కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

మూడేళ్లలో 5కోట్లకు చేరిన ఖాతాదార్ల సంఖ్య!


ఇండియా పోస్ట్,పేమెంట్ బ్యాంక్ ప్రగతి.

వేగంగా పెరిగే డిజిటల్ బ్యాంకుల సరసన స్థానం

మూడేళ్ల తక్కువ వ్యవధిలోనే ఐదుకోట్లమంది ఖాతాదార్లకు చేరువ కావడం.. ఇదో విజయగాధ.. ఖర్చుకు తగిన ఫలితాలతో, సులభంగా, సరళంగా, సురక్షితమైన సానుకూల డిజిటల్ ఆర్థిక వ్యవస్థ సాధించిన విజయం.

----ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకుపై కేంద్ర తపాలా శాఖ కార్యదర్శి వినీత్ పాండే.

గ్రామీణ ప్రాంతాల ప్రజలకు,.. ఇప్పటిదాకా, బ్యాంకుల పరిధిలోకి రాని పౌరులకు సహకారం, తగిన ఉత్పాదనలు, సేవలు అందించడం.. ఇతర ఆర్థిక సేవా కార్యకలాపాలన్నింటికీ బ్యాంకు కట్టుబడి ఉంది.

----ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంకు (ఐ.పి.పి.బి.) మేనేజింగ్ డైరెక్టర్, సి.ఇ.ఒ. జె. వెంకటరాము

Posted On: 18 JAN 2022 2:47PM by PIB Hyderabad

  ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకు (ఐ.పి.పి.బి.)...

దేశంలో అతిపెద్ద ఆర్థిక సమ్మిళత ప్రక్రియలో చెప్పుకోదగిన అతిపెద్ద కార్యక్రమంగా ప్రధానమంత్రి ఈ బ్యాంకును అభివర్ణించారు. బ్యాంకును ప్రారంభించిన సందర్భంలో ఆయన చేసిన వ్యాఖ్యలివి. భారత ప్రభుత్వ పరిధిలోని కమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే భారతీయ తపాలాశాఖ విస్తృతమైన వ్యవస్థ పట్టాలపై నిర్మించిన ‘డిజిటల్-ప్రథమ బ్యాంకు’ ఇది.

 డిజిటల్ బ్యాంకింగ్ ప్రక్రియ ద్వారా తన ఆర్థిక సమ్మిళత లక్ష్యాలను చేరుకున్నామని, బ్యాంకు ఆవిర్భావ కాలంనుంచి ఇది చెప్పుకోదగిన మైలురాయి వంటిదని ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకు ప్రకటించింది.

  ఆర్థిక కార్యకలాపాలు ప్రారంభమైన మూడేళ్ల స్వల్ప వ్యవధిలోనే ఐదుకోట్ల మందికి పైగా ఖాతాదారులకు తాము చేరువకాగలిగినట్టు ఐ.పి.పి.బి. ఈ రోజు ప్రకటించింది. అలాగే, దేశంలోనే అతి వేగంగా ఎదుగుతున్న డిజిటల్ పేమెంట్ బ్యాంకుల సరసన తాము స్థానం సాధించినట్టు కూడా ఐ.పి.పి.బి. ప్రకటించింది.   

 

  దేశవ్యాప్తంగా తన పరిధిలోని లక్షా 36వేల పోస్టాఫీసుల ద్వారా లక్షా 47వేల మంది డోర్ స్టెప్ ప్రొవైడర్ల సహాయంతో కాగిత రహిత పద్ధతులను పాటిస్తూ ఈ ఐదుకోట్లమేర ఖాతాలను ఐ.పి.పి.బి. తెరవగలిగింది. దేశంలోని మొత్తం లక్షా 36 వేల పోస్టాఫీసుల్లో లక్షా 20 వేల పోస్టాఫీసులు గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నాయి. మొత్తం 2,80,000మంది తపాలా కార్యాలయాల ఉద్యోగుల సేవలను సానుకూలంగా వినియోగించుకుంటూ, ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ ఆర్థిక అక్షరాస్యతా కార్యక్రమాన్ని ఐ.పి.పి.బి. సాధించింది. ఆర్థిక అంశాలపై అవగాహన, సాధికారత కలిగిన ఖాతాదార్ల వ్యవస్థను నిర్మించడం ద్వారా ఐ.పి.పి.బి. ఈ విజయాన్ని సొంతం చేసుకుంది. డిజిటల్ బ్యాంకింగ్ ప్రక్రియను తాను అట్టడుగు గ్రామీణ ప్రాంతాల స్థాయికి తీసుకెళ్లినట్టు ఐ.పి.పి.బి. ప్రకటించింది. భారత జాతీయ చెల్లింపుల సంస్థ (ఎన్.పి.సి.ఐ.), భారతీయ రిజర్వ్ బ్యాంకు (ఆర్.బి.ఐ.), విశిష్ట గుర్తింపు సంఖ్య ప్రాధికార సంస్థ (ఉడయి)ల వంటి వ్యవస్థల ద్వారా ఈ లక్ష్యాన్ని సాధించగలిగినట్టు, ఈ వ్యవస్థలు 13 భారతీయ భాషల్లో సేవలందిస్తున్నట్టు ఐ.పి.పి.బి. తెలిపింది.

  దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం ఖాతాదార్లలో దాదాపు 48శాతం మంది మహిళా ఖాతాదారులే కావడం విశేషం. మిగిలిన 52శాతం మంది పురుష ఖాతాదారులు. బ్యాంకింగ్ వ్యవస్థ పరిధిలోకి మహిళా ఖాతాదార్లను రప్పించేందుకు ఐ.పి.పి.బి. ఎంతమేర తన దృష్టిని కేంద్రీకరించిందో దీన్నిబట్టి తెలుసుకోవచ్చు. మహిళల ఖాతాల్లో 98శాతం ఖాతాలను వారి ఇంటిముంగిటికే వెళ్లి మరీ ప్రారంభింప జేశారు. మహిళా ఖాతాదార్లలో 68 శాతం మంది ప్రత్యక్ష నగదు చెల్లింపు పద్ధతిలో ప్రయోజనం పొందుతున్నారు. ఇక,. తమ డిజిటల్ బ్యాంకింగ్ సేవలపట్ల యువజనులు కూడా ఎక్కువగా ఆకర్షితులయ్యారని, తమ బ్యాంకింగ్ చరిత్రలో ఇది కూడా మరో మైలురాయి వంటిదని ఐ.పి.పి.బి. పేర్కొంది. ఖాతాదార్లలో 41శాతం మంది 18నుంచి 35సంవత్సరాల మధ్యవయసు వారే కావడం మరో విశేషమని పేర్కొంది.

  

  ఎంతో చారిత్రాత్మకమైన ఈ సందర్భాన్ని పురస్కరించుకుని కేంద్ర తపాలా శాఖ కార్యదర్శి వినీత్ పాండే మాట్లాడుతూ, “ఇండియా పోస్ట్ ద్వారా భారతదేశంలోని అతిపెద్ద ఆర్థిక సమ్మిళిత వ్యవస్థల్లో ఒకటిగా ఎదగడానికి మేం కట్టుబడి ఉన్నాం. దేశంలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో మా సేవలను వర్తింపజేయాలని అనుకున్నాం. కేవలం మూడేళ్ల వ్యవధిలోనే ఐదుకోట్లమంది ఖాతాదార్లకు చేరువ కావడం ఓ విజయగాధే అవుతుంది. ఖర్చుకు తగిన ఫలితాలతో సులభంగా, సరళంగా పనిచేసే సురక్షితమైన నమూనా సాధించిన  విజయం ఇది. ప్రత్యేకించి గ్రామీణ భారతదేశంలో అందుకున్న విజయం. గ్రామీణ మహిళలు తమ ఇంటి ముంగిటనే బ్యాంకింగ్ సేవలు పొందేలా వారికి తగిన సాధికారత కల్పించడం మాకు మరెంతో సంతోషాన్ని కలిగిస్తోంది.” అన్నారు.

   ఐ.పి.పి.బి. మేనేజింగ్ డైరెక్టర్, సి.ఇ.ఒ. జె. వెంకటరాము మాట్లాడుతూ, “ఇది బ్యాంకు ఎంతగానో గర్వించదగిన క్షణం. ఎందుకంటే ఖాతాదార్ల వ్యవస్థ నిర్మాణంలో మేం క్రమ క్రమంగా బలం పుంజుకుంటూ వచ్చాం. నిరంతరాయంగా బ్యాంకింగ్ సేవలను, ప్రభుత్వంనుంచి పౌరులకు సేవలను కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తి సమయంలోనూ అందించాం. సంపూర్ణమైన డిజిటల్ పద్ధతిలో కాగిత రహితమైన వేదిక ద్వారా ఖాతాదార్ల సంఖ్యను పెంచుకోవడం, ఇంటి ముంగిటికే సేవలందించడం తదితర కార్యకలాపాల్లో బ్యాంకు ఎంతో ముందంజ వేసింది. గ్రామీణ ప్రాంతాలకు, బ్యాంకింగ్ సదుపాయం తక్కువగా ఉన్న ప్రాంతాల పౌరులకు తగిన ఉత్పాదనలను, సేవలను అందించేందుకు మా బ్యాంకు కట్టుబడి ఉంది.” అని అన్నారు.

