ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

మారిష‌స్ లో సంయుక్త అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభం, ఆవిష్క‌ర‌ణ సంద‌ర్భంగా ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ చేసిన ప్ర‌సంగం

Posted On: 20 JAN 2022 6:06PM by PIB Hyderabad

న‌మ‌స్తే,
మారిష‌స్ రిప‌బ్లిక్ ప్ర‌ధాన‌మంత్రి , గౌర‌వ‌నీయ ప్ర‌వింద్ కుమార్ జుగ‌నౌత్‌జి
ఎక్స‌లెన్సీస్,

భార‌త‌దేశంలోని 130 కోట్ల మంది ప్ర‌జ‌ల త‌ర‌ఫున మారిష‌స్ లోని సోద‌ర సోద‌రీమ‌ణులంద‌రికీ న‌మ‌స్కారం , శుభోద‌యం, థాయి పూస‌మ్ కావ‌డీ ఉత్స‌వ‌ శుభాకాంక్ష‌లు.

భార‌త -మారిష‌స్ ల‌మ‌ధ్య సంబంధాల‌ను అద్భుత స్థాయికి తీసుకువెళ్లేందుకు , దివంగ‌త స‌ర్ అనెరూద్ జుగ్‌నౌత్  సాగించిన కృషిని  ఈ సంద‌ర్భంగా నేను గుర్తు చేయాల‌నుకుంటున్నాను. ఆయ‌న ఒక గొప్ప‌దార్శ‌నిక నాయ‌కుడు. వారంటే భార‌త్ లో ఎంతో గౌర‌వం. వారు దివంగ‌తులైన‌పుడు, మేం ఇండియాలో ఒక రోజు సంతాపం ప్ర‌కటించాం . పార్ల‌మెంటు వారికి ఘ‌న నివాళుల‌ర్పించింది. 2020లో వారిని ప‌ద్మ విభూష‌ణ్‌తో గౌర‌వించుకోవ‌డం మా అదృష్టం. దుర‌దృష్ట వ‌శాత్తు కోవిడ్ మ‌హ‌మ్మారి కార‌ణంగా వారు జీవించి ఉన్న‌ప్పుడు అవార్డు బ‌హుక‌ర‌ణ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించుకోలేక పోయాం. అయితే లేడీ స‌రోజిని జుగ‌నౌత్ ఈ అవార్డును స్వీక‌రించ‌డానికి గ‌త న‌వంబ‌ర్‌లో అంగీక‌రించ‌డం మాకు ల‌భించిన గౌర‌వంగా భావిస్తున్నాం. వారు దివంగ‌తులైన త‌ర్వాత ఇరుదేశాల మ‌ధ్య జ‌రుగుతున్న తొలి ద్వైపాక్షిక ఈవెంట్ ఇంది. ఆ ర‌కంగా మ‌నం మ‌న ఉమ్మ‌డి అభివృద్ధి ప్ర‌యాణంలో మ‌రో మైలురాయిని ఉత్స‌వంలా జ‌రుపుకుంటున్నాం. నేను అనెరూద్ జుగ‌నౌత్ గారి మృతికి వారి కుటుంబానికి, మొత్తం మారిష‌స్‌ప్ర‌జానీకానికి  నా ప్ర‌గాఢ సంతాపం తెలియ‌జేస్తున్నాను. 

ఎక్స‌లెన్సీస్‌,
ఇండియా , మారిష‌స్‌లు చ‌రిత్ర‌, పూర్వీకులు, సంస్కృతి, సంస్కృతి, భాష  హిందూ మహాసముద్ర భాగస్వామ్య జలాల ద్వారా ఉమ్మ‌డి బంధం క‌లిగి ఉన్నాయి. ఇవాళ మ‌న అద్భుత అభివృద్ధి భాగ‌స్వామ్యం మ‌న స‌న్నిహిత సంబంధాల‌కు కీల‌క స్తంభంగా రూపుదిద్దుకుంది. భార‌త‌దేశ‌పు అభివృద్ది భాగ‌స్వామ్యానికి మారిష‌స్ ప్ర‌ధాన ఉదాహ‌ర‌ణ‌గా నిలుస్తుంది.ఇది మ‌న భాగ‌స్వాముల అవ‌స‌రాలు ప్రాధాన్య‌త‌లు, వారి సార్వ‌భౌత్వం ప‌ట్ల గౌర‌వం పునాదిగా ఉంది.


