రక్షణ మంత్రిత్వ శాఖ
మణిపూర్‌లోని ఇన్‌స్పెక్టర్ జనరల్ అస్సాం రైఫిల్స్ (సౌత్) హెడ్‌క్వార్టర్స్ వద్ద సైనికులతో మాట్లాడిన రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్
ధైర్య సాహసాలతో అంకిత భావంతో విధులు నిర్వహిస్తూ రాష్ట్ర భద్రతా పరిస్థితిని మెరుగుపరిచిన సైనికులను అభినందించిన శ్రీ రాజ్‌నాథ్ సింగ్
సరిహద్దులు సురక్షితంగా ఉన్నప్పుడే మాత్రమే దేశం అభివృద్ధి సాధించగలుగుతుంది .. శ్రీ రాజ్‌నాథ్ సింగ్
జాతీయ పతాకం రెపరెపలాడేలా చూడాలని సైనికులను కోరిన శ్రీ రాజ్‌నాథ్ సింగ్
Posted On:
19 AUG 2022 10:44AM by PIB Hyderabad
మణిపూర్ లోని మంత్రిపుఖ్రీ ఇన్‌స్పెక్టర్ జనరల్ అస్సాం రైఫిల్స్ (సౌత్) హెడ్‌క్వార్టర్స్ ని రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ 2022 ఆగష్టు 19 న సందర్శించారు. అస్సాం రైఫిల్స్, రెడ్ షీల్డ్ డివిజన్ కి చెందిన సైనికులతో శ్రీ రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడారు. శ్రీ రాజ్‌నాథ్ సింగ్ పాటు ఆర్మీ స్టాఫ్ చీఫ్ జనరల్ మనోజ్ పాండే, GOC-in-C ఈస్టర్న్ కమాండ్ లెఫ్టినెంట్ జనరల్ ఆర్పీ కలిత మరియు జీఓసి స్పియర్ కార్ప్స్ లెఫ్టినెంట్ జనరల్ ఆర్సీ తివారీ, ఆర్మీ మరియు అస్సాం రైఫిల్స్ ఇతర సీనియర్ అధికారులు ఉన్నారు. ఈ పర్యటన సందర్భంగా ఈ ప్రాంతంలో శాంతి మరియు ప్రశాంతతను కాపాడేందుకు ఇండో-మయన్మార్ సరిహద్దు లో తిరుగుబాటు వ్యతిరేక చర్యలతో పాటు సరిహద్దు నిర్వహణ కార్యకలాపాల గురించి రక్షణ శాఖ మంత్రికి అధికారులు వివరించారు.
సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడిన శ్రీ రాజ్‌నాథ్ సింగ్ క్లిష్ట భౌగోళిక పరిస్థితులు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల రూపంలో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించి సైనికులు మణిపూర్‌లో భద్రతా పరిస్థితిని మెరుగుపరచడంలో విజయం సాధించారని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసించారు. అధికారులు మరియు సైనికులు ధైర్యంగా మరియు దృఢ నిశ్చయం తో విధులు నిర్వర్తిస్తున్నారని అన్నారు. భారత సైన్యం మరియు అస్సాం రైఫిల్స్ దళాల మధ్య నిలబడటం గర్వంగా ఉందని ఆయన అన్నారు.
1971 యుద్ధ సమయంలో ఏర్పడిన రెడ్ షీల్డ్ డివిజన్ శ్రీలంకలో ఐపికేఎఫ్ కార్యకలాపాల్లో విశేష సేవలు అందించిందని రక్షణ మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం రెడ్ షీల్డ్ డివిజన్ సిబ్బంది అంకితభావంతో తమ విధులు నిర్వర్తిస్తున్నారని రక్షణ మంత్రి ప్రశంసించారు. అంతర్గత భద్రత, ఇండో-మయన్మార్ సరిహద్దులు రక్షించడం మరియు ఈశాన్య ప్రాంతాలను జాతీయ స్రవంతిలోకి తీసుకురావడంలో గత ఏడు దశాబ్దాలలో అస్సాం రైఫిల్స్ అద్భుతమైన కీలక పాత్ర పోషించిందని ఆయన ప్రశంసించారు. "ఈ కారణంగా, మీరు 'ఈశాన్య ప్రజల స్నేహితులు' మరియు 'ఈశాన్య ప్రాంత రక్షకులుగా గుర్తింపు పొందారు " అని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.
సరిహద్దులు సురక్షితంగా ఉన్నప్పుడు మాత్రమే దేశం సంపూర్ణ సామర్థ్యాన్ని సాధిస్తుందని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. అచంచలమైన అంకితభావంతో విధులు నిర్వర్తించి జాతీయ జెండా గౌరవాన్ని ఉన్నతిని రక్షించాలని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ బలగాలను ఉద్బోధించారు. రెడ్ షీల్డ్ విభాగం మరియు అస్సాం రైఫిల్స్‌కు చెందిన 1,000 కంటే ఎక్కువ మంది సైనికులు రక్షణ మంత్రి నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు
***
(Release ID: 1853101)
Visitor Counter : 156