శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
సెన్సార్ ఆధారిత నీటిపారుదల వ్యవస్థ అభివృద్ధి
బ్యాంక్ ఫిల్టరేషన్ ఉపయోగించి పనిచేసే వ్యవస్థతో నీరు ఆదా అవుతుంది. రైతుల ఆదాయం పెరుగుతుంది
Posted On:
13 APR 2022 2:34PM by PIB Hyderabad
బ్యాంక్ ఫిల్ట్రేషన్ టెక్నాలజీని ఉపయోగించి సెన్సార్ ఆధారిత నీటిపారుదల వ్యవస్థ గోవాలోని నవేలిమ్ సమీపంలోని సాల్ నది వద్ద ఉన్న కోర్టాలిమ్ నౌతా సరస్సు వద్ద ఏర్పాటయింది. వెబ్/మొబైల్ యాప్ ద్వారా నియంత్రించేందుకు వీలుగా అభివృద్ధి చేసిన నీటిపారుదల వ్యవస్థతో ఈ ప్రాంతంలో నీటి వృథాను అరికట్టింది. రైతులు నీటిపారుదలని రిమోట్ సహకారంతో సులువుగా నిర్వహంచగలుగుతున్నారు.
నీటి అవసరం ఉన్నప్పుడు మాత్రమే నీటి మోటారును ప్రారంభించి, గరిష్ట స్థాయికి తేమ చేరుకున్నప్పుడు మోటారు ఆగిపోవడం ఈ వ్యవస్థ ప్రత్యేకత. తేమ శాతాన్ని సెన్సార్లు సేకరించి దానికి అనుగుణంగా మోటారును నియంత్రిస్తాయి. ఈ విధమైన ప్రక్రియ వల్ల నీరు ఆవిరిగా మారి గాలిలో కలిసి పోదు. దీనివల్ల భూసారం అన్ని చోట్ల ఒకే విధంగా ఉంటుంది. సెన్సార్ ఆధారిత నీటిపారుదల వ్యవస్థను ఉపయోగిస్తున్న రైతులు ముఖ్యంగా రోజు కూలీపై పని చేసే రైతులు సమయాన్ని ఆదా చేసుకోగలిగారు. తమ ఉత్పత్తులను మార్కెట్ లో విక్రయించుకునేందుకు రైతులకు స్వేచ్ఛ కలిగింది. కూలీల అవసరం తగ్గడంతో రైతుల ఆదాయం కూడా పెరిగింది.
నీటిపారుదల వ్యవస్థను గోవాలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) సహకారంతో ది ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇన్‌స్టిట్యూట్ (TERI) అభివృద్ధి చేసింది. కేంద్ర శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ డిమాండ్ డ్రివెన్ మిషన్ - వాటర్ టెక్నాలజీ ఇనిషియేటివ్ కింద ఈ కార్యక్రమానికి సహకారం అందించింది.
రివర్ బ్యాంక్ ఫిల్ట్రేషన్ సాంకేతికతతో పాటు సెన్సార్-నియంత్రిత నీటిపారుదల వ్యవస్థ ద్వారా రైతులకు నీటి పారుదల కోసం స్వచ్ఛమైన నీటిని అందిస్తుంది. ఇటువంటి వ్యవస్థ ఈ ప్రాంతంలో ఏర్పాటు కావడం ఇదే తొలిసారి. నదులు లేదా సరస్సుల దగ్గర ఉన్న బావుల నుంచి నీటిని సంగ్రహించడం ద్వారా రివర్ బ్యాంక్ ఫిల్ట్రేషన్ వ్యవస్థ పనిచేస్తుంది. నది నీరు నది గర్భ అవక్షేపాల లోకి చేరి ప్రవహిస్తున్న సమయంలో జీవ, భౌతిక మరియు రసాయన ప్రక్రియలతో బ్యాక్టీరియా మరియు విషపూరిత లోహాలను తొలగించడం జరుగుతుంది. దీనికోసం గోవాలోని కోర్టాలిమ్ వద్ద నవేలిమ్ మరియు నౌతా సరస్సు సమీపంలోని సాల్ నది కలుషిత నీటిని శుద్ధి చేసేందుకు అందరికీ అందుబాటులో ఉండే విధంగా రివర్ బ్యాంక్ ఫిల్ట్రేషన్ బావులను ఏర్పాటు చేయడం జరిగింది. పునరుత్పాదక ఇంధన వనరుల (సౌరశక్తితో నడిచే పంపులు) ద్వారా పనిచేసే వ్యవస్థ విద్యుత్ సరఫరా లేని ప్రాంతాల్లో కూడా పని చేసి రైతులకు స్వచ్ఛమైన నీటిని సరఫరా చేస్తుంది. కలుషితాలు లేకుండా తక్కువ బాక్టీరియా శాతం కలిగి ఉన్న నీటిని వ్యవసాయ కార్యక్రమాల కోసం ఉపయోగించడం తో పంట దిగుబడి కూడా గణనీయంగా పెరిగింది.
గోవాలో రైతులు చిన్న కమతాలు కలిగి ఉంటారు. ఈ ప్రాజెక్టు ద్వారా రైతులను చైతన్యవంతులను చేసి వారి దిగుబడులను పెంచడానికి అవకాశం కలిగింది. నీటిలో కలిసి ఉండే కణాలు మరియు సూక్ష్మజీవుల తో సహా అన్ని కలుషితాలను తొలగించడానికి ఈ వ్యవస్థ తక్కువ ఖర్చుతో తొలగించేందుకు అవకాశం కల్పిస్తుంది. దీనివల్ల రైతుల నీటి అవసరాలకు స్వచ్ఛమైన నాణ్యత కలిగిన నీరు అందుబాటులో ఉంటుంది.
వ్యవస్థ అభివృద్ధి, దీనివల్ల కలిగే ప్రయోజనాలను వివరించి దీనికి మరింత ప్రచారం కల్పించేందుకు ఒక వర్క్‌షాప్ కూడా నిర్వహించబడింది. దీనిలో సంబంధిత వాటాదారులు, పరిశోధకులు, విధాన రూపకర్తలు మరియు రైతులు పాల్గొన్నారు. సమాచారం మరియు సాంకేతికతను స్థానిక రైతులకు అందుబాటులోకి రావడంతో ఈ వ్యవస్థ భవిష్యత్తులో మరింత ప్రాచుర్యం పొందే అవకాశం ఉంది.
(Release ID: 1816436)
Visitor Counter : 217