పర్యటక మంత్రిత్వ శాఖ

సూరజ్ కుండ్ అంతర్జాతీయ హస్తకళా మేళా ప్రారంభం


35వ ప్రదర్శనను లాంఛనంగా ప్రారంభించిన
హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ,
సి.ఎం. మనోహర్ లాల్ ఖట్టర్...

కార్యక్రమంలో కేంద్ర పర్యాటక కార్యదర్శి
అరవింద్ సింగ్ ప్రసంగం.

Posted On: 20 MAR 2022 8:45AM by PIB Hyderabad

   ముప్పై ఐదవ సూరజ్.కుండ్ అంతర్జాతీయ హస్తకళల మేళా (ప్రదర్శన)ను హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ఈ రోజు ప్రారంభించారు. ఫరీదాబాద్ లో జరిగిన ఈ కార్యక్రమానికి హర్యానా పర్యాటక, అటవీ శాఖ, ఆతిథ్యం, కళలు, విద్య, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కన్వర్ పాల్, ఉజ్బెకిస్తాన్ రిపబ్లిక్ రాయబారి దిల్షోద్ అఖతోవ్, బద్ఖల్ ఎమ్మెల్యే సీమా తారీఖా, కేంద్ర విద్యుత్, భారీ పరిశ్రమల శాఖ సహాయమంత్రి  కృష్ణపాల్, హర్యానా రవాణా, గనులు, భూగర్భవిజ్ఞానం, నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి మూల్ చంద్ శర్మ, కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ కార్యదర్శి అరవింద్ సింగ్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రముఖులు, సీనియర్ అధికారులు హాజరయ్యారు. 

 

 

హస్తకళల మేళా ప్రారంభోత్సవం సందర్భంగా గవర్నర్ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ, నాగరికత, సాంస్కృతిక అభివృద్ధిలో కళలు, హస్తకళలకు ఉన్న ప్రాధాన్యాన్ని గురించి వివరించారు. హస్తకళల మేళాను నిర్వహిస్తున్నందుకు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల మంత్రిత్వ శాఖలను ఆయన ప్రత్యేకంగా  అభినందించారు. భారతదేశంతోపాటు వివిధ దేశాల సుంపన్నమైన కళలను, హస్తకళలను, వారసత్వ సంపదను ప్రదర్శించేందుకు ఈ హస్తకళా మేళా అవకాశం ఇస్తుందని ఆయన అన్నారు.

 

హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ఉన్న వేలాది మంది  హస్తకళాకారులు తమ కళా ఖండాలను, ఉత్పాదలను మరింత విస్తృత స్థాయిలో కళాభిమానుల ముందు  ప్రదర్శించేందుకు సూరజ్ కుండ్ హస్తకళల మేళా దోహదపడుతుందన్నారు. సుసంపన్నమైన  భారతదేశ వారసత్వాన్ని, హస్త కళలను, కళాఖండాలను పునరుద్ధరించేందుకు కూడా ఈ మేళా ఉపయోగపడుతుందన్నారు. ప్రస్తుతం మనం ఆజాదీకా అమృత్ మహోత్సవ్ వేడుకలు సందర్భంగా జరుపుకుంటున్న ఈ సంవత్సరపు సూరజ్ కుండ్ హస్తకళల ప్రదర్శన మరింత ప్రత్యేకతను సంతరించుకుందన్నారు. తొలిసారిగా 1987వ సంవత్సరంలో ఈ ప్రదర్శన జరిగిందని, ఈ సంవత్సరం 35వ ప్రదర్శనను నిర్వహించుకుంటున్నామని, హర్యానా కళాకారులకే కాక, దేశవ్యాప్తంగా ఉన్న హస్త కళాకారులకు కూడా ఇది వేదికగా ఉపయోగపడుతుందని, కళాకారులు తమ ప్రతిభను ప్రదర్శించేందుకు, వారిని ప్రోత్సహించేందుకు, సుసంపన్నమైన మన వారసత్వ సంపదను, సంస్కృతిని పరిరక్షించేందుకు ఈ మేళా ఒక గొప్ప అవకాశమని ఆయన అన్నారు.

