రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

జాతీయ ప్రయోజనాల పరిరక్షణలో అనధికార డైరెక్టర్లదే ముఖ్య పాత్ర!


ప్రభుత్వ రంగ రక్షణ సంస్థలు
‘ఆత్మనిర్భర భారత్’ లక్ష్యాన్ని
సాధించేలా చూడాలి.

సి.ఎం.డి., ఎన్.ఒ.డి.ల చర్చాగోష్టిలో
రక్షణమంత్రి రాజనాథ్ సింగ్ పిలుపు

Posted On: 13 JUL 2022 2:39PM by PIB Hyderabad

    ‘రక్షణ రంగంలో స్వావలంబనతో ఆత్మనిర్భర భారత్లక్ష్యాన్ని సాధించే దిశగా, ప్రభుత్వం చేపట్టే వివిధ పథకాలు సజావుగా అమలు జరిగేలా చూడాలని ప్రభుత్వ రంగ రక్షణ సంస్థల అనధికార డైరెక్టర్లకు (ఎన్.ఒ.డి.లకు) రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ పిలుపునిచ్చారు. 2022 జూలై 13న న్యూఢిల్లీలో జరిగిన ప్రభుత్వరంగ రక్షణ సంస్థల (డి.పి.ఎస్.యు.ల) చైర్మన్-మేనేజింగ్ డైరెక్టర్ల (సి.ఎం.డి.ల), అనధికార డైరెక్టర్ల (ఎన్.ఒ.డి.ల) చర్చాగోష్టి కార్యక్రమంలో రాజనాథ్ సింగ్ ప్రసంగించారు. రక్షణ ఉత్పత్తుల శాఖ ఆధ్వర్యంలో ఇలాంటి చర్చాగోష్టి కార్యక్రమం చేపట్టడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ మాట్లాడుతూ, స్వావలంబన అన్న లక్ష్యసాధనా ప్రక్రియకు సంబంధించి, దేశం ప్రస్తుతం పరివర్తనా దశలో ఉందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కలలుగన్న ఆత్మనిర్భర భారత్లక్ష్యాన్ని సాధించాలంటే, క్రియాశీలకమైన రీతిలో, సమష్టి కృషి చాలా కీలకమని అన్నారు.

   స్వావలంబన సాధనకోసం రక్షణ శాఖ చేపట్టిన పలు కార్యక్రమాలను గురించి రాజనాథ్ సింగ్ ప్రకటించారు. 2020వ సంవత్సరపు రక్షణ సేకరణ విధానం కింద రక్షణ పరికరాలు, వేదిక సమీకరణ ప్రక్రియను సరళీకరించిన విషయాన్ని,  మార్గదర్శక సూత్రాల సడలింపును, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్.డి.ఐ.ల) పరిమితిని ఆటోమాటిక్ మార్గంలో అయితే 74 శాతానికి, ప్రభుత్వం ద్వారా అయితే వందశాతంవరకూ పెంచడాన్ని రాజనాథ్ సింగ్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. లైసెన్సుల జారీ ప్రక్రియ సరళీకరణ, రక్షణ ప్రతిభా కార్యక్రమాల్లో ఆవిష్కరణలకు ప్రోత్సాం, రక్షణ రంగంలో కృత్రిమ మేథో పరిజ్ఞాన వినియోగాన్ని పెంచడం వంటి అంశాలను కూడా ఆయన ప్రస్తావించారు. 2025 సంవత్సరానికల్లా రక్షణ ఉత్పత్తి లక్ష్యాన్ని 1.75లక్షల కోట్లుగా రక్షణ శాఖ నిర్దేశించినట్టు ఆయన చెప్పారు. ఇందులో రూ. 35,000కోట్ల మేర ఎగుమతులు ఉన్నాయన్నారు. లక్ష్య సాధనలో రక్షణ ప్రభుత్వ రంగ సంస్థలు ప్రధాన పాత్ర పోషిస్తాయని, లక్ష్యంలో 70శాతం వరకూ సాధిస్తాయని ఆయన విశ్వాసం వ్యక్తంచేశారు. ప్రభుత్వ రంగ రక్షణ సంస్థలు వివిధ రంగాల్లో ప్రపంచంలోనే ఉత్తమ సంస్థలుగా స్థానం సంపాదించేలా కలసికట్టుగా కృషి చేయాలని సి.ఎం.డి.లకు, ఎన్.ఒ.డి.లకు రాజనాథ్ సింగ్ విజ్ఞప్తి చేశారు.

