వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కేంద్ర ప్రభుత్వ ఒక జిల్లా ఒక ఉత్పత్తి పథకం అమలు
యూఏవీ/ డ్రోన్ ద్వారా మేఘాలయలోని పశ్చిమ జైంతియా హిల్స్‌లో ఉత్పత్తి అయిన లకడాంగ్ పసుపు రవాణా చేసేందుకు సన్నాహాలు
దేశంలో రవాణా సమస్యల పరిష్కారానికి ఉపకరించనున్న ప్రయోగం
7 నుంచి 9% వరకు కర్క్యుమిన్ కలిగే ఉండే లకడాంగ్ పసుపు తో రూపు మారనున్న పశ్చిమ జైంతియా హిల్స్ ఆర్థిక వ్యవస్థ
Posted On:
05 FEB 2022 2:55PM by PIB Hyderabad
సరకు రవాణా రంగంలో నూతన అధ్యాయానికి మేఘాలయలోని పశ్చిమ జైంతియా హిల్స్ జిల్లా నాంది పలికింది. ఈ రోజు మేఘాలయలోని పశ్చిమ జైంతియా హిల్స్‌లో ఉత్పత్తి అయిన లకడాంగ్ పసుపు వినూత్నంగా ఇదివరకు ఎన్నడూ జరగని విధంగా యూఏవీ/ డ్రోన్ ద్వారా రవాణా అయ్యింది. యూఏవీ/డ్రోన్ వినియోగం విజయవంతం కావడంతో లకడాంగ్ రైతులు తాము ఉత్పత్తి చేస్తున్న పసుపును ప్రధాన భూభాగానికి సులువుగా రవాణా చేసేందుకు మార్గం సుగమం అయింది.
పశ్చిమ జైంతియా హిల్స్‌లో ఉత్పత్తి అవుతున్న పసుపు ఎగుమతులు ఎక్కువ చేసేందుకు అవకాశం ఉందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖకు చెందిన పరిశ్రమ, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక శాఖ గుర్తించింది. లకడాంగ్ పసుపు ప్రాధాన్యత గుర్తించిన శాఖ దీనిని 'ఒక జిల్లా ఒక ఉత్పత్తి' (ఓడిఒపి) గా గుర్తించింది.
రవాణా సౌకర్యాలను మెరుగుపరిచి పశ్చిమ జైంతియా హిల్స్‌లో ఉత్పత్తి అవుతున్న పసుపు ఎక్కువ పరిమాణంలో రవాణా చేసేందుకు AGNLi మిషన్ తో ఓడిఒపి ఒప్పందం కుదుర్చుకుంది. శాస్త్ర సాంకేతిక ఆవిష్కరణల రంగంలో ఏర్పాటైన ప్రధానమంత్రి సలహా మండలి అమలుచేస్తున్న తొమ్మిది సాంకేతిక మిషన్లలో AGNLi మిషన్ ఒకటి. ఓడిఒపితో కుదిరిన ఒప్పందంలో భాగంగా పసుపు రవాణా కోసం డ్రోన్ (యూఏవీ)లను సమకూర్చేందుకు AGNLi అంగీకరించింది.
డ్రోన్ ద్వారా పసుపు రవాణాను ప్రారంభించిన సందర్భంగా ఏర్పాటైన సమావేశంలో ప్రసంగించిన పరిశ్రమ, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక శాఖ అదనపు కార్యదర్శి శ్రీమతి సుమితా దావ్రా ఈ చర్య పారిశ్రామిక విప్లవం 4.0కి నాంది పలికిందని అన్నారు. రవాణా సమస్యల పరిష్కారం కోసం జరుగుతున్న ప్రయత్నాల్లో ఇది ఒక మైలు రాయిగా నిలుస్తుందని అన్నారు.
మేఘాలయలోని పశ్చిమ జైంతియా హిల్స్‌లో ఉత్పత్తి అవుతున్న పసుపు 7-9% అత్యధిక కర్కుమిన్ కలిగి ఉంటుంది. ఇతర రకాల్లో కర్కుమిన్ 3% లేదా అంతకంటే తక్కువ ఉంటుంది. ప్రపంచంలో ఉత్పత్తి అవుతున్న అత్యుత్తమ పసుపు పశ్చిమ జైంతియా హిల్స్ ఆర్ధిక వ్యవస్థ రూపురేఖలను మార్చే అవకాశం ఉంది. మేఘాలయ రాష్ట్రం లకడాంగ్ పసుపుకు భౌగోళిక సూచిక ట్యాగ్ పొందేందుకు కృషి చేస్తోంది. పసుపులో ఉండే జిగట,కర్కుమిన్ నాణ్యత అంశంలో కీలకంగా ఉంటాయి. జిగట,కర్కుమిన్ శాతం ఎక్కువగా ఉండే పసుపుకు ఎక్కువ గిరాకీతో పాటు అధిక ధర లభిస్తుంది. భారతదేశం నుంచి ఇతర దేశాలకు పసుపు ఎక్కువగా ఎగుమతి అవుతుంది. ప్రపంచంలో భారతదేశంలోనే పసుపు ఎక్కువగా ఉత్పత్తి అవుతోంది. 2018లో అమెరికాకు 236.5 మిలియన్ అమెరికా డాలర్ల విలువ చేసే పసుపును భారతదేశం ఎగుమతి చేసింది. 2017లో ఎగుమతుల విలువ 182.53 మిలియన్ అమెరికా డాలర్లుగా ఉంది. నీరు ఎక్కువగా అవసరం లేని పసుపు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
పసుపు ఉత్పత్తి, ఎగుమతుల్లో భారతదేశం అగ్రస్థానంలో ఉన్నప్పటికీ పసుపు దిగుమతులు కూడా జరుగుతున్నాయని పరిశ్రమ, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక శాఖ అదనపు కార్యదర్శి శ్రీమతి సుమితా దావ్రా వివరించారు. జిగట,కర్కుమిన్ శాతం ఎక్కువగా ఉండే పసుపును వెలికితీత మరియు ప్రాసెసింగ్ పరిశ్రమలు ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్నాయని తెలిపారు.
