ప్రధాన మంత్రి కార్యాలయం

ఎన్ఐఐఒ సదస్సు ‘స్వావలంబన్‌’ను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగం


భారత నావికాదళంలో స్వదేశీ సాంకేతిక పరిజ్ఞాన వినియోగానికి
చేయూత లక్ష్యంగా ‘స్ప్రింట్ ఛాలెంజెస్’ను ఆవిష్కరించిన ప్రధానమంత్రి;

“21వ శతాబ్దపు భారతానికి మన రక్షణ దళాల్లో స్వావలంబన లక్ష్యసాధన అత్యంత ప్రధానం”;

“ఆవిష్కరణలు కీలకం… అవి దేశీయంగానూ ఉండాలి…
దిగుమతి చేసుకున్నవి ఆవిష్కరణకు ఎన్నడూ వనరులు కావు”;

“తొలి స్వదేశీ విమాన వాహకనౌక కోసం ఎదురుచూపులు త్వరలో ఫలిస్తాయి”;

“జాతీయ భద్రతకు సవాళ్లు విస్తృతమయ్యాయి… యుద్ధ పద్ధతులూ మారుతున్నాయి”;

“ప్రపంచ వేదికపై భారత్‌ సత్తా రుజువు చేసుకుంటుంటే తప్పుడు-బూటకపు
సమాచారంతో.. అవావస్తవ ప్రచారం ద్వారా నిరంతర ప్రతిఘటన సాగుతోంది”;

“దేశంలో లేదా విదేశాల్లో భారత ప్రయోజనాలకు హానిచేసే శక్తులను తిప్పికొడదాం”;

“స్వయం సమృద్ధ భారతం కోసం ‘యావత్‌ ప్రభుత్వ’ విధానం
తరహాలో దేశ రక్షణ కోసం ‘జాతి మొత్తం’ పద్ధతి నేటి తక్షణావసరం”

Posted On: 18 JUL 2022 6:23PM by PIB Hyderabad

   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ‘ఎన్‌ఐఐఒ’ (నావికాదళ ఆవిష్కరణ-దేశీయీకరణ సంస్థ) నిర్వహించిన ‘స్వావలంబన్‌’ సదస్సునుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ- ప్రస్తుత 21వ శతాబ్దపు భారతదేశానికి మన రక్షణ దళాల్లో స్వావలంబన లక్ష్యం అత్యంత ప్రధానమని స్పష్టం చేశారు. ఈ దిశగా స్వయం సమృద్ధ నావికాదళం లక్ష్యంగా తొలి ‘స్వావలంబన్‌’ సదస్సు నిర్వహించడం ఒక కీలక చర్యగా ఆయన పేర్కొన్నారు. నవ భారతం కోసం సరికొత్త సంకల్పాలు పూనుతున్న ప్రస్తుత తరుణంలో 75 దేశీయ సాంకేతిక పరిజ్ఞానాల అభివృద్ధి లక్ష్యం నిర్దేశించుకోవడం ఎంతో స్ఫూర్తిదాయకమని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. అలాగే ఈ లక్ష్యాన్ని అత్యంత త్వరగా చేరుకోగలమన్న ఆశాభావం కూడా వ్యక్తం చేస్తూ-  అయినప్పటికీ ఇలాంటివాటిలో ఇది తొలి అడుగు మాత్రమేనని ఆయన అన్నారు. “దేశీయ సాంకేతిక పరిజ్ఞానాల సంఖ్యను మనం నిరంతరం పెంచుకుంటూ ముందుకు సాగాల్సి ఉంది. ఆ మేరకు భారతదేశం స్వాతంత్ర్య శతాబ్ది వేడుకలు నిర్వహించుకునే నాటికి మన నావికాదళం సమున్నత శిఖరాలకు చేరాలి” అని ప్రధానమంత్రి ఆకాంక్షించారు.