   అనధికాక డైరెక్టర్ల వ్యవస్థ ప్రభుత్వ రంగంలోని రక్షణ సంస్థలకు, రక్షణ మంత్రిత్వ శాఖకు మధ్య ఒక వారధిలా పనిచేస్తుందని రక్షణమంత్రి అన్నారు. దీనితో ప్రభుత్వ రంగ కంపెనీల్లో కార్పొరేట్ తరహా పాలనా వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని, అదే సమయంలో ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా పనులు అమలవుతాయని ఆయన అన్నారు. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా ఈ సంస్థల యాజమాన్య వ్యవస్థ పనిచేస్తోందా లేదా అన్నది పరిశీలించాలని అనధికార డైరెక్టర్ల వ్యవస్థకు రాజనాథ్ సింగ్ పిలుపునిచ్చారు. ప్రభుత్వ రంగంలోని రక్షణసంస్థల ప్రయోజనాలను పరిరక్షించేందుకు పనిచేయాలని, నిర్మాణాత్మక విమర్శల ద్వారా నిర్ణాయక ప్రక్రియకు తగిన విలువలను జోడించాలని ఆయన కోరారు.

   ప్రభుత్వ రంగంలోని రక్షణ సంస్థల వ్యూహాన్ని, పనితీరును, సమస్యలను ఎదుర్కొనే వ్యూహాలను, వనరులను, కీలకమైన నియామకాలను, కార్పొరేట్ సామాజిక బాధ్యతలను, సుస్థిర అభివృద్ధిని, నిర్వహణా ప్రమాణాలను ఎన్.ఒ.డి.ల వ్యవస్థ నిశితంగా పరిశీలిస్తుందన్నారు. ప్రభుత్వ రంగ రక్షణ సంస్థలు తమ లక్ష్యాలను చేరుకోవడంలో ఎన్.ఒ.డి.ల వ్యవస్థ అందించిన సేవలను ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. విధాన నిర్ణాయక వ్యవస్థకు సంబంధించి ప్రైవేటు రంగంలో అమలులో ఉన్న ఉత్తమైన విధానాలను మాత్రమే అమలు చేయాలని ఆయన ఎన్.ఒ.డి.లకు విజ్ఞప్తి చేశారు. మరింత విస్తృత స్థాయిలో పరిశోధనా, అభివృద్ధి కార్యకలాపాలు జరిగేలా ఎన్.ఒ.డి.లు రక్షణ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రోత్సహించాలన్నారు. ఇటీవలి కాలంలో విశేష ప్రతిభా సామర్థ్యాలు కనబరిచిన రక్షణ ప్రభుత్వ రంగ సంస్థలను ఆయన ప్రశంసించారు. ఎన్.ఒ.డి.లు అందించే సూచనలపై తగిన చర్యలు తీసుకోవాలని రక్షణ మంత్రి సి.ఎం.డి.లకు పిలుపునిచ్చారు.