 

 

కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ కార్యదర్శి అరవింద్ సింగ్ మాట్లాడుతూ, కోవిడ్ వైరస్ మహమ్మారి వ్యాప్తి కారణంగా సుదీర్ఘ విరామం తర్వాత 35వ సూరజ్ కుండ్ హస్తకళల ప్రదర్శన ఈ సారి జరుగుతోందని, ఎందరో ఎంతగానో ఎదురుచూసే ఈ ప్రదర్శన 2021లో నిర్వహించడం సాధ్యంకాలేదని అన్నారు. అయితే, ఈ సారి ఇనుమడించిన ఉత్సాహంతో మరింత భారీ స్థాయిలో హస్తకళల ప్రదర్శన జరుగుతోందని అన్నారు. హస్తకళల ప్రదర్శనను నిర్వహించేందుకు హర్యానా ప్రభుత్వం తీసుకున్న చర్యలు అభినందనీయమని, భారతదేశంలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు ఈ ప్రదర్శన దోహదపడుతుందని ఆయన అన్నారు.

   హర్యానా పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.డి. సిన్హా మాట్లాడుతూ, 43.5 ఎకరాల విస్తీర్ణంగల మైదానంలో ఈ ప్రదర్శన జరుగుతోందని, హస్తకళా నిపుణులకోసం 1,183 స్టాళ్లను ఈ ప్రదర్శనలో ఏర్పాటు చేశారని అన్నారు. దీనికి తోడుగా, బహుళ రుచుల వంటకాలతో కూడిన ఫుడ్ కోర్టు సందర్శకులను అలరిస్తోందని ఆయన అన్నారు. అంతర్జాతీయ హస్తకళల పరిసరాలన్నింటినీ అలంకృత చిత్రాలు, వర్ణ చిత్రాలతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. మహువా, నర్గిస్, పాంచజన్యతో పాటుగా, 75 సంవత్సరాల స్వాతంత్ర్య ఇతివృత్తంతో, స్వాతంత్ర్య పతకాల ప్రతిరూపాలతో, త్రివర్ణ కంబళ్లతో, సంస్మరణ స్టాంపులతో అలంకరించినట్టు ఆయన చెప్పారు. సూరజ్ కుండ్ ప్రదర్శన అనేది ఇపుడు అంతర్జాతీయంగా ఎంతో ప్రజాదరణ కలిగిన పర్యాటక ప్రదర్శన అని అన్నారు. రానున్నరోజుల్లో మరిన్ని సృజనాత్మక విశేషాలతో ఈ ప్రదర్శనను మరింత భారీ స్థాయిలో తీర్చిదిద్దగలమని ఆయన అన్నారు.

  భారతదేశపు సుసంపన్నమైన హస్తకళలను, చేనేత వస్త్రాలను, సాంస్కృతిక విశేషాలను ప్రదర్శించే లక్ష్యంతో సూరజ్ కుండ్ హస్తకళల ప్రదర్శనను తొలిసారిగా 1987లో నిర్వహించారు. సూరజ్ కుండ్ ప్రదర్శన ప్రాధికార సంస్థ, హర్యానా పర్యాటక శాఖ  కలసి కేంద్ర పర్యాటక, జవుళి, సాంస్కృతిక, విదేశాంగ మంత్రిత్వ శాఖలు, హర్యానా ప్రభుత్వం సహకారంతో ఈ ప్రదర్శనను నిర్వహిస్తూ వస్తున్నారు. ఎంతో సౌందర్యదృష్టితో కళాత్మకంగా తీర్చిదిద్దిన పరిసరాల్లో భారతదేశ హస్తకళలను, సాంస్కృతిక, వారసత్వసంపదను, భారతీయ సంప్రదాయ వంటకాల రుచులను ప్రదర్శించేందుకు ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. అంతర్జాతీయ పర్యాటక క్యాలెండర్.లో ఇది ప్రస్తుతం ప్రముఖ స్థానం ఆక్రమించబోతోంది. కాలాగుణంగా వచ్చిన మార్పులను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రదర్శనను తిలకించేందుకు టికెట్లను ఆన్ లైన్ ద్వారా అందుబాటులోకి తెచ్చారు. పేటీఎం ఇన్ సైడర్ వంటి పోర్టల్స్ ద్వారా సందర్శకులకు ఈ టికెట్లను అందుబాటులో ఉంచారు. పొడవాటి క్యూలలో నిల్చుకోవలసిన అవసరం లేకుండా సందర్శకులు టికెట్లు పొందడానికి, సులభంగా ప్రదర్శనలోకి ప్రవేశించడానికి ఈ పోర్టల్స్ వీలు కల్పిస్తున్నాయి. చుట్టు పక్కల వివిధ ప్రాంతాలనుంచి వచ్చే సందర్శకుల సౌలభ్యం కోసం ప్రత్యేక బస్సులను కూడా ఏర్పాటు చేశారు.