   భారత ఆర్థిక వ్యవస్థలో మహాసముద్రాలు, తీరప్రాంతాల ప్రాముఖ్యాన్ని ప్రస్తావిస్తూ- భారత నావికాదళం పాత్ర నిరంతరం పెరుగుతోందని, తదనుగుణంగా నావికాదళ స్వావలంబన అత్యంత కీలకమని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. దేశానికిగల అత్యద్భుత సముద్ర-నావికా సంబంధ సంప్రదాయాన్ని గుర్తుచేస్తూ-  స్వాతంత్ర్యానికి ముందు కూడా భారత రక్షణ రంగం చాలా పటిష్టంగా ఉండేదని ప్రధాని పేర్కొన్నారు. స్వాతంత్ర్యం వచ్చేనాటికి దేశంలో 18 ఆయుధ ఫ్యాక్టరీలు ఉండేవని, వాటిలో శతఘ్నులు సహా అనేక రకాల సైనిక పరికరాలు దేశంలోనే తయారయ్యేవని తెలిపారు. రెండో ప్రపంచ యుద్ధంలో భారతదేశం రక్షణ పరికరాల కీలక సరఫరాదారుగా వ్యవహరించిందని వివరించార. “ఇషాపూర్‌ రైఫిల్‌ ఫ్యాక్టరీలో తయారయ్యే మన హొవిట్జర్లు, మెషిన్ గన్‌లు అత్యుత్తమమైనవిగా పరిగణించబడ్డాయి. అప్పట్లో మనం ఎక్కువగా ఎగుమతులు చేసేవాళ్లం. కానీ, ఒకానొక దశ వచ్చేసరికి మనం ఈ రంగంలో ప్రపంచంలోనే అతిపెద్ద దిగుమతిదారుగా ఎందుకు మారాల్సి వచ్చింది?” అని ఆయన ప్రశ్నించారు.

   రెండో ప్రపంచ యుద్ధం సవాలును సద్వినియోగం చేసుకుంటూ కొన్ని దేశాలు ఆయుధ ఎగుమతులలో అగ్రస్థాయికి చేరాయని ప్రధాని గుర్తుచేశారు. అదే తరహాలో కరోనా మహమ్మారి సమయంలో ప్రతికూలతను భారత్‌ అవకాశంగా మలచుకున్నదని పేర్కొన్నారు. ఆ మేరకు ఆర్థిక వ్యవస్థతోపాటు తయారీ రంగం, శాస్త్రవిజ్ఞాన రంగం వేగంగా ముందడుగు వేశాయని చెప్పారు. స్వాతంత్య్రం వచ్చిన తొలి దశాబ్దాల్లో రక్షణ రంగ ఉత్పాదన పురోగమనంపై దృష్టి సారించలేదని, పరిశోధన, అభివృద్ధి కేవలం ప్రభుత్వ రంగానికే పరిమితం అయ్యాయని ఆయన విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు “ఆవిష్కరణలు కీలకం… అవి దేశీయంగానూ ఉండాలి… దిగుమతి చేసుకున్నవి ఆవిష్కరణకు ఎన్నడూ వనరులు కావు” అన్నారు. మరోవైపు దిగుమతి చేసుకునే వస్తువులపై మోజుపడే ధోరణి మారాల్సిన అవసరాన్ని ఆయన నొ్క్కిచెప్పారు.

   స్వయం సమృద్ధ రక్షణ వ్యవస్థ మన ఆర్థిక వ్యవస్థకే కాకుండా వ్యూహాత్మక దృక్కోణంలోనూ అత్యంత కీలకమని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ఈ విధంగా దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం కోసం 2014 తర్వాత దేశం ఉద్యమ ఉద్వేగంతో కృషి చేసిందని ఆయన అన్నారు. మన ప్రభుత్వ రంగ రక్షణ సంస్థలను వివిధ రంగాలకు విస్తరించడం ద్వారా ప్రభుత్వం వాటికి కొత్త బలాన్ని సమకూర్చిందని ప్రధాని వ్యాఖ్యానించారు. ఇవాళ మనం ఐఐటీల వంటి మన ప్రధాన సంస్థలను రక్షణ పరిశోధన-ఆవిష్కరణలతో అనుసంధానించేలా చూస్తున్నామని తెలిపారు. “గత దశాబ్దాల ఒడుదొడుకుల నుంచి నేర్చుకుంటూ నేడు మనం ప్రతి ఒక్కరి కృషి బలంతో కొత్త రక్షణ పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నాం. ఇవాళ రక్షణ పరిశోధన-అభివృద్ధిలో ప్రైవేట్ రంగం, విద్యాసంస్థలు, ‘ఎంఎస్‌ఎంఈ’లు, అంకుర సంస్థలకూ బాటలు వేశాం” అని ఆయన పేర్కొన్నారు. చాలాకాలం నుంచీ మూలపడి ఉన్న రక్షణ ప్రాజెక్టులు సరికొత్త వేగం అందుకోవడానికి ఇది దోహదం చేసిందన్నారు. ఫలితంగా తొలి స్వదేశీ విమాన వాహక నౌకను జల ప్రవేశం చేయించడంపై ఎదురుచూపులు త్వరలోనే ముగుస్తాయని ప్రధానమంత్రి ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు.