   రక్షణ శాఖ సహాయమంత్రి అజయ్ భట్ ముగింపు ప్రసంగం చేస్తూ, తగిన నైపుణ్యాలు, అనుభవం, ప్రైవేటు రంగంపై పరిజ్ఞానం కలిగిన ఎన్.ఒ.డి.ల ప్రతిభా సామర్థ్యాలను వినియోగించుకోవాలని ప్రభుత్వ రంగ రక్షణ సంస్థల సి.ఎం.డి.లకు పిలుపునిచ్చారు. ఎన్.ఒ.డి.లు కార్పొరేట్ నిర్వహణా వ్యస్థకు తగిన ప్రోత్సాహం అందించి, డి.పి.ఎస్.యు.ల విశ్వసనీయతను, జవాబుదారీ తనాన్ని పెంపొందించాలని కోరారు. యాజమాన్య వ్యవస్థ ప్రయోజనాలకు, వాటాదార్లకు మధ్య సమతుల్యత సాధించాలని, నిర్ణయం తీసుకునే ప్రక్రియకు తగిన విధంగా దోహదపడాలని ఆయన ఎన్.ఒ.డి.లకు విజ్ఞప్తి చేశారు.

   రక్షణ శాఖ కార్యదర్శి డాక్టర్ అజయ్ కుమార్ మాట్లాడుతూ, ఎన్.ఒ.డి. నిర్వహించాల్సిన పాత్ర, వారు నిర్వర్తించాల్సిన బాధ్యతలను గురించి వివరించారు. స్వావలంబన సాధనకోసం ప్రభుత్వ రంగ రక్షణ సంస్థలు చేస్తున్న కృషికి ఎన్.ఒ.డి.లు తగిన ప్రోత్సాహం అందించాలన్నారు. స్వదేశీ పరిజ్ఞానంతో కూడిన అధునాతన సాంకేతికతను, పరికరాలను సాయుధ బలగాలకోసం రూపొందించేందుకు విలువైన సూచనలు, సలహాలు అందించాలని కోరారు. తద్వారా ఎగుమతులను పెంచాలని అన్నారు. ఇందుకోసం పారిశ్రామిక రంగం, విద్యా సంస్థలు, స్టార్టప్ కంపెనీలతో సహకారాన్ని పెంపొందింప జేసే అంశంపై దృష్టిని కేంద్రీకరించాలన్నారు. ప్రభుత్వ రంగంలోని రక్షణసంస్థలను ప్రపంచ స్థాయి పోటీ సంస్థలుగా తీర్చిదిద్దేందుకు ఎన్.ఒ.డి.లు మరింత క్రియాశీలకంగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. 2047వ సంవత్సరానికల్లా ప్రపంచంలోని అగ్రశ్రేణి రక్షణసంస్థల సరసన 20 భారతీయ రక్షణ ఉత్పత్తి సంస్థలు స్థానం సంపాదించేందుకు దోహదపడే కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని పిలుపునిచ్చారు.

   ఎన్.ఒ.డి.లు తమ పాత్ర ప్రాధాన్యాన్ని, బాధ్యతలను, గుర్తించేలా చేసి, తద్వారా ప్రభుత్వ రంగ రక్షణసంస్థల పనితీరును మెరుగుపరిచే లక్ష్యంతో ఈ చర్చాగోష్టిని నిర్వహించారు. అనధికార డైరెక్టర్లు (ఎన్.ఒ.డి.లు) కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల మండలిలో గణనీయమైన పాత్ర నిర్వహిస్తారు.  స్వతంత్రంగా నిర్ణయం తీసుకునేందుకు, బోర్డు, మేనేజిమెంట్ పనితీరును నిష్పాక్షికంగా మధింపు చేసేందుకు వారు సహాయపడతారు. కంపెనీ ఉత్పత్తుల, సేవల నాణ్యాతా ప్రమాణాలను సక్రమంగా కొనసాగేలా చూసేందుకు, వాటాదార్ల ప్రయోజనాల సమతుల్యతను కాపాడేందుకు, పర్యావరణ హితమైన సాంకేతిక పరిజ్ఞానాలను వినియోగించేందుకు, కంపెనీలు వనరుల పరిరక్షణను సక్రమంగా పాటించేలా చూసేందుకు ఎన్.ఒ.డి.లు ఎంతగానో దోహదపడతారు.

 

****



(Release ID: 1841237) Visitor Counter : 145