రక్షణ మంత్రిత్వ శాఖ
మార్షల్ ఆఫ్ ఎయిర్ ఫోర్స్ స్వర్గీయ అర్జన్ సింగ్ కు నివాళులు అర్పించిన భారత వైమానిక దళం
Posted On:
15 APR 2022 10:44AM by PIB Hyderabad
మార్షల్ ఆఫ్ ఎయిర్ ఫోర్స్ స్వర్గీయ అర్జన్ సింగ్ 103వ జయంతి సందర్భంగా వైమానికదళం ఆయనకు ఘనంగా నివాళులర్పించింది. దేశానికి వైమానిక దళానికి ఆయన అందించిన సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. వైమానిక యుద్ధ వీరునిగా అర్జన్ సింగ్ గుర్తింపు పొందారు. 1919 ఏప్రిల్ 15న అర్జన్ సింగ్ లియాల్‌పూర్‌లో (ప్రస్తుతం పాకిస్థాన్‌లోని ఫైసలాబాద్) జన్మించారు. 19 సంవత్సరాల వయస్సులో అర్జన్ సింగ్ క్రాన్‌వెల్‌లోని ఆర్ఏఎఫ్ కాలేజ్‌లో శిక్షణ కోసం ఎంపికయ్యారు. పైలెట్ ఆఫీసర్ గా ఆయన 1939లో రాయల్ ఎయిర్ ఫోర్స్ లో చేరారు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఆయన బర్మాలో ధైర్య సాహసాలు, నైపుణ్యంతో పని చేశారు. దీనికి గుర్తింపుగా రాయల్ ఎయిర్ ఫోర్స్ అర్జన్ సింగ్ కు ప్రతిష్టాత్మక ఫ్లైయింగ్ క్రాస్ (డీ ఎఫ్ సి )ని ప్రధానం చేసింది. 1947లో దేశానికి స్వాతంత్ర్యం సిద్దించిన తరువాత జరిగిన అరుదైన ఘట్టానికి ఆయన నాయకత్వం వహించారు. ఢిల్లీలోని ఎర్రకోట మీదుగా వందకు పైగా భారత వైమానిక యుద్ధ విమానాలు అర్జన్ సింగ్ నాయకత్వంలో ఫ్లై-పాస్ట్ నిర్వహించాయి. 44 సంవత్సరాల వయస్సులో అర్జన్ సింగ్ ఎయిర్ మార్షల్ హోదాలో ఎయిర్ స్టాఫ్ చీఫ్ (సిఏఎస్)గా 01 ఆగస్టు 1964న బాధ్యతలు చేపట్టారు.
కీలకమైన పట్టణం అఖ్నూర్‌ను లక్ష్యంగా చేసుకుని 1965లో పాకిస్తాన్ ఆపరేషన్ గ్రాండ్ స్లాం ప్రారంభించిన సమయంలో భారతదేశానికి పరీక్షా సమయం ఎదురయింది. ఈ సమయంలో అర్జన్ సింగ్ ను అప్పటి రక్షణ శాఖ మంత్రి తన కార్యాలయానికి పిలిపించి ఎంత తక్కువ సమయంలో వైమానిక దళాన్ని రంగంలోకి దించగలుగుతారు అని అడిగారు. దానికి తనదైన శైలిలో స్పందించిన అర్జన్ సింగ్ '.. ఒక గంటలో' అని సమాధానం ఇచ్చారు. చెప్పిన విధంగానే అర్జన్ సింగ్ గంటలో వైమానిక దళం పాకిస్తాన్ పై దాడులు నిర్వహించింది. పాకిస్తాన్ వైమానిక దళం దాడులను తిప్పి కొట్టిన భారత వైమానిక దళం
వ్యూహాత్మక విజయాలను సాధించడంలో భారత సైన్యానికి సహాయపడింది.
1965 యుద్ధ సమయంలో అందించిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం పద్మ విభూషణ్ అవార్డుతో అర్జన్ సింగ్ ను గౌరవించింది. భారత వైమానిక దళం తొలి ఎయిర్ చీఫ్ మార్షల్ గా అర్జన్ సింగ్ దేశానికి సేవలు అందించారు. 1969లో ఆయన పదవీ విరమణ చేశారు. రిటైర్ అయిన తరువాత కూడా అర్జన్ సింగ్ భారత వైమానిక దళం పటిష్టత, సంక్షేమ కోసం తన సేవలు అందించారు. దేశానికి ఆయన సేవలు అందించారు. 1971 నుంచి 1974 వరకు స్విట్జర్లాండ్, హోలీ సీ మరియు లీచ్‌టెన్‌స్టెయిన్‌లలో భారత రాయబారిగా అర్జన్ సింగ్ వ్యవహరించారు. 1974 నుంచి 1977 వరకు అర్జన్ సింగ్ కెన్యాలోని భారత హై కమిషన్ నాయకత్వం వహించారు. 1978 నుంచి 1981 వరకు జాతీయ మైనారిటీ కమిషన్ సభ్యునిగా వ్యవహరించిన అర్జన్ సింగ్ 1989 నుంచి 1990 వరకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌గా పనిచేశారు.
అర్జన్ సింగ్ అందించిన సేవలకు గుర్తింపుగా 2002 జనవరి లో భారత వైమానిక దళం మార్షల్ హోదా ని కల్పించింది. భారత వైమానిక దళంలో ఆయన తొలి ' ఫైవ్ స్టార్' పొందిన అధికారి గా అర్జన్ సింగ్ గుర్తింపు పొందారు. భారత వైమానిక దళానికి అర్జన్ సింగ్ అందించిన సేవలకు గుర్తింపుగా పనాగఢ్ వైమానిక కేంద్రం పేరును అర్జన్ సింగ్ వైమానిక కేంద్రంగా మార్చారు.
విశిష్టమైన వ్యక్తిత్వం, వృత్తిపరమైన సామర్థ్యం, నాయకత్వం మరియు వ్యూహాత్మక దృష్టి కలిగిన అర్జన్ సింగ్ వైమానిక దళ చరిత్రలో చిరస్మరణీయ వ్యక్తి గా నిలుస్తారు.
(Release ID: 1817159)
Visitor Counter : 191