శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

వైరస్ నిర్మూలనకు రైలుబోగీల్లో, ఏసీ బస్సుల్లో యు.వి.-సి వాడకం!


ఇది సి.ఎస్.ఐ.ఆర్.లో రూపుదిద్దుకున్న
కొత్త టెక్నాలజీ: జితేంద్ర సింగ్..

సార్స్ సి.ఒ.వి.-2 నియంత్రణకు
నూతన టెక్నాలజీ వినియోగంపై
మార్గదర్శకాలను విడుదల చేసిన కేంద్రమంత్రి...

రైల్వేలు, పార్లమెంటు భవనంలో వాడకం విజయవంతం,
ఇపుడు సామాన్య ప్రజలూ వాడవచ్చని సూచన..

గాలి తుంపరల్లోని వైరస్ నిర్మూలనలో
ఇది పూర్తిగా సమర్థమైనదని వెల్లడి..


ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో
పరిమిత హాజరు సమావేశాల్లో ఈ టెక్నాలజీని వాడాలంటూ
ఎన్నికల కమిషన్.కు త్వరలో సి.ఎస్.ఐ.ఆర్. లేఖ..

Posted On: 17 JAN 2022 5:32PM by PIB Hyderabad

  రైల్వే బోగీలు, ఎ.సి. బస్సులు, తదితర మూసి ఉంచిన ప్రాంతాల్లో వైరస్ మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర వైజ్ఞానిక, పారిశ్రామిక పరిశోధనా మండలి (సి.ఎస్.ఐ.ఆర్.) రూపొందించిన నూతన క్రిమిసంహాకర సాంకేతిక పరిజ్ఞాన వినియోగానికి తగిన ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్ర సైన్స్, టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా) డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. భూగోళ విజ్ఞానం, ప్రధానమంత్రి కార్యాలయం, సిబ్బంది వ్యవహారాలు, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్లు, అణుశక్తి, అంతరిక్ష పరిశోధన శాఖలను కూడా ఆయన సహాయమంత్రి హోదాలో అజమాయిషీ చేస్తున్నారు.

https://ci5.googleusercontent.com/proxy/I1JfQzekWGtWerWXE7YySUWAY876vpOvG-XIh2WRJh5wvHbAUdJ0yUpCTAlIjahXx7v1ArLgfxuYkgCGGEcPHZ6NEPZcJJUb9yRyuJs48xW0L_aIKsViSs3--A=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001BAHE.jpg

సార్స్ సి.ఒ.వి.-2 వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు జరిపే క్రిమిసంహారక సాంకేతిక పరిజ్ఞాన వినియోగంలో పాటించవలసిన మార్గదర్శక సూత్రాలను విడుదల చేసిన సందర్భంగా డాక్టర్ జితేందర్ సింగ్ మాట్లాడారు.  ఆన్.లైన్., ఆఫ్.లైన్ల ద్వారా హైబ్రిడ్ పద్ధతిలో జరిగిన మార్గదర్శకాల విడుదల కార్యక్రమంలో సి.ఎస్.ఐ.ఆర్. డైరెక్టర్ జనరల్ శేఖర్ సి మాండే,..డాక్టర్ రాజేశ్ గోఖలే,  దేశవ్యాప్తంగా ఉన్న సి.ఎస్.ఐ.ఆర్. లెబరేటరీల సీనియర్ అధికారులు పాలుపంచుకున్నారు.

సి.ఎస్.ఐ.ఆర్., కేంద్ర వైజ్ఞానిక పరికరాల సంస్థ (సి.ఎస్.ఐ.ఒ.)ల ద్వారా కేంద్ర సైన్స్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ రూపొందించిన యు.వి-సి, సాంకేతిక పరిజ్ఞానం గాలి, నీటి తుంపరల ద్వారా వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో ఎంతో సమర్థవంతంగా పనిచేస్తోందని మంత్రి చెప్పారు. వైరస్ వ్యాప్తి అనంతరం కాలంలో కూడా ఈ పరిజ్ఞానం వినియోగయోగ్యంగానే కొనసాగుతుందన్నారు. రైల్వేలు, ఎ.సి. బస్సులతో పాటుగా, పార్లమెంటు భవన సముదాయంలో కూడా ఈ సాంకేతిక పరిజ్ఞానం వాడకాన్ని ప్రయోగాత్మకంగా విజయవతం చేసినట్టు చెప్పారు. ప్రస్తుతం దీన్ని సామాన్య ప్రజలు కూడా వినియోగించేందుకు అవకాశం ఏర్పడిందని ఆయన అన్నారు.