  35వ సూరజ్ కుండ్ అంతర్జాతీయ హస్తకళల ప్రదర్శనలో ప్రధాన ఇతివృత్త రాష్ట్రంగా జమ్ము కాశ్మీర్.ను ఎంపిక చేశారు. జమ్ము కాశ్మీర్ విభిన్నమైన సంస్కృతీ సంప్రదాయాలను, వారసత్వ సంపదను, వివిధ రకాల హస్తకళారూపాల ద్వారా ఈ మేళాలో ప్రదర్శిస్తున్నారు. వందలాదిమంది జమ్ము కాశ్మీర్ కళాకారులు వివిధ రకాల జానపద కళలను, నృత్యాలను ప్రదర్శించనున్నారు. సంప్రదాయ నృత్యాలతో పాటుగా, సుందరమైన హస్తకళలతో జమ్ము కాశ్మీర్ సాంస్కృతిక వైభవాన్ని సందర్శకులకు కళ్లకుకట్టినట్టుగా ప్రదర్శిస్తారు. వైష్ణవదేవి ఆలయం, అమర్ నాథ్ క్షేత్రం ప్రతిరూపాలతో పాటుగా, కాశ్మీర్ వాస్తు శిల్ప కళను ప్రతిబింబించే అప్నా ఘర్ కళారూపాన్ని ప్రదర్శిస్తున్నారు. అలాగే, హౌస్ బోట్ ప్రదర్శన, జమ్ము-ముబారక్ మండీఈ సారి ప్రధాన ఆకర్షణగా సందర్శకులను అలరించబోతున్నాయి.

  2013లో సూరజ్ కుండ్ హస్తకళల ప్రదర్శన అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది. 2020వ సంవత్సరంలో యూరప్, ఆఫ్రికా, ఆసియా ప్రాంతాలకు చెందిన 30దేశాలు ఈ ప్రదర్శనలో పాలుపంచుకున్నాయి. ఈ సంవత్సరం భాగస్వామ్య దేశమైన ఉజ్బెకిస్తాన్ తో పాటుగా 30దేశాలకు పైగా పాల్గొంటున్నాయి. లాటిన్ అమెరికా దేశాలు, ఆఫ్ఘనిస్తాన్, ఇతియోపియా, ఎస్వాటినీ, మొజాంబిక్, టాంజానియా, జింబాబ్వే, ఉగాండా, నమీబియా, సుడాన్, నైజీరియా, ఈక్విటోరియల్ గినియా, సెనెగల్, అంగోలా, ఘనా, థాయిలాండ్, నేపాల్, శ్రీలంక, ఇరాన్, మాల్దీవులు తదితర దేశాలు ఈ సారి ఉత్సాహంగా ఈ ప్రదర్శనలో పాల్గొంటున్నాయి.

  సందర్శకుల మానసిక ఉల్లాసం కలిగించేందుకు వివిధ రాష్ట్రాల కళాకారులతో పాటుగా, ఈ ప్రదర్శనలో పాలుపంచుకుంటన్న వివిధ దేశాల అంతర్జాతీయ జానపద కళాకారులచేత అద్భుతమైన ప్రదర్శనలు నిర్వహించనున్నారు.

  పంజాబ్ కు చెందిన బాంగ్డా, అస్సాం రాష్ట్రానికి చెందిన బిహూ, బర్సానా కీ హోలీ, హర్యానాకు చెందిన లోక్ నృత్యం, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన జమాక్డా, మహారాష్టకు చెందిన లావ్నీ నృత్యాలు, హత్ చక్నీ ప్రదర్శన, ప్రసిద్ధి పొందిన బెహురూపియా ప్రదర్శనలు వీక్షకులను, కళాభిమానులను ఎంతగానో అలరించబోతున్నాయి.

