రైల్వే మంత్రిత్వ శాఖ

“మిషన్ జీవన్ రక్షా” పేరిట 42మందికి ప్రాణరక్షణ!


2022 జనవరిలో ఆర్.పి.ఎఫ్. సిబ్బంది సేవలు..

అదే నెలలో 1,045మంది చిన్నారులకు రక్షణ...

మహిళా ప్రయాణికుల రక్షణకోసం
ప్రధాన రైల్వే స్టేషన్లలో
“మేరీ సహేళీ” బృందాల ఏర్పాటు

Posted On: 17 FEB 2022 4:43PM by PIB Hyderabad

         రైలు ప్రయాణం భద్రంగా, సురక్షితంగా, సౌకర్యవంతంగా సాగేందుకు రైల్వే రక్షణ దళం (ఆర్.పి.ఎఫ్.) సిబ్బంది 24 గంటలూ పనిచేస్తూ ఉంది. రైల్వేల ఆస్తులను, రైలు ప్రయాణికుల ప్రాంతం, ప్రయాణికుల రక్షణకోసం తమకు అప్పగించిన బాధ్యతను వారు నిర్విరామంగా నిర్వర్విస్తూ వస్తున్నారు. వినియోగదార్లకు సురక్షితమైన సరకు రవాణా సేవలందించేందుకు కూడా ఆర్.పి.ఎఫ్. సిబ్బంది సేవలు ఉపయోగపడుతున్నాయి. దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో విస్తరించిన రైల్వేల ఆస్తుల పరిరక్షణా బాధ్యతల నిర్వహణలో ఆర్.పి.ఎఫ్. ఎంతో సమర్థవంతంగా, ప్రతిభావంతంగా పనిచేస్తోంది. ప్రయాణికుల అవసరాలకు సహాయపడేందుకు, మహిళలకు, చిన్న పిల్లలకు తగిన రక్షణ అందించేందుకు కూడా  కృషి చేస్తున్నారు. వివిధ కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా, పటిష్టంగా అమలు చేయడానికి నిర్దేశిత విధులకు అతీతంగా కూడా  పనిచేస్తూ వస్తున్నారు. ఈ ఏడాది జనవరి నెల నుంచి ఆర్.పి.ఎఫ్. కార్యక్రమాల, విధుల నిర్వహణకు నిర్ణయించారు.

   వివిధ రైల్వే స్టేషన్లలో, రైళ్ల చక్రాలకింద పడి ప్రాణాలు కోల్పోయే వారి రక్షణకోసం ఆర్.పి.ఎఫ్. సిబ్బంది విధులకు అతీతంగా పనితీరును ప్రదర్శిస్తున్నారు. తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా రేయింబవళ్లూ పనిచేస్తున్నారు. "మిషన్ జీవన్ రక్షా" కార్యక్రమం పేరిట ఈ పనులను చేపడుతూ వస్తున్నారు. ఈ కార్యక్రమం కింద 2022వ సంవత్సరం జనవరి నెలలో ఆర్.పి.ఎఫ్, సిబ్బంది 42మంది ప్రాణాలను రక్షించారు. వారిలో 20 మంది పురుషులు కాగా, 22మంది మహిళలు.

   అనేక కారణాలవల్ల కుటుంబం నుంచి విడిపోయి, తప్పించుకు పోతున్న చిన్నారులకు తగిన రక్షణ కల్పించి, వారిని తిరిగి కుటుంబ సభ్యులతో కలపడంలో ఆర్.పి.ఎఫ్. ఎంతో గొప్ప సేవను అందిస్తోంది. వారిని సకాలంలో రక్షించని పక్షంలో దోపిడీకి, అక్రమ రవాణాకు గురయ్యే ఆస్కారం ఉంది. వారిని రక్షించేందుకు "ఆపరేషన్ నన్హే ఫరిస్తే" పేరిట అఖిలభారత స్థాయి కార్యక్రమాన్ని రైల్వే శాఖ ప్రారంభించింది. 2022 జనవరి నెలలో ఈ కార్యక్రమం కింద 1,045 మంది చిన్నారులకు (701మంది బాలురు, 344మంది బాలికలు) ఆర్.పి.ఎఫ్. సిబ్బంది రక్షణ కల్పించారు. వారికోసం పలు ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థలతో  (ఎన్.జి.ఒ.లతో) కలసి తదుపరి కార్యక్రమాలను కూడా నిర్వహించారు. ప్రస్తుతం భారతీయ రైల్వే శాఖ పరిధిలోని 132 రైల్వేస్టేషన్లలో చిన్నారుల సహాయక కేంద్రాలు పనిచేస్తున్నాయి.

