ఉప రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav

ఆరోగ్యవంతమైన, ఆనందమయమైన, ఐశ్వర్యవంతమైన, ఆర్థికంగా శక్తిశాలి అయిన భారతదేశాన్ని నిర్మించుకోవాలి – ఉపరాష్ట్రపతి


• శక్తివంతమైన భారతదేశ నిర్మాణంలో ప్రభుత్వంతో పాటు, ప్రజలు స్వచ్ఛంద సేవా సంస్థలు భాగస్వామ్యం వహించాలి

• భారతదేశ భవిష్యత్తు యువతే, వారు ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలి

• మంచి ఆరోగ్యం కోసం జీవనశైలిలో మార్పులు, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు అత్యంత ఆవశ్యకం

• నెల్లూరు స్వర్ణభారత్ ట్రస్ట్ లో ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఉపరాష్ట్రపతి

• స్వర్ణభారత్ ట్రస్ట్, గ్లోబల్ హాస్పిటల్ - చెన్నై సంయుక్త నిర్వహణలో నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో ఉచిత వైద్యశిబిరాలు

• 500 మందికి పైగా ఉచిత వైద్య పరీక్షల నిర్వహణ

Posted On: 28 APR 2022 1:56PM by PIB Hyderabad

ఆరోగ్యవంతమైన, ఆనందమయమైన, ఐశ్వర్యవంతమైన, ఆర్థికంగా శక్తిశాలి అయిన భారతదేశాన్ని నిర్మించుకోవాలని, ఇందుకోసం ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలతో పాటు ప్రజలు, స్వచ్ఛంద సేవాసంస్థలు భాగస్వాములు కావాలని గౌరవ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. ముఖ్యంగా భారతదేశ భవిష్యత్తు అయిన యువతరం కష్టపడి పని చేయడమే కాదు, ఆరోగ్యాన్ని కూడా కాపాడుకునేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ మధ్యకాలంలో యువతరం జీవన విధానం తనను మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయన్న ఆయన, క్రమశిక్షణా యుతమైన జీవన విధానాన్ని యువత అలవాటు చేసుకోవాలని సూచించారు.
నెల్లూరు వెంకటాచలంలోని స్వర్ణభారత్ ట్రస్ట్ లో ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన అనంతరం ప్రసంగించిన ఉపరాష్ట్రపతి ఒత్తిడితో కూడిన జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, చైతన్యరహితమైన పని విధానం... తదితర అంశాలు అనారోగ్యాలకు చేరువ చేస్తున్నాయని ఈ నేపథ్యంలో యోగ, నడక, వ్యాయామం ద్వారా శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చని ఉపరాష్ట్రపతి తెలిపారు. అహారపు అలవాట్లు మారిపోయి, ప్రతి ఒక్కరూ ఫాస్ట్ ఫుడ్ సంస్కృతి వైపు వెళుతున్నారని, ఈ పరిస్థితికి చరమ గీతం పాడి భారతీయ ఆహారపు అలవాట్ల మీద దృష్టి కేంద్రీకరించాలని హితవు పలికారు. మన పెద్దలు కాలానుగుణంగా ఆరోగ్యకరమైన ఆహారాన్ని మనకు సూచించారని, వారు చూపిన బాటలో ముందుకు సాగి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని తెలిపారు.
స్వర్ణభారత్ ట్రస్ట్ కార్యక్రమాల్లో పాల్గొనడం తనకెంతో తృప్తిని అందిస్తుందన్న ఉపరాష్ట్రపతి, ఈ సంస్థ కార్యక్రమాలను అన్నీ తానై చూసుకుంటున్న తమ కుమార్తె శ్రీమతి దీపావెంకట్ కు అభినందనలు తెలియజేశారు. ఈ ట్రస్ట్ కార్యకలాపాల్లో భాగస్వామ్యం వహిస్తున్న మిత్రుల చొరవ గురించి ప్రస్తావించిన ఆయన, యూనియన్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్ లాంటి  ఎన్నో సంస్థలు తమ కార్యక్రమాల్లో భాగస్వామ్యం అవుతున్నాయన్నారు.
సేవా కార్యక్రమాలకు మించి భగవంతుని సేవ లేదన్న ఉపరాష్ట్రపతి, ప్రతి ఊరిలో ఓ దేవాలయం, ఓ విద్యాలయం, ఓ వైద్యాలయం, ఓ గ్రంథాలయంతో పాటు ఓ సేవాలయం కూడా ఉండాలని సూచించారు. ఉన్నత స్థాయిలో ఉన్నవారు సమాజ సంక్షేమం కోసం ఈ దిశగా చొరవ తీసుకోవాలని సూచించారు. 
సమస్యలకు చికిత్స మాత్రమే కాదు, ముందస్తు జాగ్రత్తల మీద వైద్యులు అవగాహన కల్పించాలని సూచించిన ఉపరాష్ట్రపతి, అప్పుడే అనేక వ్యాధుల బారి నుంచి రక్షించుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు పార్లమెంట్, రాజకీయ పార్టీలు, పత్రికలు, ప్రభుత్వాలు పెద్ద పీట వేసి, ప్రాధాన్యత ఇవ్వాలన్న ఆయన, ఈ రంగాలకు ప్రభుత్వ కేటాయింపులు పెంచాలని సూచించారు. 
గ్లోబల్ హాస్పిటల్ – చెన్నై వైద్యులచే గుండె, ఊపిరితిత్తులు, నెమ్ము, కీళ్ళు, ఎముకలు, గర్భకోశ, మధుమేహం, కంటి, దంత వైద్య పరీక్షలతో పాటు, సాధారణ వ్యాధుల పరీక్షలను ఈ శిబిరంలో ఉచితంగా నిర్వహించారు. ఈసీజీ, టూడీ ఎకో గుండె పరీక్ష, ల్యాబ్ పరీక్షలు చేసి మందులను అందజేశారు. కంటి శుక్లాలతో బాధపడే వారికి ఉచిత ఆపరేషన్ సౌకర్యాన్ని కూడా కల్పించారు. 500 మందికిపైగా ఈ క్యాంపులో ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు.

***


(Release ID: 1820976) Visitor Counter : 169