శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
ఈశాన్యంలో కోవిడ్ పరీక్షలకు ప్రత్యేక ఐ.ల్యాబ్!
కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ చేతుల మీదుగా
మిజోరాంలో మొబైల్ ల్యాబ్ ఆవిష్కరణ..
ఆన్.లైన్ ద్వారా సి.ఎం. జొరాంతాంగా హాజరు..
కోవిడ్-19 నిర్ధారణ పరీక్షల నిర్వహణ కోసం,
దేశంలోనే తొలి మొబైల్ డయాగ్నస్టిక్ లేబరేటరీ..
క్రమంగా ఈశాన్యంలోని ఇతర రాష్ట్రాల్లోనూ అందుబాటులోకి..
టెలీ కన్సల్టేషన్ సదుపాయాన్ని ఐ.ల్యాబ్.తో
అనుసంధానించాలన్న జితేంద్ర సింగ్
Posted On:
20 JAN 2022 4:49PM by PIB Hyderabad
దేశంలోని ఈశాన్య ప్రాంతంలో కోవిడ్ నిర్ధారణ పరీక్షలకోసం ఏర్పాటు చేసిన సంచార పరీక్షా సదుపాయాన్ని కేంద్ర సైన్స్, టెక్నాలజీ శాఖ (స్వతంత్ర హోదా) సహాయమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ రోజు ప్రారంభించారు. కేంద్ర భూగోళ శాస్త్రాలు, ప్రధాని కార్యాలయ వ్యవహారాలు, సిబ్బంది వ్యవహారాలు, ప్రజాఫిర్యాదులు, పెన్షన్లు, అణుశక్తి, అంతరిక్ష పరిశోధన శాఖలను ఆయన సహాయ మంత్రిగా స్వతంత్ర హోదాలో పర్యవేక్షిస్తున్నారు. ఈ రోజు ఆవిష్కరించిన సంచార పరీక్షా సదుపాయం మిజోరాంలో ప్రారంభమైంది. ఆవిష్కరణ కార్యక్రమంలో మిజోరాం ముఖ్యమంత్రి పూ జొరాంతాంగా ఆన్ లైన్ ద్వారా పాలుపంచుకున్నారు.
ఈ రోజు ప్రారంభమైన సంచార వ్యాధి నిర్ధారణ పరిశోధన శాల (ఐ.ల్యాబ్) దేశంలోనే మొదటిది. ఆర్.టి. పి.సి.ఆర్. పరీక్షలతో పాటుగా ఎలిసా పరీక్షలను కూడా నిర్వహించే సదుపాయాన్ని కలిగి ఉంది. ఆవిష్కరణ కార్యక్రమంలో కేంద్రమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ,. కేంద్ర బయోటెక్నాలజీ శాఖ సహాయ సహకారాలతో ఈ ల్యాబ్.కు రూపకల్పన జరిగినట్టు తెలిపారు. దేశంలోని ఈశాన్య ప్రాంతంలో ఉన్న మారుమూల గ్రామీణ ప్రాంతాలకు కూడా కోవిడ్ పరీక్షలను అనుసంధానం చేయాలన్న ధ్యేయంతో ఈ సంచార పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేశారని. ఈ కేంద్రానికి బయోసేఫ్టీ సదుపాయం ఉందని ఆయన చెప్పారు. కోవిడ్ నిర్ధారణకోసం ఆర్.టి.పి.సి.ఆర్. పరీక్షలతోపాటుగా, ఎలిసా పరీక్షలు కూడా చేయగలిగిన ఈ సంచార కేంద్రాన్ని ఇతర అంటువ్యాధుల నిర్ధారణ పరీక్షలకు కూడా ఉపయోగించుకోవచ్చని. క్షయ, హెచ్.ఐ.వి. వంటి వ్యాధుల ధ్రువీకరణ పరీక్షలను కూడా నిర్వహించుకోవచ్చని, అంటే, కోవిడ్ అనంతర కాలంలో కూడా ఈ ఐ. ల్యాబ్, బాగా ఉపయోగపడుతుందని ఆయన అన్నారు.
