ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

ఆయుష్మాన్ భారత్, ఆయుష్మాన్ డిజిటల్ మిషన్ ప్రగతిపై చర్చ..


మహాబలిపురంలో దక్షిణాది ప్రాంతీయ సమీక్ష నిర్వహణ
దక్షిణాది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల
సీనియర్ అధికారుల హాజరు...

5 రాష్ట్రాల్లో ఆరోగ్య ప్రయోజనాల కొత్త ప్యాకేజీ,..
రోగుల వర్గీకరణకు కొత్త వ్యవస్థ ప్రారంభం..

ఆయుష్మాన్ భారత్ పథకం కింద
వ్యాధి నిర్ధారణ సంబంధిత గ్రూపింగ్ వ్యవస్థకూ
ప్రయోగాత్మకంగా శ్రీకారం..

Posted On: 08 APR 2022 3:08PM by PIB Hyderabad

   జాతీయ ఆరోగ్య ప్రాధికార సంస్థ (ఎన్.హెచ్.ఎ.) ఆధ్వర్యంలో దక్షిణ ప్రాంతీయ సమీక్షా సమావేశం తమిళనాడులోని మహాబలిపురంలో నిర్వహిస్తున్నారు.  ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన (ఎ.బి. పి.ఎం.-జె.ఎ.వై.), ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ (ఎ.బి.డి.ఎం.) వంటి కేంద్ర ప్రాయోజిత పథకాల అమలుకు ఎన్.హెచ్.ఎ. బాధ్యత వహిస్తూ వస్తోంది. దక్షణ ప్రాంతీయ సమీక్షా సమావేశం సందర్భంగా ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన (ఎ.బి. పి.ఎం.-జె.ఎ.వై.) పథకం పరిధిలో,  2022వ సంవత్సరపు ఆరోగ్య ప్రయోజనాల ప్యాకేజీ (హెచ్.బి.పి.) కొత్త రూపాంతరాన్ని ఎన్.హెచ్.ఎ. విడుదల చేసింది. కొత్త రూపాంతరం ద్వారా నూతనంగా 365 తాజా పద్ధతులను అదనంగా జోడించారు. దీనితో ప్యాకేజీల మొత్తం సంఖ్య 1,949కి చేరింది. హెచ్.బి.పి. 2022 ద్వారా ఈ పథకం కింద తొలిసారిగా విభిన్నమైన ధరల వ్యవస్థను ప్రవేశపెట్టారు. ఆరోగ్య రక్షణ స్థాయి, నగరం స్థాయి ప్రాతిపదికలుగా ఈ ధరల వ్యవస్థను ప్రవేశపెట్టారు.

  ఎ.బి. పి.ఎం.-జె.ఎ.వై. పథకం కోసం రోగుల వర్గీకరణకు కొత్త పద్ధతిని కూడా ప్రారంభించినట్టు ఎన్.హెచ్.ఎ. ఈ సందర్భంగా ప్రకటించింది. అంతర్జాతీయ వ్యాధుల వర్గీకరణ (ఐ.సి.డి-11), అంతర్జాతీయ ఆరోగ్యరక్షణ వర్గీకరణ (ఐ.సి.హెచ్.ఐ.) ద్వారా ఈ పద్ధతిని ప్రారంభించారు.

  సమీక్షా సమావేశం సందర్భంగా ప్రకటించిన చర్యల్లో మరో కీలక అంశం ఏమిటంటే,.. చత్తీస్ గఢ్, హర్యానా, కేరళ, మహారాష్ట్ర, మేఘాలయ వంటి ఐదు రాష్ట్రాల్లో, వ్యాధి నిర్ధారణ సంబంధిత గ్రూపింగ్ వ్యవస్థను (డి.ఆర్.జి.ని) ప్రకటించారు. అంటే, డి.ఆర్.జి. వ్యవస్థ ద్వారా చెల్లింపు జరిపే భారతదేశంలోని మొట్టమొదటి బీమా సంస్థగా ఎ.బి. పి.ఎం.-జె.ఎ.వై. నిలిచింది.