  సి.ఎస్.ఐ.ఆర్. రూపొందించిన క్రిమిసంహారక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించినప్పటికీ, ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలను పాటించవలసిందేనని, నోటికీ, ముక్కుకూ మాస్కు ధారణ, భౌతిక దూరం పాటించడం కొనసాగించాల్సిందేనని, జనం గుంపులుగా కూడటాన్ని నివారించాలని ఆయన సూచించారు. 

  వాతావరణంలోని నీటి తుంపర్లలో, బిందువుల్లో ప్రయాణించే సార్స్ సి.ఒ.వి-2 వైరస్.ను తగిన వెలుతురు ప్రసరణ ఏర్పాట్లతో నిర్వీర్యం చేయడానికి వీలుగా ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని రూపొందించినట్టు డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. అవసరమైన భద్రతా సూత్రాలు, మార్గదర్శక సూత్రాలు, బయోసేఫ్టీ ప్రమాణాలతో యు.వి.సి అనే ఈ పరిజ్ఞానాన్ని తయారు చేసినట్టు చెప్పారు. 254 నానో మీటర్ల సామర్థ్యంతో కూడిన అతి నీలలోహిత కాంతితో తగిన మోతాదులో యు.వి-సి.ని వినియోగించినపుడు అది పలు రకాల వైరస్.లను, బాక్టీరియాను, శిలీంద్రాలను, ఇతర క్రిములతో కూడిన నీటి తుంపరలను నిర్వీర్యం చేస్తుందని రుజువైందని ఆయన అన్నారు.

   ఐదు రాష్ట్రాల శాసనసభ ఎనికల సందర్భంగా, కొన్నాళ్లపాటు భౌతిక ర్యాలీలను, రోడ్ షోలను నిషేధించన నేపథ్యంలో, పరిమిత హాజరుతో నిర్వహించే అంతర్గత మందిర సమావేశాలకోసం ఈ సాంకేతిక పరిజ్ఞాన్ని వినియోగించుకోవాలని సూచిస్తూ, సి.ఎస్.ఐ.ఆర్. ఎన్నికల కమిషన్.కులేఖ రాస్తుందని కేంద్రమత్రి జితేంద్ర సింగ్ చెప్పారు. ఆడిటోరియంలు, పెద్దపెద్ద సమావేశ గదులు, తరగతి గదులు, మాళ్లు తదితర ప్రాంతాల్లో యు.వి.-సి. ఎయిర్ డక్ట్ క్రిమిసంహారక వ్యవస్థను వినియోగించుకోవచ్చని జితేంద్ర సింగ్ సూచించారు. వైరస్ తీవ్రంగా వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత తరుణంలో గదుల్లో జరిపే అంతర్గత సమావేశాలకు మరింత సురక్షిత సానుకూల వాతావరణాన్ని ఇది కల్పిస్తుందని ఆయన అన్నారు.

https://ci4.googleusercontent.com/proxy/Bv6P75booh3wEb_SYdI8_3bJ6MUO7se9F0NIGW5fnLssezIxf85yJqrCxlgxJm2ql1l9ZN4gjPsWbo2Q6gkf3nxCMVw3DNVL5jV1YXB1uchMRIkdyf22nf8RTA=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002QIXJ.jpg

  ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో గరిష్టంగా 300మందితో ఇండోర్ సమావేశాలు నిర్వహించుకోవచ్చని, ఆడిటోరియం, లేదా హాల్ సామర్థ్యంలో 50శాతం హాజరుతో, కోవిడ్ నిబంధనలను, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పాటిస్తూ, ఎన్నికల ప్రచార కార్యక్రమాలు చేపట్టవచ్చని ఇటీవల ఎన్నికల కమిషన్ పేర్కొన్నట్టు కేంద్రమంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు.