   ప్రధానమంత్రి తన ప్రసంగం కొనసాగిస్తూ- గ‌త 8 సంవ‌త్స‌రాల్లో ప్ర‌భుత్వం ర‌క్ష‌ణ బ‌డ్జెట్‌ను గణనీయంగా పెంచిందని గుర్తుచేశారు. “ఈ బ‌డ్జెట్ దేశంలోనే రక్షణ తయారీ పర్యావరణ వ్యవస్థ ప్రగతికి దోహదం చేసేలా మేం శ్రద్ధ వహించాం. ఇవాళ రక్షణ పరికరాల కొనుగోలు కోసం కేటాయించిన బడ్జెట్‌లో అధికశాతం భారతీయ కంపెనీల నుంచి కొనుగోలు కోసమే వెచ్చించబడుతోంది” అని ఆయన వివరించారు. దిగుమతి చేసుకోగూడని 300 పరికరాల జాబితాను రూపొందించడంపై రక్షణ దళాలను ఆయన అభినందించారు. గడచిన నాలుగైదేళ్లలో రక్షణ దిగుమతులు దాదాపు 21 శాతం తగ్గాయని ప్రధాని చెప్పారు. నేడు మనం అతిపెద్ద రక్షణ దిగుమతిదారు స్థాయి నుంచి పెద్ద ఎగుమతిదారుగా ఎదిగేలా వేగంగా పయనిస్తున్నామని తెలిపారు. ఈ మేరకు నిరుడు రక్షణ ఎగుమతులు రూ.13 వేల కోట్లకు చేరగా, ఇందులో 70 శాతానికి పైగా ప్రైవేట్‌ రంగం వాటాగా ఉన్నట్లు ఆయన వెల్లడించారు.

   దేశ భద్రతకు నేడు ముప్పు రకరకాలుగా విస్తృతం అవుతన్నదని, యుద్ధ పద్ధతులు కూడా ఎంతో మారుతున్నాయని ప్రధాని పేర్కొన్నారు. ఇంతకుముందు మనం మన రక్షణను భూమి, సముద్రం, ఆకాశం వరకూ మాత్రమే ఊహించుకునేవారమని గుర్తుచేశారు. కానీ, ఇవాళ ఈ వలయం అంతరిక్షం వైపు, సైబర్‌ ప్రపంచం దిశగా, ఆర్థిక-సామాజిక మార్గంవైపునా కదులుతున్నదని అప్రమత్తం చేశారు. ఈ నేపథ్యంలో భవిష్యత్‌ సవాళ్లను అంచనా వేస్తూ ముందుకు సాగాలని, తదనుగుణంగా మనల్ని మనం మార్చుకోవాలని ప్రధాని స్పష్టం చేశారు. ఈ విషయంలో స్వావలంబనే దేశానికి ఎంతగానో అండగా నిలవగలదని నొక్కిచెప్పారు.