  మహిళా ప్రయాణికులకు మరింత మెరుగైన రక్షణ కల్పించే లక్ష్యంతో "మహిళా సురక్ష" పేరిట  పలు కార్యక్రమాలను ఆర్.పి.ఎఫ్. నిర్వర్తిస్తోంది. మహిళా ప్రయాణికుల రక్షణ కోసం ప్రత్యేకించి ఒంటరిగా ప్రయాణించే మహిళలకు నేరాలబారినుంచి రక్షణ కల్పించడమే లక్ష్యంగా –మేరీ సహేళీ- పేరిట రక్షణ బృందాలను 2022 జనవరి నెలలో వివిధ రైల్వే స్టేషన్లకు ఆర్.పి.ఎఫ్. తరలించింది. దేశవ్యాప్తంగా నడుస్తున్న 13,000 రైళ్లకు ఈ బృందాలను వర్తింపజేశారు. అత్యాచారం, మహిళలను, బాలికలను వేధించడం తదితర ఆరోపణలపై ఐదుగురు వ్యక్తులను, మహిళల బోగీల్లో ప్రయణిస్తూ పట్టుబడిన మరో 2,185మందిని ఆర్.పి.ఎఫ్. సిబ్బంది అరెస్టు చేశారు.

   ఆర్.పి.ఎఫ్.లో దాదాపు 9శాతం మేరకు మహిళా సిబ్బంది ఉన్నారు. రైలు ప్రయాణం చేస్తూ ప్రసవ వేదనకు గురైన గర్భిణులైన మహిళలకు తగిన సహాయం అందించి, వారికి సుఖ ప్రసవం, శిశుజననం సమర్థవంతంగా సేవలందించారు.  –ఆపరేషన్ మాతృశక్తి- పేరిట వారు ఈ సహాయం అందించారు. 2022 జనవరి నెలలో గర్భిణులైన ఏడుగురు మహిళా ప్రయాణికులకు ఈ సేవలను మహిళా ఆర్.పి.ఎఫ్. సిబ్బంది అందించారు.   

   భారత రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్ ప్రకారం పోలీసులతో రక్షణ కల్పించడం రాష్ట్రాల పరిధిలోని అంశం అయినప్పటికీ, ప్రయాణికుల పట్ల జరిగే నేరాలను అరికట్టడంలో రాష్ట్రాల పోలీసులకు ఆర్.పి.ఎఫ్. సిబ్బంది తగిన సహకారం అందించారు. –ఆపరేషన్ యాత్రీ సురక్ష- పథకం కింద ఈ విధులను నిర్వర్తించారు. 2022 జనవరి నెలలో ప్రయాణికులపై నేరాలకు సంబంధించిన 254 కేసుల్లో 300మందికి పైగా ఆర్.పి.ఎఫ్. అరెస్ట్ చేసింది. వారిని సంబంధిత స్థానిక పోలీసులకు అప్పగించింది. –ఆపరేషన్ యాత్రీ సురక్ష- కార్యక్రమం కింద ప్రయాణికుల భద్రతాపరమైన అంశాలు, ఇతర సమస్యల పరిష్కారం కోసం  ఆర్.పి.ఎఫ్.ను సంప్రదించవలసిన వారు 139 హెల్ప్.లైన్ టోల్ ఫ్రీ నంబరుకు ఫోన్ చేయవచ్చు. అలాగే ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్.స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాలపై కూడా ఆర్.పి.ఎఫ్. సిబ్బంది 24 గంటలూ అందుబాటులో ఉంటుంది. భద్రతకు సంబంధించి హెల్ప్.లైన్ టోల్ ప్రీ నంబరుపై, సామాజిక మాధ్యమాలపై 2022 జనవరి నెలలో అందిన 11,230 ఫోన్ కాల్స్.ను, ఫిర్యాదులను ఆర్.పి.ఎఫ్. సిబ్బంది సంపూర్ణంగా పరిష్కరించింది.