   గాలిలోని నీటి తుంపరల ద్వారా సార్స్-సి.ఒ.వి.-2 వైరస్ వ్యాప్తి చెందకుండా నివారించేలా ఈ సాంకేతిక పరిజ్ఞాన వినియోగం కోసం పార్లమెంటు సెంట్రల్ హాలు, లోక్ సభ చేంబర్, 62, 63వ కమిటీ గదుల్లో గత ఏడాది జూలై నెలలో వర్షాకాల సమావేశాల సందర్భంగా తగిన ఏర్పాట్లు చేసినట్టు డాక్టర్ జితేందర్ సింగ్ చెప్పారు. రానున్న బడ్జెట్ సమావేశాలను దృష్టిలో పెట్టుకుని ఈ టెక్నాలజీని ఏర్పాటు చేయవలసిందిగా కోరుతూ రాజ్యసభ ప్రధాన కార్యదర్శికి తాను లేఖరాయనున్నట్టు చెప్పారు. విజ్ఞాన శాస్త్ర పరిశోధనా ప్రక్రియలో సి.ఎస్.ఐ.ఆర్. తన సంప్రదాయాన్ని, ఆనవాయితీని కొనసాగిస్తున్నదని ఆయన అన్నారు. సామాన్య మానవుడి దైనందిన జీవిత కార్యకలాపాల్లో ఈ సంస్థ నిర్వహిస్తున్న పాత్ర గురించి శాస్త్రవేత్తలు ప్రధానంగా ప్రస్తావించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సైన్స్, టెక్నాలజీ రంగాల్లో సి.ఎస్.ఐ.ఆర్. ప్రపంచ స్థాయి ప్రత్యేక హోదాను కొనసాగిస్తూ వస్తోందని కేంద్రమంత్రి అన్నారు.

 కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి మనోజ్ జోషి మాట్లాడుతూ, ప్రభుత్వ, ప్రైవేటు భవనాలకు సంబంధించి ఎయిర్ డక్ట్ క్రిమిసంహారక ప్రక్రియలో యు.వి.-సి టెక్నాలజీ వ్యవస్థ పనితీరు, సామర్థ్యాన్ని గురించి తెలియజెప్పేందుకు, టెక్నాలజీ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రజా పనుల శాఖ, సి.ఎస్.ఐ.ఆర్.తో కలసి పనిచేస్తుందని చెప్పారు.

  రైల్వే బోర్డు కార్యనిర్వాహక డైరెక్టర్ ఎ.కె. మల్హోత్రా మాట్లాడుతూ, బంద్రానుంచి చండీగఢ్ వరకూ వంద కిలోమీటర్ల మార్గం వెంబడీ నెలరోజులపాటు రైలు బోగీల్లో యు.వి.-సి. టెక్నాలజీని  వినియోగించగా, అది సమర్థవంతగా పనిచేసినట్టు ప్రయోగాత్మకంగా రుజువైందని అన్నారు. రైలు బోగీల్లో ఈ టెక్నాలజీని దశలవారీగా వినియోగించాలని లక్నోకు చెందిన పరిశోధనా నమూనాల, ప్రమాణాల సంస్థ (ఆర్.డి.ఎస్.ఒ.) సిఫార్సు చేసినట్టు మల్హోత్రా చెప్పారు.

  రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి అమిత్ వరదన్ మాట్లాడుతూ, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (యు.పి.ఎస్.ఆర్.టి.సి.) ఆధ్వర్యంలోని ఎ.సి. బస్సుల్లో యు.వి.-సి. టెక్నాలజీని విజయవంతంగా వినియోగించినట్టు తెలిపారు. ప్రయాణికుల రవాణా వాహనాలన్నింటిలోనూ ఈ టెక్నాలజీ వినియోగాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని తమ మంత్రిత్వ శాఖ భావిస్తున్నట్టు చెప్పారు.

 <><><>


(Release ID: 1790715) Visitor Counter : 199