కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
మొబైల్ టవర్ ఏర్పాటుకు సంబంధించిన మోసాలపై టెలి కమ్యూనికేషన్స్ విభాగం జారీచేన బహిరంగ ప్రకటన
Posted On:
05 AUG 2022 5:20PM by PIB Hyderabad
భారత ప్రభుత్వ కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ పరిధిలోని టెలికమ్యూనికేషన్ల విభాగం మొబైల్ టవర్ల ఏర్పాటు సంబంధిత మోసాల గురించి ప్రజలను హెచ్చరిస్తూ బహిరంగ ప్రకటన జారీచేసింది:-
మొబైల్ టవర్ల ఏర్పాటుద్వారా నెలవారీ అద్దె భారీగా లభిస్తుందంటూ బూటకపు హామీలతో కొన్ని అనైతిక కంపెనీలు/ ప్రాతినిధ్య సంస్థలు/వ్యక్తులు సామాన్య ప్రజలను మోసగించి డబ్బు వసూలు చేస్తున్నట్లు టెలి కమ్యూనికేషన్ల విభాగం (డీఓటీ) దృష్టికి వచ్చింది.
ఈ నేపథ్యంలో మోసకారుల ప్రలోభాలకు గురికావద్దని ప్రజలను హెచ్చరిస్తూ కిందివిధంగా తెలియజేయడమైనది:-
- మొబైల్ టవర్ల ఏర్పాటు కోసం ప్రాంగణాలను లీజుకు/అద్దెకు ఇవ్వడంలో ‘డీఓటీ/ట్రాయ్’ (టిఆర్‌ఏఐ)లకు ప్రత్యక్ష లేదా పరోక్ష ప్రమేయం ఏమీ ఉండదు.
- మొబైల్ టవర్ల ఏర్పాటుకు ‘డీఓటీ/ట్రాయ్’ లేదా వాటికి సంబంధించిన అధికారులు ఎలాంటి ‘నిరభ్యంతర ధ్రువీకరణ పత్రం’ (నో అబ్జెక్షన్ సర్టిఫికెట్) జారీ చేయరు.
- మొబైల్ టవర్ల ఏర్పాటుకు అనుమతి పొందిన అధీకృత టెలికాం సేవా ప్రదాతలు (టీఎస్‌పీ) మౌలిక వసతుల కల్పనదారుల (ఐపీ-1) నవీకరించిన జాబితా ‘డీఓటీ’ వెబ్‌సైట్.. అంటే- https://dot.gov.in సహా https://dot.gov.in/infrastructure-providerలో అందుబాటులో ఉంటుంది.
- మొబైల్ టవర్ల ఏర్పాటు కోసం ఏదైనా కంపెనీ/ప్రాతినిధ్య సంస్థ/వ్యక్తి డబ్బు డిమాండ్ చేసేట్లయితే వారిలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని, వారికి సంబంధించిన అధికారిక గుర్తింపు చూపాల్సిందిగా నిలదీయాలని ఇందుమూలంగా హెచ్చరించడమైనది. అదేవిధంగా మొబైల్ టవర్ల ఏర్పాటు కోసం తమ సిబ్బంది ఎన్నడూ డబ్బు చెల్లింపు కోరబోరని ‘టీఎస్‌పీ’, ‘ఐపీ-1’ల సంఘాలు స్పష్టం చేశాయి.
- ఇలాంటి మోసపూరిత చర్యలు ఎవరి దృష్టికైనా వచ్చిన పక్షంలో వాటిపై అతడు/ఆమె స్థానిక పోలీసు అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు.
- అంతేకాకుండా ‘డీఓటీ’ వెబ్‌సైట్ https://dot.gov.in/relatedlinks/director-general-telecomలోని వివరాల సహాయంతో స్థానిక ‘డీఓటీ’ కార్యాలయాలను సంప్రదించవచ్చు.
***
(Release ID: 1848964)
Visitor Counter : 154