   రైళ్లద్వారా మనుషుల అక్రమ రవాణాను అరికట్టేందుకు సంబంధిత భాగస్వామ్య వర్గాల సమన్వయంతో ఆర్.పి.ఎఫ్. 24 గంటలూ తన విధులను సమర్థవంతంగా నిర్వహిస్తూ వస్తోంది. –ఆహత్- అన్నకార్యక్రమం పేరిట ఆర్.పి.ఎఫ్. ఈ విధులను నిర్వర్తిస్తోంది. 2022 జనవరి నెలలో ఈ కార్యక్రమం కింద 22మంది మైనర్లతో సహా 35మంది బాధితులను అక్రమ రవాణాదార్లనుంచి ఆర్.పి.ఎఫ్. కాపాడింది. 8మంది అక్రమ రవాణాదార్లను అరెస్ట్ చేసి, స్థానిక పోలీసులకు అప్పగించింది.

   ప్రయాణం హడావుడితో రైలెక్కే తొందరలోనో, రైల్వే స్టేషన్ నుంచి తిరిగి వచ్చే ధ్యాసలోనో,.. ప్రయాణికులు వదిలేసి పోయిన సామాన్లకు తగిన రక్షణ కల్పించి, వాటిని తిరిగి సొంతదారులకే అప్పగించడంలో ఆర్.పి.ఎఫ్. ఎంతో కృషి చేస్తోంది. –ఆపరేషన్ అమానత్- కోడ్ నేమ్ పేరిట ఈ విధులను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం పేరట 2022 జనవరి నెలలో ప్రయాణికులకు చెందిన రూ. 2.8లక్షలకుపైగా విలువైన 1,552 సామాన్లను వాటి సొంతదార్లకు అప్పగించారు.  

   మత్తు మందులు, మాదక ద్రవ్యాలు యువత ఆరోగ్యానికి హానికరమే కాక, దేశ ఆర్థిక వ్యవస్థను, సంక్షేమాన్ని కూడా దెబ్బతీస్తాయి. ఈ నేపథ్యంలో మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాల నిరోధక చట్టం (2019) మేరకు దఖలు పడిన అధికారాలతో ఆర్.పి.ఎఫ్. పలు చర్యలు తీసుకుంది. -ఆపరేషన్ నార్కోస్- కార్యక్రమం పేరిట ఈ చర్యలు తీసుకున్నారు. 2022 జనవరి నెలలో రైళ్ల ద్వారా అక్రమంగా రవాణా అవుతున్న సుమారు రూ. 4.57కోట్ల మేర విలువైన మాదక ద్రవ్యాలను, మత్తు పదార్థాలను ఆర్.పి.ఎఫ్. సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. మాదక ద్రవ్యాలను అక్రమ రవాణా చేస్తున్న ఆరోపణలపై 87 మందిని నిర్బంధంలోకి తీసుకున్నారు.

   పన్ను ఎగవేతదార్లు, చట్టాన్ని ఉల్లంఘించే వారు, ఆక్రమ రవాణాదార్లు తమ అక్రమాలకు రైళ్లను ఎక్కువగా వాడుకుంటున్నారు. వారి పన్నాగాలను అరికట్టేందుకు –ఆపరేషన్ సతర్క్- పేరిట ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ఆర్.పి.ఎఫ్. ప్రారంభించింది. పొగాకు ఉత్పత్తులను, లెక్కల్లోకి రాని నగదును, అక్రమ మద్యాన్ని, స్మగుల్డ్ విదేశీ సరకులను, ఇతర విలువైన వస్తువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అక్రమంగా రవాణా అవుతున్న రూ. 19లక్షల విలువైన పొగాకు ఉత్పత్తులను, రూ. 19కోట్ల విలువైన అక్రమ మద్యాన్ని, 4.90కోట్ల విలువైన బంగారాన్ని, రూ. 11లక్షల విలువైన వెండిని, రూ. 2.18 లక్షల విలువైన ఇతర స్మగుల్డ్ విదేశీ వస్తువులను, లెక్కల్లోకి రాని 2.50కోట్ల నగదును ఆర్.పి.ఎఫ్. స్వాధీనం చేసుకుంది. ఇందుకు సంబంధించి 119మందిని అరెస్ట్ చేసింది. స్వాధీనం చేసుకున్న అక్రమ రవాణా సరకులను, నిందితులను సంబంధిత పోలీసులకు, సిబ్బందికి అప్పగించారు.

