ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
“క్యాన్సర్ చికిత్స కోసం కార్యాచరణ ప్రణాళిక ”పై ఏర్పాటైన జాతీయ వర్క్‌షాప్‌ను ఉద్దేశించి ప్రసంగించిన కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి
" కోవిడ్ సమయంలో అనుసరించిన విధానాలు క్యాన్సర్ నివారణ చికిత్స విధానాల రూపకల్పనలో మార్గదర్శకంగా ఉంటాయి"
" క్యాన్సర్ నివారణ కోసం అమలు చేసే చర్యలు విడివిడిగా కాకుండా 'మొత్తం ప్రభుత్వం మొత్తం సమాజం ప్రాతిపదికన అమలు జరగాలి".. కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి
Posted On:
23 AUG 2022 4:11PM by PIB Hyderabad
" కోవిడ్ సమయంలో అనుసరించిన విధానాలు క్యాన్సర్ నివారణ చికిత్స విధానాల రూపకల్పనలో మార్గదర్శకంగా ఉండాలి. క్యాన్సర్ నివారణ చికిత్స విధానాలను విడివిడిగా కాకుండా అన్ని ప్రభుత్వ శాఖ మధ్య సమన్వయం సాధించి సమాజ అవసరాలను దృష్టిలో ఉంచుకుని అమలు జరగాల్సి ఉంటుంది. కోవిడ్ నివారణ, చికిత్స కోసం అనుసరించిన సమగ్ర విధానాలను క్యాన్సర్ నివారణ, చికిత్స అంశంలో కూడా అమలు చేయాల్సి ఉంటుంది. కోవిడ్ తరహాలోనే క్యాన్సర్ సంబంధిత నివారణ, చికిత్స విధానం కూడా వివిధ ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వేతర సంస్థల మధ్య సమన్వయం తో అమలు జరగాలి" అని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ రాజేష్ భూషణ్ అన్నారు. ఈ రోజు “క్యాన్సర్ చికిత్స కోసం కార్యాచరణ ప్రణాళిక ”పై ఏర్పాటైన జాతీయ వర్క్‌షాప్‌ను ఉద్దేశించి కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి మాట్లాడారు.
ఆరోగ్య అంశం కేవలం వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖకు మాత్రమే సంబంధించిన అంశం కాదని శ్రీ రాజేష్ భూషణ్ స్పష్టం చేసారు. కోవిడ్ సమయంలో ఆరోగ్య రంగంపై దేశానికి గుణపాఠం నేర్పిందని అన్నారు. వివిధ మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఆరోగ్య సంబంధిత అంశాలను అమలు చేయాల్సి ఉంటుందని అన్నారు. ప్రాంతీయ ఆరోగ్య సంరక్షణ కేంద్రాలకు మాత్రమే ఆరోగ్య సంరక్షణ పరిమితం కాకూడదని ఆయన స్పష్టం చేసారు. ప్రాధమిక, ద్వితీయ స్థాయి ఆరోగ్య కేంద్రాలు కూడా ఈ అంశానికి ప్రాధాన్యత ఇవ్వాలని యన సూచించారు. కార్మిక, రైల్వే, ఉక్కు, ఓఎన్జీసీ, అణు ఇంధన శాఖ లాంటి మంత్రిత్వ శాఖల పరిధిలో పనిచేస్తున్న ప్రాంతీయ ఆరోగ్య సంరక్షణ కేంద్రాలలో లభిస్తున్న సౌకర్యాలు, సేవలను సమీకృతం చేసి సమగ్ర ఆరోగ్య సంరక్షణ అందించడం వల్ల ఎనలేని ప్రయోజనం కలుగుతుందని శ్రీ రాజేష్ భూషణ్ అన్నారు. సమగ్ర ఆరోగ్య సంరక్షణ అందించేందుకు జాతీయ ఆరోగ్య మిషన్ అమలులో ఇటీవల కాలంలో మార్పులు తీసుకుని వచ్చామని శ్రీ రాజేష్ భూషణ్ వివరించారు. దీనిలో భాగంగా ప్రాధమిక, ద్వితీయ స్థాయి ఆరోగ్య కేంద్రాలు, రెఫరల్ ఆసుపత్రులను కూడా ప్రాంతీయ ఆరోగ్య సేవలతో అనుసంధానం చేసి ఆరోగ్య సంరక్షణ రంగం లో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరిస్తున్నామని పేర్కొన్నారు.
క్యాన్సర్ నివారణ చికిత్సలో క్రిటికల్ కేర్ మేనేజ్‌మెంట్ అంశాలు కీలకంగా ఉంటాయని శ్రీ రాజేష్ భూషణ్ అన్నారు. దీనికోసం సాధారణ ప్రమాణాల ఆధారంగా విధానాలు గుర్తించి, రూపొందించి, అందరి సహకారంతో అమలు చేయాల్సి ఉంటుందని అన్నారు. వీటి ఆధారంగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అమలు చేయనున్న జాతీయ క్యాన్సర్ నివారణ కార్యక్రమాన్ని రూపొందించి అమలు చేస్తుందని ఆయన పేర్కొన్నారు. క్యాన్సర్ నివారణ చర్యలు అమలు చేసేందుకు శిక్షణ , నైపుణ్యం పెంపుదల కార్యక్రమాలను అమలు చేసి వైద్య రంగంలో సేవలు అందిస్తున్నవారి సామర్థ్యాన్ని పెంపొందించవలసి ఉంటుందని అన్నారు. సంబంధిత వర్గాల మధ్య . స్పష్టమైన సమాచార వ్యవస్థను ఏర్పాటు చేసి, కార్యక్రమాలు అమలు జరుగుతున్న తీరు తెలుసుకోవడానికి విధానాలను రూపొందించాలని ఆయన పేర్కొన్నారు. క్యాన్సర్ నివారణ చికిత్స కోసం టెలిమెడిసిన్ వంటి ఆరోగ్య సాంకేతికతను గుర్తించి అమలు చేయాలని ఆయన చెప్పారు. అస్సాం, పంజాబ్, ఆంధ్రప్రదేశ్ వంటి కొన్ని రాష్ట్రాల్లో అమలు జరుగుతున్న వివిధ "హబ్ మరియు స్పోక్" నమూనాలు దేశం అన్ని ప్రాంతాల్లో అమలు జరగాలని అన్నారు.
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్వహించిన ఒక-రోజు జాతీయ వర్క్‌షాప్‌లో ఈ క్రింది అంశాలపై సెషన్‌లు జరిగాయి :
i. క్యాన్సర్ సంరక్షణ కోసం భారతదేశంలో అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలు మరియు మానవ వనరులు
ii. భారతదేశంలో క్యాన్సర్ సంరక్షణ విధానాలు ఏమేరకు అందుబాటులో ఉన్నాయి
iii. క్యాన్సర్ సంరక్షణకు సంబంధించి రాష్ట్రాలు అమలు చేస్తున్న ఉత్తమ పద్ధతులు
iv. కొనసాగుతున్న ప్రాజెక్ట్‌లు, సంబంధిత అంశాల సమీక్ష
జాతీయ ఆరోగ్యమిషన్ ఎండీ శ్రీమతి రోలీ సింగ్ , సంయుక్త కార్యదర్శి (విధానం) శ్రీ విశాల్ చౌహాన్, జాయింట్ సెక్రటరీ , టాటా మెమోరియల్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ రాజేంద్ర బద్వే వివిధ రాష్ట్రాలు మరియు వైద్య సంస్థల కు చెందిన సీనియర్ అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
****
(Release ID: 1853996)
Visitor Counter : 128