ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

రాజస్థాన్ లో సోదాలు నిర్వహించిన ఆదాయం పన్ను శాఖ

प्रविष्टि तिथि: 11 AUG 2022 2:36PM by PIB Hyderabad

 జైపూర్ కేంద్రంగా  బంగారం ఆభరణాలు, ఆతిధ్య, రియల్ ఎస్టేట్ రంగంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఒక సంస్థపై  03.08.2022 న ఆదాయం పన్ను శాఖ దాడి చేసి సోదాలు నిర్వహించింది. జైపూర్ మరియు  కోటలలో సంస్థ కార్యకలాపాలు జరుగుతున్న 36 కి పైగా కేంద్రాలలో అధికారులు సోదాలు నిర్వహించారు. 

సంస్థ పాల్పడిన అక్రమాలకు సంబంధించి పలు దస్త్రాలు, డిజిటల్ సాక్ష్యాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 

నివాస గృహాలు, భూముల విక్రయాలను నగదు రూపంలో నిర్వహించి సంస్థ భారీ మొత్తంలో పన్ను ఎగవేసిందని అధికారులు గుర్తించారు. విక్రయాల ద్వారా వచ్చిన నగదును సంస్థ లెక్కల్లో చూపలేదని స్వాధీనం చేసుకున్న దస్త్రాలు, సాక్ష్యాలను విశ్లేషించిన అధికారులు నిర్ధారించారు. రికార్డుల్లో చూపకుండా సంస్థ రత్నాలు, బంగారు ఆభరణాల అమ్మకాలు సాగించిందని కూడా సోదాల్లో వెల్లడయింది. 

లెక్కలు చూపని ఆదాయాన్ని సంస్థ భూములు, విలాసవంతమైన హోటళ్ల నిర్మాణ కార్యక్రమాలకు మళ్లించడమే కాకుండా నగదు రుణాలు ఇచ్చేందుకు ఉపయోగించిందని ఆదాయం పన్ను శాఖ అధికారులు గుర్తించారు. నగదు రుణాలపై వడ్డీగా వసూలు చేసిన మొత్తాలకు సంబంధించి దస్త్రాలు  కూడా సోదాలలో బయటపడ్డాయి. వడ్డీ రూపంలో వచ్చిన ఆదాయానికి   సంస్థ లెక్కలు చూపలేదని అధికారులు గుర్తించారు.

సంస్థ 150 కోట్ల రూపాయలకు పైగా ఆదాయానికి లెక్క చూపలేదని ప్రాథమిక పరిశీలనలో వెల్లడయింది. లెక్కలు చూపని 11 కోట్ల రూపాయలకు మించి విలువ చేసే ఆస్తులను ఆదాయం పన్ను శాఖ జప్తు చేసింది. 

కేసులో విచారణ సాగుతోంది. 


(रिलीज़ आईडी: 1850926) आगंतुक पटल : 142
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Punjabi