ఇక మేళాలో పక్షం రోజులపాటు సాయంత్ర వేళల్లో నిర్వహించే పలు సాంస్కృతిక ప్రదర్శనలు సందర్శకులకు ప్రధాన ఆకర్షణలుగా నిలువనున్నాయి. రెహ్మత్ ఇ నుస్రత్ వంటి బ్యాండ్ వాయుద్యాలు, రింకూ కాలియా ఆలపించే ఘజళ్లు, చక్కని ఆకర్షణీయమైన నృత్య ప్రదర్శనలు, సూఫీ గీతాగానం, మాతీ బానీ ప్రదర్శించే భారతీయ శ్రుతి లయలు, జమ్ము కాశ్మీర్, ఉజ్బెకిస్తాన్, ఇతర అంతర్జాతీయ కళాకారుల సంగీత-నృత్య ప్రదర్శనలు కూడా ఉంటాయి. చౌపాల్ రంగస్థల థియేటర్ లో సాయంత్రం ఏడు గంటలనుంచి ఈ కార్యక్రమాలను నిర్వహిస్తారు.

  హర్యానా ప్రజల జీవనశైలిని గురించి తెలియజెప్పేందుకు అదే రాష్ట్రానికి చెందిన ఒక కుటుంబం ప్రత్యేకంగా సృష్టించిన అప్నా ఘర్లో నివసిస్తుంది. హర్యానా రాష్ట్ర ప్రజల జీవన విధానాన్ని గురించి సందర్శకులు తెలుసుకునేందుకు, సంస్కృతీ సంప్రదాయాలను వారినే అడిగి తెలుసుకునేందుకు అప్నా ఘర్ దోహదపడుతుంది. సంప్రదాయబద్ధమైన మట్టి పాత్రలు, వంటపాత్రల గురించి తెలుసుకునేందుకు కూడా అప్నాఘర్ వీలు కల్పిస్తుంది. ఈ సంప్రదాయ కళలను హస్తకళాకారులు సందర్శకులకు ప్రత్యక్షంగా ప్రదర్శించి చూపుతారు. ప్రదర్శనలన్నింటినీ సజీవ రూపంలో తీర్చిదిద్దేందుకు రెండు చౌపాల్ ఆంఫీ ధియేటర్లను అందంగా, ఆకర్షణీయంగా అలంకరించారు.

  2022 మార్చి 19వ తేదీన మొదలైన ఈ హస్తకళల ప్రదర్శన 2022 ఏప్రిల్ 4వ తేదీవరకూ కొనసాగుతుంది. ప్రతి రోజూ మధ్యాహ్నం 12.30నుంచి రాత్రి తొమ్మిదిన్నర వరకూ నిర్వహిస్తారు.

  35వ సూరజ్ కుండ్ అంతర్జాతీయ హస్తకళల మేళా-2022 ప్రధాన ఆకర్షణలు.

ఈ ఏడాది ప్రదర్శనకు గాను ఉజ్బెకిస్తాన్ భాగస్వామ్యదేశంగా ప్రాతినిధ్యం వహిస్తుంది.

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తాజా ప్రగతిని దృష్టిలో పెట్టుకుని మేళా ప్రవేశ రుసం టికెట్లను పేటీఎం ఇన్.సైడర్ పోర్టల్ ద్వారా సందర్శకులు ముందే బుక్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు.

సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన సృజనాత్మక ఆవిష్కరణల ద్వారా ఎలాంటి ఇబ్బందులు లేని రీతిలో వాహనాల పార్కింగ్ సదుపాయాన్ని ఏర్పాటు చేశారు.

