వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

వ్యవసాయ, ఆహార ఉత్పాదనల ఎగుమతుల వృద్ధిలో స్థిరత్వం!


సవాళ్లు ఎదురైనా గత పదేళ్లలో పెరుగుదల.

2011-12లో అపెడా ఉత్పత్తుల ఎగుమతి విలువ
17,321 మిలియన్ డాలర్లు..,
2020-21లో 20,674 మిలయన్ డాలర్లకు పెరుగుదల..

Posted On: 31 DEC 2021 12:19PM by PIB Hyderabad

   ప్రపంచవ్యాప్తంగా సరకుల వాణిజ్యంలో రవాణా, మౌలిక సదుపాయాల పరంగా ఎన్నో సవాళ్లు ఎదురైనప్పటికీ, గత పదేళ్లలో భారతదేశం వ్యవసాయ ఉత్పత్తుల, ప్రాసెస్డ్ ఆహార ఉత్పాదనల ఎగుమతులు స్థిరంగా పెరుగుతూ వచ్చాయి. వ్యవసాయ, ప్రాసెస్డ్ ఆహార ఉత్పాదనల ఎగుమతి అభివృద్ధి ప్రాధికార సంస్థ (అపెడా) పరిధిలోని ఉత్పత్తుల ఎగుమతులు కూడా గణనీయంగా పెరిగాయి. వాణిజ్య ఇంటలిజెన్స్, గణాంకాల డైరెక్టర్ జనరల్ కార్యాలయం (డి.జి.సి.ఐ.ఎస్.) అందించిన సమాచారం ప్రకారం 2011-12వ సంవత్సరంలో 17,321 మిలియన్ల అమెరికన్ డాలర్లు (రూ. 83,484కోట్లు)గా ఉన్న ఈ ఎగుమతులు,.. 2020-21వ సంవత్సరంలో 20,674మిలియన్ల అమెరికన్ డాలర్లకు (రూ. 15,30,50 కోట్లకు) పెరిగాయి.

  అపెడా పరిధిలోని పలు వ్యవసాయ, ప్రాసెస్డ్ ఆహార ఉత్పత్తుల్లో,  బాస్మతీయేతర బియ్యం అగ్రస్థాయిలో ఎగుమతి అయ్యింది. 2020-21వ ఆర్థిక సంవత్సరంలో జరిగిన మొత్తం ఎగుమతుల్లో దాదాపు నాలుగోవంతు స్థానాన్ని బాస్మతీయేతర బియ్యం ఎగుమతులే ఆక్రమించాయి.

  2020-21వ సంవత్సరంలో జరిగిన ఎగుమతిలో మొదటి 3 స్థానాలను ఆక్రమించిన అపెడా ఉత్పత్తుల్లో బాస్మతీయేతర బియ్యం వాటా 23.32శాతం, బాస్మతీ బియ్యం వాటా 19.44శాతం, గొడ్డుమాంసం వాటా 15.34 శాతం ఉన్నాయి. మొత్తం ఎగుమతుల్లో ఈ మూడు ఉత్పాదనల ఉమ్మడి వాటా 58శాతంగా నమోదైంది. 

   భారతదేశపు బాస్మతీయేతర బియ్యం ఎగుమతుల విలువను 2020-21లో 4,799.91 మిలియన్ల అమెరికన్ డాలర్లు (రూ. 35,477 కోట్లు) గా లెక్కవేశారు.  బాస్మతీ బియ్యం ఎగుమతి విలువను 4,018.71 మిలియన్ల అమెరికన్ డాలర్లు (రూ. 29,850 కోట్లు) గా, గొడ్డుమాంసం ఎగుమతుల విలువను 3,171.19 మిలియన్ల అమెరికన్ డాలర్లు (రూ. 23,460 కోట్లు) గా లెక్కించారు.

