విద్యుత్తు మంత్రిత్వ శాఖ
కేంద్ర విద్యుత్ శాఖ, ఎన్ఆర్ఈ మంత్రి స్వయంచాలక ఉత్పత్తి నియంత్రణ వ్యవస్థను (ఆటోమేటిక్ జనరేషన్ కంట్రోల్ సిస్టమ్–ఏజీఎస్)జాతికి అంకితం చేశారు.
– ఏజీసీ ప్రాజెక్ట్ భారతీయ శక్తి వ్యవస్థ స్థితిస్థాపకతను మెరుగుపరచడంలో ఒక ముఖ్యమైన మైలురాయని ఆయన ప్రకటించారు.
–2030 నాటికి ఏజీసీ 500 గిగావాట్ల నాన్-ఫాజిల్ (శిలాజేతర) ఇంధన ఆధారిత ఉత్పాదక సామర్థ్యాన్ని సాధించాలనే ప్రభుత్వ ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని సులభతరం చేస్తుందని అన్నారు.
–పవర్ సిస్టమ్ ఫ్రీక్వెన్సీ విశ్వసనీయతను నిర్ధారించడానికి ప్రతి 4 సెకన్లకు ఏజీసీ ద్వారా ఎన్ఎల్డీసీ పవర్ ప్లాంట్లకు సంకేతాలను పంపుతుంది.
Posted On:
04 JAN 2022 12:06PM by PIB Hyderabad
కేంద్ర విద్యుత్, నూతన & పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ఆర్.కె. సింగ్ సోమవారం ఆటోమేటిక్ జనరేషన్ కంట్రోల్ (ఏజీసీ)ను జాతికి అంకితం చేశారు. ఇది 2030 నాటికి ప్రభుత్వ ప్రతిష్టాత్మక లక్ష్యమైన 500 గిగావాట్ల శిలాజ రహిత ఇంధన- ఆధారిత ఉత్పాదక సామర్థ్యాన్ని సాధించడానికి వీలు కల్పిస్తుందని భావిస్తున్నారు. ఏజీసీ నేషనల్ లోడ్ డెస్పాచ్ సెంటర్ను పవర్ సిస్టమ్ ఆపరేషన్ కార్పొరేషన్ (పోసోకో) నిర్వహిస్తోంది. ఏజీసీ ద్వారా, పోసోకో పవర్ సిస్టమ్ ఫ్రీక్వెన్సీ విశ్వసనీయతను నిర్ధారించడానికి ప్రతి 4 సెకన్లకు పవర్ ప్లాంట్లకు సంకేతాలను పంపుతుంది.
ఐదో పోసోకో వార్షికోత్సవం సందర్భంగా ఆర్.కె. సింగ్ మాట్లాడుతూ భారతదేశం పెద్ద-స్థాయి వేరియేబుల్ & ఇతర పునరుత్పాదక మూలాల ఏకీకరణకు సిద్ధమవుతోందని, ఫ్రీక్వెన్సీ నియంత్రణను ప్రారంభించే ప్రధాన సాధనాల్లో ఏజీసీ ఒకటని సింగ్ వ్యాఖ్యానించారు. ఏజీసీ ప్రాజెక్ట్ కింద పోసోకో ఇప్పటి వరకు మొత్తం ఐదు ప్రాంతాలలో 51 గిగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంతో పనిచేస్తోందని ఆయన వివరించారు. ఇండియన్ పవర్ సిస్టమ్ స్థితిస్థాపకతను మెరుగుపరచడంలో ఇది ఒక ముఖ్యమైన మైలురాయని చెప్పారు. ఏజీసీ ద్వారా, ఎన్ఎల్డీసీ (నేషనల్ లోడ్ డెస్పాచ్ సెంటర్) భారతీయ పవర్ సిస్టమ్ ఫ్రీక్వెన్సీ విశ్వసనీయతను నిర్ధారిండానికి