జిగట,కర్కుమిన్ శాతం ఎక్కువగా ఉండే లకడాంగ్ పసుపుకు స్వదేశీ విదేశీ మార్కెట్లలో డిమాండ్ ఉంది. అయితే, మారుమూల ప్రాంతంలో ఉన్న మేఘాలయలోని పశ్చిమ జైంతియా హిల్స్‌లో ఉత్పత్తి అవుతున్నలకడాంగ్ పసుపు రవాణా అంశంలో సమస్యలు ఎదురవుతున్నాయి. మారుమూల ప్రాంతం కావడంతో రవాణా సౌకర్యాలు అందుబాటులో లేవు. దీనితో కొనుగోలు దారులు గ్రామాల నుంచి చిన్న వాహనాల్లో ప్రధాన మార్కెట్ ప్రాంతాలకు సరుకును రవాణా చేయాల్సి వస్తోంది. దీనితో రవాణా ఖర్చులు పెరుగుతున్నాయి. రవాణాలో జాప్యం కూడా జరుగుతోంది. దీనితో ఈ ప్రాంతంలో పసుపు కొనుగోలు చేసేందుకు కొండలు దారులు సందేహిస్తున్నారు. సమస్య పరిష్కారానికి యూఏవీ/డ్రోన్ రవాణా సహకరిస్తుంది.
యూఏవీ/డ్రోన్ వినియోగం ఓడిఒపి మరింత సమర్ధంగా అమలు జరిగేందుకు సహకరిస్తుంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రవాణా సమస్యలను పరిష్కరించడానికి అవకాశం కల్పిస్తుంది. రవాణా సమస్య పరిస్కారం కావడంతో మేఘాలయాలో ఉత్పత్తి అవుతున్న అరుదైన పసుపు ఎగుమతులు పెరుగుతాయని శ్రీమతి సుమితా దావ్రా వివరించారు.
గత ఏడాది ఏప్రిల్ లో కుదిరిన అవగాహన ప్రకారం ఓడిఒపి బృందం 13,136 కేజీల పసుపు ముక్కలు, ఎండబెట్టిన పసుపును కేరళలోని ఎర్నాకులం కేంద్రంగా పనిచేస్తున్న ప్రాసెస్సింగ్ పరిశ్రమకు లకడాంగ్ పసుపు రవాణా చేసింది. ఓడిఒపి కింద లకడాంగ్ పసుపు ధర కేజీకి 20 రూపాయల వరకు పెరిగింది. 2021 లో 150 రూపాయలుగా ఉన్న కేజీ పసుపు ధర 2022 లో 170 రూపాయలకు పెరిగింది.
ఓడిఒపి కింద అమలు జరుగుతున్న కార్యక్రమాలు జిల్లాలో ఆర్థిక కార్యకలాపాలను ఎక్కువ చేశాయి. పండిన పంటను పూర్తిగా ఎక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. దీంతో స్థానికులకు ఆర్థిక సాధికారత కలుగుతోంది. ఓడిఒపి సాధించిన విజయం పట్ల హర్షం వ్యక్తం చేసిన శ్రీమతి సుమితా దావ్రా జిల్లాలో నాలుగు గ్రామాలకు చెందిన స్వయం సహాయక బృందాలు, సహకార సంఘాల సభ్యులుగా ఉన్న 500 మందికి పైగా రైతులు పండిస్తున్న పంటకు మార్కెట్ సౌకర్యం కలిగిందని పేర్కొన్నారు.
2022 పంట కాలంలో పసుపు సేకరణ మరింత ఎక్కువ చేస్తుందుకు చర్యలు తీసుకుంటామని శ్రీమతి సుమితా దావ్రా తెలిపారు. 2021 డిసెంబర్ నెలలో కొనుగోలుదారులు గ్రామాలకు వచ్చి రైతులతో సంప్రదింపులు జరిపారని అన్నారు. ఇంతవరకు 25,000 కేజీల పసుపు కొనుగోలు ఒప్పందాలు జరిగాయని అన్నారు. దీనిని మరింత పెంచే అవకాశాలను పరిశీలిస్తున్నామని అన్నారు.
ప్రపంచంలోని పసుపులో 78 శాతం భారతదేశం ఉత్పత్తి చేస్తుంది. 2018-19 సంవత్సరంలో 246 వేల హెక్టార్ల భూమిలో ఉత్పత్తి 389 వేల టన్నుల పసుపు దేశంలో ఉత్పత్తి అయ్యింది. హెక్టర్ భూమిలో సరాసరిన 5646.34 పసుపు ఉత్పత్తి అవుతున్నదని కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ వెల్లడించారు.
***
(Release ID: 1795805)
Visitor Counter : 253