   2020-21వ సంవత్సరంలో భారతదేశంనుంచి బాస్మతీయేతర బియ్యాన్ని ఎక్కువగా దిగుమతి చేసుకున్న దేశాల్లో బెనిన్, నేపాల్, బంగ్లాదేశ్, సెనెగల్, టోగో ఉన్నాయి. ఇక అదే సంవత్సరం భారతదేశంనుంచి బాస్మతీ బియ్యం ఎక్కువగా సౌదీ ఆరేబియా, ఇరాన్, ఇరాక్, యెమెన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యు.ఎ.ఇ.)లకు ఎగుమతి అయ్యాయి. ఇక భారతదేశంనుంచి గొడ్డుమాంసం ఎక్కువగా దిగుమతి చేసుకున్న దేశాల్లో హాంకాంగ్, వియత్నాం, మలేసియా, ఈజిప్టు, ఇండోనేసియా ఉన్నాయి.

 “ఎగుమతులను పెంపొందించేలా తగిన మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టిని కేంద్రీకరిస్తాం. ఇందుకోసం వివిధ రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో క్లస్టర్ల ఏర్పాటుకు మరింత ప్రాధాన్యం ఇస్తాం. ఈ విషయంలో 2018వ సంవత్సరపు వ్యవసాయ ఎగుమతి విధానానం నిర్దేశించిన లక్ష్యాన్ని పరిశీలనలోకి తీసుకుంటాం,” అని అపెడా అధ్యక్షుడు డాక్టర్ అంగముత్తు అన్నారు.

  వ్యవసాయ ఎగుమతి విధానం అమలుకోసం వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలతో కలసి అపెడా కృషి చేస్తోంది.  ఎగుమతులకు సంబంధించి పలు రాష్ట్రాల కార్యాచరణ ప్రణాళికలు ఇప్పటికే ఖరారయ్యాయి. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కేరళ, నాగాలాండ్, తమిళనాడు, అస్సాం, పంజాబ్, కర్ణాటక, గుజరాత్, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మణిపూర్, సిక్కిం, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, మిజోరాం, మేఘాలయ రాష్ట్రాలకు సంబంధించిన ఎగుమతుల కార్యాచరణ ప్రణాళికలు ఇప్పటికే ఖరారు కాగా, మిగిలిన రాష్ట్రాల కార్యాచరణ ప్రణాళికలు ఖరారయ్యే క్రమంలో వివిధ దశల్లో ఉన్నాయి.

   ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యు.టి.ఒ.) వెలువరించిన సమాచారం ప్రకారం, 2010లో 23,106మిలియన్ల అమెరికన్ డాలర్లుగా నమోదైన భారతదేశపు వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు 2019వ సంవత్సరంలో 37,371 మిలియన్ల అమెరికన్ డాలర్లకు పెరిగాయి. దీనితో గత పదేళ్ల కాలంలో ఉమ్మడి వార్షిక వృద్ధి రేటు (సి.ఎ.జి.ఆర్.) 5.49శాతంగా రికార్డయింది. 2010నుంచి 2019వరకూ ప్రపంచంలో వ్యవసాయ ఎగుమతుల సి.ఎ.జి.ఆర్. 3.11శాతంగా నమోదైంది.

  ఇక, ప్రపంచ వ్యవసాయ ఎగుమతులకు సంబంధించి 2010లో 1.71 స్థానం ఉన్న భారతదేశపు వాటా 2019లో 2.1శాతానికి పెరిగింది. ప్రపంచ వ్యాప్తంగా జరిగిన వ్యవసాయ ఎగుమతులకు సంబంధించి 2010లో 17వ ర్యాంకులో ఉన్న భారతదేశం 2019లో 16వ ర్యాంకుకు చేరుకుంది. ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యు.టి.ఒ.) వెలువరించిన సమాచారం ఈ అంశాలను తెలిపింది.

