యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
2022 కామన్‌వెల్త్ క్రీడలకు వెళ్తున్న భారత బృందానికి ఘనంగా వీడ్కోలు!
ముఖ్యఅతిథిగా పాల్గొన్న కేంద్రమంత్రి ఠాకూర్
మన క్రీడాబృందం ఎంతో బలమైనది.,
ప్రపంచ వేదికపై మరోసారి
భారత గౌరవాన్ని నిలబెడుతుంది: ఠాకూర్
Posted On:
07 JUL 2022 7:05PM by PIB Hyderabad
యునైటెడ్ కింగ్‌డమ్‌లోని బర్మింగ్‌హ్యామ్‌లో జరగనున్న కామన్‌వెల్త్ క్రీడోత్సవానికి వెళ్లే భారత జట్టు క్రీడాకారుల బృందానికి ఈ రోజు ఢిల్లీలో జరిగిన వీడ్కోలుకార్యక్రమంలో కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ పాలుపంచుకున్నారు. దేశంలో ఒలింపిక్ క్రీడాంశాల పర్యవేక్షణా సంస్థ అయిన భారత ఒలింపిక్ సంఘం (ఐ.ఒ.ఎ.) ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

కేంద్ర హోమ్, యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ సహాయమంత్రి నిశీత్ ప్రమాణిక్, భారతీయ క్రీడా ప్రాధికార సంస్థ (ఎస్.ఎ.ఐ) డైరెక్టర్ జనరల్ సందీప్ ప్రధాన్, ఐ.ఒ.ఎ. తాత్కాలిక అధ్యక్షుడు అనిల్ ఖన్నా తదితర ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
కామన్వెల్త్ క్రీడోత్సవానికి వెళ్తున్న 215మంది బృందంలో 2020లో టోక్యో ఒలింపిక్ క్రీడల పతక విజేతలు బైరంగ్ పూనియా, పి.ఆర్. శ్రీజేష్, మన్‌ప్రీత్ సింగ్, లవ్లీనా బోర్గోహెయిన్ తదితరులు ఉన్నారు. ఒలింపిక్ పతక విజేతలు సాక్షీ మాలిక్, పరుగు, స్ప్రింట్ స్టార్ ద్యుతీ చంద్, హిమాదాస్, ఆసియన్ బాక్సింగ్ చాంపియన్ షిప్ పోటీల స్వర్ణపతక విజేత శివా తపా, బాక్సర్ అమిత్ పంఘాల్ తదితర ప్రముఖులు కూడా కార్యక్రమానికి హాజరయ్యారు.
ఈ సందర్భంగా క్రీడాబృందానికి చెందిన కిట్లను ఆవిష్కరించారు. కామన్‌వెల్త్ క్రీడలకు వెళ్లే బృందానికి ప్రధాన స్పాన్సార్‌గా జె.ఎస్.డబ్ల్యు. ఇన్‌స్పైర్ సంస్థను కూడా ఐ.ఒ.ఎ. చేర్చింది. సెర్మోనియర్ కిట్టింగ్ భాగస్వామ్య సంస్థగా మాన్యవర్ సంస్థకు అవకాశం కల్పించారు. అడిడాస్ సంస్థకు అధికారిక ఫుట్‌వేర్ సంస్థగా భాగస్వామ్యం కల్పించారు.

వీడ్కోలు కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న కేంద్రమంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికత్వంతో భారతీయ క్రీడా రంగం ప్రపంచ స్థాయిలో మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరకుందన్నారు. “గత ఒలిపింక్ క్రీడోత్సవంలో మన జట్టు ఇదివరకెన్నడూ లేని స్థాయిలో అత్యుత్తమ ప్రతిభను ప్రదర్శించింది. మన క్రీడాకారుల మెరుగైన ప్రతిభను ఇటీవలి కాలంలో మన కళ్లతో వీక్షిస్తున్నాం. చారిత్రాత్మకమైన థామస్‌కప్ గెలుచుకోవడం కూడా గొప్ప విషయం.” అని ఆయన అన్నారు.

