గనుల మంత్రిత్వ శాఖ
గనులరంగం వృద్ధి చెందడం భారత ఆర్థిక వ్యవస్థ పురోభివృద్ధికి దోహదకారిగా మారుతుందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు.
36వ అంతర్జాతీయ జియోలాజికల్ కాంగ్రెస్ (ఐజీసీ) న్యూఢిల్లీలో ప్రారంభమైంది
58 సంవత్సరాల తర్వాత భారతదేశం ఐజీసీకి ఆతిథ్యం ఇస్తోంది.
"జియోసైన్సెస్: ది బేసిక్ సైన్స్ ఫర్ సస్టైనబుల్ ఫ్యూచర్" అనే ఇతివృత్తంతో ఐసీజీని నిర్వహిస్తున్నారు.
Posted On:
20 MAR 2022 5:23PM by PIB Hyderabad
గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశం యొక్క మైనింగ్ విస్తీర్ణం గణనీయంగా పెరిగిందని..
కేంద్ర బొగ్గు, గనులు మరియు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. అంతేకాకుండా మైనింగ్ రంగంలో దేశవ్యాప్తంగా 12 మిలియన్ల మంది ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా ఉపాధి పొందుతున్నారని చెప్పారు. దేశ రాజధాని న్యూఢిల్లీలో జరిగిన 36వ అంతర్జాతీయ జియోలాజికల్ కాంగ్రెస్ మంత్రి ప్రారంభోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఖనిజాల అన్వేషణలో వేగం అనేక రెట్లు పెరిగిందని అన్నారు. భారత ఆర్థిక వ్యవస్థకు సరైన పునరుజ్జీవనాన్ని అందించిన మైనింగ్ రంగంలో ఇటీవలి కాలంలో చేపట్టిన సంస్కరణలను ప్రస్తావిస్తూ.. మెరుగైన శిఖరాలను అందుకోవడానికి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తోందని మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రశంసించారు. 36వ అంతర్జాతీయ జియోలాజికల్ కాంగ్రెస్ యొక్క ప్రాముఖ్యతను స్పృశిస్తూ... 58 సంవత్సరాల తర్వాత భారతదేశం ఆతిథ్యమిస్తున్న మూడు రోజుల కార్యక్రమమిదని, సుస్థిర అభివృద్ధి రంగంలో మరింత ప్రభావవంతమైన సాధనాలను రూపొందించడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న భూ శాస్త్రజ్ఞులకు సరైన వేదికను అందిస్తుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.
బొగ్గు, గనులు మరియు రైల్వేల శాఖ సహాయ మంత్రి రావుసాహెబ్ పాటిల్ దాన్వే, కమ్యూనికేషన్స్ రాష్ట్ర మంత్రి దేవుసిన్ చౌహాన్ మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎర్త్ సైన్సెస్, పీఎంఓ, పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్స్, పెన్షన్లు, అటామిక్ ఎనర్జీ, స్పేస్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ కూడా ఈ కార్యక్రమంలో ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఇతర ప్రముఖులలో గనుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి డాక్టర్. అలోక్ టోండన్, భూ శాస్త్రాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి డాక్టర్. ఎం. రవిచంద్రన్, జీఎస్ఐ డైరెక్టర్ జనరల్ రాజేంద్ర సింగ్ గర్ఖాల్ తదితరులు ఉన్నారు.
"జియోసైన్సెస్: ది బేసిక్ సైన్స్ ఫర్ ఎ సస్టైనబుల్ ఫ్యూచర్" అనే ఇతివృత్తంతో 36వ ఇంటర్నేషనల్ జియోలాజికల్ కాంగ్రెస్ నిర్వహిస్తున్నారు. ఐజీసీ అనేది గనుల మంత్రిత్వ శాఖ, ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ, ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ మరియు బంగ్లాదేశ్, నేపాల్ మరియు శ్రీలంక సైన్స్ అకాడమీల ఉమ్మడి సంస్థ. నాలుగేళ్లకోసారి నిర్వహించే ఈ కాంగ్రెస్ను జియోసైన్సెస్ ఒలింపిక్స్‌గా పిలుస్తున్నారు. ఆయా దేశాల ఐజీసీల సైంటిఫిక్ స్పాన్సర్ అయిన ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ జియోలాజికల్ కాంగ్రెస్ (ఐయూజీఎస్) ఆధ్వర్యంలో ఈ సమావేశాలు నిర్వహిస్తున్నారు. మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో ప్రపంచం నలుమూలల నుంచి దాదాపు 5000వేల నుంచి 7000 మంది ప్రతినిధులు పాల్గొంటారు.
ఈ కార్యక్రం జియోసైన్సెస్ మరియు ప్రొఫెషనల్ నెట్‌వర్కింగ్ రంగంలో నూతన ఆవిష్కరణలు మరియు అనుభవాలను పంచుకోవడానికి ఒక ప్రత్యేక వేదికగా నిలుస్తోంది. ఇది మైనింగ్, ఖనిజాల అన్వేషణ మరియు నీటి నిర్వహణ, ఖనిజ వనరులు మరియు పర్యావరణంలో తాజా సాంకేతికతలపై ప్రత్యక్ష సమాచారాన్ని అందిస్తుంది. ఐజీసీ ప్రారంభ రోజున, జియో టూరిజం హాట్‌స్పాట్‌లపై స్మారక పోస్టల్ స్టాంపులు, ఫస్ట్ డే కవర్ మరియు మల్టీ కలర్ కాఫీ టేబుల్ పుస్తకాలను ఆవిష్కరించారు.
ప్రాంతీయ సంస్థలకు నాయకత్వం వహిస్తున్న భారతదేశం 2012లో బ్రిస్బేన్లో జరిగిన అంతర్జాతీయ జియోలాజికల్ కాంగ్రెస్లో.. 2020లో జరగనున్న 36వ ఐజీసీ కోసం ప్రాంతీయ భాగస్వాములతో కలిసి బిడ్ వేసింది. వాస్తవానికి 2020 మార్చి 2-8 తేదీలలో జరగాల్సిన ప్రస్తుత కాంగ్రెస్.. కోవిడ్ మహమ్మారి కారణంగా వాయిదా పడింది. 58 సంవత్సరాల క్రితం ఆసియాఖండంలోనే తొలిసారిగా 22వ ఇంటర్నేషనల్ జియోలాజికల్ కాంగ్రెస్కు భారతదేశం ఆతిథ్యం ఇచ్చింది.
***
(Release ID: 1807466)
Visitor Counter : 190