రక్షణ మంత్రిత్వ శాఖ
అన్ని రకాల ఉగ్రవాదాలను నిర్మూలించడంలో ఎస్‌సీఓ సభ్య దేశాలు కలిసి పోరాడాలి: ఉజ్బెకిస్తాన్‌లో రక్షణ మంత్రుల సమావేశంలో రక్షణ మంత్రి
భారత్ శాంతియుత, సురక్షితమైన & స్థిరమైన ఆఫ్ఘనిస్తాన్‌కు మద్దతు ఇస్తుంది; చర్చల ద్వారా జాతి సయోధ్యను సాధించవచ్చన్న మంత్రి రాజ్‌నాథ్ సింగ్
ఆఫ్ఘన్ భూభాగాన్ని ఉగ్రవాద కార్యకలాపాలకు లాంచింగ్ ప్యాడ్‌లుగా ఉపయోగించకూడదు
ఉక్రెయిన్ పరిస్థితిని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి: రక్షణ మంత్రి
Posted On:
24 AUG 2022 4:08PM by PIB Hyderabad
రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO)ని ఉగ్రవాదానికి వ్యతిరేకంగా, ఐక్యంగా పోరాడాలని, అన్ని రకాల ఉగ్రవాదాలను నిర్మూలించాలని పిలుపునిచ్చారు. ఆగస్ట్ 24, 2022న ఉజ్బెకిస్తాన్‌లోని తాష్కెంట్‌లో జరిగిన ఎస్‌సీఓ రక్షణ మంత్రుల సమావేశంలో ప్రసంగిస్తూ, రక్షణ మంత్రి, సరిహద్దు ఉగ్రవాదంతో సహా ఏ రూపంలోనైనా ఉగ్రవాదాన్ని ఎవరైనా మరియు ఏ ఉద్దేశ్యంతో చేసినా మానవత్వానికి వ్యతిరేకంగా చేసిన నేరమని తెలిపారు.
“ప్రపంచ శాంతి, భద్రతలకు తీవ్రవాదం అత్యంత తీవ్రమైన సవాళ్లలో ఒకటి. అన్ని రకాల ఉగ్రవాదంపై పోరాడాలని, ఈ ప్రాంతాన్ని శాంతియుతంగా, సురక్షితమైనదిగా, సుస్థిరంగా మార్చేందుకు భారత్ తన సంకల్పాన్ని పునరుద్ఘాటిస్తోంది. ఎస్‌సీఓ సభ్య దేశాలతో ఉమ్మడి సంస్థాగత సామర్థ్యాలను అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తున్నాం, ఇది ప్రతి దేశం యొక్క సున్నితత్వాన్ని గౌరవిస్తూ, వ్యక్తులు, సమాజాలు మరియు దేశాల మధ్య సహకార స్ఫూర్తిని సృష్టిస్తుంది” అని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.
ఈ నేపథ్యంలో, ఎస్‌సీఓ సభ్య దేశాల రక్షణ మంత్రిత్వ శాఖల కోసం రక్షణ మంత్రి 2023లో ‘మానవతా సహాయం మరియు విపత్తు ఉపశమనం - రిస్క్ మిటిగేషన్ మరియు డిజాస్టర్ రెసిలెంట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్’ అనే అంశంపై వర్క్‌షాప్‌ను భారత్‌లో నిర్వహించాలని ప్రతిపాదించారు. ఎస్‌సీఓ దేశాల రక్షణ థింక్ ట్యాంకుల మధ్య 'ఆసక్తి అంశం'(టాపిక్ ఆఫ్ ఇంట్రెస్ట్) పై వార్షిక సెమినార్‌ను కూడా నిర్వహించాలని ఆయన సూచించారు. 2023లో భారతదేశంలో మొదటి డిఫెన్స్ థింక్ ట్యాంక్ సెమినార్‌ను నిర్వహించాలని ప్రతిపాదిస్తున్నట్లు మంత్రి చెప్పారు.