   తమిళనాడులోని మహాబలిపురంలో రెండు రోజుల దక్షిణ ప్రాంతీయ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఆయుష్మాన్ సంఘం పేరిట ఈ సమావేశాన్ని 20221, ఏప్రిల్ 7,8 తేదీల్లో జరిపారు. దక్షిణాది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రమేయంతో ఈ సమావేశం,  ప్రాంతీయ సమీక్షా సమావేశాల్లో 3వది అవుతుంది. అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, లక్షద్వీప్, పుదుచ్చేరి, తమిళనాడు, తెలంగాణ ఈ సమీక్షా సమావేశంలో పాలుపంచుకున్నాయి. ఇదివరకు ఉత్తరాది, ఈశాన్య ప్రాంతాల రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో ఇదే తరహా ప్రాంతీయ సమీక్షా సమావేశాలను ఎన్.హెచ్.ఎ. ఇదే తరహాలో నిర్వహించింది. ఎ.బి. పి.ఎం.-జె.ఎ.వై., ఎ.బి.డి.ఎం. పథకాల అమలులో ప్రమేయం ఉన్న కీలకమైన భాగస్వామ్య వర్గాల మధ్య చర్చలు, సంప్రదింపులకోసం ఈ సమావేశాలను నిర్వహించారు.

  తాజాగా జరిగిన దక్షిణ ప్రాంతీయ సమీక్షా సమావేశానికి ఏప్రిల్ 7న తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి ఎం.ఎ. సుబ్రమణియన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రముఖులను తమిళనాడు ప్రభుత్వం తరఫున సత్కరించారు. ఎన్.హెచ్.ఎ. ముఖ్య కార్యనిర్వహణాధికారి (సి.ఇ.ఒ.) డాక్టర్ ఆర్.ఎస్. శర్మ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆర్.ఎస్. శర్మ మాట్లాడుతూ, ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన పథకం అమలులో దక్షిణాది రాష్ట్రాల పాత్ర ప్రశంసనీయమని అన్నారు.

  ఎ.బి.డి.ఎం. అమలుపై ఎన్.హెచ్.ఎ. అదనపు సి.ఇ.ఒ. డాక్టర్ ప్రవీణ్ గెడం, ఎ.బి పి.ఎం.-జె.ఎ.వై. అమలులో ప్రగతిపై డిప్యూటీ సి.ఇ.ఒ. డాక్టర్ విపుల్ అగ్గర్వాల్ తమ తమ నివేదికలను ఈ సమావేశంలో సమర్పించారు. ఆ తర్వాత దక్షిణాది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన సీనియర్ అధికారులు కూడా తమ నివేదికలు సమర్పించారు. ఎన్.హెచ్.ఎ. ఆర్థిక సలహాదారు జి.యు. అహ్మద్, తమిళనాడు రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ జె. రాధాకృష్ణన్, తమిళనాడు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి, ఒ.ఎస్.డి. డాక్టర్ సెంథిల్ కుమార్, ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, తెలంగాణ ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.ఎ.ఎం. రిజ్వీ, కేరళ ఎస్.హెచ్.ఎ. ముఖ్య కార్యనిర్వహణాధికారి (సి.ఇ.ఒ.) డాక్టర్ రతన్ కేల్కర్, కర్ణాటక ఆరోగ్యశాఖ కమిషనర్ డి. రణదీప్, జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్.హెచ్.ఎం.), తమిళనాడు ప్రభుత్వ మిషన్ రెక్టర్ డాక్టర్ డెరెజ్ అహ్మద్, లక్షద్వీప్ ఆరోగ్య శాఖ కార్యదర్శి అమిత్ సతీజా, పుదుచ్చేరి ఆరోగ్యశాఖ కార్యదర్శి సి. ఉదయ కుమార్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆరోగ్య-కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ జె. నివాస్, ఆంధ్రప్రదేశ్ ఎస్.హెచ్.ఎ. ముఖ్య కార్యనిర్వహణాధికారి వినయ్ చంద్, తమిళనాడు ఎస్.ఎస్.ఎ. ముఖ్య కార్యనిర్వణాధికారి, ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ ఎస్. ఉమ, అండమాన్ నికోబార్ దీవుల డిప్యూటీ రెసిడెంట్ కమిషనర్ (డి.ఆర్.సి.) వి. బుబా లకానీ తదితర సీనియర్ అధికారులు ఈ సమీక్షా సమావేశానికి హాజరయ్యారు.

****



(Release ID: 1814905) Visitor Counter : 146