హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

మణిపూర్‌ లో 2,450 కోట్ల రూపాయల విలువైన 29 అభివృద్ధి పనులకు ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన - కేంద్ర హోం మరియు సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా

Posted On: 06 JAN 2022 7:15PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో అన్ని చోట్లా అభివృద్ధిని తీసుకురావడంలో ముఖ్యమంత్రి శ్రీ ఎన్. బీరెన్ సింగ్ విజయం సాధించారు

ఈ ఐదేళ్లలో ఎప్పుడూ ఎలాంటి దిగ్బంధనం జరగలేదు,  అభివృద్ధి ఎక్కడా ఆగలేదు,  హింస కూడా చాలా వరకు నియంత్రించబడింది; స్థిరత్వం, శాంతి ఉంటే తప్ప, అభివృద్ధి అసాధ్యం

మణిపూర్‌ లో సుస్థిరత, శాంతితో పాటు అభివృద్ధి మార్గాలను తెరవడమే బీరెన్ సింగ్ ప్రభుత్వం సాధించిన అతి పెద్ద విజయం

గత ప్రభుత్వాల హయాంలో కొనసాగిన దిగ్బంధనం, హింస, అవినీతి, బంద్‌ లు, డ్రగ్స్ వ్యాపారం వంటి సంప్రదాయాల నుంచి బయటపడేందుకు మణిపూర్ విజయవంతమైన ప్రయత్నం చేసింది

ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ నిన్న 3,000 కోట్ల రూపాయల కంటే ఎక్కువ విలువైన 21 ప్రాజెక్టుల‌కు ప్రారంభోత్సవాలు, శంకుస్థాప‌నలతో పాటు; ఐదు జాతీయ రహదారుల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు

265 కోట్ల రూపాయల కంటే ఎక్కువ వ్యయంతో కూడిన 15 ప్రాజెక్టులకు; అదేవిధంగా  2,194 కోట్ల రూపాయల విలువైన 14 ప్రాజెక్టులకు ఈ రోజు ప్రారంభోత్సవాలు జరిగాయి

కేవలం రెండు రోజుల్లోనే మణిపూర్ వాసుల కోసం దాదాపు 5,500 కోట్ల రూపాయలతో పనులు ప్రారంభమయ్యాయి.

గత ప్రభుత్వాల సుదీర్ఘ పాలనలో, ఎప్పుడైనా, కేవలం రెండు రోజుల వ్యవధిలో 5,500 కోట్ల రూపాయల విలువైన పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జరిగాయా? నాకు చెప్పండి

నరేంద్ర మోదీ ప్రభుత్వం మొత్తం ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి అనేక అవకాశాలను కల్పించింది;  ఈ ఎనిమిది రాష్ట్రాలు భారతదేశానికి అష్టలక్ష్మిలని ప్రధానమంత్రి అభివర్ణించారు

గత ఏడున్నరేళ్లలో మంత్రుల పర్యటనలు జరిగాయి, ప్రధానమంత్రి కూడా అనేక సార్లు పర్యటించారు

బ్రూ-రియాంగ్ ఒప్పందం, బోడో ఒప్పందం వంటి ఒప్పందాలపై ఎనిమిది తిరుగుబాటు బృందాలతో చర్చలు జరిపి, బంగ్లాదేశ్‌ తో ఉన్న భూ సరిహద్దు వివాదాలు వంటి అనేక సమస్యలను ఒప్పందాల ద్వారా పరిష్కారించడం జరిగింది

దాదాపు 3,000 మంది తీవ్రవాదులు తమ ఆయుధాలను స్వాధీనం చేసి, జన జీవన స్రవంతిలో చేరారు; ఈ యువత, నేడు, దేశాభివృద్ధిలో నిమగ్నమై ఉన్నారు

గత ప్రభుత్వంలో అస్థిరత (Instability), తిరుగుబాటు (Insurgency), అసమానత (Inequality) అనే మూడు "ఐ(I)" లు ఉండేవి.  ఆ మూడు "ఐ (I)" లను మేము ఆవిష్కరణ (Innovation), మౌలిక సదుపాయాలు (Infrastructure), సమగ్రత (Integration) లు గా మార్చాము

సమగ్రత ద్వారా మాత్రమే దేశం ఒక్కటి కాగలదు; ఈశాన్య ప్రాంతం ఒక్కటి కాగలదు

మణిపూర్ సంస్కృతిని ప్రోత్సహించడానికి, క్వీన్ మదర్ మరియు గిరిజన నాయకులందరి పై  దేశవ్యాప్తంగా 31 గిరిజన మ్యూజియంల నిర్మాణం; వాటిలో ఒకటి మణిపూర్‌ లో నిర్మించనున్నారు.

