ఉప రాష్ట్రప‌తి స‌చివాల‌యం

భారతీయ సంస్కృతి, హిందు ధర్మాన్ని కాపాడుకోవాలి – ఉపరాష్ట్రపతి పిలుపు


• సాధారణ భక్తులకు దర్శనం కల్పించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానాలు చేస్తున్న కృషి అభినందనీయం

• ప్రముఖులు ఏడాదికి ఒక్కమారే శ్రీవారి దర్శనానికి రావడం వల్ల సామాన్య భక్తులకు సౌకర్యవంతంగా ఉంటుంది

• కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్న ఉపరాష్ట్రపతి

• ప్రోటోకాల్ ప్రకారం మహాద్వారం నుంచి దర్శనానికి అవకాశం ఉన్నా, మామూలు భక్తునిలా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి వెళ్ళి స్వామిని దర్శించుకున్న ఉపరాష్ట్రపతి

Posted On: 10 FEB 2022 12:36PM by PIB Hyderabad

భారతీయ సంస్కృతి – సంప్రదాయాలను, హిందూ ధర్మాన్ని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. కుమార్తె శ్రీమతి దీపావెంకట్ గారి కూతురు కుమారి సుష్మ వివాహ మహోత్సవం కోసం ఉపరాష్ట్రపతి తిరుమల చేరుకుని సతీమణి శ్రీమతి ఉషమ్మ, కుమారుడు శ్రీ హర్షవర్ధన్, కోడలు శ్రీమతి రాధమ్మ సహా ఇతర కుటుంబ సభ్యులతో కలిసి గురువారం ఉదయం తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. ప్రోటోకాల్ ప్రకారం మహాద్వారం నుంచి దర్శనం చేసుకునే అవకాశం ఉన్నా, మామూలు భక్తునిలా వైకుంఠ ద్వారం నుంచి దర్శనం చేసుకున్నారు.

సాధారణ భక్తులకు దర్శనాన్ని కల్పించేందుకు తిరుమల – తిరుపతి దేవస్థానం చేస్తున్న కృషిని ఈ సందర్భంగా అభినందించిన ఉపరాష్ట్రపతి, ఈ విషయంలో ప్రముఖులుసైతం సహకారం అందించాలని సూచించారు. ప్రముఖులు, ప్రజా ప్రతినిధులు ఏడాదికి ఒక్కసారే దర్శనానికి రావాలని, సామాన్య భక్తులకు అవకాశం కల్పించాలని సూచించారు. 

తిరుమల శ్రీనివాసుని దర్శించుకోవడం ద్వారా సంతోషం, సంతృప్తి లభిస్తుందన్న ఉపరాష్ట్రపతి దాని ద్వారా ప్రజలకు మరింత సేవ చేసేందుకు స్ఫూర్తి కలుగుతుందన్నారు. ఆధ్యాత్మికత అంటే సేవామార్గమన్న ఆయన, అందరం దీన్ని గుర్తించి ఆచరించాలని సూచించారు. ఆలయ దర్శనమంటే భగవంతుడు చూపిన బాటలో ముందుకు నడవడమేనని, సాటి వారికి చేసే సేవలో నిజమైన భగవద్దర్శనం సాధ్యమౌతుందని తెలిపారు.

 

***



(Release ID: 1797305) Visitor Counter : 166