యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ

కామన్వెల్త్ క్రీడలు 5వ రోజున 2 స్వర్ణాలు మరియు 2 రజత పతకాలు సాధించిన భారత్


లాన్ బౌల్స్ లో చారిత్రాత్మక స్వర్ణం సాధించిన తరువాత పురుషుల టేబుల్ టెన్నిస్ డబుల్స్ లో స్వర్ణం, బాడ్మింటన్ మిక్స్డ్ లో రజతం, 96 కేజీల పురుషుల వెయిట్‌లిఫ్టింగ్ లో రజత పతకాలు సాధించిన భారత్ క్రీడాకారులు

Posted On: 03 AUG 2022 11:20AM by PIB Hyderabad

ముఖ్య అంశాలు:

• అసాధారణ ప్రతిభ చూపిన క్రీడాకారులను అభినందించిన రాష్ట్రపతి  శ్రీమతి. ద్రౌపది ముర్ము, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 

•క్రీడాకారులను అభినందించిన క్రీడా మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్  కామన్వెల్త్ గేమ్స్‌లో క్రీడాకారులు  అద్భుత ప్రదర్శన చేశారని ప్రశంస 

 

 బర్మింగ్‌హామ్‌లో జరుగుతున్న  కామన్వెల్త్ గేమ్స్ 2022లో 5వ రోజు భారత్ 4 పతకాలు సాధించింది.   లాన్ బౌల్స్ మహిళల జట్టు చారిత్రాత్మక స్వర్ణం సాధించిన తర్వాత పురుషుల టేబుల్ టెన్నిస్ జట్టు ఫైనల్‌లో సింగపూర్‌ను 3-1 తేడాతో ఓడించి రెండో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ఆ తర్వాత పురుషుల 96 కేజీల విభాగంలో వెయిట్‌లిఫ్టర్ వికాస్ ఠాకూర్ రజత పతకాన్ని గెలుచుకోగా, ఫైనల్లో మలేషియా చేతిలో ఓడి బ్యాడ్మింటన్ మిక్స్‌డ్ జట్టు రజత పతకాన్ని గెలుచుకుంది. 5 స్వర్ణాలు, 5 రజతాలు, 3 కాంస్య పతకాలతో భారత్ పతకాల సంఖ్య 13 కి చేరింది. రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, కేంద్ర క్రీడల మంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్ మరియు దేశ క్రీడాభిమానులు పతకాలు సాధించిన  క్రీడాకారులకు అభినందనలు తెలిపారు.

  కామన్వెల్త్ గేమ్స్ 2022 లో బంగారు పతకం సాధించిన భారత టేబుల్ టెన్నిస్ జట్టును రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము  అభినందించారు.  “ కామన్వెల్త్ గేమ్స్ 2022 లో   టేబుల్ టెన్నిస్‌లో చారిత్రాత్మక స్వర్ణం గెలిచినందుకు సత్యన్ జ్ఞానశేఖరన్, శరత్ కమల్, హర్మీత్ దేశాయ్ మరియు సనీల్ శెట్టిలకు అభినందనలు. వారు అసాధారణ నైపుణ్యం మరియు సంకల్పాన్ని ప్రదర్శించారు. యావత్తు భారతీయుల   హృదయాలను  గెలుచుకున్నారు. క్రీడాకారులు సాధించిన విజయం   యువతకు స్ఫూర్తి నిస్తుంది అని  నేను నమ్ముతున్నాను" రాష్ట్రపతి ట్వీట్ లో పేర్కొన్నారు. 

మరో ట్వీట్ లో బాడ్మింటన్ జట్టును రాష్ట్రపతి అభినందించారు. ' కామన్వెల్త్ గేమ్స్‌  మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్ లో రజత పతకం  గెలుచుకున్న భారత బ్యాడ్మింటన్ జట్టు సభ్యులకు అభినందనలు. వారు ప్రదర్శించిన నైపుణ్యాలు, టీమ్ వర్క్ మరియు పోరాట పటిమ చెప్పుకోదగ్గవి. ఆటగాళ్లందరికీ నా అభినందనలు తెలియజేస్తున్నాను'' అని రాష్ట్రపతి తన ట్వీట్ లో అన్నారు.

స్వర్ణ పతకం సాధించిన టేబుల్ టెన్నిస్ జట్టును, రజత పతకం సాధించిన బాడ్మింటన్ జట్టును, వెయిట్‌లిఫ్టింగ్ లో రజత పతకం సాధించిన వికాస్ ఠాకూర్ ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు. 

టేబుల్ టెన్నిస్ లో స్వర్ణ పతకం సాధించిన జి. సత్యన్, హర్మీత్ దేశాయ్, శరత్ కమల్ మరియు సనీల్ శెట్టిలను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు. "టేబుల్ టెన్నిస్‌లో గొప్ప వార్త!  కామన్వెల్త్ గేమ్స్  లో బంగారు పతకం  సాధించిన జి. సత్యన్, హర్మీత్ దేశాయ్, శరత్ కమల్ మరియు సనీల్ శెట్టి ల అబ్దుత బృందానికి అభినందనలు. ఈ జట్టు నైపుణ్యం లేదా పట్టుదల  పరంగా ఉన్నత ప్రమాణాలు నెలకొల్పింది.  భవిష్యత్ లో జట్టు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను." అని శ్రీ మోదీ తన ట్వీట్ లో అన్నారు. 

