జల శక్తి మంత్రిత్వ శాఖ
కర్ణాటకలో స్వచ్ఛభారత్ మిషన్ విజయగాధ
ఉడుపి జిల్లాలోని 41 పంచాయతీలకు
వ్యర్థాల నిర్వహణా సేవలు!
Posted On:
02 FEB 2022 4:32PM by PIB Hyderabad
పరిశుద్ధ భారతావని లక్ష్యంగా భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛభారత్ పథకం అమలులో ఇది మరో విజయగాధ. కర్ణాటక రాష్ట్రం, ఉడుపి జిల్లా,.. కారకాల తాలూకాలోని నిట్టె గ్రామంలో సాధించిన విజయం. రీసైక్లింగ్ చేయాల్సిన పొడి వ్యర్థ పదార్థాల సేకరణలో నిట్టీ పంచాయతీ పరిధిలోని మెటీరియల్ రికవకరీ కేంద్రం (ఎం.ఆర్.ఎఫ్.),.. ఎంతో సమర్థంగా పనిచేసింది. 2021 ఆగస్టు ఒకటవ తేదీన పనులు ప్రారంభించిన ఈ కేంద్రం,.. కారకాల, ఉడుపి, కవుప్, హెబ్రి బ్లాకుల పరిధిలో ఉన్న 41 గ్రామ పంచాయతీలకు సంబంధించిన వ్యర్థాల తొలగింపు ప్రాజెక్టు పనులను ఎంతో సమర్థంగా నిర్వహించింది.
ఉడుపి జిల్లా పంచాయత్ పర్యవేక్షణలో ఈ ప్రక్రియను నిర్వహించారు. వ్యర్థాల నిర్వహణా సేవలందించే సాహస్ జీరో వేస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ,.. ఈ ప్రాజెక్టు అమలుకు సాంకేతిక మార్గదర్శకత్వం వహించింది. మంగళూరుకు చెందిన మంగళా రిసోర్స్ మేనేజిమెంట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఆధ్వర్యంలో ఎం.ఆర్.ఎఫ్. తన పనులు నిర్వహించింది.
ప్రాజెక్టు లక్ష్యాలు:
- పరిమితమైన మానవ వనరుల వినియోగించి వ్యర్థాల తొలగింపునకు కేంద్రీకృత సేవలందించడం
- వ్యర్థ పదార్థాలనుంచి గరిష్టస్థాయిలో వనరులను గ్రహించడం. పర్యావరణానికి హానికరం కాని రీతిలో వ్యవహరిస్తూ, అశాస్త్రీయ పద్ధతులను నివారించడం.
- సరళమైన యంత్రపరికరాల వినియోగం ద్వారా మానవ వనరుల సామర్థ్యాన్ని పెంచడం.
- రీసైక్లింగ్.కు వీలుకాని మల్టీ లేయర్ ప్లాస్టిక్కులు వంటి వ్యర్థాలను సిమెంట్ ఫ్యాక్టరీలకు విక్రయించడం.
- వ్యర్థాలను అధీకృత రీసైక్లింగ్ కేంద్రాలకు మాత్రమే విక్రయించడం.
- ఈ ప్రాజెక్టులో పనిచేసే కార్మికుల సామాజిక భద్రత, ఆరోగ్యం, భద్రత కోసం తగినన్ని సదుపాయాలు కల్పించడం.
- వ్యర్థాల నిర్వహణకు సంబంధించిన రికార్డులను సక్రమంగా నిర్వహించడం.
నిర్వహణా ప్రక్రియ: ప్రాజెక్టు అమలుచేసే ప్రాంతం పరిధిలో ఇళ్ల ముంగిటినుంచి సేకరించిన వ్యర్థాలను నేరుగా ఘనవ్యర్ధాల నిర్వహణ (ఎస్.డబ్ల్యు.ఎం.) కేంద్రాలకు తీసుకవస్తారు. ఇక్కడ వ్యర్థాలను బరువు తూచి, ప్యాక్ చేసి ప్రతివారం వాహనంలో నింపి ఎం.ఆర్.ఎఫ్ కేంద్రానికి పంపిస్తారు. కేంద్రానికి చేరుకున్న తర్వాత సదరు వ్యర్థాలను మరోసారి బరువు సరిచూసి గిడ్డంగుల్లో ఏర్పాటు చేసిన అరల్లో నిల్వచేస్తారు.
