రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
మౌలిక సదుపాయాల అభివృద్ధి 'నాణ్యత'పై దృష్టి సారించేందుకు కొత్త ఆలోచనలు, పరిశోధన ఫలితాలు మరియు సాంకేతికతల కోసం ఇన్నోవేషన్ బ్యాంక్‌ను ఏర్పాటు చేయాలి.. కేంద్ర మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ సూచన
Posted On:
17 JUN 2022 12:53PM by PIB Hyderabad
మౌలిక సదుపాయాల అభివృద్ధి లో 'నాణ్యత' అంశానికి ప్రాధాన్యత లభించేలా చూసినందుకు నూతన ఆలోచనలు, పరిశోధన ఫలితాలు మరియు సాంకేతికతలకు 'ఇన్నోవేషన్ బ్యాంక్'ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ అన్నారు. ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ (ఐ ఆర్ సీ ) 222 వ మిడ్-టర్మ్ కౌన్సిల్ మీటింగ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో వర్చువల్ విధానంలో శ్రీ నితిన్ గడ్కరీ ప్రసంగించారు. వినూత్న అంశాలకు ప్రాధాన్యత ఇస్తూ నూతన ఆవిష్కరణలకు ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి సూచించారు. ప్రతి ఒక్క ఇంజనీర్ ఆవిష్కరణకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా కార్యక్రమాలు రూపొందాలని అన్నారు. ఐఐటీలు, ప్రపంచ స్థాయి సంస్థల సహకారంతో ప్రపంచ స్థాయి అత్యాధునిక ప్రయోగశాలను అభివృద్ధి చేయాలని ఆయన ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ కు సూచించారు.
5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారతదేశం అభివృద్ధి సాధించాలన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికత సాకారం అయ్యే అంశంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కీలక పాత్ర పోషిస్తుందని శ్రీ గడ్కరీ అన్నారు.
ఒక ప్రాంత అభివృద్ధిలో రహదారి మౌలిక సదుపాయాలు ప్రత్యక్ష ప్రభావం చూపుతాయని శ్రీ గడ్కరీ పేర్కొన్నారు. రోడ్డు మౌలిక సదుపాయాలు ప్రజలు , సంస్కృతి మరియు సమాజం మధ్య వారధిగా పని చేస్తాయని ఆయన వివరించారు. సామాజిక-ఆర్థిక అభివృద్ధి ద్వారా శ్రేయస్సు సాధ్యమవుతుందని ఆయన అన్నారు.
గత 8 ఏళ్లలో జాతీయ రహదారుల పొడవు 50% పైగా పెరిగిందని మంత్రి తెలిపారు. 2014లో జాతీయ రహదారుల పొడవు 91,000 కి.మీలు ఉండగా ఇప్పుడు 1.47 లక్షల కి.మీలకు చేరిందని వివరించారు. 2025 నాటికి జాతీయ రహదారి వ్యవస్థను 2 లక్షల కిలోమీటర్ల వరకు విస్తరించేందుకు అవసరమైన ప్రణాళిక రూపొందించి ప్రభుత్వం అమలు చేస్తోందని ఆయన అన్నారు. గత 8 ఏళ్లలో తమ బృందం అనేక ప్రపంచ రికార్డులను నెలకొల్పిందని ఆయన అన్నారు.
ఈశాన్య ప్రాంత అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని శ్రీ గడ్కరీ అన్నారు. ఈ ప్రాంతంలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంలో జాతీయ రహదారులు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (NHIDCL) కీలక పాత్ర పోషిస్తుందని ఆయన అన్నారు. జాతీయ రహదారుల్లో ఈశాన్య ప్రాంతం వాటా 10% వరకు ఉందని మంత్రి అన్నారు. ఇంతవరకు 45,000 కోట్ల ఖర్చుతో 2344 కి.మీ జాతీయ రహదారులను అభివృద్ధి చేశామని తెలిపారు.
ప్రపంచంలోనే అత్యుత్తమమైన మరియు అత్యంత విజయవంతమైన సాంకేతికతను, నిర్మాణ సామాగ్రిని ఉపయోగించేందుకు భారతదేశం సిద్ధంగా ఉందని శ్రీ గడ్కరీ స్పష్టం చేశారు. విజయవంతమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం మరియు నిర్మాణ వ్యయం తగ్గింపు అంశాలకు ప్రాధాన్యత ఇస్తున్నామని అన్నారు. నిర్మాణ వ్యయాన్ని తగ్గించి నాణ్యతను మెరుగు పరచవలసిన అవసరం ఉందని ఆయన అన్నారు.
నిర్మాణం, నిర్వహణ ఆపరేషన్ దశలో కర్బన ఉద్గారాల విడుదల తక్కువగా ఉండాలని శ్రీ గడ్కరీ స్పష్టం చేశారు. సహజ వనరుల వినియోగం సాధ్యమైనంత తక్కువగా జరగాలని శ్రీ గడ్కరీ అన్నారు. పర్యావరణాన్ని, వాతావరణాన్ని నాశనం చేసే అభివృద్ధిని దేశం కోరుకోవడం లేదని ఆయన అన్నారు. ఉక్కు , సిమెంట్ లకు స్థిరమైన ప్రత్యామ్నాయాన్ని కనుగొనాలని ఆయన అన్నారు.
***
(Release ID: 1834805)