శాంతియుత, సురక్షితమైన & సుస్థిరమైన ఆఫ్ఘనిస్తాన్‌కు భారతదేశం యొక్క పూర్తి మద్దతును ఇస్తామని రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారుల. అదే సమయంలో దాని సార్వభౌమత్వం, స్వాతంత్ర్యం, ప్రాదేశిక సమగ్రత, జాతీయ ఐక్యత మరియు అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోబోమని తెలిపారు. అఫ్ఘనిస్తాన్‌లో చర్చలు ద్వారా జాతీయ సయోధ్యను సాధించేందుకు, దేశంలో విస్తృతమైన, సమ్మిళిత, ప్రాతినిధ్య రాజకీయ నిర్మాణాన్ని స్థాపించడానికి అధికారులను ప్రోత్సహించాలని ఆయన అన్ని దేశాలను కోరారు. ఈ విషయంలో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (యుఎన్‌ఎస్‌సి) తీర్మానాల ప్రాముఖ్యతను ఆయన నొక్కి చెప్పారు.
ఉగ్రవాదులకు సురక్షిత శిక్షణ అందించడం, ఆర్థిక సహాయం ద్వారా వారి కార్యకలాపాలకు మద్దతు ఇవ్వడం ద్వారా ఏ దేశాన్ని భయపెట్టడానికి లేదా దాడి చేయడానికి ఆఫ్ఘన్ భూభాగాన్ని ఉపయోగించకూడదని రక్షణ మంత్రి తెలిపారు. ఆఫ్ఘనిస్థాన్ ప్రజలకు తక్షణ మానవతా సహాయం అందించి వారి ప్రాథమిక హక్కులను కాపాడాల్సిన అవసరాన్ని ఆయన ప్రస్తావించారు.
ఉక్రెయిన్‌లో పరిస్థితిపై భారతదేశం ఆందోళన వ్యక్తం చేసిన రాజ్‌నాథ్ సింగ్, ఈ సంక్షోభాన్ని పరిష్కరించడానికి రష్యా-ఉక్రెయిన్ మధ్య చర్చలకు భారత్ మద్దతు ఇస్తుందని పేర్కొన్నారు. ఉక్రెయిన్ దాని చుట్టుపక్క ప్రాంతాల్లో మానవతా సంక్షోభం గురించి భారత్ ఆందోళన చెందుతున్నట్లు తెలిపారు. మానవతా సహాయం అందించడానికి ఐరాస ప్రధాన కార్యదర్శి, యూఎన్ ఏజెన్సీలు మరియు ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ రెడ్ క్రాస్ (ICRC) ప్రయత్నాలకు మద్దతు అందించిన విషయాన్ని తెలిపారు.
భారత్ ఎస్‌సీఓ దేశాలతో ఎన్నో ఏళ్లుగా ఉన్న సంబంధాలపై రాజ్‌నాథ్ సింగ్ సమావేశంలో ప్రస్థావించారు. ఎస్‌సీఓ సభ్య దేశాలు ఈ ప్రాంతం యొక్క పురోగతి, శ్రేయస్సులో ఉమ్మడి వాటాదారులని చెప్పారు. “బహుపాక్షికతపై నమ్మకం ఉన్నందున భారత్ ఎస్‌సీఓకి అధిక ప్రాధాన్యతనిస్తుంది. సమానత్వం, గౌరవం, పరస్పర అవగాహన ఆధారంగా సంస్థ సభ్య దేశాల మధ్య ద్వైపాక్షికంగా సంబంధాలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. వచ్చే ఏడాది ఉజ్బెకిస్తాన్ నుండి ఆర్గనైజేషన్ అధ్యక్ష పదవిని భారత్ చేపట్టినప్పుడు భారతదేశాన్ని సందర్శించాలని రక్షణ మంత్రి సభ్య దేశాలను ఆహ్వానించారు.
నిన్న తన ఉజ్బెక్, కజఖ్ మరియు బెలారసియన్ ప్రత్యర్ధులతో ద్వైపాక్షిక సమావేశాల తర్వాత, రక్షణ మంత్రి తరువాత కిర్గిస్థాన్ రక్షణ మంత్రిని కలవనున్నారు. నేడు రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగుతో మాటల సందర్భంగా, రాజ్‌నాథ్ సింగ్ భారతదేశంలో దాడులకు ప్లాన్ చేస్తున్న ఒక ఉగ్రవాదిని మాస్కోలో అరెస్టు చేసినందుకు తన ప్రగాఢమైన అభినందనలు మరియు ధన్యవాదాలు తెలియజేశారు.
********
(Release ID: 1854275)
Visitor Counter : 211