“కామన్‌వెల్త్ క్రీడోత్సవానికి పంపుతున్న మనం పంపుతున్న భారత జట్టు ఇదివరకు ఎన్నడూ లేనంత మెరుగైనది. బలమైనది. ప్రపంచ క్రీడా వేదికపై మన క్రీడాకారులు ఎన్ని పతకాలు గెలుచుకుంటారన్న అంశంతో సంబంధం లేకుండా, ప్రపంచ వేదికపై వారు, మనదేశ గౌరవాన్ని మరోసారి నిలబెట్టగలరని నా విశ్వాసం. వారు ఎన్ని పతకాలు గెలుస్తారన్నది ముఖ్యం కాదు. వారంతా మనకు గర్వకారణం. జయాపజయాలతో సంబంధం లేకుండా దేశం యావత్తూ వారికి మద్దతు అందిస్తోంది. వారు విజయం సాధించాలన్నదే మన ఆకాంక్ష.” అని కేంద్రమంత్రి ఠాకూర్ అన్నారు.

కామన్‌వెల్త్ క్రీడల్లో తలపడేందుకు వెళ్లే భారత జట్టులో పురుషలు, మహిళలు దాదాపు సమతూకంతో ప్రాతినిధ్యం వహించడం తనకు చాలా సంతోషం కలిగిస్తోందని ఆయన అన్నారు. ఈ క్రీడా బృందంలో 108మంది పురుషులు, 107మంది మహిళలు ఉన్నారన్నారు.