ప్రతి 4 సెకన్లకు దేశంలోని 50కిపైగా పవర్ ప్లాంట్లకు సంకేతాలను పంపుతుంది. ఇది వేరియబుల్, ఇతర పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిని నిర్వహించడానికి మరింత సమర్థవంతమైన ఆటోమేటిక్ ఫ్రీక్వెన్సీ నియంత్రణను నిర్ధారిస్తుంది. ఐఐటి బాంబే సహకారంతో పోసోకో రూపొందించిన “అసెస్‌మెంట్ ఆఫ్ ఇనర్షియా ఇన్ ఇండియన్ పవర్ సిస్టమ్” అనే నివేదికను కూడా సింగ్ రిలీజ్ చేశారు. భారతదేశంలో ఆర్ఈ సామర్థ్యాన్ని సమగ్రపరచడం, దూకుడు లక్ష్యాన్ని పరిగణనలోకి తీసుకొని దీనిని తయారు చేశారు. పోసోకో పవర్ సిస్టమ్ జడత్వం అంచనా, కొలత పర్యవేక్షణకు సంబంధించి ప్రపంచ ఉత్తమ పద్ధతులను సమీక్షించేందుకు ఒక పద్దతిని రూపొందించడానికి బొంబాయిలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సహకారంతో పోసోకో ఒక అధ్యయనాన్ని ప్రారంభించింది.
ఈ సందర్భంగా సింగ్ మాట్లాడుతూ, “2022లో 175 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని సాధించే దిశగా దేశం సాగిపోతున్న క్రమంలో మనం భారీ హైడ్రో ప్రాజెక్టులతో సహా 150 గిగావాట్ల పునరుత్పాదక శక్తిని స్థాపిత సామర్థ్యాన్ని సాధించాము. 63 గిగావాట్ల పునరుత్పాదక శక్తి సామర్థ్యం వివిధ దశల్లో ఉంది. ఇవన్నీ వచ్చే ఏడాది నాటికి పూర్తవుతాయని భావిస్తున్నాం. స్వచ్ఛమైన శక్తికి మారేందుకు ఏర్పాటు చేసుకున్న జాతీయ లక్ష్యం సాధించడానికి అడ్డుగా ఉన్న భవిష్యత్ సవాళ్లను పోసోకో ఎదుర్కోవాలి. మారుతున్న ఇంధన మిశ్రమం, పునరుత్పాదక ఇంధనాల వ్యాప్తి, ఇంధన వనరుల విస్తరణ, పంపిణీ, సిస్టమ్ భద్రత స్థితిస్థాపకత వంటి చాలా సవాళ్లు ఉన్నాయి. విద్యుత్ రంగం రూపాంతరం చెందుతోంది. పునరుత్పాదకాలు పెద్ద సవాలుగా మారుతున్నందున గ్రిడ్ కార్యకలాపాలను సమతుల్యం చేయాలి. వ్యవసాయ రంగంలో కూడా మనకు సోలార్ కరెంటు వాడకం ఉంది. వినియోగంలో గణనీయమైన భాగాన్ని పునరుత్పాదకత వనరుల ద్వారా వినియోగదారులే ఉత్పత్తి చేస్తారు. పరిశ్రమల సుంకం వినియోగదారుల సుంకం కంటే ఎక్కువగా ఉన్నందున పరిశ్రమలు కూడా పునరుత్పాదక ఉత్పత్తులకు మారడం మనం చూస్తాము. వీటన్నింటిని సమతౌల్యం చేయడానికి మనం ఒక యంత్రాంగాన్ని తీసుకురావాలి” అని ఆయన అన్నారు.