  అపెడా పరిధిలోని పది అగ్రశ్రేణి ఉత్పాదనలు ప్రపంచ వ్యాప్తంగా మరిన్ని ఎక్కువ దేశాలకు ఎగుమతి జరిగినప్పటికీ, గత దశాబ్దకాలంలో వాటి ఎగుమతులకు సంబంధించిన భారతదేశపు వాటాలో ఎలాంటి మార్పు చోటుచేసుకోలేదు. 2020-21లో అపెడా పరిధిలోని పది అగ్రశ్రేణి ఉత్పాదనల వాటా విషయం పరిశీలించినపుడు,.. బాస్మతీయేతర బియ్యం (23.22శాతం), బాస్మతీ బియ్యం (19.44శాతం), గొడ్డు మాంసం (15.34శాతం), మిగిలిన ఉత్పత్తులు (3.84శాతం), వేరు శనగ (3.52), తృణధాన్యాల తయారీ పదార్థాలు (3.08శాతం), మొక్కజొన్న (3.07శాతం), గోధుమలు (2.66శాతం), ప్రాసెస్డ్ కూరగాయలు (2.43శాతం), ప్రాసెస్డ్ పండ్లు, పండ్ల రసాలు, గింజలు (2.07శాతం), జీడి పిక్కలు (2.03శాతం) ఉన్నాయి.

  ఇక, 2011-12వ సంవత్సరంలో జరిగిన ఎగుమతుల్లో పది అపెడా ఉత్పత్తుల వాటాలు ఇలా ఉన్నాయి. గౌర్.గమ్ (19.89శాతం), బాస్మతీ బియ్యం (18.60శాతం), గొడ్డు మాంసం (16.56శాతం), బాస్మతీయేతర బియ్యం (10.43శాతం), వేరుశనగ (6.32శాతం), మొక్కజొన్న (6.21శాతం), తృణధాన్యాల తయారీ పదార్ధాలు (2.26శాతం), తాజా ఉల్లిపాయలు (2.07శాతం), ఆల్కహాలు పానీయాలు (1.76శాతం), ప్రాసెస్డ్ కూరగాయలు (1.47శాతం).

  2020-21వ సంవత్సరంలో అపెడా పరిధిలోని పది ఉత్పాదనల ఎగుమతులే మొత్తం ఎగుమతుల్లో 78శాతానికి పైగా స్థానాన్ని ఆక్రమించాయి. 2010-11వ సంవత్సరంలో ఇవి 85శాతం స్థానాన్ని ఆక్రమించాయి.

    2020-21వ సంవత్సరంలో అపెడా పరిధిలోని మొదటి పది ఉత్పాదనల ఎగుమతుల తీరు ఇలా ఉంది. బాస్మతీయేతర బియ్యం (4,799.91 మిలియన్ల అమెరికన్ డాలర్లు/రూ. 35,477కోట్లు), బాస్మతీ బియ్యం (4,018.71 మిలియన్ల అమెరికన్ డాలర్లు/ రూ. 29,850కోట్లు), గొడ్డు మాంసం (3171.19 మిలియన్ల అమెరికన్ డాలర్లు / రూ. 23,460కోట్లు), ఇతర ఉత్పాదనలు (793.08 మిలియన్ల అమెరికన్ డాలర్లు/రూ. 5,866కోట్లు), వేరుశనగలు (727.4 మిలియన్ల అమెరికన్ డాలర్లు/రూ. 5,382కోట్లు), తృణధాన్యాల ఆహార పదార్ధాలు (635.75 మిలియన్ల అమెరికన్ డాలర్లు/రూ. 4,706కోట్లు) మొక్క జొన్నలు (634.85మిలియన్ల డాలర్లు/రూ. 4,676కోట్లు), గోధుమలు (549.7 మిలియన్ల డాలర్లు/ రూ. 4,038కోట్లు), ప్రాసెస్డ్ కూరగాయలు (502మిలియన్ డాలర్లు/రూ. 3,719కోట్లు), ప్రాసెస్డ్ పండ్లు, పండ్ల రసాలు, గింజలు (428 మిలియన్ డాలర్లు/రూ. 3,173కోట్లు)      