ఒక ట్వీట్‌లో ప్రధాని ఇలా అన్నారు; " కామన్వెల్త్ గేమ్స్  బాడ్మింటన్ లో   రజత పతకం సాధించినందుకు గాను @శ్రీకిదాంబి, @సాత్విక్సాయిరాజ్, @బస్స్_రెడ్డి, @లక్ష్య_సేన్, @శెట్టిచిరాగ్04, ట్రీసా జాలీ, ఆకర్షి కశ్యప్, @పి 9అశ్విని, @పీవీ సింధు 1లతో కూడిన భారత బ్యాడ్మింటన్ జట్టుకు అభినందనలు. జట్టు సాధించిన విజయం పట్ల గర్వంగా ఉంది ."

మరొక ట్వీట్‌లో ప్రధానమంత్రి ఇలా అన్నారు, “భారతదేశంలో అత్యంత ఆదరణ కలిగిన  క్రీడల్లో బ్యాడ్మింటన్ ఒకటి.  కామన్వెల్త్ గేమ్స్   లో బాడ్మింటన్ జట్టు  రజత పతకం సాధించడంతో దేశంలో బాడ్మింటన్ కు మరింత ఆదరణ లభిస్తుంది. ఎక్కువ మంది ఈ క్రీడా పట్ల ఆసక్తి చూపుతారు." అని ప్రధానమంత్రి తన ట్వీట్  లో అన్నారు. 
 రజత పతకం సాధించిన వెయిట్‌లిఫ్టర్‌ వికాస్ ఠాకూర్ ను అభినందిస్తూ ప్రధానమంత్రి మరో ట్వీట్ చేశారు.  “వెయిట్‌లిఫ్టింగ్‌లో రజతం సాధించిన వికాస్ ఠాకూర్ కారణంగా   కామన్వెల్త్ గేమ్స్ లో మరింత కీర్తి, వికాస్ సాధించిన విజయం ఆనందం కలిగించింది. క్రీడల పట్ల ఆయనకున్న అంకితభావం అభినందనీయం. భవిష్యత్తులో వికాస్ మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను."అని ప్రధానమంత్రి అన్నారు. 

క్రీడా మంత్రి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్ కూడా పతక విజేతలను అభినందించారు. శ్రీ ఠాకూర్ ట్వీట్ చేస్తూ, “మరో అద్భుత గోల్డ్ మెడల్. భారత పురుషుల టేబుల్ టెన్నిస్ జట్టు అద్భుతమైన ప్రదర్శన. శరత్ కమల్, జి. సత్యన్ మరియు హర్మీత్ దేశాయ్ నేతృత్వంలోని మన ప్యాడ్లర్లు సింగపూర్‌ను 3-1తో అధిగమించారు. మనం మరోసారి విజేతలుగా నిలిచాం !" అని అన్నారు. 
బాడ్మింటన్ జట్టును అభినందిస్తూ శ్రీ ఠాకూర్    మరో ట్వీట్‌ చేశారు.  “భారత బ్యాడ్మింటన్ మిక్స్‌డ్ టీమ్ పోరాట పటిమ ప్రదర్శించి  కామన్వెల్త్ గేమ్స్ 2022 లో రజతం కైవసం చేసుకుంది.  అచంచల విశ్వాసంతో ఆడి విజయం సాధించిన  చిరాగ్, సాత్విక్ మరియు సింధులకు అభినందనలు.! కిదాంబి యొక్క శక్తివంతమైన ఆట చూసి  క్రీడాభిమానులు పులకించిపోయారు. ట్రీసా జాలీ గాయత్రి పుల్లెల  పోరాట పటిమను ప్రదర్శించారు !

వికాస్ఠాకూర్‌ను అభినందిస్తూ, “కామన్వెల్త్ గేమ్స్‌లో పురుషుల 96 కేజీల ఫైనల్‌లో స్నాచ్- 155 కేజీలు, క్లీన్  జెర్క్- 191 కేజీలు మొత్తం 346 కేజీల బరువుతో అద్భుత ప్రదర్శన చూపించి  రజత పతకాన్ని సాధించి, కామన్వెల్త్ గేమ్స్‌లో వరుసగా 3వ పతకాన్ని గెలుచుకున్న వికాస్ ఠాకూర్ !" అని  శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్ ట్వీట్ చేశారు. 

Click here for achievements of G. Sathiyan

Click here for achievements of Harmeet Desai

Click here for achievements of Sharat Kamal

Click here for achievements of Sanil Shetty

Click here for achievements of Vikas Thakur

***



(Release ID: 1847857) Visitor Counter : 126