ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
ఎబిడిఎం హాకెథాన్ శ్రేణి కింద తొలి హాకెథాన్‌ను మహారాష్ట్రలోని పూణెలో ప్రారంభించిన జాతీయ ఆరోగ్య అథారిటీ
ఎబిడిఎం హాకెథాన్ రౌండ్ 1- మిశ్రమ కార్యక్రమంగా 14 నుంచి 17 జులై 2022 వరకు సమగ్ర ఆరోగ్య వినిమయసీమ (యుహెచ్ఐ) ప్రారంభం
Posted On:
15 JUL 2022 1:40PM by PIB Hyderabad
ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ హాకెథాన్ శ్రేణి కింద జాతీయ ఆరోగ్య అథారిటీ (ఎన్‌హెచ్ఎ) తొలి హాకెథాన్‌ను 14 నుంచి 17 జులై 2022 వరకు మహారాష్ట్రలోని పూణెలో ఉన్న స్మార్ట్ సిటీ ఆపరేషన్స్ సెంటర్ లో హైబ్రిడ్ (మిశ్రమ) ఫార్మాట్‌లో నిర్వహిస్తోంది. ఈ హాకెథాన్‌ను ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ (ఎబిడిఎం) పూణె మున్సిపల్ కార్పొరేషన్ (పిఎంసి), పూణె స్మార్ట్ సిటీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (పిఎస్‌సిడిసిఎల్) సహకారంతో నిర్వహిస్తోంది. ఆవిష్కర్తలు, డెవలపర్‌లు (అభివృద్ధి చేసేవారు) డాటా నిపుణులకు చెందిన వివిధ బృందాలు ఆవిష్కరణ పరిష్కారాలను నిర్మించేందుకు భౌతికంగా, దృశ్యమాధ్యమం ద్వారా సహకరించారు.
హాకెథాన్‌ను ఎన్‌హెచ్ఎ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డాక్టర్ ఆర్. ఎస్. శర్మ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మహరాష్ట్ర ప్రభుత్వ వైద్య విద్య, డ్రగ్స్ విభాగం కార్యదర్శి శ్రీ సౌరభ్ విజయ్, ఎన్‌హెచ్ఎ అదనపు సిఇఒ డాక్టర్ ప్రవీణ్ గేదం ప్రారంభించారు. పిఎంసి కమిషనర్ శ్రీ విక్రమ్ కుమార్, ఆరోగ్య సేవలు, మిషన్ డైరెక్టర్ డాక్టర్ ఎన్. రామస్వామి, ఎన్‌హెచ్ఎ డైరెక్టర్ శ్రీ కిరణ్ గోపాల్ వస్కా, పిఎస్‌సిడిసిఎల్ సిఇఒ డాక్టర్ సంజయ్ కోల్తే, సి-డిఎసి పూణె అసోసియేట్ డైరెక్టర్ డాక్టర్ గౌర్ సుందర్, పిఎంసి అదనపు కమిషనర్ శ్రీ రవీంద్ర బిన్‌వాడే, పిఎంసి అదనపు కమిషనర్ డాక్టర్ కునాల్ ఖేమ్నర్ పాల్గొన్నారు.
యుపిఎ పోషించిన పాత్రలానే, సమగ్ర ఆరోగ్య వినిమయసీమ (ఇంటర్‌ఫేస్) మార్కెట్ సమర్ధతనిచ్చే పాత్రను పోషిస్తూ, బహుళ ఆరోగ్య సేవలను అందిస్తుందని ఎన్‌హెచ్ఎ సిఇఒ డాక్టర్ ఆర్. ఎస్, శర్మ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ చెప్పారు. ఇది ఆరోగ్య సంరక్షణకర్తల మధ్య పరస్పర చర్యను నిర్మించేందుకు, ఆరోగ్య సంరక్షణ డాటాను ఇచ్చిపుచ్చుకునే సౌకర్యాన్ని కల్పిస్తుంది. అంతిమంగా ఇది నాణ్యత కలిగిన ఆరోగ్య సంరక్షణ సరసమైన ధరలో అందరికీ అందుబాటులోకి తీసుకువచ్చేందుకు తోడ్పడుతుందని ఆయన అన్నారు.
తాము నిర్వహించాలని భావిస్తున్న హాకెథాన్ల పరంపరలో ఈ హాకెథాన్ మొదటిదని డాక్టర్. శర్మ చెప్పారు. ఇది తమ డిజిటల్ ఆరోగ్య పర్యావరణ వ్యవస్థ పునాదిరాళ్ళను మెరుగుపరిచేందుకు, దేశానికి, ప్రపంచానికి వినూత్న పరిష్కారాలను రూపొందించడానికి దేశంలోని యువ ప్రతిభను ప్రోత్సహిస్తుందని ఆయన వివరించారు.
సమగ్ర ఆరోగ్య వినిమయ సీమ (యునిఫైడ్ హెల్త్ ఇంటర్‌ఫేస్ - యుహెచ్ఐ)కు అదనంగా నూతన పరిష్కారాలను అభివృద్ధి చేయడం కోసం వ్యక్తులను, సంస్థలను ఒక చోట చేర్చడం ద్వారా భారత్‌లోని ఆరోగ్య స్టార్టప్‌ల వాతావరణ వ్యవస్థను సమీకరించడంపై హాకెథాన్ దృష్టిపెడుతుంది. తొలి రౌండ్ - కిక్ స్టార్టింగ్ యుహెచ్ఐ అన్న పేరుతో జరుగుతున్న బహుమాన మొత్తం రూ. 60,00,000. ఈ పరిష్కారాలను స్వతంత్య్ర జ్యూరీ అంచనా వేస్తుంది. బహుమానాలను రెండు ప్రధాన ఇతివృత్తాలలో అత్యంత బాగా రాణించిన వారికి అందచేస్తారు. ఆ రెండు ప్రధాన ఇతివృత్తాలు -
ఇన్నొవేషన్ ట్రాక్ (వినూత్న పద్ధతి): టెలికన్సల్టేషన్, అంబులెన్స్ బుకింగ్, ల్యాబ్ పరీక్షలు, భౌతిక కన్సల్టేషన్ బుకింగ్, ల్యాబ్ టెస్ట్‌ల బుకింగ్ వంటి వివిధ వినియోగ సందర్భాలలో బహిరంగ నెట్‌వర్క్‌లో డిజిటల్ ఆరోగ్య వ్యవస్థను శక్తిమంతం చేయడానికి వినూత్న పరిష్కారాల కోసం పోటీ.
ఇంటిగ్రేషన్ ట్రాక్ (సమన్వయ పద్ధతి)ః యుహెచ్ఐకి అనుకూలమైన అప్లికేషన్ల అభివృద్ధిని వేగవంతం చేయడం, ఈ అప్లికేషన్లను ఇతర భాగస్వామి అప్లికేషన్లతో సమన్వయ పరచడం ద్వారా యుహెచ్ ఐ నెట్‌వర్క్‌లో డిజిటల్ ఆరోగ్య లావాదేవీలకు తోడ్పాటునందించడంలో పోటీ.
ఎబిడిఎం హాకెథాన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను https://abdm.gov.in/register అన్న లింక్‌ను క్లిక్ చేయడం ద్వారా చూడవచ్చు.
సమగ్ర ఆరోగ్య వినిమయ సీమ (యుహెచ్ఐ)కి సంబంధించిన మరింత సమాచారం https://uhi.abdm.gov.in/ లో అందుబాటులో ఉంది.
***
(Release ID: 1841989)
Visitor Counter : 153