రక్షణ మంత్రిత్వ శాఖ
గణతంత్ర దినోత్సవ శిబిరం 2022లో పాల్గొంటున్న ఎన్‌సిసి క్యాడెట్లతో ముచ్చటించిన రక్షణమంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్
ఉన్నతమైన కలలను కని, దేశాన్ని నూతన శిఖరాలకు తీసుకొని వెళ్ళాల్సిందిగా వారికి బోధ
ఐక్యమైన& క్రమశిక్షణ కలిగిన శక్తిగా యువతను మారుస్తూ ఎన్‌సిసి గొప్ప సేవలను అందిస్తోందిః రక్షణ మంత్రి
Posted On:
22 JAN 2022 2:27PM by PIB Hyderabad
గణతంత్రి దినోత్సవ శిబిరం 2022లో పాల్గొంటున్న నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (ఎన్‌సిసి) క్యాడెట్లను ఉద్దేశించి జనవరి 22, 2022న రక్షణ మంత్రి శ్రీ రాజనాథ్ సింగ్ దృశ్యమాధ్యమం ద్వారా సంభాషించారు. క్యాడెట్లలో ఒక నాయకుడు, సైనికుడు, కళాకారుడు, సంగీతకారుడు, అన్నింటినీ మించి ఒక మంచి మనిషికి అవసరమైన లక్షణాలను పొందుపరిచిన వారి సంపూర్ణ వ్యక్తిగా తీర్చిదిద్దిన యువజన సంస్థను ఆయన కొనియాడారు. తన క్యాడెట్లలు తమ స్వంత పథాన్ని సృష్టించుకుని, సమాజానికి నూతన దిశను ఇచ్చేందుకై ఈ గుణాలను వారిలో అభివృద్ధి చేసినందుకు ఎన్‌సిసిని ఆయన ప్రశంసించారు. సంస్థలో బోధించిన ఐక్యత, క్రమశిక్షణ, విశ్వసనీయత, సాహసం, సామరస్యం, నాయకత్వం వంటి గుణాలను అందిపుచ్చుకుని సమాజంపై తమదైన ముద్ర వేసిన ఎన్‌సిసి పూర్వ విద్యార్ధుల నుంచి స్ఫూర్తి తీసుకోవాలని, జీవితంలో ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలని ఆయన క్యాడెట్లను కోరారు. యువతను ఐక్యత కలిగిన, క్రమశిక్షణ కలిగిన శక్తిగా పరివర్తన చేయడం ద్వారా దేశానికి ఎన్‌సిసి గొప్ప సేవను చేస్తోందని ఆయన అన్నారు.
విజయానికి కీలకం కష్టపడి పని చేయడం అని పేర్కొంటూ, ప్రాంతాలు, మతాలు, కులాలు వర్గాలకు సంబంధించి స్వల్ప అసరూయలు, ఆత్మను క్షీణింప చేసే పక్షపాతాల నుంచి పురోగతికి సంబంధించిన నూతన వేకువ కోసం కృషి చేయాలని ఎన్‌సిసి క్యాడెట్లను రక్షణ మంత్రి కోరారు. స్త్రీ, పురుషల మధ్య సమానత్వానికి, ఉమ్మడి ప్రయోజనాలకు అనుగుణమైన అత్యధిక స్వేచ్ఛను వారు కలిగి ఉండాలని ఆయన పిలుపిచ్చారు. నిరంతరం పురోగమిస్తున్న కాలానికి అనుగుణంగా తమను తాము మలచుకుంటూ, భారతీయ విలువలు, సంప్రదాయాలు, మానవతా భావాన్ని ముందుకు తీసుకువెళ్ళడంపై ఆయన సమాన ప్రాధాన్యతను ఇచ్చారు.
