ఆయుష్

యోగా మహోత్సవ్‌ తో ప్రారంభమవుతున్న - 8వ అంతర్జాతీయ యోగా దినోత్సవ సంరంభం

Posted On: 12 MAR 2022 1:07PM by PIB Hyderabad

కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని మొరార్జీ దేశాయ్ జాతీయ యోగా సంస్థ రేపు యోగా మహోత్సవ్-2022 ను నిర్వహిస్తోంది.  అంతర్జాతీయ యోగా దినోత్సవం-2022 కి సన్నాహకంగా, 100 రోజుల ముందు కేంద్ర ఆయుష్, ఓడరేవులు, నౌకారవాణా, జలమార్గాల మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు.  ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో -   కేంద్ర కార్మిక, ఉపాధి, పర్యావరణం, అటవీ శాఖ మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్;  హర్యానా ముఖ్యమంత్రి శ్రీ మనోహర్ లాల్ ఖట్టర్; సిక్కిం ముఖ్యమంత్రి శ్రీ ప్రేమ్ సింగ్ తమాంగ్;  కేంద్ర విదేశీ వ్యవహారాలు, సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి శ్రీమతి మీనాక్షి లేఖి;  కేంద్ర ఆయుష్, డబ్ల్యూ.సి.డి. మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి డాక్టర్ ముంజ్‌ పరా మహేంద్ర భాయ్;  రిషికేశ్ లోని పరమార్థ నికేతన్ కు చెందిన స్వామి చిదానంద సరస్వతీ జీ మొదలైన ప్రముఖులు పాల్గొంటున్నారు. 

యోగా యొక్క వివిధ విధానాలు, దాని ప్రయోజనం గురించి విస్తృత ప్రచారం కల్పించడం తో పాటు,  ఆరోగ్యం, శ్రేయస్సు, ప్రపంచ శాంతి కోసం ఐ.డి.వై-2022 కి 100 రోజుల కౌంట్‌ డౌన్ ప్రచారాన్ని ప్రోత్సహించాలానే ప్రాథమిక లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.  అదేవిధంగా, మొరార్జీ దేశాయ్ జాతీయ యోగా సంస్థ ఆధ్వర్యంలో ఆయుష్ మంత్రిత్వ శాఖ కూడా 2022 మార్చి, 13వ తేదీ నుంచి 2022 జూన్, 21వ తేదీ వరకు, ప్రపంచవ్యాప్తంగా "100 రోజులు, 100 నగరాలు, 100 సంస్థలు" అనే విస్తృత ప్రచారాన్ని ప్రారంభిస్తోంది.  

ఐ.డి.వై-2022 అనేది అంతర్జాతీయ యోగా దినోత్సవం యొక్క 8వ కార్యక్రమం.  ఆ పరంపరను కొనసాగిస్తూ, ఈ సంవత్సరం, యోగా కు చెందిన వివిధ ప్రక్రియలు,   యోగా వల్ల కలిగే ప్రయోజనాలకు విస్తృత ప్రచారం కల్పించడంతో పాటు, ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యం, శ్రేయస్సు, శాంతిని ప్రోత్సహించే విధంగా సామూహిక ఉద్యమాన్ని ప్రేరేపించడం కోసం, ఎం.డి.ఎన్.ఐ.వై. యోగా మహోత్సవ్-2022 ను నిర్వహిస్తోంది.  ప్రతి సంవత్సరం అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో, ఈ  "100 రోజుల-కౌంట్‌-డౌన్" అనేది ఒక ముఖ్యమైన అంశంగా పేర్కొనవచ్చు.  ఈ కార్యక్రమం, 8వ అంతర్జాతీయ యోగా దినోత్సవం-2022 వేడుకల అధికారిక ప్రారంభ సూచికగా నిలవడంతో పాటు, వ్యాధి, ఒత్తిడి, నిరాశల నుండి విముక్తి వైపు ప్రయాణానికి నాంది పలుకుతుంది.

2015 లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రకటించినప్పటి నుంచి, ఐ.డి.వై. వేడుకలకు సంబంధించి ప్రజలను చైతన్యం చేయడానికి, ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆద్వర్యంలోని మొరార్జీ దేశాయ్ జాతీయ యోగా సంస్థ, యోగా మహోత్సవ్‌ ను ప్రతీ ఏటా విజయవంతంగా నిర్వహిస్తోంది.

భారతదేశంలో ఐ.డి.వై. కి నోడల్ మంత్రిత్వ శాఖగా వ్యవహరిస్తున్న ఆయుష్ మంత్రిత్వ శాఖ,  అంతర్జాతీయ యోగా దినోత్సవం (ఐ.డి.వై) ఏడు కార్యక్రమాలను   విజయవంతంగా నిర్వహించడంలో ముందుండి, గొప్ప ఉత్సాహాన్ని, ప్రపంచవ్యాప్త మద్దతును పొందింది.  ప్రపంచవ్యాప్తంగా యోగా సందేశాన్ని వ్యాప్తి చేసి, అద్భుతమైన ప్రగతి సాధించడానికి, ఆయుష్ మంత్రిత్వ శాఖ, గత 7 సంవత్సరాలు గా వివిధ కార్యక్రమాలను చేపట్టింది.  ఈ సంవత్సరం కూడా, 8వ అంతర్జాతీయ యోగా దినోత్సవం-2022 వేడుకల ప్రారంభ సూచకంగా, "100 రోజుల-కౌంట్‌-డౌన్‌" కార్యక్రమాన్ని, 2022 మార్చి, 13వ తేదీ ఉదయం 10 గంటలకు, న్యూఢిల్లీ లోని విజ్ఞాన్ భవన్‌ లో పలువురు ప్రముఖుల సమక్షంలో, ఆయుష్ మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రారంభిస్తోంది. 

ఈ కార్యక్రమంలో ఆయుష్ మంత్రిత్వ శాఖ, అనేక ఇతర మంత్రిత్వ శాఖలు, పరిశోధన మండళ్ళు, జాతీయ సంస్థలు, ఎం.ఓ.ఏ., లకు చెందిన సీనియర్ అధికారులతో పాటు, పలువురు ఇతర ప్రముఖులు, నిపుణులు కూడా పాల్గొంటారు.  అనేక మంది ప్రముఖ యోగా శిక్షకులు, గురువుల సందేశాలు కూడా ఉంటాయి. 

యోగ విద్యను బోధించే అధ్యాపకులు, పండితులు, విధాన నిర్ణేతలు, ఉన్నతోద్యోగులు, కార్పొరేట్ సిబ్బంది, యోగా ఔత్సాహికులు, అనుబంధ శాస్త్ర నిపుణులతో సహా సుమారు 1500 మంది ఈ యోగా మహోత్సవ్-2022 లో పాల్గొనే అవకాశముంది. 

*****



(Release ID: 1805602) Visitor Counter : 158