ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
-సబ్ కా వికాస్- మహా క్విజ్!
దేశంలోనే అతిపెద్ద పోటీకి
నరేంద్ర మోదీ ప్రభుత్వం శ్రీకారం..
వివిధ ప్రభుత్వ పథకాలు, పరిపాలనా ప్రక్రియపై
పౌరుల్లో అవగాహన కల్పించడమే లక్ష్యం...
డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్.కు నివాళిగా
ఏప్రిల్ 14నే ప్రారంభమైన క్విజ్ పోటీ..
తొలి క్విజ్ పోటీ ఇతివృత్తం
-ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్నయోజన-
12 భాషల్లో క్విజ్ పోటీ నిర్వహణ..
వెయ్యిమంది అగ్రశ్రేణి విజేతలకు
రూ. 2,000చొప్పున నగదు పురస్కారం.
క్విజ్ కోసం వెబ్ లింక్ : http://mygov.in/mahaquiz
Posted On:
14 APR 2022 2:18PM by PIB Hyderabad
ఆత్మనిర్భర భారత్ గా దేశాన్ని తీర్చిదిద్దడమే లక్ష్యంగా, “సబ్ కా సాత్ , సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రయాస్” అన్న ఆశయాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం కట్టుబడి ఉంది. సమాజంలోని పేదలు, నిమ్న వర్గాల ప్రజల పరిపూర్ణ సంక్షేమంకోసం వివిధ పథకాలు, కార్యక్రమాల అమలు ద్వారా దేశంలోని పౌరులందరి అవసరాలనూ తీర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తూ వస్తోంది. సమాజంలోని అట్టడుగు స్థాయి వ్యక్తికి కూడా అవసరమైన సేవలందించేందుకు వీలుగా ఈ పథకాలను, కార్యక్రమాలను రూపొందించారు. సమాజంలోని నిరుపేద వర్గాల ప్రజలకు అంతిమ దశ ఫలితాలు అందేలా గత ఎనిమిదేళ్ల కాలంలో ఎన్నెన్నో చర్యలు తీసుకున్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పి.ఎం.ఎ.వై.) పథకం కింద ఇదివరకు ఎన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో ఇళ్ల నిర్మాణం, జలజీవన్ మిషన్ పథకం కింద నీటి కులాయిల కనెక్షన్ల ఏర్పాటు, జన్ ధన్ యోజన పథకం కింద బ్యాంకు ఖాతాలను తెరవడం, పి.ఎం. కిసాన్ పథకం కింద రైతులకు నేరుగా నగదు బదిలీ, ఉజ్వల పథకం కింద ఉచిత గ్యాస్ కనెక్షన్లు తదితర కార్యక్రమాలతో దేశంలోని నిరుపేదల జీవనోపాధిలో గణనీయమైన మెరుగుదలను ప్రభుత్వం సాధించగలిగింది.
-సబ్ కా వికాస్- మహా క్విజ్ ఆవిష్కరణ
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరిట భారతదేశం 75 వసంతాల స్వాంత్ర్య వార్షికోత్సవాలు జరుపుకుంటున్న నేపథ్యంలో భాగస్వామ్యంతో కూడిన పరిపాలనా ప్రక్రియ, కార్యక్రమాల, పథకాల బట్వాడా, తదితర అంశాల్లో పౌరులకు ప్రమేయం కల్పించేందుకు ప్రభుత్వం తన కృషిని మరింత ముమ్మరం చేసింది. పథకాల ఫలితాలను అంతిమంగా చేరవలసిన వారికే చేర్చేందుకు కేంద్ర ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని మై గవ్ (MyGov) పోర్టల్ వేదికగా సబ్ వికాస్ మహాక్విజ్ పోటీల పరంపరను చేపట్టారు. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలపై పౌరుల్లో అవగాహన, చైతన్యం కలిగించేందుకు ఈ పోటీలను రూపొందించారు. వివిధ పథకాలు, కార్యక్రమాలను గురించి వివరించడం, వాటి ప్రయోజనాలను ఎలా పొందాలన్న అంశాలపై భాగస్వాములకు అవగాహన కలిగించడం ఈ క్విజ్ పోటీల లక్ష్యంగా నిర్దేశించారు. ఈ క్విజ్ పోటీల పరంపలో భారీ ఎత్తున పోటీదార్లు పాల్గొన్న పక్షంలో ప్రభుత్వ పథకాలను సమాజంలోని అట్టడుగు స్థాయికి తీసుకెళ్లేందుకు మరింత ఎక్కువ అవకాశం ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో ప్రజలు ఈ క్విజ్ పోటీల్లో పాల్గొని, నవ భారత నిర్మాణ ప్రక్రియపై తమ పరిజ్ఞానం స్థాయిని పరీక్షించుకోవలసిందిగా మైగవ్ పోర్టల్ కోరుతోంది.
