యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
ఆస్థమా ఓడింది,.. సుధేష్ణ పరుగే గెలిచింది!
Posted On:
10 JUN 2022 3:21PM by PIB Hyderabad
విక్టరీ పోడియం దగ్గర సుధేష్ణ తండ్రి, హన్మంత్ శివాంకర్ ఎలాంటి భావం లేకుండా అలా నిశ్చంతగా నిలుచుకుని ఉన్నాడు. అతని మనసు మాత్రం అనేక ఏళ్లు వెనక్కి పరుగెట్టింది. ఒక పరుగు పందెంలో తన కుమార్తె, పోటీనుంచి తప్పుకోవలసి వచ్చిందన్న భావన అతనికి ఆ సమయంలో మళ్లీ గుర్తొచ్చింది.
తాజాగా, ఖేలో ఇండియా యువజన క్రీడల విజయోత్సవంలో అదే కుమార్తె పొగడ్తల్లో తడిసి ముద్దైపోవడం శివాంకర్‌ను ఆశ్చర్యంలో ముంచెత్తింది. “సంభ్రమాశ్చర్యంతో కూడిన కెరటం నన్ను చుట్టుముట్టేసింది,” గెలిచిన తన కూతుర్ని చూస్తూ ఆయన అన్న మాటలివి. ఈ మాటలతో ఆయన ఎంతో ఉద్వేగానికి గురయ్యారు. తన కుమార్తెకు చిన్నప్పడే ఆస్థమా వ్యాధి నిర్ధారణ అయిందని, దీనితో ఆమెను పొగకు, ధూళికి దూరంగా ఉంచేందుకు తమ కుటుంబమంతా ప్రయత్నించేదని అన్నారు. ఆమె ఊపిరితిత్తులు, శ్వాస నాళాలకు పొగా, దుమ్మూధూళి సోకకుండా తాము జాగ్రత్తపడే వారమని అన్నారు.
“నా కూతరు సుధేష్ణను అథ్లెటిక్ పోటీలకు తీసుకెళ్లేందుకు అనుమతించాలంటూ ఆమె పి.టి. టీచర్ చేసిన విజ్ఞప్తిని అప్పట్లో నేను పూర్తిగా కొట్టిపారేశాను,” అంటూ తన గత స్మృతులను నెమరువేసుకున్నారు. అయినా, ఆ పోటీకి ఎలాగైనా తనకు తెలియకుండా అయినా వెళ్లాలని ఉపాధ్యాయుడితో పాటుగా సుధేష్ణ కూడా నిర్ణయించుకున్నట్టు ఆయన చెప్పారు.
“అయితే, వారు అథ్లెటిక్ పోటీ ప్రయాణం గురించి నేను ఎలాగో తెలుసుకున్నాను. ఎలాగైనా ఆమె ప్రయత్నాన్ని అడ్డుకుందామని అక్కడికి పరుగు పరుగున వెళ్లాను. అయితే నేను అక్కడికి వెళ్లేసరికే సుధేష్ణ పోటీలో విజేతగా నిలిచింది.” అంటూ హన్మంత్ నవ్వుతూ చెప్పాడు..
ఆవిధంగా అథ్లెటిక్స్ కోచ్ బల్వంత్ బాబర్ దృష్టిని సుధేష్ణ ఆకర్షించడం ఎంతో ప్రాధాన్యం సంతరించుకుంది. అప్పట్లో ఆయన తాలూకా క్రీడా వ్యవహారాల అధికారిగా కూడా ఉండేవారు.
ఇదంతా జరిగి ఇన్నేళ్ల తర్వాత మహారాష్ట్ర క్రీడాకారిణి అయిన సుధేష్ణ ఖేలో ఇండియా యువజన క్రీడల్లో అతి వేగవంతమైన మహిళగానే కాక, ట్రాక్ అండ్ ఫీల్డ్ పోటీల్లో తన అద్భుతమైన ప్రతిభతో అందరి దృష్టినీ ఆకర్షించింది. స్ప్రింట్ పోటీల్లో హ్యాట్రిక్ సాధించడం క్రీడాభిమానుల దృష్టిని ఎంతగానో ఆకట్టుకుంది. వంద మీటర్లు, 200 మీటర్లు, 4x100 మీటర్ల పోటీల్లో ఆమె విజేతగా నిలిచి ఏకంగా స్వర్ణ పతకాలు సొంతం చేసుకుంది.
తన విజయాన్ని సుధేష్ణ గుర్తుచేసుకుంటూ,, “అప్పటికి నా తల్లిదండ్రులు సతారాకు 20 కిలోమీటర్ల దూరంలో మా సొంత ఊరైన ఖార్షీలో ఉండిపోయారు. అయితే, ఆ రోజునుంచి వాళ్లు నాకు కావల్సిన సహాయం అందిస్తూ వచ్చారు.” అంటూ ఆమె ఆనందభాష్పాలతో చెప్పింది.
పి.టి. టీచర్ నిన్ను అథ్లెటిక్ పోటీలకు ఎలా ఎంపిక చేశారని అడగ్గా, తన తల్లిదండ్రులకు తెలియకుండా తాను స్కూల్లో తోటి అమ్మాయిలతో కలసి ఖోఖో ఆడేదాన్నని, ఆటలో తాను చూపించిన వేగం, చురుకుదనమే పి.టి. టీచర్ దృష్టిని అమితంగా ఆకర్షించిందని ఆమె పేర్కొంది.
“ఆరోజుల్లో నాకు ఆస్థమా వచ్చినపుడల్లా కాస్సేపు విశ్రాంతి తీసుకుని మళ్లీ ఆటలో దిగేదాన్ని. అందువల్ల ఆటలో నన్ను ఆస్థమా ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు,” అంటూ ఆమె గెలిచిన ఆనందంతో చెప్పింది.