      2011-12వ సంవత్సరంలో అపెడా పరిధిలోని మొదటి పది ఉత్పాదనల ఎగుమతుల తీరు ఇలా ఉంది. గౌర్.గమ్ (3446.37మిలియన్ల డాలర్లు/రూ. 16,524కోట్లు), బాస్మతీ బియ్యం (3,222.31మిలియన్ల డాలర్లు/రూ. 5,450 కోట్లు), గొడ్డు మాంసం (2,869.36 మిలియన్ డాలర్లు/రూ. 13,757కోట్లు), బాస్మతీయేతర బియ్యం (1,806.03 మిలియన్ల డాలర్లు/రూ. 8,659 కోట్లు), వేరుశనగలు (1,094.25 మిలియన్ డాలర్లు/రూ. 5,246 కోట్లు), మొక్కజొన్న (1,075.7 మిలియన్ల డాలర్లు/రూ. 5,158కోట్లు), తృణధాన్యాల తయారీ పదార్ధాలు (3,92.21 మిలియన్ల డాలర్లు/రూ. 1,889కోట్లు), తాజా ఉల్లిపాయలు (359.36 మిలియన్ల డాలర్లు/రూ. 1,723 కోట్లు), ఆల్కహాలు పానీయాలు (304.4 మిలియన్ల డాలర్లు/రూ.  1,459 కోట్లు), ప్రాసెస్డ్ కూరగాయలు (254.56 మిలియన్ల డాలర్లు/రూ. 1,250 కోట్లు).

  అపెడా సంస్థ తీసుకున్న అనేక చర్యల కారణంగా వ్యవసాయ ఉత్పత్తుల, ప్రాసెస్డ్ ఆహార ఉత్పాదనల ఎగుమతులు పెరిగాయి. ఎగుమతులను పెంపొందించేందుకు వివిధ దేశాల్లో బిజినెస్ టు బిజినెస్ ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేయడం, వివిధ దేశాల్లోని భారతీయ రాయబార కార్యాలయాల ప్రమేయంతో ఉత్పాదలకోసమే ప్రత్యేకించిన మార్కెటింగ్ ప్రచారం, సాధారణ మార్కెటింగ్ ప్రచారం చేయించడం వంటి కార్యక్రమాలను అపెడా నిర్వహించడంతో వ్యవసాయ, ప్రాసెస్డ్ ఆహార ఉత్పత్తుల ఎగుమతులు పెరిగాయి.

  ఇక, భౌగోళిక గుర్తింపు (జి.ఐ.)కోసం నమోదు చేసుకున్న వ్యవసాయ, ప్రాసెస్డ్ ఆహార పదార్థాల ఎగుమతుల ప్రోత్సాహం కోసం కూడా అపెడా అనేక చర్యలు తీసుకుంది. వ్యవసాయ, ఆహార ఉత్పాదనలపై విక్రేతల, కొనుగోలుదార్ల సమావేశాలను అపెడా నిర్వహించింది. మన ఉత్పత్తులను ఎక్కువగా దిగుమతి చేసుకునే దేశాల ప్రమేయంతో వర్చువల్ పద్ధతిలో ఈ సమావేశాలను అపెడా నిర్వహించింది.

  ఎగుమతి చేయాల్సిన ఉత్పత్తుల నాణ్యతా నిర్ధారణతో యోగ్యతా పత్రాల జారీ ప్రక్రియ నిరాటంకంగా జరిగేందుకు వీలుగా, దేశవ్యాప్తంగా 220 లేబరేటరీలను అపెడా సంస్థ గుర్తించింది. వివిధ రకాల ఉత్పత్తులపై నాణ్యతా పరీక్షల నిర్వహణా సేవలందించేందుకు, ఎగుమతుదార్లను గుర్తించేందుకు ఈ పరిశోధన శాలలను అపెడా గుర్తించింది. 

  ఎగుమతి ఉత్పాదనలపై పరీక్షల నిర్వహణకోసం గుర్తింపు పొందిన లేబరేటరీల స్థాయిని నవీకరించేందుకు, సదరు లేబరేటరీలను మరింత బలోపేతం చేసేందుకు కూడా అపెడా తగిన సహాయ సహకారాలను అందిస్తోంది. వ్యవసాయ ఉత్పాదనల ఎగుమతులను పెంపొందించడమే లక్ష్యంగా,..మౌలిక సదుపాయాల అభివృద్ధి, నాణ్యతా ప్రమాణాల మెరుగుదల, మార్కెట్ సదుపాయాల అభివృద్ధి వంటి ప్రక్రియలకోసం ఆర్థిక సహాయ పథకాలతో తగిన సహకారాన్ని కూడా అపెడా అందిస్తుంది.