ఐ.ఒ.ఎ. ప్రధాన కార్యదర్శి రాజీవ్ మెహతా మాట్లాడుతూ, “కామన్‌వెల్త్ క్రీడల్లోమన క్రీడా బృందం తమ ప్రతిభను చక్కగా ప్రదర్శించగలదని మా విశ్వాసం. వారికి ఇచ్చిన శిక్షణ, సన్నాహాలు అగ్రశ్రేణిలో ఉన్నాయి. బర్మింగ్‌హ్యామ్ కామన్‌వెల్త్ క్రీడల్లో మనం అత్యుత్తమ ప్రతిభను ప్రదర్శించేందుకు గల అవకాశాలన్నింటినీ వినియోగించుకునేందుకు భారత ప్రభుత్వం, క్రీడా మంత్రిత్వ శాఖ గట్టిగా కృషి చేశాయి. ఇందుకు నేను సవినయంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ క్రీడలనుంచి ఘన విజయంతో తిరిగి రావాలని కోరుకుంటున్నాను. మన క్రీడాకారులకు, కోచ్‌లకు, సహాయ సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.” అన్నారు.
బర్మింగ్‌హ్యామ్ కామన్‌నెల్త్ క్రీడల్లో పతకాలు గెలిచే క్రీడాకారులకు ఐ.ఒ.ఎ. తరఫున నగదు పురస్కారాలను రాజీవ్ మెహతా ఈ సందర్భంగా ప్రకటించారు. స్వర్ణపతక విజేతలకు రూ. 20లక్షలు, రజత పతక విజేతలకు రూ. 10లక్షలు, కాంస్య పతక విజేతలకు ఏడున్నర లక్షల రూపాయలను నగదు పురస్కారంగా అందించనున్నట్టు ఆయన ప్రకటించారు. క్రీడోత్సవం జరిగే బర్మింగ్‌హ్యామ్ వాతావరణానికి అలవాటు పడేందుకు, సన్నాహక శిక్షణకు వీలుగా క్రీడా బృందంలో కొందరు సభ్యులు ఇప్పటికే యునైటెడ్ కింగ్‌డమ్ చేరుకున్నారు. వృత్తిపరంగా తమకు అప్పగించిన బాధ్యతల్లో చేరిన మరికొంతమంది క్రీడాకారులు అక్కడనుంచి నేరుగా బర్మింగ్‌హ్యామ్ చేరుకోనున్నారు.
ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్‌లో గతంలో నాలుగేళ్ల కిందట జరిగిన కామన్‌వెల్త్ క్రీడల్లో భారతదేశం 26 స్వర్ణపతకాలతో పాటు మొత్తం 66పతకాలను సొంతం చేసుకుని, మూడవ స్థానాన్ని సాధించింది. ఈ క్రీడల్లో మొదటి స్థానాన్ని ఆస్ట్రేలియా, రెండవ స్థానాన్ని ఇంగ్లండ్ సాధించాయి. గత కామన్‌వెల్త్ క్రీడల్లో బాడ్మింటన్, బాక్సింగ్, షూటింగ్, టేబుల్ టెన్నిస్, వెయిట్‌లిఫ్టింగ్, కుస్తీ (రెజిలింగ్) వంటి ఆరు క్రీడాంశాల్లో 90శాతం స్వర్ణ పతకాలను అంటే, 26 స్వర్ణపతకాల్లో ఇరవై ఐదింటిని భారతదేశం సొంతం చేసుకుంది. అలాగే, అథ్లెటిక్స్, పారా స్పోర్ట్స్, స్క్వాష్ క్రీడల్లో కూడా భారతదేశం పతకాలు గెలుచుకుంది.
గోల్డ్‌కోస్ట్ క్రీడల్ల షూటింగ్ పోటీల్లో భారతదేశం 16పతకాలు గెలుచుకుంది. వాటిలో 7 స్వర్ణపతకాలు ఉన్నాయి. అయితే, ఈ సారి కామన్‌వెల్త్ క్రీడల్లో మాత్రం షూటింగ్ పోటీలకు ప్రాతినిధ్యం లేదు. కానీ, తొలిసారిగా ఈ క్రీడల్లో భాగంగా చేర్చిన మహిళా క్రికెట్‌లో భాతదేశం తన సత్తాను చాటుకునే అవకాశం ఉంది. దీనికి తోడు, బాడ్మింటన్, బాక్సింగ్, హాకీ, వెయిట్‌లిఫ్టింగ్, రెసిలింగ్ క్రీడల్లో భారత క్రీడాకారులు సంప్రదాయపరంగా బలంగా ఉంటారు. ఇటీవలి కాలంలో సాధించిన ఫలితాలను పరిగణనలోకి తీసుకున్నా, షూటింగ్ పోటీల తొలగింపుతో తలెత్తే నష్టాన్ని భారత్ పూడ్చుకునే అవకాశం ఉంది.
దీనికి తోడు, బాడ్మింటన్, బాక్సింగ్, హాకీ, వెయిట్‌లిఫ్టింగ్, రెజిలింగ్ క్రీడల్లో గట్టిజట్టుగా కొనసాగుతున్న భారతదేశం, ఇటీవలి కాలంలో కంటే ఇపుడు మరింత బలంగా రూపుదిద్దుకుంది. ఇటీవలి కాలంలో సాధించిన ఫలితాలను పరిశీలించినపుడు ఇదే విషయం అర్థమవుతుంది.
కామన్‌వెల్త్ క్రీడోత్సవానికి వెళ్లే భారతబృందానికి అదానీ స్పోర్ట్స్‌లైన్ సంస్థ ప్రధాన స్పాన్సార్‌గా వ్యవహరిస్తోంది. జె.ఎస్.డబ్ల్యు. ఇన్‌స్పైర్ సంస్థ ప్రిన్స్‌పల్-కిట్టింగ్ స్పాన్సార్‌గా ఉంది. హెర్బల్‌లైఫ్ అఫిషియల్ న్యూట్రీషన్ భాగస్వామ్యసంస్థగా, మాన్యవర్ సంస్థ సెరిమోనియల్ కిట్టింగ్ పార్ట్‌నర్‌గా, అడిడాస్ కంపెనీ ఫర్మార్మెన్స్ ఫుట్‌వేర్ పార్టనర్‌గా వ్యవహరిస్తున్నాయి. ఇనాక్స్-అమూల్ సంస్థలు అసోసియేట్ స్పాన్సార్లుగా, హైడ్రేషన్ పార్ట్‌నర్స్‌గా బోరోసిల్ కంపెనీ, స్పోర్ట్ ఎడ్-టెక్ పార్ట్‌నర్‌గా ఎస్.ఎఫ్.ఎ. సంస్థ పనిచేస్తున్నాయి.
****
(Release ID: 1840046)
Visitor Counter : 190