పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
తడోబా అభయారణ్యం ఆతిథ్యంలో జాతీయ, ప్రపంచ పులుల దినోత్సవం!
దేశంలో 52కు పెరిగిన పులుల అభయారణ్యాల సంఖ్య..
పులుల సంరక్షణపై ప్రభుత్వం చిత్తశుద్ధికి
ఇదే నిదర్శనం: కేంద్రమంత్రి భూపేందర్ యాదవ్
అభయారణ్యాల పరిధిలో, పరిసరాల్లో ప్రజల సంక్షేమానికి
ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రకటన...
Posted On:
29 JUL 2022 11:35AM by PIB Hyderabad
మహారాష్ట్రలోని చంద్రాపూర్ ఫారెస్ట్ అకాడమీలో జరిగిన 2022వ సంవత్సరపు ప్రపంచ, జాతీయ పులుల దినోత్సవం కార్యక్రమానికి కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్, సహాయమంత్రి అశ్వినీ కుమార్ చౌబే హాజరయ్యారు.
పలువురు ప్రముఖులతో కలసి కార్యక్రమానికి హాజరైన మంత్రులు, అనంతరం తడోబా అంధారి పులుల అభయారణ్యం (టి.ఎ.టి.ఆర్.) సందర్శించారు. విభిన్నమైన, సుందరమైన అక్కడి ప్రకృతి దృశ్యాలను, జంతు, వృక్షజాతుల ప్రత్యేకతను, ప్రశంసించారు. అటవీశాఖ సిబ్బందితో, అభయారణ్యం యాజమాన్యం ప్రతినిధులతో ముచ్చటించారు. పులుల రక్షణకు క్షేత్రస్థాయిలో తీసుకుంటున్న చర్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
పులుల సంరక్షణపై ప్రజల్లో అవగాహన, చైతన్యం కల్గించే లక్ష్యంతో అంతర్జాతీయ పులుల దినోత్సవం ( #InternationalTigerDay) ప్రతి సంవత్సరం జూలై 29వ తేదీన నిర్వహిస్తూ వస్తున్నారు.
ఇందుకు భారతదేశంలో ప్రధాన కార్యక్రమాన్ని #చంద్రాపూర్, #తడోబా అంధారీ పులుల అభయారణ్యం ప్రాంతాల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ హాజరయ్యారు. @PIB_India, @MIB_India pic.twitter.com/AuICOlxRsU
— పి.ఐ.బి. మహారాష్ట్ర (@పి.ఐ.బి. ముంబై) జూలైJuly 29, 2022
తడోబా అంధారీ అభయారణ్యంలో పెద్దసంఖ్యలో పులుల జనాభా కేంద్రీకృతమై ఉంది. స్థానికంగా ప్రజలు కూడా ఆ పరిసర ప్రాంతాల్లోనే నివాసం ఉంటున్నారు. పులుల అభయారణ్యంలో పులుల రక్షణకు సిబ్బంది ఎంతో అంకితభావంతో చేపడుతున్న కార్యక్రమాలను కేంద్రమంత్రి భూపేందర్ యాదవ్ అభినందించారు. ప్రత్యేకించి మొబైల్ అప్లికేషన్ ఆధారంగా ఎం.ఎస్.ట్రైబ్స్ పేరిట అధునాతన (స్మార్ట్) పద్ధతుల్లో చేపడుతున్న గస్తీ ప్రక్రియను ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. స్థానిక ప్రజలకు జీవనోపాధి అవకాశాలు కల్పిస్తున్న పర్యావరణ ఆధారిత నమూనా కార్యక్రమాలను కూడా ఆయన ప్రశంసించారు.
చంద్రాపూర్ ఫారెస్ట్ అకాడమీ ఆవరణలో కూడా ప్రపంచ పులుల దినోత్సవం జరిగింది. పులుల ప్రత్యేక రక్షణ దళం, మహారాష్ట్ర, కేరళ అటవీశాఖల పులుల అభయారణ్యాల బలగాలు సమర్పించిన కవాతు వందనాన్ని కేంద్రమంత్రి ఈ సందర్భంగా స్వీకరించారు.
