సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
పెన్షనర్ల కోసం సమగ్ర పోర్టల్!
Posted On:
21 JUN 2022 12:41PM by PIB Hyderabad
పెన్షన్-పెన్షనర్ల సంక్షేమ శాఖ (డి.ఒ.పి.పి.డబ్ల్యు) నిర్వహించిన రెండు రోజుల బ్యాంకర్ల అవగాహనా కార్యక్రమం ఉదయపూర్‌లో జరిగింది. 2022 జూన్ 20, 21వ తేదీల్లో ఈ కార్యక్రమం జరిగింది. పెన్షన్ సంబంధిత కార్యకలాపాలను చూసే భారతీయ స్టేట్ బ్యాంకు (ఎస్.బి.ఐ.) ఉత్తర ప్రాంతీయ అధికారులకోసం ఈ కార్యక్రమం నిర్వహించారు.
కేంద్రప్రభుత్వ పెన్షనర్ల పెన్షన్ పంపిణీకి సంబంధించిన విధాన సంస్కరణలు, డిజిటైజేషన్ ప్రక్రియ తదితర అంశాలపై డి.ఒ.పి.పి.డబ్ల్యు. అధికారుల బృందం తరగతులు నిర్వహించింది. ఎస్.బి.ఐ. క్షేత్రస్థాయి అధికారులకు సమాచారాన్ని నవీకరించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. పెన్షనర్లకు సంబంధించిన ఆదాయం పన్ను వ్యవహారాలు, వార్షిక జీవన ప్రమాణ పత్రాలను సమర్పించేందుకు డిజిటల్ మార్గాల గురించి ప్రత్యేక సమావేశాలను నిర్వహించారు. ఈ సందర్భంగా సెంట్రల్ పెన్షన్ అక్కౌంటింగ్ కార్యాలయానికి చెందిన పెన్షన్ల విభాగం చీఫ్ కంట్రోలర్ మాట్లాడుతూ, పెన్షనర్ల సమస్యలకు కారణాలేమిటో వివరించారు. సమస్యల పరిష్కారానికి బ్యాంకర్లు తీసుకోవలసిన చర్యలను కూడా సూచించారు.
పెన్షనర్లకు నిర్విరామంగా, నిరాటంకంగా సేవలందించేందుకు వీలుగా, డి.ఒ.పి.పి.డబ్ల్యు.ను ఎస్.బి.ఐ. ప్రస్తుత పోర్టళ్లను అనుసంధానిస్తూ పెన్షనర్లకోసం ఒక సమగ్రమైన పోర్టల్‌ను తక్షణం ఏర్పాటు చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.
భారత ప్రభుత్వం అందించే సంక్షేమ కార్యక్రమాల ప్రయోజనాలు సక్రమంగా బట్వాడా కావాలంటే, క్షేత్రస్థాయి అధికారులకు, పెన్షనర్లకు తగిన అవగాహన కల్పించడం చాలా అవసరం. డిజిటల్ జీవన ప్రమాణ పత్రం కోసం పెన్షనర్ ముఖ ధ్రువీకరణ ప్రక్రియలో సాంకేతిక పరిజ్ఞానం పాత్ర గురించి బ్యాంకులు తమ ప్రకటనల ద్వారా విస్తృతంగా అవగాహన కల్పించాల్సి ఉంటుంది. ఇక క్షేత్రస్థాయి అధికారులు, పెన్షనర్లు ఎదుర్కొనే సమస్యలను పరిష్కరించేందుకు డి.ఒ.పి.పి.డబ్ల్యు. విధానపరమైన చర్యలు తీసుకుంటుంది. డిజిటల్ జీవన ప్రమాణ పత్రం, ముఖ ధ్రువీకరణ సాంకేతిక పరిజ్ఞానం వంటివి జీవన ప్రమాణ పత్రాల సమర్పణ ప్రక్రియలో పెనుమార్పులకు దోహదపడతాయి. పెన్షనర్లకు, బ్యాంకర్లకు ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. ఇలాంటి అవగాహనా కార్యక్రమాలు బ్యాంకు అధికారులకు తమ సామర్థ్యాల నిర్మాణంలో ఎంతగానో దోహదపడతాయి.
కేంద్రీయ పెన్షన్ ప్రాసెసింగ్ కేంద్రాలకు, వివిధ బ్యాంకుల్లో పెన్షన్ సంబంధిత పనులను నిర్వర్తించే క్షేత్రస్థాయి సిబ్బందికి నిర్వహించే అనేక అవగాహనా కార్యక్రమాల పరంపరంలో భాగంగా ఈ తొలి కార్యక్రమం నిర్వహించారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా పెన్షనర్ల ‘సౌకర్య జీవనం’ విస్తృతం చేయాలన్న లక్ష్యం చాలావరకు సాధ్యమవుతుందని భావిస్తున్నారు. దేశవ్యాప్తంగా క్షేత్రస్థాయి సిబ్బంది అంతటికీ వర్తించేలా ఎస్.బి.ఐ. సహకారంతో ఇలాంటి అవగాహనా కార్యక్రమాలను నాలుగింటిని దేశవ్యాప్తంగా నిర్వహిస్తారు. అదే పద్ధతిలోనే పెన్షన్లను బట్వాడా చేసే బ్యాంకుల సహకారంతో అవగాహనా కార్యక్రమాలను 2022-23వ సంవత్సరంలోనే నిర్వహిస్తారు.
ఉదయపూర్‌లో నిర్వహించిన రెండు రోజుల బ్యాంకర్ల అవగాహనా కార్యక్రమం జూన్ 21న ముగిసింది. డి.ఒ.పి.పి.డబ్ల్యు. సంయుక్త కార్యదర్శి సంజీవ్ ఎన్. మాథుర్ ముగింపు ప్రసంగం చేశారు.పెన్షనర్ల ‘సౌకర్య జీవనం’ లక్ష్యంగా క్రియాశీలక మార్పులు చేసేందుకు అవసరమైన విధాన చర్యలపై బ్యాంకు అధికారుల అభిప్రాయాలను కూడా ఈ కార్యక్రమంలో సేకరించారు. దేశం ఉత్తరాది కేంద్రీయ సెంట్రల్ ప్రాసెసింగ్ కేంద్రాలు, పెన్షన్ బ్రాంచీలకు చెందిన 50మంది అధికారులకు పార్టిసిపేషన్ సర్టిఫికెట్లను కూడా ముగింపు కార్యక్రమంలో ప్రదానం చేశారు
<><><>
(Release ID: 1836124)
Visitor Counter : 143