ఒక అభివృద్ధి చెందిన ఈశాన్య ప్రాంతం ఉండాలని, అది మొత్తం తూర్పు భారతదేశ అభివృద్ధికి ఆధారం కావాలని, తద్వారా మాత్రమే తూర్పు భారతదేశంతో పాటు మొత్తం భారతదేశం అభివృద్ధి చెందుతుందని, శ్రీ నరేంద్ర మోదీ ఒక మంచి దార్శనికతను మనందరి ముందు ఉంచారు

అండమాన్‌లో, మహారాజా కులచంద్ర మరియు అతని సహచరులు బ్రిటిష్ వారితో పోరాడారు.  వారిని ఉంచిన ప్రదేశానికి మణిపూర్ పర్వతం అని పేరు పెట్టడం ద్వారా, మోడీ ప్రభుత్వం ఆ స్వాతంత్య్ర సమరయోధులందరికీ నివాళులు అర్పించింది.

స్వాతంత్య్ర పోరాటంలో నేతాజీ స్వాతంత్య్ర ద్వారంగా మార్చుకున్నది మణిపూర్; అదేవిధంగా, ఐ.ఎన్.ఏ. కు చెందిన జండాను తొలిసారి ఎగురుచేసే అవకాశం కూడా మణిపూర్‌కు దక్కింది

75 సంవత్సరాల స్వాతంత్య్రం మరియు 50 సంవత్సరాల మణిపూర్ సందర్భంగా మణిపూర్ పౌరులందరికీ కొత్త సంకల్పం, కొత్త శక్తి సంవత్సరాలు

మణిపూర్‌ లో 2,450 కోట్ల రూపాయల విలువైన 29 అభివృద్ధి పనులకు కేంద్ర హోం మరియు సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా ఈ రోజు దృశ్య మాధ్యమం ద్వారా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.  ఈ కార్యక్రమంలో మణిపూర్ ముఖ్యమంత్రి శ్రీ ఎన్. బీరెన్ సింగ్ కూడా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి ప్రసంగిస్తూ, నేతాజీ సుభాష్ చంద్రబోస్ మన స్వాతంత్య్ర పోరాటంలో మణిపూర్‌ ని స్వాతంత్య్రానికి ద్వారంలా తీర్చిదిద్దారని, అదేవిధంగా ఐ.ఎన్.ఏ. తొలి జెండాను ఎగురవేసే అవకాశం కూడా మణిపూర్‌ కు దక్కిందని పేర్కొన్నారు.  ఈ సంవత్సరం దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75వ సంవత్సరం, దేశం మొత్తం ఆజాదీ-కా-అమృత్-మహోత్సవ్‌ ను జరుపుకుంటోంది. ఇదే సమయంలో మణిపూర్ ఏర్పడి కూడా 50 ఏళ్ళు పూర్తయ్యింది. ఒక రకంగా చెప్పాలంటే, 75 సంవత్సరాల దేశ స్వాతంత్య్రం మరియు 50 సంవత్సరాల మణిపూర్, మణిపూర్ పౌరులందరికీ కొత్త సంకల్పం మరియు కొత్త శక్తి యొక్క సంవత్సరాలు.