వర్చువల్ టూర్.ను, హస్తకళాకారుల సమాచారాన్ని వెబ్.సైట్లో అందుబాటులో ఉంచారు. వెబ్ సైట్: www.surajkundmelaauthority.com

రాజస్థాన్ కు చెందిన కచ్చీ ఘోడీ, కర్రపై నడక, కల్బేలియా, బెహ్రూపియా, హిమాచల్ ప్రదేశ్.కుచెందిన కాంగ్డీ నాటీ, అస్సాంకు చెందిన పీహూ, పంజాబ్.కు చెందిన బాంగ్డా, జిందువా, ఝూమర్, ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందిన చపేలీ, ఉత్తరప్రదేశ్ కు చెందిన బర్సానా కీ హోలీ, మేఘాలయకు చెందిన వాంగియా, ఒడిశాకు చెందిన సంబాల్పూరీ, మధ్యప్రదేశ్ కు చెందిన బధాయీ, మహారాష్ట్రకు చెందిన లావ్నీ తదతర సంప్రదాయ, సాంస్కృతిక కళాకారుల ప్రదర్శనలను కళలు, సాంస్కృతిక వ్యవహారాల శాఖ నిర్వహిస్తుంది. 

కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా సూరజ్ కుండ్ మేళా ప్రాధికార సంస్థ కొన్ని వర్గాల వారికి టికెట్లలో 50శాతం రాయితీ కల్పిస్తుంది. విభిన్న సామర్థ్యాలు కలిగిన వారికి, వయోవృద్ధులకు, రక్షణ శాఖ సిబ్బందికి, మాజీ సైనికులకు ఈ రాయితీ వర్తిస్తుంది.

హర్యానాకు చెందిన సుప్రసిద్ధ కళా రూపమైన అప్నాఘర్ఈ సారి సందర్శకులను కొత్త రూపుతో అలరిస్తుంది.

పాఠశాల విద్యార్థులకు ఈ సారి ఎన్నో పోటీలను నిర్వహిస్తారు.

మేళా జరిగే పక్షం రోజుల్లో ఎగుమతుదార్ల, కొనుగోలుదార్లతో సమ్మేళనాన్ని నిర్వహిస్తారు. హస్తకళాఖండాల కళాకారులు తమ ఉత్పత్తులకు ఎగుమతి అవకాశాలను అందిపుచ్చుకునే అవకాశాన్ని ఈ సమ్మేళనం కల్పిస్తుంది.

భద్రతా ఏర్పాట్లను మరింత బలోపేతం చేసేందుకు మేళా మైదానంలో వందకు పైగా సి.సి.టి.వి. కెమెరాలను ఏర్పాటు చేశారు. మహిళా గార్డులతో సహా పెద్ద సంఖ్యలో సెక్యూరిటీ గార్డులను మేళా ఆవరణకు తరలించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావీయని రీతిలో ఈ భద్రతా ఏర్పాట్లను కల్పించారు.

మేళా పార్కింగ్ స్థలంలోకి ప్రవేశించే వివిధ రకాల వాహనాల నంబర్ ప్లేట్లను గుర్తించే ఎలెక్ట్రానిక్ నిఘా కోసం అధునాతనమైన ఎన్.పి.ఆర్. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించారు.

హాజరయ్యే సందర్శకుల సంఖ్యను లెక్కించే సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశపెట్టారు.

అనుమతిలేనిదే అనధికారికంగా ఎవరూ మేళా ఆవరణలోకి ప్రవేశించకుండా నిరోధక వ్యవస్థను ఏర్పాటు చేశారు.

సిల్వర్ జూబ్లీ గేటుకు ఆనుకొని ఉన్న ఎం.సి.ఎఫ్. ఖోరీ స్థలంలో వాహనాలు నిలిపేందుకు 2-3 ఎకరాల అదనపు స్థలాన్ని అందుబాటులో ఉంచారు.  

మేళా జరిగినన్ని రోజులూ ఎలాంటి అత్యవసర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు అగ్నిమాపక దళం, వైద్య బృందాలు అందుబాటులో ఉండేలా తగిన ఏర్పాట్లు చేశారు.

ప్రకృతి వైపరీత్యాల నేపథ్యంలో తగిన నిర్వహణా ప్రణాళిక/ సందర్శకులను, ప్రజలను ఖాళీ చేయించే ప్రణాళికలను కీలక ప్రాంతాల్లో అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో సిద్ధం చేశారు. అగ్నిమాపక దళం, వైద్య బృందాలతో ఈ ఏర్పాట్లు చేశారు.