2022 ఏప్రిల్ 14న మొదలైన క్విజ్ సిరీస్
భారత రత్న డాక్టర్ బాబాసాహెబ్ భీంరావ్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా 2022, ఏప్రిల్ 14వ తేదీన ఈ క్విజ్.ను సముచిత రీతిలో ప్రారంభించారు. సామాజిక న్యాయానికి, సాధికారితకు ప్రతీకగా బాబా సాహెబ్ అంబేడ్కర్ నిలిచారు. పేదలు, నిమ్నవర్గాలవారు, సమాజంలోని ఎలాంటి ప్రయోజనాలకు నోచుకోని ప్రజలకు సేవలందించేందుకు ప్రభుత్వం కూడా అంబేడ్కర్ అడుగుజాడల్లోనే పురోగమిస్తోంది.
క్విజ్ పోటీల పరంపర ప్రారంభోత్సవం సందర్భంగా కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ మాట్లాడుతూ, ప్రజలంతా ఈ “వికాస పర్వం”లో పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు. పౌరుల భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని ఆయన భారతీయులందరినీ కోరారు.
కేంద్ర సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ, పౌరుల ప్రమేయంతో ప్రభుత్వం చేపట్టిన అతి పెద్ద కార్యక్రమమే, సబ్ కా వికాస్ మహాక్విజ్ అని అన్నారు. “ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం, ఆయన పరిపాలనా ప్రక్రియ నిజాయితీకి కొత్త ప్రమాణాలను నెలకొల్పింది. ప్రభుత్వం చేపట్టిన ప్రతి కార్యక్రమంలోనూ సబ్ కా సాత్, సబ్ కా వికాస్ ధోరణిని తీసుకువచ్చింది. ప్రత్యేకించిపేదలకోసం చేపట్టిన పథకాల, కార్యక్రమాల ప్రభావం ప్రజల జీవితాల్లో ఎంతో పరివర్తనను తీసుకువచ్చేలా ఉంది. క్రమంగా మరింత మంది ఈ కార్యక్రమాలతో ప్రభావితం అవుతున్నందున, ప్రజలందరూ ఈ పథకాలపై అవగాహన కలిగి ఉండేలా చూడాల్సిన అవసరం ఉంది. పరిపాలనా ప్రక్రియను ఎప్పటికప్పడు పునర్నిర్వచించే దిశగా ప్రభుత్వం నిర్విరామంగా కృషిచేస్తూనే ఉంది. సబ్ కా వికాస్ మహా క్విజ్ అనేది, పౌరుల ప్రమేయంతో చేపట్టిన అతి భారీ కార్యక్రమాల్లో ఒకటి. ప్రజలకు అవగాహన కల్పించేందుకు, అవసరమైన పరిజ్ఞానం ప్రజలకు అందించేందుకు ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. ఈ భారీ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు డాక్టర్ బాబా సాహెబ్ జయంతి (ఏప్రిల్ 14) కంటే సముచితమైన మరో రోజు ఉండబోదు. సమానత్వం, న్యాయం, సమ్మిళిత తత్వం వంటి బాబా సాహెబ్ ఆదర్శాలు ప్రభుత్వానికి దిక్చూచిగా ఉపయోగపడతాయి. చివరి లబ్ధిదారుడికి కూడా పథకాల ఫలితాలను చేరువ చేసేందుకు, అంత్యోదయ అనే ప్రభుత్వ భావనను నేరవెర్చేందుకు అంబేడ్కర్ ఆశయాలు ఎంతగానో దోహదపడతాయి.” అని రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు.
తొలి క్విజ్ పోటీ ఇతివృత్తం
ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన (పి.ఎం.జి.కె.ఎ.వై.)..