  అంతర్జాతీయ స్థాయిలో జరిగే వాణిజ్య ప్రదర్శనల్లో ఎగుమతిదారులు, ఎగుమతి సంస్థల ప్రతినిధులు పాల్గొనేలా అపెడా తగిన చర్యలు తీసుకుంటుంది. ఎగుమతిదారులు తమ ఆహార ఉత్పాదనలను ప్రపంచ మార్కెట్ వేదికల్లో మార్కెటింగ్ చేసుకునేందుకు ఈ వాణిజ్య ప్రదర్శనలు తగిన అవకాశాలు కల్పిస్తాయి. వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహించడమే లక్ష్యంగా,.. ఆహార్, ఆర్గానిక్ వరల్డ్ కాంగ్రెస్, బయోఫ్యాఛ్ వంటి జాతీయ స్థాయి కార్యక్రమాలను కూడా అపెడా నిర్వహిస్తుంది. 

  ఉద్యాన పంటల ఉత్పత్తులు అంతర్జాతీయ మార్కెట్ స్థాయి నాణ్యతా ప్రమాణాలకు దీటుగా ఉండేలా చూసేందుకు పార్క్ హౌస్.ల రిజిస్ట్రేషన్ ప్రక్రియను కూడా అపెడా నిర్వహిస్తుంది. వేరుశనగ కాయల తొక్కలను తొలగించడం, గ్రేడింగ్, ప్రాసెసింగ్ నిర్వహించడం వంటి ప్రక్రియలకు సంబంధించిన ఎగుమతి యూనిట్ల రిజిస్ట్రేషన్.ను కూడా అపెడా చేపడుతుంది. ఉదాహరణకు, యూరోపియన్ యూనియన్, యూరోపియన్ యూనియన్ మినహా ఇతర దేశాల నాణ్యతాప్రమాణాలకు అనుగుణంగా ఎగుమతి యూనిట్లను రిజిస్టేషన్ ను అపెడా చేపడుతుంది.

  మాసం శుద్ధి ప్లాంట్ల రిజిస్ట్రేషన్, ప్రపంచ స్థాయి ఆహార భద్రతా, నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా చూడటం వంటి కార్యకలాపాలను అపెడా నిర్వహిస్తుంది. దిగుమతి చేసుకునే దేశాలు పాటించే ఆహార భద్రత, నాణ్యతా ప్రమాణాల మేరకు మన ఉత్పాదనలు ఉన్నాయా,.. లేదా,.. అన్న అంశాన్ని బేరీజు వేసేందుకు అవసరమైన వ్యవస్థను కూడా అపెడా నిర్వహిస్తుంది. ఎగుమతులను ప్రోత్సహించే ప్రక్రియలో భాగంగా, వివిధ రకాల అంతర్జాతీయ వాణిజ్య విశ్లేషణా సమాచారం, మార్కెట్ అనుసంధాన సమాచారం వంటి విషయాలను ఎగుమతిదార్లకు, ఎగుమతి చేసే సంస్థలకు పంపిణీ చేస్తుంది.  అలాగే, వాణిజ్యపరమైన ఫిర్యాదులను, సందేహాలను అపెడా పరిష్కరిస్తుంది.

 

ఎగుమతుల ధోరణిపై పట్టిక

సంవత్సరం

రూపాయలు కోట్లలో

అమెరికన్ డాలర్లు మిలియన్లలో..

2011-12

83,484

17,321

2012-13

1,18,251

21,740

2013-14

1,36,921

22,707

2014-15

1,31,343

21,489

2015-16

1,07,483

16,421

2016-17

1,13,858

17,022

2017-18

1,25,858

19,524

2018-19

1,35,113

19,407

2019-20

1,19,401

16,700

2020-21

1,53,050

20,674

 

మూలం: డి.జి.సి.ఐ.ఎస్., అపెడా ఉత్పత్తులపై సమాచారం

 

****



(Release ID: 1786702) Visitor Counter : 217