కేంద్రీకృతంగా అందుబాటులో ఉండేలా బ్యాంకు, ఆసుపత్రి, మేళా పోలీస్ కంట్రోల్ రూం, సి.సి.టి.వి. కంట్రోల్ రూమ్ వంటివి ఏర్పాటు చేశారు. ముఖ్యమైన ఈ సేవలను సందర్శకులు, భాగస్వామ్య వర్గాల ప్రతినిధులు సులభంగా వినియోగించుకునే ఏర్పాటు చేశారు.

విభిన్న సామర్థ్యాలు కలిగిన వారికోసం మరింత మెరుగైన సదుపాయాలను ఏర్పాటు చేశారు.

మేళా పరిధిలో ప్లాస్టిక్/పాలిథీన్ సంచుల వినియోగంపై పూర్తి స్థాయి నిషేధం విధించారు.

 

సూరజ్ కుండ్ చరిత్ర

సూరజ్ కుండ్ అంతర్జాతీయ హస్తకళల మేళా జరుగుతున్న ఫరీదాబాద్ ప్రాంతం,.. దక్షిణఢిల్లీకి 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. పురాతన రంగస్థలంనుంచి సూరజ్ కుండ్ అనే ఈ పదం పుట్టింది. సూర్యుడి సరస్సు అని దీనికి అర్థం. తోమర్ తెగ సర్దారుల్లో ఒకడైన రాజా సూరజ్ పాల్ క్రీస్తుశకం పదవ శతాబ్దంలో దీన్ని నిర్మించాడు. సూరజ్అంటేసూర్యుడు,  ‘కుండ్అంటేకుండం/సరస్సు లేదా జలాశయం అని అర్థం. అరావళి పర్వత శ్రేణుల నేపథ్యంలో ఈ సూరజ్ కుండ్ నిర్మితమైంది.

   చరిత్రకారులు మనకు చెప్పిన ప్రకారం ఈ ప్రాంతం తోమర్ తెగ పాలకుల అధీనంలో ఉండేది. సూర్యభగవానుడిని పూజించే తోమర్ సర్దారుల్లో ఒకరైన రాజా సూరజ్ పాల్ ఈ ప్రాంతంలో సూర్య సరస్సును నిర్మింపజేశారు. సూరజ్ కుండ్ పరిసరాల్లోనే ఒక ఆలయం కూడా ఉండేదని నమ్మకం. ఇక్కడ సూర్య దేవాలయం ఉన్నట్టు పురావస్తు శాఖ జరిపిన తవ్వకాల్లో జరిపిన అవశేషాలు తెలియజేస్తున్నాయి. ఆలయ అవశేషాలను ఇప్పటికీ అక్కడ చూడవచ్చు.  తుగ్లక్ వంశం పాలనలో ఫిరోజ్ అనే పాలకుడి హయాంలో (హైపర్ లింక్ "http://en.wikipedia.org/wiki/Feroz_Shah_Tughlaq")  షా తుగ్లక్ (1351-88) ఈ కట్టడాన్ని పునరుద్ధరించారు. కట్టడం పైకప్పును, మెట్లను సున్నపురాయితో తిరిగి నిర్మించారు.

  భిన్నత్వంలో ఏకత్వంతో కూడిన సుసంపన్నమైన భారతీయ సాంస్కృతిక వారసత్వ సంపదను కానుకగా అందించేందుకు ఈ మేళాను నిర్వహిస్తున్నారు. అద్భుతమైన సూరజ్ కుండ్ కట్టడం నేపథ్యంగా ఈ ప్రదర్శనను చేపట్టారు.

సూరజ్ కుండ్ అంతర్జాతీయ హస్తకళల మేళా ప్రారంభోత్సవాన్ని యూ ట్యూబ్ ద్వారా సందర్శించేందుకు సంప్రదించాల్సిన లింకు: https://youtu.be/16xogsqUcSM

 

ఈ కింది లింకుల ద్వారా పర్యాటక మంత్రిత్వ శాఖను అనుసరించవచ్చు

ఫేస్ బుక్ - https://www.facebook.com/incredibleindia/

ఇన్.స్టాగ్రామ్- https://instagram.com/incredibleindia?igshid=v02srxcbethv

 

****



(Release ID: 1807546) Visitor Counter : 195