ప్రధాన మంత్రి కార్యాలయం

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మరియు కాంబోడియా ప్రధానమంత్రి గౌరవనీయులు సందేచ్ అక్క మహాసేన పాడేయ్ టెకో హున్ సేన్ మధ్య - దృశ్య మాధ్యమ సమావేశం

Posted On: 18 MAY 2022 8:40PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు కాంబోడియా ప్రధానమంత్రి గౌరవనీయులు సందేచ్ అక్క మహాసేన పాడేయ్ టెకో హున్ సేన్ తో దృశ్య మాధ్యమం ద్వారా సమావేశమయ్యారు. 

వాణిజ్యం మరియు పెట్టుబడుల రంగాల్లో సహకారం, మానవ వనరుల అభివృద్ధి, రక్షణ మరియు భద్రత, అభివృద్ధి సహకారం, అనుసంధానత, కోవిడ్ మహమ్మారి అనంతర ఆర్థిక పునరుద్ధరణ మరియు ప్రజల మధ్య సంబంధాల తో సహా మొత్తం శ్రేణి ద్వైపాక్షిక సమస్యల పై ఇద్దరు నాయకులు చర్చలు జరిపారు.  ద్వైపాక్షిక సహకారంపై ఇరువురు నేతలు సంతృప్తి వ్యక్తం చేశారు.

భారతదేశంతో తమ సంబంధాలకు కంబోడియా ఇస్తున్న ప్రాముఖ్యతను ప్రధానమంత్రి హున్ సేన్ నొక్కి చెప్పారు.  ప్రధానమంత్రి మోడీ ప్రతిస్పందిస్తూ, భారతదేశ "యాక్ట్-ఈస్ట్-విధానం" లో కంబోడియా పోషిస్తున్న విలువైన పాత్రను నొక్కి చెప్పారు.  మెకాంగ్-గంగ సహకార ప్రణాళిక కింద సామర్ధ్య నిర్మాణ కార్యక్రమాలు మరియు త్వరిత ప్రభావ ప్రాజెక్టులతో సహా ఇరు దేశాల మధ్య బలమైన అభివృద్ధి భాగస్వామ్యాన్ని నాయకులు ఈ సందర్భంగా సమీక్షించారు.

ఇరు దేశాల మధ్య ఉన్న చారిత్రక, నాగరికత సంబంధాల గురించి కూడా ప్రధానమంత్రి నరేంద్రమోదీ  ప్రత్యేకంగా పేర్కొంటూ, కంబోడియాలోని అంగ్ కోర్ వాట్ మరియు ప్రేహ్ విహార్ దేవాలయాల పునరుద్ధరణలో భారతదేశం పాల్గొనడం పట్ల తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.  ఇది రెండు దేశాల మధ్య సాంస్కృతిక, భాషా సంబంధాలను మరింత బలోపేతం చేసిందని ఆయన పేర్కొన్నారు. 

క్వాడ్-వ్యాక్సిన్-ఇనిషియేటివ్ కింద కంబోడియాకు 3.25 లక్షల మోతాదుల భారత తయారీ కోవిషీల్డ్ టీకాలను అందించినందుకు ప్రధానమంత్రి హున్ సేన్ భారతదేశానికి ధన్యవాదాలు తెలియజేశారు. 

ఈ ఏడాది భారత్-కంబోడియా మధ్య దౌత్య సంబంధాల స్థాపన 70వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా ఇరువురు నేతలు ఒకరినొకరు అభినందించుకున్నారు.

ఈ ఉత్సవాల్లో భాగంగా, పరస్పరం అనుకూలమైన సమయంలో భారతదేశాన్ని సందర్శించవలసిందిగా, గౌరవనీయులు కాంబోడియా రాజు మరియు గౌరవనీయులు క్వీన్ మదర్ లను ప్రధానమంత్రి మోదీ ఆహ్వానించారు.

భాగస్వామ్య ఆసక్తి ఉన్న ప్రాంతీయ మరియు ప్రపంచ సమస్యలపై కూడా ఇరువురు నేతలు, ఈ సందర్భంగా తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

"ఆసియాన్" అధ్యక్ష పదవిని చేపట్టినందుకు కంబోడియాకు ప్రధానమంత్రి మోదీ అభినందనలు తెలియజేస్తూ, అధ్యక్ష పదవిని కంబోడియా విజయవంతంగా నిర్వహించడానికి అవసరమైన పూర్తి మద్దతు, సహాయాన్ని భారతదేశం అందిస్తుందని, హామీ ఇచ్చారు. 

*****

 



(Release ID: 1826543) Visitor Counter : 146