సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

అపవాదుపూరిత వార్తలను పతాకశీర్షికలుగా చేయడం మానుకోండి... ప్రైవేటు చానళ్లకు సమాచార మంత్రిత్వశాఖ సూచన


టీవీల్లో జరిగే చర్చల్లో సామాజికంగా ఆమోదయోగ్యం కాని భాషను ఉపయోగిస్తున్నారు. జర్నలిస్టులు కల్పిత వాదనలతో చర్చలను కొనసాగిస్తున్నారు: అడ్వైజరీ

Posted On: 23 APR 2022 1:56PM by PIB Hyderabad

తప్పుడు వాదనలు చేయడం మరియు అపకీర్తిని కలిగించే శీర్షికలను ఉపయోగించవద్దని కేంద్ర సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ  ప్రైవేటు టీవీ న్యూస్ ఛానెల్‌లకు శనివారం సూచించింది. 1995, కేబుల్ టెలివిజన్ నెట్‌వర్క్స్ (రెగ్యులేషన్) యాక్ట్,  సెక్షన్ 20లోని నిబంధనలను.. దాని కింద నిర్దేశించిన ప్రోగ్రామ్ కోడ్‌తో సహా పాటించాలని మంత్రిత్వ శాఖ శనివారం జారీ చేసిన వివరణాత్మక అడ్వైజరీలో పేర్కొంది.


ఇటీవలి కాలంలో పలు శాటిలైట్ టీవీ ఛానళ్లు కార్యక్రమాలను, సంఘటనలను అశాస్త్రీయంగా, తప్పుదారి పట్టించేవిధంగా, సంచలనాత్మకంగా, సామాజికంగా ఆమోదయోగ్యం కాని భాష, వ్యాఖ్యలను ఉపయోగిస్తున్నట్లు మంత్రిత్వశాఖ గుర్తించింది. ఇవి అపకీర్తిని కలిగించేలా, అశ్లీలమైన, పరువునష్టం కలిగించే, మతపరమైన వ్యక్తీకరణలు కూడా ఉంటున్నాయని పేర్కొంది.  ఉక్రెయిన్, రష్యా యుద్ధానికి సంబంధించి వాయవ్య ఢిల్లీలో టీవీ వార్తల కంటెంట్ ప్రోగ్రామ్ కోడ్ను ఉల్లంఘించినట్లు గుర్తించామని మంత్రిత్వశాఖ తన అడ్వైజరీలో ఉదహరించింది.

ఉక్రెయిన్-రష్యా వివాదాన్ని నివేదించే సందర్భంలో వార్తా అంశాలతో సంబంధం లేని అపవాదుపూరిత విషయాలను శీర్షికలుగా చేస్తున్నాయని మంత్రిత్వశాఖ పేర్కొంది. జర్నలిస్టులు నిరాధారమైన, కల్పిత వాదనలు చేస్తున్నారని, ప్రేక్షకులను ప్రేరేపించడానికి అతిశయోక్తులు ఉపయోగిస్తున్నారని తెలిపింది. ముఖ్యంగా ఢిల్లీ హింసాకాండ విషయంలో ఈ ఉల్లంఘనలు జరిగినట్లు గుర్తించామని, మతవిధ్వేషాలను రెచ్చగొట్టేలా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వీడియోలతో కూడిన వార్తలను ప్రసారం చేశాయని, అధికారులకు మతం రంగును ఆపాదిస్తూ శీర్షికలు పెట్టాయని సమాచార ప్రసార మంత్రిత్వశాఖ పేర్కొంది.

సామాజికంగా ఆమోదయోగ్యం కాని,  రెచ్చగొట్టేలా భాష ఉపయోగించడం,  మతపరమైన వ్యాఖ్యలు మరియు అవమానకరమైన సూచనలతో కూడిన చర్చలను ప్రసారం చేస్తున్నాయని పేర్కొంది.  ఇవి వీక్షకులపై ప్రతికూల మానసిక ప్రభావాన్ని చూపుతున్నాయని, మత సామరస్యాన్ని దెబ్బతీసి, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రమాదం ఉందని మంత్రిత్వ శాఖ గుర్తించి.. ఈ మేరకు  ప్రైవేట్ టీవీ ఛానెల్‌లను హెచ్చరించింది.

ఈ ఉల్లంఘన ఉదంతాలను ఉటంకిస్తూ, మంత్రిత్వ శాఖ శనివారం ప్రసారమైన కార్యక్రమాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. కేబుల్ టెలివిజన్ నెట్‌వర్క్స్ (రెగ్యులేషన్) చట్టం, 1995..  దానిలోని నిబంధనలను ఉల్లంఘించకుండా గట్టిగా హెచ్చరించింది.

ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు సమాచార మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ www.mib.gov.inలో ఈ సలహా అందుబాటులో ఉన్నాయి. 

 

***

 



(Release ID: 1819399) Visitor Counter : 195