ప్ర‌వింద్ జి, మీ తో క‌లిసి నేను మెట్రో ఎక్స్‌ప్రెస్‌ప్రాజెక్టు, నూత‌న ఇ.ఎన్.టి ఆస్ప‌త్రి, కొత్త సుప్రీంకోర్టు భ‌వ‌నాన్ని ప్రారంభించ‌డం నాకు గుర్తు. మెట్రో జ‌నాద‌ర‌ణ పొంది 5.6 మిలియ‌న్ పాసింజ‌ర్ మార్కును దాటింద‌ని తెలిసి సంతోషం వేసింది. ఈరోజు కుదిరిన  190 మిలియన్ డాలర్ల లైన్ ఆఫ్ క్రెడిట్ ఒప్పందం ప్రకారం మెట్రో త‌దుప‌రి విస్త‌ర‌ణ‌కు  మ‌ద్ద‌తునిచ్చేందుకు మేం ఎదురు చూస్తున్నాం.
 కోవిడ్ -19 ని ఎదుర్కోవ‌డంలో కొత్త ఇ.ఎన్‌.టి ఆస్ప‌త్రి కీల‌కంగా వ్య‌వ‌హ‌రించింద‌ని తెలిసి సంతృప్తినిచ్చింది.

అంతే కాదు, కోవిడ్ మ‌హమ్మారి స‌మ‌యంలో ఉభ‌య‌దేశాల మ‌ధ్య స‌హ‌కారం అద్భుత‌మైన‌ది. మ‌న వాక్సిన్ మైత్రి కార్య‌క్ర‌మం ప్ర‌కారం, కోవిడ్ వాక్సిన్ ను ముందుగా మేం పంపిన దేశాల‌లో మారిష‌స్ ఒక‌టి. దేశ జ‌నాభాలో మూడింట రెండువంతుల జ‌నాభా పూర్తిగా వాక్సిన్ వేయించుకున్న ప్ర‌పంచంలోని కొద్ది దేశాల‌లో మారిష‌స్ కూడా ఒక‌టి గా ఉందని తెలిసి సంతోషంగా ఉంది. హిందూ మ‌హాస‌ముద్రం విష‌యంలో మా వైఖ‌రిలో మారిష‌స్ ఒక భాగంగాఉంది. 2015 లో నా మారిష‌స్ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా భార‌త స‌ముద్ర‌యాన స‌మ‌కార దార్శ‌నిక‌త అయిన సాగ‌ర్ - సెక్యూరిటీ, గ్రోత్ ఫ‌ర్ ఆల్ రీజియ‌న్స్ గురించి వివ‌రించ‌డం జ‌రిగింది.

స‌ముద్ర‌యాన భ‌ద్ర‌త‌తోపాటు మ‌న ద్వైపాక్షిక స‌హ‌కారం ఈ దార్శ‌నిక‌త‌ను కార్యాచ‌ర‌ణ రూపంలోకి తీసుకువ‌చ్చింది. కోవిడ్ కు సంబంధించి ప‌లు ఇబ్బందులు ఉన్న‌ప్ప‌టికీ మేం డార్నియ‌ర్ ఎయిర్ క్రాఫ్ట్ను లీజుకు ఇవ్వ‌గ‌లిగాం. అలాగే  మారిష‌స్ కోస్ట్ గార్డ్ షిప్‌బ‌ర్రాకుడా  షార్ట్ రీఫిట్ ను పూర్తి చేయ‌గ‌లిగాం.  వాకాషియో చ‌మురు తెట్టును నియంత్రించేందుకు నిపుణుల‌ను పంప‌డం, త‌గిన ప‌రిక‌రాలు అంద‌జేయ‌డం వంటివి ఇరుదేశాల మధ్య  ఉమ్మ‌డి స‌ముద్ర‌యాన చారిత్ర‌క వార‌స‌త్వాన్ని కాపాడడంలో ఒక ఉదాహ‌ర‌ణ‌గా నిలుస్తాయి.

ఎక్స‌లెన్సీస్‌....
ఇవాల్టి కార్య‌క్ర‌మం, మ‌న ప్ర‌జ‌ల జీవితాన్ని మెరుగుప‌రిచేందుకు  మ‌న ఉమ్మ‌డి నిబద్ద‌త‌ను మ‌రోసారి ప్ర‌ద‌ర్శిస్తోంది. ప్ర‌మోద్‌జీ, సామాజిక గృహ నిర్మాణ ప్రాజెక్టు పూర్తి సంద‌ర్భంలో మీతో క‌ల‌సి ఉండ‌డం సంతోషంగా ఉంది.మారిష‌స్ సామాన్య ప్ర‌జానీకానికి  చ‌వ‌కగా గృహ నిర్మాణం అందుబాటులోకి వ‌చ్చే కీల‌క కృషిలో భాగ‌స్వాములం కావ‌డం మాకు ప్ర‌త్యేకించి ఆనందంగా ఉంది.
దేశ నిర్మాణానికి కీల‌క‌మైన మ‌రో రెండు ఇత‌ర ప్రాజెక్టుల‌ను కూడా మేం ఇవాళ చేప‌డుతున్నాం. అత్య‌ధునాత‌న సివిల్ స‌ర్వీస్ కాలేజ్‌- ఇది ప్ర‌భుత్వ అధికారుల‌కు నైపుణ్యాభివృద్ధి శిక్ష‌ణ‌కు, మారిష‌స్ నిరంత‌ర ప్ర‌గ‌తికి దోహ‌ద‌ప‌డుతుంది. అలాగే 8 మెగా వాట్ల సౌర పివి ఫామ్ ప్రాజెక్టు. ఇది ఒక ద్వీప‌ దేశంగా మారిష‌స్ ఎదుర్కొనే వాతావ‌ర‌ణ మార్పుల స‌వాలు స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించ‌డానికి స‌హాయ‌ప‌డుతుంది..