ఆ తర్వాత సదరు వ్యర్థాలను కన్వేయర్ బెల్ట్ సాయంతో 25నుంచి 30 విభాగాలుగా విభజిస్తారు. ఇలా వర్గీకరించిన వ్యర్థాలను బెయిలింగ్ యంత్రాల ద్వారా ఒత్తిడితో అణచివేసి బ్లాకులుగా తయారు చేస్తారు. ఇలాంటి వ్యర్థాలను అధీకృత రీసైక్లింగ్ కంపెనీలకు విక్రయిస్తారు. ఇక రీసైక్లింగ్ ప్రక్రియకు వీలుగాని వ్యర్థాలను కో-ప్రాసెసింగ్ కోసం సిమెంట్ ఫ్యాక్టరీలకు రవాణా చేస్తారు.
ఎం.ఆర్.ఎఫ్. కేంద్ర సామర్థ్యం: ఈ పనులు నిర్వహించే ఎం.ఆర్.ఎఫ్. యూనిట్.కు 1,000 చదరపు అడుగుల విస్తీర్ణంతో కూడిన భవనం ఉంది. రోజుకు పది టన్నుల వ్యర్థాల సమస్యను పరిష్కరించే సామర్థ్యం ఈ యూనిట్.కు ఉంది. వ్యర్థాల నిల్వకు, వర్గీకరణకు, బెయిలింగ్ విభాగాలకు అవసరమైన స్థలం కూడా ఈ యూనిట్.కు అందుబాటులో ఉంది. దీనికి తోడుగా, కార్యాలయం, సెక్యూరిటీ గది, విశ్రాంతి గది, మరుగుదొడ్డి సౌకర్యం కూడా ఉంది. ఇంకా, కన్వేయర్ బెల్టు, బెయిలింగ్ మెషీన్, స్టేకర్, అగ్నిమాపక సదుపాయం, ఒక జనరేటర్, సి.సి.టి.వి., 70 టన్నుల సామర్థ్యంతో వాహనాల బరువును తూచే బ్రిడ్జి, 7 టన్నుల సామర్థ్యం కలిగిన ఒక ట్రక్కు ఈ రికవరీ కేంద్రం పరిధిలో ఉన్నాయి.
సేవా రుసుములు (సర్వీస్ చార్జీలు): ఈ రికవరీ యూనిట్ కోసం ప్రత్యేకంగా ఒక బ్యాంక్ ఖాతాను నిట్టే గ్రామ పంచాయతీ నిర్వహిస్తూవస్తోంది. వ్యర్థాల నిర్వహణకోసం తాము చెల్లించాల్సిన సర్వీసు చార్జీలను వివిధ గ్రామ పంచాయతీలు ఈ ఖాతాకు జమచేయాల్సి ఉంటుంది; ఈ ఖాతాకు సంబంధించి సంతకం చేసే అధికారం చైర్మన్ లేదా, సభ్య కార్యదర్శికి ఉంటుంది. ప్రతి నెలా ఐదవ తేదీలోగా ఎం.ఆర్.ఎఫ్. నిర్వాహకులు తన ఇన్వాయిస్ బిల్లును వివిధ గ్రామ పంచాయతీల ఉమ్మడికి కమిటీకి సమర్పిస్తారు. ఈ బిల్లుల ఆధారంగా గ్రామ పంచాయతీలు తాము చెల్లించాల్సిన సర్వీసు చార్జీల మొత్తాన్ని జాయింట్ కమిటీకి చెందిన బ్యాంకు ఖాతాకు జమచేయాల్సి ఉంటుంది. తమకు ఇన్వాయిస్ బిల్లు అందిన వారం రోజుల్లోగా సర్వీసు చార్జీని బ్యాంకు ఖాతాకు జమచేయాల్సి ఉంటుంది.
గ్రామ పంచాయతీల పాత్ర:
- వ్యర్థాలను వివిధ భాగాలుగా విభజించడం, సేకరించడం తదితర ప్రక్రియలపై సమాచారాన్ని,. ఇళ్ల యజమానులకు, వాణిజ్య సంస్థల యజమానులకు, వ్యర్థాలకు కారకులయ్యే ఇతరులకు గ్రామ పంచాయతీలే తమ సొంత ఖర్చుతో తెలియజేయాల్సి ఉంటుంది.
- ఇళ్లనుంచి వచ్చే తడి వ్యర్థాల, హానికరమైన వ్యర్థాల నిర్వహణ గ్రామ పంచాయతీ స్థాయిలోనే జరగాల్సి ఉంటుంది.
- తమ తమ పరిధుల్లో సేకరించిన వ్యర్థాలను విభజించడం. వ్యర్థాలు దుర్వాస రాకుండా నివారించేందుకు వాటిని పొడి కేంద్రాల్లో నిల్వచేయడం, అనంతరం ఎం.ఆర్.ఎఫ్. వాహనంలోకి బట్వాడా చేయడం.
- గ్రామ పంచాయతీ స్థాయిలో సేకరించిన వ్యర్థాలను సంచుల్లో నింపేయాలి.
- వ్యర్థాలను డంప్ చేయకుండా నివారించేందుకు సత్వర రవాణాకు ఒక వాహనాన్ని అందుబాటులో ఉంచాలి.
- పెద్ద పరిణామాణంలోని వ్యర్థాలను ఎం.ఆర్.ఎఫ్. యూనిట్ సేకరించాల్సిన అవసరం ఉందని గ్రామ పంచాయతీ గనుక భావించిన పక్షంలో, ఆ విషయాన్ని రెండురోజులు ముందుగా ఎం.ఆర్.ఎఫ్. యూనిట్ నిర్వాహకులకు తెలియజేయాల్సి ఉంటుంది.
- ఎం.ఆర్.ఎఫ్. నిర్వాహకులకు సకాలంలో సర్వీసు చార్జీని చెల్లించాల్సి ఉంటుంది. సేకరించే వ్యర్థాలు ఊహించిన దానికంటే తక్కువ పరిమాణంలో ఉన్న పక్షంలో సర్వీసు చార్జీలో 50శాతాన్ని చెల్లించాల్సి ఉంటుంది.
నిధుల సాయం: గ్రామీణ ప్రాంతాలకు ఉద్దేశించిన స్వచ్ఛ భారత్ పథకం పరిధిలో ఈ ప్రాజెక్టుకోసం రూ. 2కోట్ల 50 లక్షలను వినియోగించారు; అంటే,.. గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రూ. 8.32లక్షలను, 15 ఆర్థిక సంఘం పథకం కింద రూ. 28.35లక్షలను గ్రామ వికాస్ నిధి కింద రూ. 10లక్షలను, నిట్టే పంచాయతీ సొంత నిధి కింద రూ. 23 లక్షలను ఈ ప్రాజెక్టుకోసం వినియోగించారు.
ఫలితం, ప్రభావం:
- ఎం.ఆర్.ఎఫ్. యూనిట్ ఏర్పాటైన తర్వాత వ్యర్థాల సేకరణ పరిమాణం 1-2 టన్నులనుంచి 4-5టన్నులకు పెరిగింది.
- చెత్తను గుట్టలుగా పోగుచేయడం, ఎక్కడబడితే అక్కడ చెత్త వేయడం బాగా తగ్గిపోయింది.
- ఎం.ఆర్.ఎఫ్. యూనిట్ పనులు మొదలైన తర్వాత ఒక రెవెన్యూ తటస్థ నమూనాగా ఈ ప్రాజెక్టు మారిపోయింది.
- చెత్త నిర్వహణను శాస్త్రీయంగా నిర్వహించడం, వివిధ రకాల వ్యర్థాలను తొలగించడం.. తదితర అంశాలపై ప్రజలకు అవగాహన పెరిగింది.
- వ్యర్థాలను ఎం.ఆర్.ఎఫ్. కేంద్రం మరింత ఎక్కువ ధరకు అధీకృత రీసైక్లింగ్ ఏజెంట్లకు అమ్మేందుకు అవకాశం ఏర్పడింది.
- వ్యర్థాలను ఒత్తిడితో అణచిపెట్టి బ్లాకులుగా తయారు చేసే బెయిలింగ్ వ్యవస్థకారణంగా ఎక్కువ పరిమాణంలో చెత్తను విక్రయించేందుకు వీలు కలిగింది.
- రీసైక్లింగ్.కు వీలుగాని వ్యర్థాలను కో-ప్రాసెసింగ్ కోసం సిమెంట్ ఫ్యాక్టరీలకు రవాణా చేసేందుకు అవకాశం ఏర్పడింది.
ప్రాజెక్టును విస్తృతం చేసే ప్రణాళిక: ఈ ప్రాజెక్టును మరింత విస్తృతం చేసేందుకు ప్రణాళికలు రూపొందించారు. బుడగబెట్టు, కేడూరు, త్రాసి, హెబ్రి ప్రాంతాల్లో 4 ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణా కేంద్రాలను (పి.డబ్ల్యు.ఎం.యు.లను) ఏర్పాటుకోసం అవసరమైన ప్రణాళికలను ఇప్పటికే రూపొందించారు. మిగిలిన 144 గ్రామ పంచాయతీల్లో వ్యర్థాల నిర్వహణ చేపట్టేందుకు వీలుగా ఈ కొత్త కేంద్రాలను ఏర్పాటు చేయబోతున్నారు.
***
(Release ID: 1794935)
Visitor Counter : 113