ముఖ్యమంత్రి శ్రీ ఎన్. బీరేన్ సింగ్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం గత ఐదేళ్లలో మణిపూర్‌లోని ప్రతి మూలను అభివృద్ధి చేయడానికి ఎంతో అంకితభావంతో కట్టుబడి ఉందని శ్రీ అమిత్ షా అన్నారు.  పర్వతాలు, లోయలు, అడవులు, గ్రామాలు లేదా నగరాలు కావచ్చు, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రతి చోటా అభివృద్ధి ని తీసుకురావడంలో ముఖ్యమంత్రి శ్రీ ఎన్. బీరెన్ సింగ్ విజయం సాధించారు.  మణిపూర్ చరిత్ర ఎప్పుడు రాసినా ఈ ఐదేళ్లు స్వర్ణయుగంగా లిఖించబడతాయి.  ఈ ఐదేళ్లలో అభివృద్ధి జరిగింది. అయితే ఎప్పుడూ ఎలాంటి దిగ్బంధనం జరగలేదు. అభివృద్ధి ఎక్కడా ఆగలేదు, హింస కూడా చాలా వరకు నియంత్రించబడింది.  స్థిరత్వం, శాంతి ఉంటే తప్ప అభివృద్ధి అసాధ్యం.  బీరెన్ సింగ్ ప్రభుత్వం సాధించిన అతి పెద్ద విజయం ఏమిటంటే, అది మణిపూర్‌ లో స్థిరత్వం, శాంతి, అభివృద్ధి మార్గాలను తెరిచింది.  దిగ్బంధనాలు, హింస, అవినీతి, బంద్‌ లు, మాదక ద్రవ్యాల వ్యాపారం వంటి గత ప్రభుత్వాల సంప్రదాయాల నుంచి బయటపడేందుకు మణిపూర్ విజయవంతమైన ప్రయత్నం చేసింది.

3,000 కోట్ల రూపాయల కంటే ఎక్కువ విలువైన 21 ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలతో పాటు, ఐదు జాతీయ రహదారుల ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నిన్న శంకుస్థాపన చేశారని కేంద్ర హోం మరియు సహకార శాఖ మంత్రి తెలిపారు.  తాగునీటి సరఫరా, ఆరోగ్యం, పట్టణాభివృద్ధి, సమాచార సాంకేతికత, నైపుణ్యాభివృద్ధి, కళలు, సంస్కృతి వంటి వివిధ రంగాలకు సంబంధించిన అనేక పథకాలను ప్రధానమంత్రి ప్రారంభించారు.  ఈ రోజు, ఈ కార్యక్రమంలో, 265 కోట్ల రూపాయల విలువైన 15 ప్రాజెక్టులతో పాటు; 2,194 కోట్ల రూపాయల విలువైన 14 ప్రాజెక్టులను ప్రారంభించడం జరిగింది.   శ్రీ నరేంద్ర మోదీ మరియు శ్రీ ఎన్. బీరెన్ సింగ్ ఇద్దరూ కలిసి, మణిపూర్‌ కు దాదాపు 2,450 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను అందించారు.  అదే విధంగా, కేవలం రెండు రోజుల్లోనే మణిపూర్ ప్రజల కోసం దాదాపు 5,500 కోట్ల రూపాయల విలువైన పనులు ప్రారంభమయ్యాయి.  గత ప్రభుత్వాల సుదీర్ఘ పాలనలో, ఎప్పుడైనా, కేవలం రెండు రోజుల వ్యవధిలో 5,500 కోట్ల రూపాయల విలువైన పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జరిగాయా? అని కేంద్ర హోంమంత్రి ప్రశ్నించారు. 