ఇండియాలో కూడా, సివిల్ స‌ర్వీసుల సామ‌ర్ధ్య నిర్మాణానికి మేం మా మిష‌న్ క‌ర్మ‌యోగి కార్య‌క్ర‌మం కింద సామ‌ర్ధ్యాల నిర్మాణానికి వినూత్న విధానాలు అనుస‌రించడంపై దృష్టిపెడుతున్నాం. మా అనుభ‌వాల‌ను నూత‌న సివిల్ స‌ర్వీస్ కాలేజ్ తో పంచుకోవ‌డానికి సంతోషంగా ఉన్నాం. మ‌నం 8 మెగావాట్ల సోలార్ పివి ఫార‌మ్‌ను ప్రారంభించుకుంటున్నాం. ఈ సందర్భంగా నేను ఒకే సూర్యుడు, ఒకే ప్ర‌పంచం, ఒకే గ్రిడ్ చొర‌వ గురించి గుర్తుచేస్తున్నాను.  గ‌త ఏడాది గ్లాస్‌గో లో కాప్ -26 స‌మావేశం సంద‌ర్బంగా దీనిని చేప‌ట్ట‌డం జ‌రిగింది. 2018 అక్టోబ‌ర్లో అంత‌ర్జాతీయ సోలార్ అల‌యెన్స్ తొలి అసెంబ్లీ సంద‌ర్భంగా నేను ఈ ఆలోచ‌న‌ను స‌మావేశం ముందుంచాను. ఈ కార్య‌క్ర‌మం కార్బ‌న్‌ఫుట్ ప్రింట్‌ను త‌గ్గించ‌డ‌మే కాక‌, ఇంధ‌న ఖ‌ర్చుల‌ను త‌గ్గిస్తుంది. అలాగే వివిధ దేశాలు, ప్రాంతాల మ‌ధ్య ప‌ర‌స్ప‌ర స‌హ‌కారానికి నూత‌న అవ‌కాశాలకు వీలు క‌ల్పిస్తుంది. ఈ నేప‌థ్యంలో ఇండియా , మారిష‌స్ లు ఉమ్మ‌డిగా సౌర ఇంధ‌న రంగంలో ప‌ర‌స్ప‌ర స‌హ‌కారానికి అద్బుత ఉదాహ‌ర‌ణ‌గా నిల‌వ‌గ‌ల‌వ‌న్న ఆశాభావం వ్య‌క్తం చేస్తున్నాను.

చిన్న అభివృద్ధి ప్రాజెక్టుల‌కు సంబంధించి మ‌నం ఈరోజు ఇచ్చిపుచ్చుకుంటున్న ఒప్పందం, మారిష‌స్ అంత‌టా క‌మ్యూనిటీ స్థాయిలో అద్భుత ప్ర‌భావాన్ని క‌లిగి ఉంటుంది. రాగ‌ల రోజుల‌లో మ‌నం ప‌లు ప్ర‌ధాన ప్రాజెక్టుల‌లో ప‌నులు ప్రారంభించ‌బోతాం. అవి రీన‌ల్ ట్రాన్స్ ప్లాంట్ యూనిట్‌, ఫోరెన్సిక్ సైన్సెస్ లేబ‌రెట‌రీ, నేష‌న‌ల్ లైబ్ర‌రీ, ఆర్కైవ్స్‌, మారిష‌స్ పోలీస్ అకాడ‌మీ , ఇంకా ఇలాంటివి ఎన్నో...
మారిష‌స్ అభివృద్ధి ప్ర‌యాణంలో ఇండియా ఎల్ల‌ప్పుడూ అండ‌గా ఉండ‌డం కొన‌సాగిస్తుంద‌ని ఈరోజు నేను పున‌రుద్ఘాటిస్తున్నాను
మారిష‌స్ సోద‌ర సోద‌రీమ‌ణులంద‌రికీ , సంతోష‌క‌ర‌మైన‌, ఆనంద‌దాయ‌క‌మైన , సుసంప‌న్న‌మైన 2022 శుభాకాంక్ష‌లు తెలియ‌జేసుకుంటున్నాను.
భార‌త్‌, మారిష‌స్ మైత్రి క‌ల‌కాలం కొన‌సాగుగాక‌
జై హింద్‌
ధ‌న్య‌వాదాలు,
న‌మ‌స్కార్‌

***


(Release ID: 1791335) Visitor Counter : 168