కేంద్ర వినియోగ వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన పథకాన్ని తొలి క్విజ్ పోటీకి ఇతివృత్తంగా నిర్ణయించారు. దేశవ్యాప్తంగా కోవిడ్-19 వైరస్ మహమ్మారి బెడద కారణంగా ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్న నిరుపేదల కష్టాలను తగ్గించేందుకు పి.ఎం.-జి.కె.ఎ.వై. కార్యక్రమాన్ని చేపట్టారు. పేదవర్గాల్లో ఏ ఒక్కరూ, ఏ కుటుంబం కూడా ఆకలితో అలమటించే పరిస్థితి రాకూడదన్న తక్షణ లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ పథకం కింద జాతీయ ఆహార భద్రతా చట్టం (ఎన్.ఎఫ్.ఎస్.ఎ.) పరిధిలోని లబ్ధిదారులు ప్రతినెలా తలా 5 కిలోగ్రాముల ఆహార ధాన్యాలను పొందడానికి అర్హులు. ఎన్.ఎఫ్.ఎస్.ఎ. లబ్ధిదారులకు భారీ సబ్సిడీతో అందిస్తున్న పథకం ఇది. దేశంలోని నిరుపేదలపై కోవిడ్ వైరస్ మహమ్మారి వ్యాప్తి ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొనే లక్ష్యంతో ఈ విభిన్న పథకానికి రూపకల్పన చేశారు. ఈ పథకం కింద ఇప్పటికే, వెయ్యి మెట్రిక్ టన్నులకు పైగా ఆహార ధాన్యాలను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. దాదాపు రూ. 3.4లక్షలకోట్ల అంచనా వ్యయం కేటాయింపుతో పథకం చేపట్టారు. ప్రధానమంత్రి మోదీ మాటల్లో చెప్పాలంటే, “ఎవరూ ఆకలితో, ఖాలీ కడుపుతో నిద్రించకూడదన్నదే ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన పథకం లక్ష్యం.”
కోవిడ్ మహమ్మారి సంక్షోభ సమయంలో నిరుపేదలు మరింత దెబ్బతినకుండా చూడటంలో ఈ పథకం విజయవంతమైంది. అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐ.ఎం.ఎఫ్.) తయారు చేసిన అధ్యయన పత్రంలో కూడా ఈ పథకానికి ప్రశంసలు దక్కాయి. "కోవిడ్ మహమ్మారి వ్యాప్తికి ముందు సంవత్సరమైన 2019లో నిరుపేదతనం 0.8శాతంగా నమోదైంది. వైరస్ మహమ్మారి సంక్షోభం తలెత్తిన 2020వ సంవత్సరంలో కూడా పరిస్థితి విషమించకుండా, అదే స్థాయిలోనే నిరుపేదతనం కొనసాగేందుకు ఆహార ధాన్యాల పంపిణీ కీలకపాత్ర పోషించింది.” అని ఐ.ఎం.ఎఫ్. అధ్యయన పత్రం పేర్కొంది.
క్విజ్ పోటీ వివరాలు
సబ్ కా వికాస్ క్విజ్ పోటీల పరంపరలో భాగంగా ఈ క్విజ్ పోటీని రూపొందించారు. ఇంకా వివిధ ఇతివృత్తాలపై విభిన్నమైన మరిన్ని క్విజ్ పోటీలను ప్రారంభిస్తారు. 2022 ఏప్రిల్ 14వ తేదీన పి.ఎం.జి.కె.ఎ.వై. పథకంపై ప్రారంభించిన క్విజ్ పోటీ భారత కాలమానం ప్రకారం 2022 ఏప్రిల్ 28 ఉదయం 11.30 వరకూ వరకూ అమలులో ఉంటుంది. కాలవ్యవధితో కూడిన ఈ క్విజ్ పోటీని 20 ప్రశ్నలతో రూపొందించారు. ఈ ప్రశ్నలకు 300 సెకన్లలో జవాబు ఇవ్వాల్సి ఉంటుంది. మొత్తం 12 భాషల్లో ఈ క్విజ్ పోటీ అందుబాటులో ఉంటుంది. –ఇంగ్లీష్, హిందీ, అస్సామీ, బెంగాళీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళం, తెలుగు భాషల్లో క్విజ్ పోటీ ఉంటుంది. క్విజ్ పోటీలో ఎక్కువ మార్కులు తెచ్చుకుని అగ్రశ్రేణిలో నిలిచిన వెయ్యి మంది పోటీదార్లను విజేతలుగా ఎంపిక చేస్తారు. విజేతలుగా ఎంపికైన వారికి ఒక్కొక్కరికి రూ. 2,000 చొప్పున బహుమానంగా ఇస్తారు.
http://mygov.in/mahaquiz అనే లింకు ద్వారా ఆసక్తి కలిగిన వారెవరైనా క్విజ్ పోటీలో పాల్గొనవచ్చు.
****
(Release ID: 1816969)
Visitor Counter : 240