   ప్రధానమంత్రి తన ప్రసంగంలో చివరగా- దేశానికి ఇప్పుడొక కొత్త ప్రమాదం ముంచుకొస్తున్నదని హెచ్చరించారు. “భారతదేశ ఆత్మవిశ్వాసాన్ని, మన స్వావలంబనను సవాలు చేసే శక్తులకు వ్యతిరేకంగానూ మన యుద్ధం ముమ్మరం కావాల్సి ఉంది. ప్రపంచ వేదికపై భారత్‌ తననుతాను రుజువు చేసుకుంటున్న తరుణంలో తప్పుడు-బూటకపు సమాచారంతోనూ.. అవావస్తవ ప్రచారం ద్వారా నిరంతర ప్రతిఘటన సాగుతోంది. ఈ పరిస్థితుల నడుమ మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ, దేశంలో లేదా విదేశాల్లో భారత ప్రయోజనాలను దెబ్బతీసే శక్తులను, ఆ దిశగా వాటి ప్రతి ప్రయత్నాన్నీ తిప్పికొట్టాలి. దేశ రక్షణ ఇప్పుడు సరిహద్దులకు మాత్రమే పరిమితం కాదు… ఇదెంతో విస్తృతమైనది. కాబట్టి ప్రతి పౌరుడికీ దానిపై అవగాహన కల్పించడం కూడా ఎంతో అవసరం” అని ఉద్బోధించారు. ఆ మేరకు “స్వయం సమృద్ధ భారతం కోసం ‘యావత్‌ ప్రభుత్వ’ విధానం తరహాలో దేశ రక్షణ కోసం ‘జాతి మొత్తం’ పద్ధతి నేటి తక్షణావసరం. దేశ భద్రత, శ్రేయస్సుకు దేశంలోని వివిధ వర్గాల ప్రజలలో కలిగే ఈ సామూహిక జాతీయ స్పృహ బలమైన చేయూత” అని ప్రధాని స్పష్టం చేశారు.

‘ఎన్‌ఐఐఒ’ సదస్సు ‘స్వావలంబన్‌’

   స్వయం సమృద్ధ భారతం లక్ష్యంలో కీలక మూలస్తంభం రక్షణ రంగంలో స్వావలంబన సాధించడమే. ఈ కృషిని మరింత ముందుకు తీసుకెళ్లే దిశగా చేపట్టిన కార్యక్రమంలో భాగంగా భారత నావికాదళంలో స్వదేశీ సాంకేతిక పరిజ్ఞాన వినియోగంపై చేయూతకు ఉద్దేశించిన “స్ప్రింట్ ఛాలెంజెస్”ను ప్రధానమంత్రి ఆవిష్కరించారు. ‘స్వాతంత్ర్య అమృత మహోత్సవాల’ కింద ‘ఎన్‌ఐఐఒ’, రక్షణ ఆవిష్కరణల సంస్థ (డిఐఒ)తో సంయుక్తంగా కనీసం 75 కొత్త స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాలు/ఉత్పత్తులను భారత నావికా దళానికి అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సహకార ప్రాజెక్టుకు ‘స్ప్రింట్‌’ (సపోర్టింగ్‌ పోల్‌-వాల్టింగ్‌ ఇన్‌ ఆర్‌ అండ్‌ డి త్రూ ఐడెక్స్‌, ఎన్‌ఐఐఒ, అండ్‌ టిడిఎసి)గా నామకరణం చేసింది.

   క్షణ రంగంలో స్వావలంబన సాధించే దిశగా భారతీయ పరిశ్రమలను, విద్యాసంస్థలను భాగస్వాములను చేయడం ఈ సదస్సు లక్ష్యం. పరిశ్రమలు, విద్యాసంస్థలు, సేవా-ప్రభుత్వ రంగాల నుంచి ప్రముఖ ప్రతినిధులు ఒక ఉమ్మడి వేదికపైకి రావడంతోపాటు రక్షణ రంగానికి సంబంధించిన సిఫారసులు రూపొందించడం కోసం రెండు రోజులపాటు (జూలై 18-19) సాగే సదస్సు వేదికగా నిలుస్తుంది. ఇందులో భాగంగా ఆవిష్కరణ, దేశీయీకరణ, ఆయుధీకరణ, గగనయానం తదితరాలపై ప్రత్యేక గోష్ఠులు నిర్వహిస్తారు. సదస్సు రెండో రోజున హిందూ మహాసముద్ర ప్రాంతం ప్రధానంగా ‘సాగర్‌’ (ఈ ప్రాంతంలో సామూహిక భద్రత-అభివృద్ధి)పై ప్రభుత్వ దార్శనికతకు అనుగుణంగా చర్చ సాగుతుంది.

 

******

 

 

DS/AK

 



(Release ID: 1842581) Visitor Counter : 284