వ్యవసాయ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

గణనీయంగా పెరిగిన వేసవి పంటల విస్తీర్ణం!


వేసవి పంటల 4వ జాతీయ సదస్సులో
కేంద్ర వ్యవసాయ మంత్రి తోమర్ ప్రకటన...

గత మూడేళ్లలో ప్రభుత్వం తీసుకున్న చర్యలే
ఇందుకు కారణమని స్పష్టీకరణ..

29.71 లక్షల హెక్టార్లనుంచి 80.46లక్షల హెక్టార్లకు
వేసవి పంటల విస్తీర్ణం పెరిగిందని వెల్లడి..

ఐ.సి.ఎ.ఆర్. రూపొందించిన కొత్త వంగడాలపై
దృష్టిని కేంద్రీకరించాలని రాష్ట్రాలకు సూచన...

సేంద్రియ సాగును, సహజ వ్యవసాయాన్ని
కేంద్రం, రాష్ట్రాలు ప్రోత్సహించాలి:
తక్కువ ఖర్చుతో పంటల ఉత్పత్తి ద్వారా
రైతుల ఆదాయాన్ని పెంచవచ్చనని వెల్లడి..

Posted On: 27 JAN 2022 4:29PM by PIB Hyderabad

   వేసవిలో వేసే పంటలు,.. రైతులకు అదనపు ఆదాయం సమకూర్చడంతోబాటుగా, రబీ, ఖరీఫ్ పంటకాలాల మధ్య ఉపాధి అవకాశాలను పెంచుతాయని, ఒక వ్యవసాయ సంవత్సరంలో వార్షిక ఉత్పాదనను కూడా అవి పెంచుతాయని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర కుమార్ తోమర్ చెప్పారు. 2021-22వ సంవత్సరపు వేసవి పంటల సాగు జాతీయ సమ్మేళనంలో ఆయన ఈ రోజు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రసంగించారు. పప్పు దినుసులు, ముతక ధాన్యాలు, పోషక తృణధాన్యాలు, నూనె గింజలు వంటి వేసవి పంటల సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అనేక కొత్త పథకాలను, కార్యక్రమాలను చేపట్టిందని అన్నారు. వేసవి సీజన్ సాగు విస్తీర్ణంలో సగభాగాన్ని, పప్పుదినుసులు, నూనె గింజలు, పోషకాల తృణ ధాన్యాల సాగే ఆక్రమించినప్పటికీ, రైతులు తమకు అందుబాటులో ఉన్న సేద్యపునీటి వనరులతో వరి, కూరగాయలను కూడా  పండిస్తూ వస్తున్నారని కేంద్రమంత్రి అన్నారు. వేసవి సీజన్లో వరితో పాటుగా పండించే పంటల సాగు 2017-18నుంచి, ఇప్పటికి 2.7రెట్లు పెరిగిందని అన్నారు. 2017-18లో 29.71 లక్షల హెక్టార్లలో వేసవి పంటల సాగు జరగ్గా, 2020-21వ సంవత్సరంలో ఈ పంటల సాగు 80.46లక్షల హెక్టార్ల విస్తీర్ణానికి పెరిగిందని ఆయన అన్నారు.

Description: C:\Users\hp\Downloads\IMG-20220127-WA0089.jpg

  ఇప్పటివరకూ వేసవి సీజన్లలో సాగైన పంటలను సమీక్షించి, మధింపు చేసి, ఇక ముందు వేసవి సాగుకు పంటలవారీగా లక్ష్యాలను నిర్దేశించే లక్ష్యంతో వేసవి సాగుపై ఈ సమ్మేళనాన్ని నిర్వహించినట్టు ఆయన చెప్పారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించి, ఈ విషయంపై నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిపారు. పంటల దిగుబడిని, ఉత్పాదనా సామర్థ్యాన్ని పెంచేందుకు అవసరమైన సహాయ సహకారాలను తాము అందిస్తామని, కీలకమైన వ్యవసాయ ఉపకకరణాలను, సృజనాత్మక సాంకేతిక పరిజ్ఞానం అమలు చేయడానికి తగిన సదుపాయాలను కల్పిస్తామని కేంద్రమంత్రి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. దిగుమతులపై మనం ఆధారపడుతున్న నూనె గింజలు, పప్పుదినుసులు వంటి పంటల ఉత్పాదనను పెంచేందుకే ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందన్నారు.

 భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐ.సి.ఎ.ఆర్.-ఇకార్) రూపొందించిన కొత్త వంగడాలను గురించి తోమర్ ప్రస్తావిస్తూ, వేసవి సీజన్లో మెరుగైన పంటల ఉత్పాదనకోసం రాష్ట్రాలు కొత్త వంగడాలను వినియోగించాలని సూచించారు. ఎరువుల ఆవశ్యతకు సంబంధించి రాష్ట్రాలు ముందస్తుగానే ప్రణాళిక వేసుకోవాలని, అందుకు సంబంధించిన అంచనాలను కేంద్ర ప్రభుత్వానికి అందించాలని, అప్పుడే కేంద్ర ఎరువుల శాఖ సకాలంలో రాష్ట్రాలకు ఎరువులను అందించేందుకు వీలుంటుందని మంత్రి చెప్పారు. రాష్ట్రాలు డి.ఎ.పి. ఎరువులపై ఆధారపడటాన్ని తగ్గించుకుని, నత్రజని, భాస్వరం, పొటాషియం (ఎన్.పి.కె.) ధాతువులతో కూడిన ఎరువులు, ద్రవరూప యూరియా వినియోగాన్ని పెంచాలని కూడా రాష్ట్రాలకు సూచించారు. చిన్న, సన్నకారు రైతులకు శిక్షణ ఇచ్చేందుకు కృషి విజ్ఞాన కేంద్రాల (కె.వి.కె.లు), వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞాన నిర్వహణా సంస్థ (ఆత్మా)లు ఉమ్మడిగా చర్యలు తీసుకోవాలని, వారికి అవసరమైన శిక్షణ ఇవ్వాలని, అప్పుడే నూతన సాంకేతిక పరిజ్ఞానం, వ్యవసాయ సమాచారం అట్టడుగు ప్రాంతాలకు చేరగలదని ఆయన అన్నారు.

    కోవిడ్ వైరస్ వ్యాప్తి చెందిన సంక్షోభ సమయంలో కూడా దేశంలో (4వ ముందస్తు అంచనాల ప్రకారం) 2020-21వ సంవత్సరంలో 3,085.47లక్షల టన్నుల ఆహార ధాన్యాలు ఉత్పత్తి జరిగిందని, ఇది గతంలో ఎన్నడూలేని రికార్డుగా చెప్పవచ్చని ఆయన అన్నారు. అలాగే, పప్పు దినుసుల దిగుబడి 257.19 లక్షల టన్నులు, నూనె గింజల ఉత్పత్తి 361.01లక్షల టన్నుల మేరకు జరిగిందని ఆయన చెప్పారు. ఇక పత్తి ఉత్పత్తి 353.84 లక్షల బేళ్లవరకూ జరగవచ్చన్న అంచనాలు ఉన్నాయని, దీనితో భారతదేశం ప్రపంచంలోనే మొదటి స్థానానికి చేరుకోగలదని ఆయన చెప్పారు. ఇక, ఉద్యానవన పంటల్లో కూడా సంప్రదాయక పంటలను మించి ఈ పంటల దిగుబడి నమోదైందని చెప్పారు.

    కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయమంత్రి కైలాస్ చౌధరి  మాట్లాడుతూ, నూనె గింజలు, పప్పు దినుసుల పంటల ఉత్పాదన పెంపుదలపై ప్రస్తుతం ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించామని, వాటి ఉత్పాదనలో స్వావలంబన సాధించేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్రాలకు తెలిపారు. సేంద్రియ వ్యవసాయం, సహజ వ్యవసాయాన్ని గురించి ఆయన ప్రస్తావించారు. ఏదైనా ప్రాంతాన్ని, లేదా బ్లాకును సేంద్రియ, సహజ వ్యవసాయ ప్రాంతంగా నిర్దేశిస్తూ ప్రతిపాదనలను పంపించవలసిందిగా వివిధ రాష్ట్రాలకు ఆయన సూచన చేశారు. అలా చేయడం వల్ల ఆయా ప్రాంతాలకు చెందిన రైతులు వివిడిగా, వ్యక్తిగతంగా సర్టిఫికెట్లకోసం దరఖాస్తు చేసుకోవలసిన అవసరం ఉండదని కేంద్రమంత్రి అన్నారు. సేంద్రియ పంటలను సాగుచేసే రైతులకు మార్కెట్ సౌకర్యాలను కల్పించవలసిందిగా ఆయన రాష్ట్రాలకు సూచించారు.

  కేంద్ర ఎరువుల శాఖ కార్యదర్శి మాట్లాడుతూ రైతులకు అవసరమైన ఎరువులు సకాలంలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. 2022వ సంవత్సరపు ఖరీఫ్ పంటకాలానికి అందుబాటులో ఉన్న ఎరువుల పరిమాణంపై అంచనాలను ఆయన వెల్లడించారు. 2022వ సంవత్సరం ఖరీఫ్ సీజన్లో 255.28 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా, 81.24లక్షల మెట్రిక్ టన్నుల డి.ఎ.పి., 18.50 లక్షల మెట్రిక్ టన్నుల ఎం.ఒ.పి., 76.87లక్షల మెట్రిక్ టన్నుల ఎన్.పి.కె., 34లక్షల మెట్రిక్ టన్నుల ఎస్.ఎస్.పి. అందుబాటులో ఉండే అవకాశం ఉందని తెలిపారు. కేంద్ర వ్యవసాయ పరిశోధన, విద్యా శాఖ (డి.ఎ.ఆర్.ఇ.) కార్యదర్శి,.. ఐ.సి.ఎ.ఆర్. డైరెక్టర్ జనరల్ ఈ సమావేశంలో మాట్లాడుతూ, వేసవి పంటలకు సానుకూలంగా దోహదపడే అధునాతన సాంకేతిక పరిజ్ఞాన పద్ధతులను గురించి ప్రధానంగా వివరించారు.