వయస్సు పెరుగుతున్న కొద్దీ ఆమె క్రమం తప్పకుండా శిక్షణ పొందుతూ తన పరిస్థితిని మెరుగుపరుచుకుంది. ఆ తర్వాత ట్రాక్ అండ్ ఫీల్డ్ పోటీల్లో తన ప్రత్యేకతను చాటుకుంటూ వచ్చింది. రెండేళ్ల తర్వాత మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో జరిగిన జాతీయ పాఠశాల క్రీడల్లో 4x100 రిలే పరుగు పోటీ రిజర్వ్ జాబితాలో చోటు సంపాదించగలిగింది. ఆ తర్వాత ఏడాదికే పుణెలో జరిగిన ఖేలో ఇండియా యువజన క్రీడలకు 17ఏళ్ల లోపు క్రీడాకారిణిగా ఎంపికైంది. ఆ పోటీల్లో వందమీటర్ల పరుగు పోటీలో స్వర్ణపతకాన్ని సొంతం చేసుకుంది.
అయితే, పుణె పోటీల్లో ఆమెకు మట్టి ట్రాక్‌పై పరుగెత్తడానికి, సింథటిక్ ట్రాక్‌పై పరుగెత్తడానికి గల తేడా ఏమిటో తెలిసివచ్చింది. అప్పటివరకూ ఆమె సతారాలోని మట్టి ట్రాక్‌పై పరుగెత్తడం మాత్రమే తెలుసు. ఆమెకు సమీపంలో ఉన్న సింథటిక్ ట్రాక్ కొల్హాపూర్. అదీ ఆమెకు120 కిలోమీటర్ల దూరం.
ఈ నేపథ్యంలో సుధేష్ణ, ఆమె కోచ్ బాబర్ కలసి నెలకు ఒకసారైనా కొల్హాపూర్ వెళ్లడానికి ప్రయత్నించారు. అయినా అదికూడా వాళ్లకు సాధ్యం కాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో కోచ్ బాబర్ తన వ్యూహాన్ని మార్చేశారు.
“అసలు సింథటిక్ ట్రాక్‌కు అవసరమైన మెలకువలు ఏమిటో నా కోచ్ నాకు నేర్పించడం ప్రారంభించారు. గత కొన్నేళ్లుగా ఈ విషయంలో ఆయన ఎంతో ప్లాన్ చేశారు. ఆ సాధనే ఇపుడు ఫలితాలను అందిస్తోంది,” అంటూ సుధేష్ణ వివరించింది.
కొలంబియాలోని కాలీలో ఆగస్టు ఒకటవ తేదీనుంచి జరగబోయే అండర్-20 ప్రపంచ చాంపియన్ షిప్ పోటీల్లో క్వాలిఫైయింగ్ టైమ్ సాధించేందుకు గుజరాత్‌లోని నదియాడ్‌లో జరిగిన నేషనల్ ఫెడరేషన్ కప్ జూనియర్స్ పోటీల్లో సుధేష్ణ పయత్నించింది. అయితే, వేడి వాతావరణం కారణంగా అందులో ఉత్తమంగా రాణించలేకపోయింది. అక్కడ వందమీటర్ల పోటీలోనూ, 200మీటర్ల పోటీలోనూ కేవలం నాలుగో స్థానం మాత్రమే సాధించింది. దీనితో అర్హతా స్థాయిని సాధించలేకపోయింది.
“అయితే ఇక్కడకు వచ్చేటప్పటికి ఈ వేడి వాతావరణానికి అలవాటు పడ్డాను. రెడ్ ట్రాక్ కంటే ఇక్కడి బ్లూ ట్రాక్ కాస్త వేగవంతంగా ఉంది. ఇక్కడ నేను ప్రతిభను కనబరుస్తాననే ఆత్మవిశ్వాసం కూడా పెరిగింది.” అని సుధేష్ణ పేర్కొంది.
సుధేష్ణ పంచకుల ఖేలో ఇండియా యువజన క్రీడల స్ప్రింట్ పోటీల్లో ప్రతిభను చూపించడమే కాకుండా, వందమీటర్లు, 200మీటర్ల పరుగు పందెంలో తన వ్యవధిని కూడా చక్కగా మెరుగుపరుచుకుంది. 100మీటర్లను 11.79 సెకన్లలో, 200మీటర్లను 24.29 సెకన్లలో అధిగమించింది. అండర్-20 వరల్డ్ చాంపియన్ షిప్ పోటీలకు అథ్లెటిక్స్ పెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎ.ఎఫ్.ఐ.) నిర్దేశించిన అర్హతా ప్రమాణాల స్థాయి కంటే ఇది మెరుగైనదే.
ఈ పోటీల్లో తన ఆటతీరును, ప్రతిభను అండర్ 20 ప్రపంచ చాంపియన్ షిప్ ఎంపిక పోటీలకు పరిగణనలోకి తీసుకోవాలని సుధేష్ణ ఇపుడు ఎ.ఎఫ్.ఐ.కి విజ్ఞప్తి చేసుకుంది. తనకు అనుమతి లభించి, కొలంబియాలోని కాలీ వెళ్లేందుకు వచ్చే నెలలో విమానం ఎక్కుతానని ఆమె ఆశతో ఉంది. అదే గనుక జరిగితే ఆమె తండ్రి హన్మంత్ శివాంకర్ ఎంతో సంతోషంలో మునిగిపోతాడు. ఎందుకంటే, ఆస్థమా కారణంతో తాను తన కుమార్తెను పరుగునుంచి ఆపలేకపోయానని ఆయనకు ఇదివరకే అనుభవమైంది.
***
(Release ID: 1833073)
Visitor Counter : 120