ఈ సందర్భంగా కేంద్రమంత్రి భూపేందర్ యాదవ్ మాట్లాడుతూ, పులుల అభయారణ్యాలను పరిరక్షిస్తున్న దేశాలన్నింటికీ అభినందనలు తెలిపారు. ప్రపంచ పులుల జనాభాలో 70శాతానికి సంరక్షణ కల్పించడంలో ఉత్తమ ప్రమాణాలను నెలకొల్పిన భారతదేశానికి ప్రత్యేక ప్రశంసలు అందించాల్సి ఉందన్నారు. పులుల సంరక్షణలో భారత ప్రభుత్వం ఎప్పటికప్పుడు తన చిత్తశుద్ధిని ప్రదర్శిస్తూ వస్తోందని, 1973లో దేశవ్యాప్తంగా 9 అభయారణ్యాలు ఉండగా, వాటి సంఖ్య ఇప్పుడు 52కు పెరిగిందని అన్నారు. తాజాగా, రాజస్థాన్ రాష్ట్రంలోని రామ్‌గఢ్ విష్దారీలో అభయారణ్యం నెలకొల్పినట్టు చెప్పారు. పులుల అభయారణ్యం పరిసర ప్రాంతాల్లో నివసించే ప్రజల సంక్షేమంకోసం కూడా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు. అక్కడి స్థానికుల జీవనోపాధికోసం అనేక కార్యక్రమాలు చేపట్టినట్టు చెప్పారు. పులుల అభయారణ్యాల పరిధిలో, పరిసరాల్లో నివసించే సంక్షేమం లక్ష్యంగా శ్యామ ప్రసాద్ ముఖర్జీ జన్ వన్ వికాస్ యోజన పేరిట ప్రత్యేక పథకాన్ని అమలు చేస్తున్న మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన అభినందించారు. ఈ పద్ధతిని ఇతర రాష్ట్రాలు కూడా అనుసరించవచ్చని ఆయన సూచించారు. వన్య ప్రాణి సంరక్షణ పథకాల అమలులో ఎలాంటి అలసత్వానికి తావీయకుండా చూసేందుకు నాలుగేళ్లకు ఒకసారి వన్యజీవుల సంరక్షణ నిపుణుల ప్రమేయంతో నిష్పాక్షికమైన, స్వంతంత్ర ప్రాతిపదికన మధింపు ప్రక్రియను చేపడుతున్నట్టు చెప్పారు. అఖిలభారత స్థాయిలో పులుల సంఖ్యపై అంచనా ప్రక్రియను నాలుగేళ్లకు ఒకసారి చేపడుతున్నారని, ప్రస్తుతం ఈ కార్యక్రమాన్ని ఐదవ సారి నిర్వహిస్తున్నామని కేంద్రమంత్రి చెప్పారు. 2018లో జరిగిన విభిన్నమైన ఈ కార్యక్రమం గిన్నెస్ ప్రపంచ రికార్డుల్లో నమోదైందని అన్నారు. పులుల అభయారణ్య ప్రాంతాల్లో పర్యాటక కార్యకలాపాలను ప్రోత్సహించేందుకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. సందర్శకులకు గరిష్టస్థాయిలో సంతృప్తిని, స్థానిక ప్రజలకు ప్రత్యక్ష ప్రయోజనాన్ని కలిగించే రీతిలో పర్యాటక కార్యకలాపాలను ప్రోత్సహించాలన్నారు. 1952లో అంతరించిన పోయిన చిరుతపులుల జాతి సంరక్షణకు భారతదేశం ఎంతో ప్రాధాన్యం ఇచ్చిందని, ప్రస్తుతం ఈ కార్యక్రమం ఎంతో ముందంజలో కొనసాగుతోందని కేంద్రమంత్రి అన్నారు. ఇందుకు సంబంధించి నమీబియా ప్రభుత్వంతో ద్వైపాక్షిక ఒప్పందం ఇప్పటికే కుదిరిందని, దక్షిణాఫ్రికాతో అవగాహనా ఒప్పందంపై త్వరలోనే సంతకాలు జరగనున్నాయని అన్నారు. పులుల సంరక్షణలో దేశాన్ని ప్రపంచ స్థాయిలో అగ్రభాగాన నిలిపేందుకు కృషిచేసిన క్షేత్రస్థాయి సిబ్బందికి కేంద్రమంత్రి అభినందనలు తెలిపారు.
కేంద్ర పర్యావరణ, అటవీశాఖ సహాయమంత్రి అశ్వినీ కుమార్ చౌబే మాట్లాడుతూ, పులి అంటే బలానికి ప్రతీక అని, జీవవైవిధ్యం, అటవీ సంపద, నీరు, వాతావరణ భద్రతను కాపాడటంలో పులి కీలకపాత్ర పోషిస్తుందని అన్నారు. పులుల సంరక్షణలో భారతదేశం ప్రపంచంలోనే అగ్రభాగాన ఉండటం మనకు గర్వకారణమన్నారు. పులుల సంకరక్షణలో కాంబోడియా, చైనా, బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్, మయన్మార్, రష్యా వంటి దేశాలతో పరస్పర సహకారంతో భారతదేశం ముందుకు సాగుతోందన్నారు. భవిష్యత్తులో మానవుడు, జంతువులు, ప్రకృతి కలసి మనుగడ సాగించడంపై మనం ఆలోచించాలన్నారు.
జాతీయ పులుల దినోత్సవంలో భాగంగా, పులుల సంరక్షణలో ముందుండి విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందిని లక్ష రూపాయల విలువైన జాతీయ పులుల సంరక్షణ ప్రాధికార సంస్థ (ఎన్.టి.సి.ఎ.) వార్షిక అవార్డులతో సత్కరించారు. ఇద్దరు అటవీ అధికారులకు, ఫారెస్ట్ గార్డులకు, ఇద్దరు వాచర్లకు/రక్షణ సహాయకులకు/టైగర్ ట్రాకర్స్‌కు మంత్రి ఈ అవార్డులను అందజేశారు. పులుల సంరక్షణలో అసాధారణమైన పనితీరును ప్రదర్శించినందుకు గుర్తింపుగా ఈ అవార్డులను వారికి ప్రదానం చేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న పులుల అభయారణ్యాల ఫీల్డ్ డైరెక్టర్లు, మహారాష్ట్రకు చెందిన సీనియర్ అటవీ అధికారులు, మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల పులుల సంరక్షణ ప్రత్యేక దళాలు పాల్గొన్నాయి.
ప్రపంచ పులుల దినోత్సవం నిర్వహించుకోవాలన్న నిర్ణయాన్ని 2010వ సంవత్సరం జూలై నెల 29వ తేదీన పీటర్స్‌బర్గ్‌లో తీసుకున్నారు. పులుల సంరక్షణకు ప్రాధాన్యం ఇచ్చేలా ప్రపంచవ్యాప్తంగా పులుల జనాభా ఎక్కువగా ఉన్న దేశాలను ఒక్కతాటిపై తెచ్చే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆ రోజునుంచి ప్రతి ఏడాది జూలై 29వ తేదీన ప్రపంచ పులుల దినోత్సవాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు.
******
(Release ID: 1846271)
Visitor Counter : 249