మీరు సింహాలు, మీరు స్వచ్ఛమైన, అనంతమైన, సంపూర్ణమైన ఆత్మలు. ఈ విశ్వానికి ఉన్న శక్తి మీలో ఉంది, అన్న స్వామి వివేకానంద మాటలను ప్రస్తావిస్తూ, ఎన్‌సిసి క్యాడెట్లు భారీ కలలు కంటూ, భయం, సంశయపు సంకెళ్ళను తెంచుకుని తమ లక్ష్యాలను సాధించే దిశగా శ్రద్ధగా పని చేయాలని ఆయన ఉద్బోధించారు. మిమ్మల్ని విజయవంతం చేసే, దేశానికి గర్వం కలిగించే ఏదైనా అత్యున్నతమైన దానిని, నూతనమైనదానిని సృష్టించే దార్శనికతతో మీ జీవితంలో ముందుకు పురోగమించండి, అని ఆయన పేర్కొన్నారు.
దృశ్యమాధ్యమం ద్వారా ఎన్‌సిసి క్యాడెట్లతో ముచ్చటించాలని రక్షణ మంత్రి నిర్ణయించుకోవడానికి కారణం ఆయన ఇంకా కోవిడ్-19 పాజిటివ్ కావడం, దానికి సంబంధించి అన్ని ప్రోటోకాళ్ళను అనుసరించడమే. వ్యక్తిగతంగా ఎన్‌సిసి పూర్వవిద్యార్ధి, అధ్యాపకుడు అయిన ఆయన ఎన్‌సిసి నిర్వహించే ఏ కార్యక్రమానికీ గైర్హాజరు కాకుండా ఉండేందుకు ప్రయత్నిస్తారు.
ఢిల్లీ కాంట్‌లోని ఎన్‌సిసి ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎన్‌సిసి క్యాడెట్లు శత్ శత్ నమన్ అన్న పాటను వర్ణమయంగా రక్షణ మంత్రి కోసం ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో రక్షా మంత్రి పడక్ & కమెండేషన్ కార్డుల కు సంబంధించి ఈ ఏడాది విజేతల ప్రకటించారు. ఈ కార్యక్రమానికి ఎన్‌సిసి డిజి లెఫ్టనెంట్ జనరల్ గుర్బీర్‌పాల్ సింగ్, రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన సీనియర్ పౌర, సైనిక అధికారులు పాల్గొన్నారు.
రక్షామంత్రి పడక్‌ను 1989లో ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ప్రతి ఏడాదీ అత్యున్నత శ్రేణిలో అసాధారణమైన సేవలను అందించినందుకు, ధైర్యసాహసాలను ప్రదర్శించిన అత్యంత అర్హులైన క్యాడెట్లకు, అధ్యాపకులకు దీనిని ప్రదానం చేస్తున్నారు. ఈ ఏడాది రక్షమంత్రి పడక్‌ను ఢిల్లీ డైరెక్టొరేట్‌కు చెందిన కేడెట్ దివ్యాన్షీ కి, కర్ణాటక& గోవా డైరెక్టొరేట్‌కు చెందిన లెఫ్టనెంట్ అక్షయ్ దీపక్‌రావుకు ప్రదానం చేయనున్నారు. రక్షామంత్రి ప్రశంసా కార్డులను గుజరాత్ డైరెక్టొరేట్‌కు చెందిన క్యాడెట్ కెప్టెన్ ధీరజ్ సింగ్, మహారాష్ట్ర డైరెక్టొరేట్ కు చెందిన ఎస్‌యుఒ సోమేష్ మనోజ్ సిన్హా, ఈశాన్య ప్రాంత డైరెక్టొరేట్ ఎస్‌యుఒ కెహెచ్ మొనితా సింఘా, పశ్చిమ బెంగాల్& సిక్కిం డైరెక్టొరేట్‌కు చెందిన క్యాడెట్ ఆదర్శ్ శర్మలకు ప్రదానం చేయనున్నారు.
***
(Release ID: 1791812)
Visitor Counter : 184