   2021-22వ సంవత్సరం వేసవి సీజన్లో పప్పు దినుసులు, నూనె గింజలు, పోషక తృణధాన్యాల కోసం సాగుకోసం, జాతీయ స్థాయిలో,  వివిధ రాష్ట్రాల వారీగా నిర్దేశించిన నిర్దేశించిన లక్ష్యాలను ఈ కార్యక్రమంలో వెల్లడించారు. 2020-21వ సంవత్సరంలో ఈ పంటలకు దేశవ్యాప్తంగా 40.85 లక్షల హెక్టార్ల విస్తీర్ణానిన్ని నిర్దేశించగా, 2021-22వ సంవత్సరంలో 52.72 లక్షల హెక్టార్ల విస్తీర్ణాన్ని నిర్ణయించారు. ఇందులో పప్పు దినుసులకు 21.05 లక్షల హెక్టార్లను, నూనె గింజలకు 13.78 లక్షల హెక్టార్లను, పోషక తృణధాన్యాల పంటలకు 17.89లక్షల హెక్టార్లను కేటాయించారు. జాతీయ ఆహార భద్రతా పథకం (ఎన్.ఎఫ్.ఎస్.ఎం.), నూనెగింజల, ఆయిల్ పామ్.లకు సంబంధించిన జాతీయ ఆహార భద్రతా పథకం కింద పప్పు దినుసుల, నూనె గింజల పంటల సాగును ప్రోత్సహిస్తారు. చెరకు సాగు, ఆయిల్ పామ్ సాగులో అంతరపంటలుగా వీటిని సాగు చేస్తారు.

   కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ పరిధిలోని పంటలు, నూనె గింజల శాఖ సంయుక్త కార్యదర్శి మాట్లాడుతూ,..దేశంలో వర్షపాతం వివరాలు, ప్రాంతాలవారీగా ప్రధాన రిజర్వాయర్లలో నీటి నిల్వ తాజా స్థితి, వివిధ పంటల సాగు విస్తీర్ణం అంచనాలు, వేసవి సీజనల్లో పంటల ధోరణి, సాగు విస్తీర్ణం, వేసవి పంటలకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న కార్యక్రమాలు, 2022వ సంవత్సరంలో రాష్ట్రాలవారీగా వేసవి పంటలు వేసిన విస్తీర్ణం వంటి అంశాలను వివరించారు.

వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 ‘ఇండియన్ సీడ్ సర్టిఫికేషన్.కు సంబంధించిన కర దీపిక’ను ఈ సదస్సులో ఆవిష్కరించారు. రాష్ట్రాలకు సమాచారం అందించడానికి,  పి.ఎం. కిసాన్ ఇ-కె.వై.సి., రైతుల సమాచారం వంటి అంశాలపై ప్రెజెంటేషన్లను కూడా ఈ సందర్భంగా సదస్సుకు సమర్పించారు.

Description: C:\Users\hp\Downloads\IMG-20220127-WA0090.jpg

     కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి సంజయ్ అగర్వాల్, వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ, ఐ.సి.ఎ.ఆర్. సీనియర్ అధికారులు, వివిధ రాష్ట్ర ప్రభుత్వాల సీనియర్ అధికారులు ఈ జాతీయ సదస్సులో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా పాలుపంచుకున్నారు. అన్ని రాష్ట్రాలకు సంబంధించిన వ్యవసాయ ఉత్పాదనా కమిషనర్లు, ముఖ్య కార్యదర్శులు నాలుగు గ్రూపులుగా ఏర్పడి, ప్రశ్నలు-సమాధానాల కార్యక్రమంలో పాల్గొన్నారు. వేసవి కాలంలో సాగు చేయాల్సిన పంటలను, విస్తీర్ణాన్ని, పంటల ఉత్పాదనను పెంచడంలో ఇప్పటి వరకూ సాధించి విజయాలు, ఇకముందు అనుసరించవలసిన వ్యూహాలు, ఎదురయ్యే సవాళ్లు తదితర అంశాలపై వారు తమతమ అనుభవాలను కూడా పరస్పరం పంచుకున్నారు.

 

****


(Release ID: 1793095) Visitor Counter : 310