రానున్న కాలంలో సేంద్రియ ఆహారోత్పత్తుల ప్రాధాన్యత పెరగనుందని శ్రీ అమిత్ షా అన్నారు.  ఈ దిశలో, కేంద్ర వ్యవసాయం, రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈశాన్య ప్రాంతానికి ఆర్గానిక్ మిషన్ ప్రత్యేక పథకం కింద సంజెంథాంగ్‌ లో ఆర్గానిక్ అవుట్‌ లెట్‌ లు, శీతల గదులు, ప్యాకింగ్ యూనిట్‌ లు ప్రారంభించబడ్డాయి.  మణిపూర్ రైతులు సేంద్రీయ వ్యవసాయాన్ని అంగీకరించిన తీరును వారికి వివరించారు.  తమ ఉత్పత్తులకు వారు గరిష్ట ధరలు పొందవచ్చు.  భారత ప్రభుత్వం, మణిపూర్ ప్రభుత్వం దీనికి కట్టుబడి ఉన్నాయి. ఈ రోజు ఈ దిశగా నూతన శకం ప్రారంభమైంది.  ప్రధానమంత్రి వ్యవసాయ సాగు నీటి పథకం కింద 8 కోట్ల రూపాయలతో, 75 గొట్టపు బావులు కూడా ఈరోజు ప్రారంభమయ్యాయి.  పశుసంవర్ధక రంగంలో 16 కోట్ల రూపాయల వ్యయంతో ఐదు ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి.  21 కోట్ల రూపాయల వ్యయంతో నాలుగు వంతెనలు, రోడ్లు నిర్మాణం కానున్నాయి.  మొత్తం 36 కోట్ల రూపాయల వ్యయంతో పూర్తయిన నాలుగు తాగునీటి సరఫరా ప్రాజెక్టుల ద్వారా రేపటి నుంచి దాదాపు 31,000 మందికి ప్రయోజనం చేకూరనుంది.  పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి కూడా పనులు జరిగాయి. మణిపూర్ విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఒక అంతర్జాతీయ వసతి గృహ భవనాన్ని,  ఒక పోలీస్ స్మారకాన్ని కూడా ఈ రోజు ప్రారంభించడం జరిగింది. అలాగే సిరుయి మహోత్సవానికి సంబంధించిన మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టు కు 46 కోట్ల రూపాయలు;  'హునార్ హబ్' అభివృద్ధి;  ఇంఫాల్ వద్ద 'ఒలింపియన్ పార్క్' శంకుస్థాపన;  లువాంగ్‌ సంగ్బమ్‌ లోని క్రికెట్ స్టేడియంలో సౌకర్యాల విస్తరణ;  సేనాపతి, నోని, కక్చింగ్ జిల్లాల్లో 108 కోట్ల రూపాయలతో జిల్లా కోర్టు భవన సముదాయాలకు శంకుస్థాపన;  తంగపట్ వద్ద ఐదు రిజర్వాయర్లు, రెండు ప్రధాన ప్రాజెక్టులతో పాటు అనేక ఇతర నీటి వనరుల కోసం 22 కోట్ల రూపాయలు కూడా ప్రకటించడం జరిగింది.  450 ఎకరాల లాంఫెల్‌ పట్‌ వాటర్‌ బాడీ అభివృద్ధికి ఒక ప్రణాళికను రూపొందించడం జరిగింది.  న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్ నుండి 650 కోట్ల రూపాయల నిధులతో 450 ఎకరాల లాంఫెల్‌పట్ నీటి వనరుల పునరుద్ధరణ పనులు; న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్ నుండి 1,149 కోట్ల రూపాయల నిధులతో  ఇంఫాల్ నగరానికి సమగ్ర మురుగునీటి వ్యవస్థ రెండవ దశ పనులు ప్రారంభం కానున్నాయి. 