ఈ విషయమై సింగ్ మరిన్ని విషయాలు వివరిస్తూ "మనమందరం కలిసి విద్యుత్ రంగాన్ని మార్చాం. విద్యుత్ లోటు నుండి మిగులుకు మన దేశాన్ని మార్చాము. మేం మొత్తం దేశాన్ని ఒక గ్రిడ్‌కు అనుసంధానించాం. ఇప్పుడు మనం 112 గిగావాట్ల విద్యుత్ను ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి బదిలీ చేయవచ్చు. మొత్తం దేశాన్నే కనెక్ట్ చేశాం. ఇప్పుడు ఒకే మార్కెట్. ఇప్పుడు విద్యుత్‌ను ఎక్కడైనా ఉత్పత్తి చేయవచ్చు. ఎక్కడైనా వినియోగించుకోవచ్చు. ఇప్పుడు ఏ ప్రాంతంలోనూ విద్యుత్-లోటు అనే ప్రశ్నే లేదు. ఇప్పటికే ఉన్న సామర్థానికి మించి డిమాండ్ పెరుగుతున్నందున, పోసోకో చేతిలో మిగులు ఉండే అవకాశాలు తగ్గుతాయి. కాబట్టి పోసోకో తన అనుబంధ సేవల ద్వారా నిల్వలను పెంచుకోవాలి. రాష్ట్ర స్థాయిలో సిస్టమ్ ఆపరేషన్ కోసం నాణ్యమైన సంస్థ కోసం తప్పనిసరి ధృవీకరణ వ్యవస్థ ఉండాలి”అని మంత్రి అన్నారు. ఈ సందర్భంగా కేంద్ర విద్యుత్ శాఖ సహాయ మంత్రి క్రిషన్ పాల్ గుర్జార్ మాట్లాడుతూ, “పోసోకో తన అధికార పరిధిలోని పొరుగు దేశాల (భూటాన్, నేపాల్, బంగ్లాదేశ్ మయన్మార్) మధ్య వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవడానికి దక్షిణాసియా గ్రిడ్ ఏర్పాటుకు సహకరిస్తోంది. పోసోకోకు కొవిడ్–-19 మహమ్మారి ద్వారా ఎదురయ్యే సవాళ్లు ఉన్నప్పటికీ, సమర్థత, విశ్వసనీయత, భద్రత, న్యాయబద్ధతపై దృష్టి సారించి ఇండియన్ ఎలక్ట్రిసిటీ గ్రిడ్‌ను విజయవంతంగా నిర్వహిస్తోంది. విద్యుత్ మార్కెట్ ఆపరేషన్‌లో పారదర్శకతను తీసుకురావడానికి పబ్లిక్ డొమైన్‌లో ఇండియన్ పవర్ సిస్టమ్ గురించి రియల్ టైమ్ సమాచారాన్ని వ్యాప్తి చేస్తోంది. ఇందుకోసం పోసోకో అభివృద్ధి చేసిన విద్యుత్ ప్రవా, మెరిట్ మొదలైన వివిధ యాప్‌లు ఉపయోగిస్తున్నారు”అని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంఓపీ, ఎంఎన్ఆర్ఈ, ఆర్పీసీ, ఎన్ఎల్డీసీ, ఆర్ఎల్డీసీలు, ఎస్ఎల్డీసీ అధికారులు, ప్రముఖులు ఆన్లైన్, ఆఫ్లైన్ పద్ధతుల ద్వారా పాల్గొన్నారు. పోసోకో పవర్ గ్రిడ్ నుండి దాని అనుబంధ సంస్థగా విడిపోయిన తర్వాత పవర్ పీఎస్యూలలో ఒకటిగా విద్యుత్ మంత్రిత్వ శాఖ క్రింద 3 జనవరి 2017న ప్రారంభమైంది.ఇది స్వతంత్ర సంస్థగా ఎదిగిన రోజుకు గుర్తుగా ఏటా జనవరి 3న పోసోకో దినోత్సవాన్ని జరుపుకుంటారు. గ్రిడ్ ఆపరేషన్‌ను విశ్వసనీయంగా, సమర్ధవంతంగా, సురక్షితమైన పద్ధతిలో నిర్ధారించడం దీని బాధ్యత. ఇందులో 5 ప్రాంతీయ లోడ్ డెస్పాచ్ సెంటర్లు (ఆర్ఎల్డీసీలు) నేషనల్ లోడ్ డెస్పాచ్ సెంటర్ (ఎన్ఎల్డీసీ) ఉంటాయి.
***
(Release ID: 1787828)
Visitor Counter : 213