   వన్యప్రాణులను, వన్యప్రాణుల అవయవాలను, అటవీ ఉత్పత్తులను రవాణా చేయడం చట్టప్రకారం నేరం. ప్రకృతిలోని సహజ వనరులపట్ల ఇది అన్యాయం. సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం.  రైళ్ల ద్వారా జరిగే వన్యజీవుల అక్రమ రవాణాతో ప్రమేయం ఉన్నవారిపై –ఆపరేషన్ విలెప్- పేరిట ఆర్.పి.ఎఫ్. కఠిన చర్యలు తీసుకుంది. 2022 జనవరి నెలకు సంబంధించి 11 కేసుల్లో ఇద్దరిని అరెస్ట్ చేసింది. వారినుంచి స్వాధీనం చేసుకున్న అరుదైన జాతికి చెందిన తాబేళ్లను, వన్యప్రాంతపు పక్షులను, అంతరిస్తున్న జాతికి చెందిన రాబందులను అటవీ శాఖకు  అప్పగించారు.

  వివిధ రాష్ట్రాల పోలీసు సిబ్బంది, సంబంధిత చట్ట నిర్వహణా సిబ్బందికి పరిధిలో జరిగే నేరాలను పసిగట్టడంలో ఆర్.పి.ఎఫ్. కాపలాదారులా పనిచేస్తూ వస్తోంది. –రైల్ ప్రహరీ- పేరిట ఆర్.పి.ఎఫ్. ఈ కార్యకలాపాలను నిర్వహిస్తోంది. 2022 జనవరి నెలలో ఇలాంటి 7 కేసుల్లో ఆయా రాష్ట్రాల స్థానిక పోలీసులకు సహాయ పడింది. హత్య, మానభంగం, దోపిడీ, దారిదోపిడీ, కిడ్నాప్ వంటి తీవ్రమైన నేరాలకు సంబంధించి స్థానిక పోలీసులకు ఆర్.పి.ఎఫ్. ఈ సేవలను అందించింది.    

   తీవ్ర నిరాశా నిస్పృహలతో కుంగిపోతున్న 80మంది పురుషులకు, 153మంది మహిళలకు –ఆపరేషన్ డిగ్నిటీ- కార్యక్రమం కింద ఆర్.పి.ఎఫ్. తక్షణ రక్షణను కల్పించింది. అలాంటి వారిని వారి సొంత కుటుంబ సభ్యులకు లేదా ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థలకు అప్పగించారు. రైళ్లలో ప్రయాణిస్తున్న 1,000 మందికి పైగా వయోవృద్ధులకు, అస్వస్థులకు, దివ్యాంగులకు ఆర్.పి.ఎఫ్. సిబ్బంది సేవలందించింది. –ఆపరేషన్ సేవా- కార్యక్రమం కింద ఆర్.పి.ఎఫ్. ఈ సేవలు అందించింది. అవసరమైన మందులు, పసిపిల్లలకు ఆహారం, వికలాంగులకు చక్రాల కుర్చీలు, స్ట్రెచర్లు, వైద్యసహాయం అందించింది.

  రైలు ప్రయాణకుల, రైల్వే ఆస్తుల రక్షణలో -యూనిఫామ్ దుస్తుల్లో ఉన్న పౌరులు-గా ఆర్.పి.ఎఫ్. సిబ్బంది ఎప్పటిలా తమ విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తిస్తూనే ఉంటుంది. దేశ సేవలో, పౌరులకు అవసరమైన సేవలందించడంలో ఆర్.పి.ఎఫ్. ఎంతో సమర్థంగా తన విధులను కొనసాగిస్తూ వస్తోంది.

 

***



(Release ID: 1799193) Visitor Counter : 211