మునుపటి ప్రభుత్వాలు 24 గంటలూ రాజకీయాల్లో మునిగితేలాయని, సాయుధ గ్రూపులకు మద్దతు ఇచ్చాయని, శిక్ష లేకుండా చేయడానికి తీసుకునే లంచం, మనుష్యల అపహరణ, మాదక ద్రవ్యాల వ్యాపారం, బంద్‌ ల పేరుతో ప్రజలను వేధించాయని కేంద్ర హోంమంత్రి విమర్శించారు.  కానీ ఇప్పుడు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం, మణిపూర్‌ లోని ఎన్.బీరెన్ సింగ్ ప్రభుత్వం రెండూ కలిసి మణిపూర్‌ లో డబుల్ ఇంజన్ అభివృద్ధిని ప్రవేశపెట్టాయి.  అండమాన్‌లో, మహారాజా కులచంద్ర, అతని సహచరులు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడారు.  వారిని ఉంచిన ప్రదేశానికి మణిపూర్ పర్వతం అని పేరు పెట్టడం ద్వారా, మోడీ ప్రభుత్వం ఆ స్వాతంత్య్ర సమరయోధులందరికీ నివాళులు అర్పించింది. రాష్ట్ర డిమాండ్లన్నింటినీ అర్థం చేసుకుని, అంగీకరించి ముందుకు తీసుకెళ్లాం. మొత్తం ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి నరేంద్ర మోదీ ప్రభుత్వం అనేక అవకాశాలను కల్పించిందని, ఎనిమిది రాష్ట్రాలు భారతదేశానికి అష్టలక్ష్మిలు అని ప్రధానమంత్రి అభివర్ణించారని, ఆయన అన్నారు. 15 రోజుల్లో ప్రతి మంత్రి ఏదో ఒక రాష్ట్రంలో పర్యటించాలని, జిల్లా స్థాయి కార్యక్రమాల్లో పాల్గొనాలని, శ్రీ నరేంద్ర మోదీ భారత ప్రభుత్వ మంత్రులందరినీ ఆదేశించారు.  గత ఏడున్నరేళ్లలో 1500 సార్లు మంత్రులు పర్యటించగా, ప్రధానమంత్రి కూడా ఎన్నో పర్యటనలు చేశారు. బంగ్లాదేశ్‌ తో భూ సరిహద్దు వివాదాల వంటి అనేక సమస్యలు ఉన్నాయని,  బ్రూ-రియాంగ్ ఒప్పందం, బోడో ఒప్పందం వంటి ఒప్పందాలపై ఎనిమిది తిరుగుబాటు బృందాలతో చర్చలు జరిపి, వాటిని ఒప్పందాల ద్వారా పరిష్కారించడం జరిగిందని, శ్రీ అమిత్ షా వివరించారు. దాదాపు 3,000 మంది తీవ్రవాదులు తమ ఆయుధాలను స్వాధీనం చేసి, జన జీవన స్రవంతిలో చేరారు. ఈ యువత, నేడు, దేశాభివృద్ధిలో నిమగ్నమై ఉన్నారు. 

గత ప్రభుత్వ హయాంలో అస్థిరత  (Instability),   తిరుగుబాటు (Insurgency), అసమానత (Inequality) అనే మూడు "ఐ (I)" లు ఉండేవని శ్రీ అమిత్ షా పేర్కొన్నారు. మేము, ఆ మూడింటిని  ఆవిష్కరణ (Innovation), మౌలిక సదుపాయాలు (Infrastructure), సమగ్రత (Integration) లు గా మార్చాము. అప్పుడే దేశం ఒకటిగా, ఈశాన్య ప్రాంతం ఒకటిగా మారగలదు.  ఈ మూడు "ఐ (I)" ల సూత్రాన్ని, అష్టలక్ష్మి ల కోసం ప్రధానమంత్రి పిలుపుని, క్షేత్ర స్థాయికి తీసుకు వెళ్లాలని, ఆయన అన్నారు.  మణిపూర్‌ ను దిగ్బంధన రహితంగా, బంద్‌ రహితంగా తీర్చిదిద్ది అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్లామని, అవకాశం ఇస్తే మణిపూర్‌ ను మాదక ద్రవ్యాల రహితంగా తీర్చిదిద్దుతామన్నారు.  మణిపురి సంస్కృతిని ప్రోత్సహించడానికి, మేము క్వీన్ మదర్ మరియు గిరిజన నాయకులందరికీ మ్యూజియం నిర్మిస్తున్నాము.  దేశవ్యాప్తంగా 31 గిరిజన మ్యూజియంలు ఏర్పాటు కానున్నాయి; వాటిలో ఒకటి మణిపూర్‌లో ఉంటుంది.  కోవిడ్-19 నిర్వహణ బాగా చేసినందుకు ముఖ్యమంత్రిని, మణిపూర్ ప్రభుత్వాన్ని కూడా ఆయన అభినందించారు.  మొత్తం 16 జిల్లాల్లో ఆక్సిజన్ ప్లాంట్లు కూడా ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు.  అభివృద్ధి చెందిన ఈశాన్య ప్రాంతం ఉండాలని శ్రీ నరేంద్ర మోదీ మనందరికీ దిశానిర్దేశం చేశారు;  అదే, మొత్తం తూర్పు భారతదేశ అభివృద్ధికి ఆధారం కావాలి.  దీని ద్వారా తూర్పు భారతదేశంతో పాటు భారతదేశం మొత్తం అభివృద్ధి చెందుతుంది.

***** 


(Release ID: 1788249) Visitor Counter : 241