ఆయుష్

గౌహతిలోని కేంద్ర ఆయుర్వేద పరిశోధనా సంస్థ ( కారి) , రాష్ట్ర ఆయుర్వేద కళాశాలల్లో మూడు భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్

Posted On: 12 FEB 2022 6:39PM by PIB Hyderabad

గౌహతిలోని కేంద్ర ఆయుర్వేద పరిశోధనా సంస్థ లో 20 కోట్ల రూపాయల ఖర్చుతో కొత్తగా మూడు భవనాలను నిర్మించనున్నారు. తొలిసారిగా ఏర్పాటు చేయనున్న ఫార్మకాలజీ మరియు  కెమిస్ట్రీ ల్యాబ్ కోసం  ఈ భవనాలను నిర్మిస్తారు. ఈశాన్య ప్రాంత రాష్ట్రంలో గౌహతిలో పనిచేస్తున్న రాష్ట్ర ఆయుర్వేద ఫార్మసీ స్థాయిని కూడా అప్‌గ్రేడ్ చేస్తారు. 

బోర్సజై లోని కేంద్ర ఆయుర్వేద పరిశోధనా సంస్థ పంచకర్మ బ్లాకును నెలకొల్పేందుకు నిర్మించనున్న భవనానికి కేంద్ర ఆయుష్, రేవులు, షిప్పింగ్, జలమార్గాల శాఖ మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ ఈ రోజు శంకుస్థాపన చేశారు. జలుక్‌బరి గువాహటిలోని రాష్ట్ర ఆయుర్వేద కళాశాలలో పంచకర్మ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నిర్మాణానికి కూడా మంత్రి  శంకుస్థాపన చేశారు.  వీటి నిర్మాణానికి 20 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా. 

 ఈ కార్యక్రమానికి అస్సాం  ఆరోగ్య  కుటుంబ సంక్షేమం మరియు ఐటీ శాఖ మంత్రి కేశబ్ మహంత , గౌహతి లోక్‌సభ పార్లమెంటు సభ్యుడు క్వీన్ ఓజా కూడా హాజరయ్యారు.

రాష్ట్ర ఆయుర్వేద కళాశాలలో పంచకర్మ  ఎక్సలెన్స్ కేంద్రం ఏర్పాటు చేయబడుతుంది.  రాష్ట్ర ఆయుర్వేద ఫార్మసీ కూడా ఆయుష్ మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న  ఆయుర్ స్వస్థ  యోజన కింద అప్‌గ్రేడ్ చేయబడుతుంది. పంచకర్మ బ్లాక్ జి జి +2 భవనం మరియు ఫార్మకాలజీ  కెమిస్ట్రీ లేబొరేటరీస్ జి +3 భవనాలను నిర్మించడం జరుగుతుంది.  దీనికి 10 కోట్ల రూపాయలు ఖర్చవుతాయని అంచనా వేశారు. 

నూతనంగా ఏర్పాటయ్యే పంచకర్మ కేంద్రంలో పంచకర్మ చికిత్సలో ప్రపంచ స్థాయి ప్రమాణాల మేరకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ తరగతులు నిర్వహిస్తారు. కేంద్ర  ఫార్మకాలజీ కెమిస్ట్రీ భవనం ప్రీ-క్లినికల్ ప్రయోగాత్మక విధానాలుఔషధాల ప్రమాణీకరణ మూలికల రసాయన పరీక్షజంతు సంబంధిత టాక్సికాలజీ నివేదిక మొదలైన అంశాలతో ఆధునిక సౌకర్యాలతోఆయుర్వేద పరిశోధనా సంస్థ లో కేంద్రాన్ని నెలకొల్పుతారు.  ఈ రకమైన సౌకర్యం ఈశాన్య ప్రాంతంలో తొలిసారిగా అందుబాటులోకి వస్తుంది. 

ఈ సందర్భంగా ఏర్పాటైన సమావేశంలో మాట్లాడిన శ్రీ సర్బానంద సోనోవాల్ ఆయుర్వేదం మానసిక ప్రశాంతతను అందించి శరీరాన్ని దృఢంగా ఉంచుతుందని అన్నారు. భూమాత అనేక గుణాలు కలిగిన వృక్ష సంపదను అందించిందని అన్నారు. అస్సాంలో లభిస్తున్న ఈ సంపదను వినియోగంలోకి తేవడం  ద్వారా అస్సాంలో పాటు ఈశాన్య ప్రాంత రాష్ట్రాలు ఆయుర్వేద రంగంలో అభివృద్ధి సాధిస్తాయని మంత్రి పేర్కొన్నారు. ప్రకృతి ప్రసాదించిన  సంపదను వినియోగంలోకి తెచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయని అన్నారు. ఈ ప్రయత్నాలతో ఈ ప్రాంత ప్రజల ఆరోగ్య స్థితిగతులు మెరుగు పడతాయని శ్రీ సర్బానంద సోనోవాల్ అన్నారు. ప్రపంచ స్థాయి గుర్తింపు, ఆదరణ పొందిన పంచకర్మ విధానాలను మరింత సమర్థంగా అమలు చేసేందుకు అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు. దీనివల్ల భారత పురాతన సంప్రదాయ వైద్య విధానాలకు మరింత ప్రచారం కలుగుతుందని అన్నారు. ఇతర సౌకర్యాలను అభివృద్ధి చేయడం వల్ల ఆయుర్వేద సామర్థ్యాన్ని సాక్ష్యాధారాలతో రుజువు చేసి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సహకరిస్తాయని మంత్రి అన్నారు. భారతదేశంలో మాత్రమే అందుబాటులో ఉన్న ఆయుర్వేద వైద్య విధానానికి ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చేసి మానవాళికి సేవ చేయడానికి వినియోగించాలని శ్రీ సర్బానంద సోనోవాల్ అన్నారు.

***



(Release ID: 1797979) Visitor Counter : 120