    అవసరమైన వారికి బ్యాంకింగ్ సేవలందించేందుకు తన పితృసంస్థ అయిన తపాలా శాఖ సానుకూలతలను అన్నింటినీ ఐ.పి.పి.బి. సమర్థంగా వినియోగించుకొంది. దేశవ్యాప్తంగా ఆర్థిక సమ్మిళిత వ్యవస్థను సంపూర్ణంగా తీర్చిదిద్దుతూ వస్తోంది. సమీప భవిష్యత్తులోనే ఇంటి ముంగిటికి రుణ సదుపాయం వంటి సేవలను, అనేక  పౌర ప్రయోజన ఆర్థిక సేవలను అందించే సమైక్య వేదిక ఏర్పాటుకు ఐ.పి.పి.బి. కృషి చేస్తోంది.

 

ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకు (ఐ.పి.పి.బి.) గురించి:

  కేంద్ర కమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖ పరిధిలో కేంద్ర తపాలా శాఖ ఆధ్వర్యంలో ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకు (ఐ.పి.పి.బి.) ఏర్పాటైంది. ప్రభుత్వ యాజమాన్యంలో వందశాతం వాటాలతో ఇది మొదలైంది. 2018వ సంవత్సరం సెప్టెంబరు ఒకటవ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఐ.పి.పి.బి.ని లాంఛనంగా ప్రారంభించారు. దేశంలోని సామాన్య ప్రజలకు పూర్తి అందుబాటు యోగ్యంగా, విశ్వసనీయమైన బ్యాంకుగా దీన్ని ఏర్పాటు చేశారు. బ్యాంకు సదుపాయంలేని వారికి, తగిన సంఖ్యలో బ్యాంకులు లేని వారికి బ్యాంకింగ్ సేవలు అందించే ప్రధాన లక్ష్యంతో, తపాలా కార్యాలయాల వ్యవస్థను సానుకూలంగా వినియోగించుకుంటూ చిట్టచివరి ప్రాంతానికి కూడా సేవలందించే ధ్యేయంతో  ఐ.పి.పి.బి. రూపుదిద్దుకుంది. కాగిత రహితంగా, నగదు రహితంగా బ్యాంకింగ్ కార్యకలాపాలను సరళంగా, సురక్షిత పద్ధతిలో సి.బి.ఎస్.తో కూడిన స్మార్ట్ ఫోన్, బయోమెట్రిక్ పరికరం ద్వారా ఖాతాదారుడి ముంగిటికే అందించే లక్ష్యంతో ఈ బ్యాంకును రూపొందించారు. ప్రజలకు సులభమైన పద్ధతిలో బ్యాంకింగ్ సేవలను అందించేందుకు ఐ.పి.పి.బి. సరళమైన, అందుబాటు యోగ్యమైన బ్యాంకింగ్ పరిష్కారాలను బట్వాడా చేస్తోంది. తక్కువ స్థాయి నగదు ప్రమేయంతో డిజిటల్ ఇండియా కలను సాకారం చేసేందుకు ఐ.పి.పి.బి. కృషి చేస్తోంది. దేశంలోని ప్రతి పౌరుడు ఆర్థికంగా సాధికారత, భద్రత సాధించినపుడు భారతదేశం ముందుకు పురోగమిస్తుంది. తమ దృష్టిలో ప్రతి ఖాతాదారుడూ ముఖ్యమే..ప్రతి లావాదేవీ అవసరమే. ప్రతి డిపాజిట్టూ విలువైనదే అని ఐ.పి.పి.బి. చెబుతోంది. ఐ.పి.పి.బి.పై మరింత సమాచారం కోసం, ఇంటర్నెట్.పై www.ippbonline.com  అనే వెబ్ లింకును సందర్శించవచ్చు.

 

****



(Release ID: 1790788) Visitor Counter : 219