కోవిడ్ మహమ్మారి వ్యాప్తి కారణంగా ఏర్పడిన క్లిష్ట పరిస్థితినుంచి దేశం విజయవంతంగా బయటపడగదలన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. దేశంలో కోవిడ్ పరిస్థితిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిరోజూ స్వయంగా పర్యవేక్షిస్తూ వస్తున్నారని, వైరస్ వ్యాప్తిని అరికట్టే కార్యకలాపాలకోసం పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారని కేంద్రమంత్రి చెప్పారు.
ఈశాన్య ప్రాంతంలోని జనాభాకు సంబంధించిన వ్యాధుల వివరాలకు అనుగుణంగా ఐ.ల్యాబ్.ను టెలి కన్సల్టేషన్ సదుపాయంతో అనుసంధానం చేయాలని జితేంద్ర సింగ్ పిలుపునిచ్చారు. ఈ సంచార పరిశోధనశాల నిర్వహించే పరీక్షలకు అదనంగా, మమ్మోగ్రఫీ పరీక్షలను, కంటిచూపు పరీక్షలను కూడా జతజేయాలని, ఈశాన్య ప్రాంత ప్రజలకు ఇది భారీగా ప్రయోజనం చేకూర్చుగలదని త్వరలోనే రుజువవుతుందని అన్నారు.
ప్రధానమంత్రిగా తాను అధికారంలోకి వచ్చిన వెంటనే నరేంద్ర మోదీ,.. ఈశాన్య ప్రాంతం అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తూవచ్చారని, ఈ సంచార పరీక్షా కేంద్రం కూడా ఆయన చిత్తశుద్ధికి నిదర్శనంగా నిలుస్తుందని జితేంద్ర సింగ్ అన్నారు. విభిన్నమైన వాతావరణ, భౌగోళిక పరిస్థితులు నెలకొన్న ఈశాన్య ప్రాంతంలో ఉన్న ఇతర రాష్ట్రాలకు కూడా త్వరలోనే ఈ సదుపాయం అందుబాటులోకి వస్తుందని అన్నారు.
ఎంతో విభిన్నమైన, సృజనాత్మకమైన వ్యాధి నిర్ధారణ పరీక్షల సదుపాయాన్ని రూపొందించడంలో ఆంధ్రప్రదేశ్ మెడ్ టెక్ జోన్ (ఎ.ఎం.టి.జెడ్.) సంస్థ చేసిన కృషి అభినందనీయమని కేంద్రమంత్రి అన్నారు. ఎ.ఎం.టి.జెడ్. సంస్థకు చెందిన బృందం నిర్విరామంగా, అంకితభావం, చిత్తశుద్ధితో చేసిన కృషి వల్లనే ఇది సాధ్యమైందని ఆయన ప్రశంసించారు. ఇప్పటివరకూ ఎక్కువగా దిగుమతి చేసుకుంటూ వస్తున్న వివిధ రకాల ఆరోగ్య రక్షణ సాంకేతిక పరిజ్ఞానాలను స్వదేశీ పరిజ్ఞానంతోనే తయారు చేసేందుకు వీలుగా కేంద్ర బయోటెక్నాలజీ శాఖ చర్యలు తీసుకుందని, ఎ.ఎం.టి.జెడ్. సంస్థలోనే తయారీ సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేసిందని కేంద్రమంత్రి అన్నారు. దీనితో ప్రధానమంత్రి పిలుపునిచ్చిన మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ఇండియా స్ఫూర్తిని సాకారం చేసినట్టయిందని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు.
సమిష్టిగా, పరస్పర సహకారంతో ఆరోగ్యరక్షణ టెక్నాలజీల్లో స్వయంసమృద్ధిని సాధించే ప్రక్రియలో భారతదేశం ఇపుడు ముందుకు సాగుతోందని అన్నారు. దేశ ప్రజలకు మంచి ఆరోగ్యం సాధించే దిశగా తగిన సౌకర్యాలు కల్పించేందుకు భారత్ కృషి చేస్తోందని అన్నారు. కోవిడ్19 వ్యాధి నిర్ధారణ పరీక్షలతోపాటుగా, వ్యాక్సినేషన్ ప్రక్రియ కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో జరిగిన కృషి స్వతంత్ర భారత చరిత్రలో ఇదివరకెన్నడూ జరగనే లేదని ఆయన అన్నారు. ఆరోగ్య రక్షణ టెక్నాలజీ విషయంలో, దేశంలో భారీగా ఉన్న మన జనాభా అవసరాలను తీర్చడంతోపాటుగా, అనేక ఇతర దేశాల అవసరాలను కూడా మనం నెరవేర్చగలిగామని ఆయన అన్నారు. ఆరోగ్య రక్షణ సాంకేతిక పరిజ్ఞానం తయారీలో, పరిశోధనలో తగినంత సామర్థ్యంలేని దేశాలకు కూడా మనదేశం సహాయపడిందని ఆయన అన్నారు.
మిజోరాం ముఖ్యమంత్రి పూ జొరాంతాంగా మాట్లాడుతూ, కోవిడ్ నిర్ధారణ పరీక్షల నిర్వహణకు సంచార సదుపాయాన్ని ఏర్పాటు చేసినందుకు కేంద్రమంత్రి జితేంద్ర సింగ్.కు కృతజ్ఞతలు తెలిపారు. సరిహద్దు ప్రాంతంలోని జిల్లాల్లో కోవిడ్ పరీక్షల విషయంలో ఏర్పడిన అంతరాన్ని పూడ్చేందుకు ఇది దోహదపడుతుందని జొరాంతాంగా అభిప్రాయపడ్డారు.
మిజోరాం ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ ఆర్. లాల్తంగ్లియానా మాట్లాడుతూ, వైరస్ మహమ్మారి వ్యాప్తి కారణంగా ఆరోగ్య మౌలిక సదుపాయాలపై ఎంతో ఒత్తిడి ఏర్పడిందని, ప్రత్యేకించి ఈశాన్య ప్రాంతపు రాష్ట్రాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా నెలకొందని అన్నారు. ఈశాన్యంలోని దుర్గమమైన పర్వత ప్రాంతాలు, ఆసుపత్రులకు అవకాశం లేని ప్రాంతాల్లో ప్రజలకు కోవిడ్ పరీక్షల అవసరాలను, చికిత్స సదుపాయాన్ని అందించేందుకు ఐ.ల్యాబ్ ఎంతగానో ఉపయోగపడగలదని ఆయన అన్నారు.
కేంద్ర బయోటెక్నాలజీ శాఖ కార్యదర్శి డాక్టర్ రాజేశ్ గోఖలే మాట్లాడుతూ,.. కోవిడ్ అనంతర కాలంలో కూడా క్షయ, హెచ్.ఐ.వి. వంటి అంటువ్యాధుల నిర్ధారణ పరీక్షలకు ఈ ఐ. ల్యాబ్ ఎంతో అందుబాటులో ఉంటుందని అన్నారు. ఎ.ఎం.టి.జెడ్. సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ జె.కె. శర్మ మాట్లాడుతూ, ప్రపంచంలోనే అతి పెద్ద మెడికల్ టెక్నాలజీ తయారీ క్లస్టర్లలో ఒకటిగా ప్రీమియర్ మెడికల్ టెక్నాలజీ పార్క్ ఆవిర్భవించిందని అన్నారు. ప్రాణ రక్షణకు ఉపయోగపడే పరికరాలకు సంబంధించిన పరిశోధన, రూపకల్పన, ఉత్పాదనలో వందకు పైగా కంపెనీలు ఈ క్లస్టర్.లో పనిచేస్తున్నాయని ఆయన తెలిపారు.
****
(Release ID: 1791332)
Visitor Counter : 200