పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ

ఈ నెల 5-7 తేదీల్లో, ఇటలీలోని మిలన్‌లో పర్యటించనున్న కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి శ్రీ హర్‌దీప్ సింగ్ పూరి

Posted On: 04 SEP 2022 8:56AM by PIB Hyderabad

కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి శ్రీ హర్‌దీప్ సింగ్ పూరి నేతృత్వంలో కేంద్ర అధికారులు, వ్యాపార ప్రతినిధుల బృందం ఇటలీ పర్యటనకు వెళ్తోంది. మిలన్‌లో జరిగే గ్యాస్‌టెక్‌ మిలన్-2022 కార్యక్రమానికి ఈ బృందం హాజరవుతుంది. ఈ నెల 5వ తేదీ నుంచి 7వ తేదీ వరకు పర్యటన సాగుతుంది.


వివిధ దేశాల మంత్రులు, ప్రపంచ స్థాయి ఇంధన సంస్థల సీఈవోలు కలిసే అతి పెద్ద కార్యక్రమం ఇది. ఎల్‌ఎన్‌జీ మీద, మారుతున్న ఇంధన అవసరాల మీద, మహమ్మారి తర్వాత ఆర్థిక పునరుద్ధరణ అంచనాల మీద, ఇంధన పరివర్తన కోసం ఒక మార్గాన్ని నిర్దేశించడంపై చర్చలు జరుగుతాయి.

ఈజిప్టు పెట్రోలియం & ఖనిజ వనరుల శాఖ మంత్రి, పోర్చుగల్ ఇంధన శాఖ కార్యదర్శితో కలిసి శ్రీ హర్‌దీప్ సింగ్ పూరి ప్రారంభ వేడుకల్లో పాల్గొంటారు. "ఇంధన భద్రత, పరివర్తన", "అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఇంధన పరివర్తన" అంశాల మీద జరిగే మంత్రుల ప్యానెల్ చర్చల్లో కూడా పాల్గొంటారు.

"ఇండియా స్పాట్‌లైట్: భారతదేశ ఇంధన పరిశ్రమను శక్తిమంతం చేయడం - సుస్థిర భవిష్యత్తు కోసం కొత్త మార్గాలు" అంశంపై జరిగే ప్యానెల్‌ చర్చకు శ్రీ పూరి అధ్యక్షత వహిస్తారు.

గ్యాస్‌టెక్ మిలన్-2022కి హాజరయ్యే వివిధ దేశాల మంత్రులు, అంతర్జాతీయ ఇంధన సంస్థల సీఈవోలతోనూ భారత కేంద్ర మంత్రి ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహిస్తారు.

ఆ ప్రదర్శనలో, భారతీయ ఇంధన సంస్థల ఎగ్జిబిషన్ స్టాళ్లను కూడా ఆయన ప్రారంభిస్తారు.

భారతదేశ ఆర్థిక వృద్ధిని, మొత్తం ఇంధన విలువ గొలుసులో మన దేశంలో ఉన్న పెట్టుబడి అవకాశాలను తెలియజేయడానికి ఈ పర్యటన ఒక అవకాశంగా ఉంటుంది.

మంత్రిత్వ శాఖ నిర్వహించనున్న ప్రధాన కార్యక్రమం 'ఇండియా ఎనర్జీ వీక్', వచ్చే ఏడాది ఫిబ్రవరి 5 నుంచి 8 వరకు బెంగళూరులో జరుగుతుంది. ఈ పర్యటన సందర్భంగా మంత్రి ఆ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.

 

*****



(Release ID: 1856644) Visitor Counter : 147