ప్రధాన మంత్రి కార్యాలయం
త్రిపుర 50వ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం -తెలుగు అనువాదం
Posted On:
21 JAN 2022 2:14PM by PIB Hyderabad
నమస్కారం!
ఖులుమఖా!
రాష్ట్రం ఆవిర్భవించి 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా త్రిపుర ప్రజలందరికీ శుభాకాంక్షలు! త్రిపుర నిర్మాణానికి, అభివృద్ధికి సహకరించిన గొప్ప వ్యక్తులందరిని నేను గౌరవపూర్వకంగా అభినందిస్తున్నాను; వారి కృషికి వందనం!
త్రిపుర చరిత్ర ఎప్పుడూ మహిమాన్వితమైనదే. మాణిక్య వంశ చక్రవర్తుల ఘనత నుండి నేటి వరకు, త్రిపుర ఒక రాష్ట్రంగా తన పాత్రను బలోపేతం చేసుకుంది. అది గిరిజన సమాజమైనా లేదా ఇతర సంఘాలైనా, త్రిపుర అభివృద్ధికి అందరూ ఐక్యంగా కృషి చేశారు. త్రిపుర సుందరి మాత ఆశీస్సులతో, త్రిపుర ప్రతి సవాలును ధైర్యంగా ఎదుర్కొంది.
త్రిపుర నూతన అభివృద్ధి శిఖరాలకు పయనిస్తున్న దశలో త్రిపుర ప్రజల జ్ఞానం చాలా దోహదపడింది. మూడేళ్ల అర్థవంతమైన మార్పు ఈ విజ్ఞతకు నిదర్శనం. త్రిపుర ఈ రోజు అవకాశాలకు వేదికగా నిలిచింది. ఈ రోజు, త్రిపురలోని సామాన్య ప్రజల చిన్న చిన్న అవసరాలు సైతం తీర్చడానికి డబుల్ ఇంజన్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది. ఫలితంగా, త్రిపుర, ఈరోజు, అనేక అభివృద్ధి రంగాలలో మంచి పనితీరును కనబరుస్తోంది. రాష్ట్రం ఈ రోజు, భారీ అనుసంధానత కలిగిన మౌలిక సదుపాయాల ద్వారా వాణిజ్య కారిడార్లకు కేంద్రంగా మారుతోంది. చాలా దశాబ్దాలుగా, త్రిపుర నుండి భారతదేశంలో మిగిలిన ప్రాంతాలకు వెళ్ళడానికి రోడ్డు మార్గం మాత్రమే అందుబాటులో ఉండేది. వర్షాకాలంలో కొండచరియలు విరిగిపడిన సందర్భాల్లో, రహదారులు మూసుకుపోవడం వల్ల, త్రిపుర తో సహా మొత్తం ఈశాన్య రాష్ట్రాలలో నిత్యావసర వస్తువుల కొరత ఉండేది. ఈ రోజు, త్రిపుర రహదారులతో పాటు, రైలు, విమాన, అంతర్గత జల మార్గాలను కూడా కలిగి ఉంది. బంగ్లాదేశ్‌లో చిట్టగాంగ్ పోర్ట్ ను ఏర్పాటు చేసిన తర్వాత, దానిని వినియోగించుకోడానికి అవకాశం కల్పించాలని త్రిపుర చాలా సంవత్సరాలుగా డిమాండ్ చేస్తోంది. 2020 లో బంగ్లాదేశ్ నుంచి మొదటి ట్రాన్సిట్ కార్గో అఖౌరా ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ కు వచ్చినప్పుడు డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఈ డిమాండ్‌ను తీర్చింది. రైలు మార్గాల అనుసంధానత లో త్రిపుర కూడా దేశంలోని అగ్రగామి రాష్ట్రాల సరసన చేరుతోంది. కొద్ది రోజుల క్రితం మహారాజా బీర్ బిక్రమ్ విమానాశ్రయాన్ని కూడా విస్తరించడం జరిగింది.
మిత్రులారా!
త్రిపుర, ఈ రోజు, ఒకవైపు, పేదలకు పక్కా గృహాలను అందించడంలో ప్రశంసనీయమైన కృషి చేస్తూనే, మరోవైపు, నూతన సాంకేతికతను కూడా వేగంగా స్వీకరిస్తోంది. గృహ నిర్మాణంలో నూతన సాంకేతికతను వినియోగిస్తున్న దేశంలోని ఆరు రాష్ట్రాల్లో త్రిపుర కూడా ఒకటి. ఈ మూడేళ్లలో జరిగింది, కేవలం ప్రారంభం మాత్రమే. త్రిపుర యొక్క వాస్తవ సామర్థ్యం ఇంకా తెరపైకి రావలసి ఉంది.
పరిపాలన లో పారదర్శకత నుండి ఆధునిక మౌలిక సదుపాయాల వరకు, నేడు నిర్మించబడుతున్న త్రిపుర రాబోయే దశాబ్దాలకు రాష్ట్రాన్ని సిద్ధం చేస్తోంది. శ్రీ బిప్లబ్ దేబ్ జీ మరియు అతని బృందం తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రతి గ్రామానికి వంద శాతం సౌకర్యాలు చేరుకునేలా, ఇటీవల, త్రిపుర ప్రభుత్వం, ప్రచారాన్ని ప్రారంభించింది. త్రిపుర ప్రజల జీవితాలను సులభతరం చేయడంలో, ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రయత్నం చాలా దోహదపడుతుంది. భారతదేశం స్వాతంత్య్రం పొంది 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వేళ, త్రిపుర రాష్ట్రంగా ఏర్పడి 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. కొత్త తీర్మానాలు, అవకాశాలకు ఇది చాలా మంచి సమయం. మన బాధ్యతలను నిర్వర్తిస్తూ ముందుకు సాగాలి. మనమందరం కలిసి అభివృద్ధి పథంలో ముందుకు సాగుదాం. ఈ విశ్వాసంతో, నేను, మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను !
ధన్యవాదములు!
గమనిక:
ఇది ప్రధానమంత్రి ప్రసంగానికి స్వేచ్చానువాదం.
అసలు ప్రసంగం హిందీలో జరిగింది.
*****
(Release ID: 1792138)
Visitor Counter : 166
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam