రక్షణ మంత్రిత్వ శాఖ
లక్నోలో డి.టి.టి.సి., బ్రహ్మోస్ క్షిపణి తయారీ కేంద్రం!
రక్షణమంత్రి చేతుల మీదుగా రెండు కేంద్రాలకు శంకుస్థాపన..
జాతీయ భద్రత, రక్షణ ఉత్పాదనలో, దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టతలో
ఈ కేంద్రాలదే కీలకపాత్ర అని వ్యాఖ్య..
ఆదాయాన్ని సమకూర్చడంతోపాటు,
యువతకు ఉపాధి కల్పనకు,
‘ఆత్మనిర్భర భారత్’ సాధనకు
దోహదపడతాయన్న రక్షణ మంత్రి..
Posted On:
26 DEC 2021 3:16PM by PIB Hyderabad
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో రక్షణ, పరిశోధన అభివృద్ధి సంస్థ (డి.ఆర్.డి.ఒ.) ఆధ్వర్యంలో, నిర్మించ తలపెట్టిన రక్షణ సాంకేతిక పరిజ్ఞాన, పరీక్షా కేంద్రానికి (డి.టి.టి.సి.కి), బ్రహ్మోస్ క్షిపణి తయారీ కేంద్రానికి రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ డిసెంబరు 26న శంకుస్థాపన చేశారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ సమక్షంలో రెండు కేంద్రాల శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర హోమ్ శాఖ సహాయమంత్రి కౌశల్ కిశోర్, ఉత్తరప్రదేశ్ పారిశ్రామికాభివృద్ధి శాఖ మంత్రి సతీష్ మహానా,; ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు; రక్షణ మంత్రిత్వ శాఖ అధికారులు, డి.ఆర్.డి.ఒ.కు, రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన అధికారులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
తాజాగా జరిగిన శంకుస్థాపనతో 22ఎకరాల విస్తీర్ణంలో లక్నోలో నిర్మించనున్న డి.టి.టి.సి. ఎన్నో రకాలుగా విలక్షణమైనది. ఉత్తరప్రదేశ్ రక్షణ పారిశ్రామిక కారిడార్ (యు.పి.డి.ఐ.సి.)లో రక్షణ గగనతల తయారీ విభాగాల సమూహ ప్రగతిని మరింత వేగవంతం చేసేందుకు ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ డి.టి.టి,సి. పరిధిలో ఈ కింద ఆరు ఉపకేంద్రాలు పనిచేస్తాయి.:
- డీప్ టెక్ ఇన్నోవేషన్, స్టార్టప్ ఇంకుబేషన్ సెంటర్
- డిజైన్, స్టిములేషన్ సెంటర్
- టెస్టింగ్, ఎవాల్యుయేషన్ సెంటర్
- సెంటర్ ఫర్ ఇండస్ట్రీ 0/డిజిటల్ మాన్యుఫ్యాక్చరింగ్
- నైపుణ్యాభివృద్ధి కేంద్రం
- వాణిజ్యాభివృద్ధి కేంద్రం
ఇక బ్రహ్మోస్ ఎయిరోస్పేస్ సంస్థ ప్రకటించిన బ్రహ్మోస్ తయారీ కేంద్రం, లక్నోలోని రక్షణ పారిశ్రామిక కారిడార్ పరిధిలో ఎంతో అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడుకున్నది. 200 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉండే ఈ సంస్థలో కొత్త తరహా బ్రహ్మోస్-ఎన్.జి. (తదుపరి తరం) రకం క్షిపణులను ఉత్పత్తి చేస్తారు. బ్రహ్మోస్ ఆయుధ వ్యవస్థకే ప్రత్యేకమైన ఆయుధాన్ని మోసుకెళ్లగలిగే క్షిపణులను ఈ కేంద్రంలో తయారు చేస్తారు. ఈ కేంద్రం రానున్న రెండు మూడేళ్లలో ఉత్పాదనకు సిద్ధమవుతుంది. సంవత్సరానికి 80నుంచి వంద బ్రహ్మోస్ ఎన్.జి. క్షిపణులను ఈ కేంద్రంలో తయారు చేస్తారు.
శంకుస్థాపన సందర్భంగా డి.ఆర్.డి.ఒ., బ్రహ్మోస్ ఎయిరో స్పేస్ సంస్థ శాస్త్రవేత్తలను, ఇంజనీర్లను రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ అభినందించారు. జాతీయ భద్రతను, రక్షణ ఉత్పాదనను, ఉత్తరప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో ఈ రెండు కేంద్రాలు ప్రముఖ పాత్ర పోషించగలవన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఈ రెండు కేంద్రాల్లో ఏర్పాటు కానున్న అధునాతన సాంకేతిక పరిజ్ఞాన సదుపాయాలు, మన రక్షణ రంగంలోనే ముఖ్యమైన మలుపుగా నిలిచిపోగలవన్నారు. ఆదాయాన్ని సమకూర్చడంతోపాటుగా, యువతకు ఉపాధి కల్పనకు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కలలుగన్న ‘ఆత్మనిర్భర భారత్’ కలను సాకారం చేసుకునేందుకు ఈ కేంద్రాలు దోహదపడగలవన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తంచేశారు. మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ఇండియా, మేక్ ఫర్ వరల్డ్ అనే సందేశాలు ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలకు చేరుకున్నాయని అన్నారు.
'రక్షణ సాంకేతిక, పరీక్షా కేంద్రం (డి.టి.టి.సి.)' గురించి ఆయన ప్రస్తావిస్తూ, రక్షణ ఉత్పాదనలను రూపొందించడానికి తగిన సాంకేతిక పరిజ్ఞానానికి తగిన పునాదిని ఈ కేంద్రం ఏర్పాటు చేయగలదన్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం,.. అమౌసీ ప్రాంతానికి చెందిన యువజనులైన ఆవిష్కర్తలను, స్టార్టప్ సంస్థలను దృష్టిలో పెట్టుకుని ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్టు కేంద్రమంత్రి తెలిపారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర యువత ఆశయాలను నెరవేర్చేందుకు, సృజనాత్మక శక్తిని, సామర్థ్యాలను వినియోగించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అన్నివిధాలా కృషి చేయగలదని ఆయన చెప్పారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలను సమీకృతం చేసేందుకు, రక్షణ, గగనతల రంగాలకు సంబంధించిన తయారీ ప్రక్రియలో ఉత్తరప్రదేశ్.ను ముందువరుసలో నిలిపేందుకు ఈ కేంద్రం దోహదపడుతుందన్నారు. నైపుణ్యాభివృద్ధి ద్వారా రక్షణ రంగంలో, గగనతల రంగంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పనకు కేంద్రం చర్యలు తీసుకుంటుందని రాజనాథ్ సింగ్ చెప్పారు.
భారతదేశ చరిత్రను ఆయన ఉటంకిస్తూ, “మనం ఎప్పుడూ ఆక్రమణదారుగా వ్యవవహరించలేదు. అయితే, ఏదైనా దేశం శతృభావంతో వచ్చినపుడు మాత్రం ప్రజలను రక్షించుకునేందుకు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటున్నాం.” అని అన్నారు. దాడులను ఎదుర్కొని దీటుగా ప్రతిఘటించడమే బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రయిజ్ క్షిపణి వ్యవస్థ ప్రధాన ధ్యేయమని అన్నారు. బ్రహ్మోస్ క్షిపణి వ్యవస్థ భారత, రష్యా దేశాల సాంకేతిక సహకారాన్ని ప్రతిబింబించడమే కాక, దీర్ఘకాలంగా కొనసాగుతున్న ఉభయదేశాల సాంస్కృతిక, రాజకీయ, దౌత్య బంధాలకు సూచికగా నిలిచిందని అన్నారు. బ్రహ్మోస్ వ్యవస్థ అనేది, ప్రపంచంలోనే ఉత్తమమైన, వేగవంతమైన, కచ్చితత్వంతో కూడిన చోదకశక్తితో కూడిన ఆయుధమని, 21వ శతాబ్దంలో ఇది భారతీయ సాయుధబలగాల ప్రతిఘటనా శక్తిని మరింత బలోపేతం చేసిందని రాజనాథ్ సింగ్ అన్నారు.
బ్రహ్మోస్ వ్యవస్థ సాయుధ బలగాలకు సాధికారతను కల్పించిందని, అంతర్జాతీయ స్థాయిలో భారతీయ సైనిక ప్రతిష్టను మరింత ఇనుమడింపజేసిందని రక్షణమంత్రి అన్నారు. భూ ఉపరితలంపై, నీటిలో, గగనతలంలో ఇప్పటికే తన శక్తి సామర్థ్యాలను రుజువు చేసుకున్న బ్రహ్మోస్ ఎన్.జి. క్షిపణి వ్యవస్థ,.. రానున్న కాలంలో భారతీయ సాయుధ బలగాల అధునాతన యుద్ధ పటిమను మరింతగా బలోపేతం చేయగలదన్నారు. ఉత్తరప్రదేశ్.లో బహుముఖ సాంకేతిక పరిజ్ఞాన ప్రగతికి, ఆ ప్రాంతంలో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పనకు అనువుగా ఉత్తరప్రదేశ్ రక్షణ పారిశ్రామిక కారిడార్ (యు.పి. డి.ఐ.సి.) కొత్త మార్గాలను తెరిచిందని అన్నారు. “ఈ కారిడార్.తో రూ. 3,732కోట్ల పెట్టుబడులు రావచ్చని ప్రారంభోత్సవ సమయంలో అంచనా వేశాం. ఇప్పటికే, రూ. 1,400కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయి. కారిడార్ ఏర్పాటు ప్రక్రియ వేగంగా ముందుకు సాగుతోంది.” అని ఆయన అన్నారు.
గత కొన్నేళ్లలోనే రక్షణ సాంకేతిక పరిజ్ఞానరంగంలో భారతదేశం గౌరవనీయమైన స్థానాన్ని సాధించిందని, అధునాతన పరిజ్ఞానంతో కూడిన క్షిపణి వ్యవస్థను కూడా రూపొందించుకోగలిగిందని, రక్షణ పారిశ్రామిక పునాదుల నిర్మాణంలో ప్రశంసనీయమైన ప్రగతిని సాధించిందని ఆయన అన్నారు. సాయుధ బలగాలను బలోపేతం చేయడం, అధునాతన క్షిపణి వ్యవస్థల రూపకల్పన, ఉత్పాదనలో స్వావలంబనతో కూడిన ‘ఆత్మనిర్భర భారత్’ స్థాయిని సాధించడంలో డి.ఆర్.డి.ఒ. శాస్త్రవేత్తల కృషి అభినందనీయమని కేంద్రమంత్రి అన్నారు. ఉత్తరప్రదేశ్ ప్రగతిని కొత్త శిఖరాలకు చేర్చేందుకు ప్రతిన బూనాలని ఆహూతులందరికీ రాజనాథ్ సింగ్ విజ్ఞప్తి చేశారు. రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన రెండు కీలకమైన ప్రతిష్టాత్మక కేంద్రాలకు శంకుస్థాపన చేయడం దేశ రక్షణ రంగం, రక్షణ ఉత్పాదన రంగం, ఉత్తరప్రదేశ్ ఆర్థిక రంగంలో, లక్నో నగరాభివృద్ధిలో కొత్త అధ్యాయానికి నాంది పలికినట్టేనని అన్నారు. రాష్ట్రానికి చెందిన అన్ని సామాజిక వర్గాల ప్రగతి, సంక్షేమం, మౌలిక సదుపాయాలను మెరుగుపరచడమే లక్ష్యంగా అనేక చర్యలు తీసుకున్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యానాథ్ నాయకత్వాన్ని ఆయన అభినందించారు.
ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యానాథ్ మాట్లాడుతూ, రక్షణ మంత్రిత్వశాఖ చొరవతో తీసుకున్న అనేక కార్యక్రమాల నేపథ్యంలో, రక్షణమంత్రి రాజనాథ్ సింగ్.కు కృతజ్ఞతలు తెలిపారు. రక్షణమంత్రిత్వ శాఖ చొరవతో ఏర్పాటవుతున్న యు.పి. డి.ఐ.సి., రెండు కేంద్రాల నిర్మాణానికి శంకుస్థాపన వంటివి రక్షణ రంగంలో ‘ఆత్మనిర్భర భారత్’ సాకారం చేయడానికేనని ఆయన అన్నారు.
రక్షణమంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఈ రెండు కేంద్రాలు ఉత్తరప్రదేశ్ యువతకు ఉపాధి కల్పనకు, మార్గాలను ఏర్పరుస్తాయని యోగీ ఆదిత్యానాథ్ అన్నారు. రాష్ట్రం ప్రగతికి, దేశాభివృద్ధికి ఈ రెండు కేంద్రాలు గణనీయమైన సేవలందించగలవన్నారు. ఉత్తరప్రదేశ్.లో రక్షణ రంగం ప్రగతికి గల అవకాశాలను గురించి ఆదిత్యానాథ్ ప్రధానంగా ప్రస్తావించారు. రాష్ట్రంలో మధ్య, సూక్ష్మ, చిన్న మధ్యతరహా (ఎం.ఎస్.ఎం.ఇ.) సంఖ్య భారీ సంఖ్యలో ఉన్నందున రక్షణ రంగం ప్రగతి సాధ్యమవుతుందని అన్నారు. రాష్ట్రానికి రక్షణ రంగం ద్వారా వచ్చే పరిశ్రమలకు రాష్ర్టప్రభుత్వం అన్ని విధాలా సహాయం అందిస్తుందన్నారు.
రక్షణ పరిశోధన, అభివృద్ధి శాఖ కార్యదర్శి, డి.ఆర్.డి.ఒ. చైర్మన్ డాక్టర్ జి. సతీశ్ రెడ్డి ప్రారంభోపన్యాసం చేస్తూ, లక్నోలో డి.టి.టి.సి. ఏర్పాటుకోసం భూమిని అందుబాటులోకి తెచ్చినందుకు రక్షణమంత్రికి కృతజ్ఞతలు చెప్పారు. బ్రహ్మోస్ క్షిపణుల తయారీ కేంద్రంకోసం 200 ఎకరాల స్థలాన్ని అందించినందుకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఆ ప్రాంతంలో వచ్చే అన్ని పరిశ్రమలకు డి.ఆర్.డి.ఒ.నుంచి తప్పనిసరిగా మద్దతు ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.
ఉత్తరప్రదేశ్ ఎక్స్.ప్రెస్ రహదారులు, పారిశ్రామికాభివృద్ధి సంస్థ (యు.పి.ఇ.ఐ.డి.ఎ.), డి.ఆర్.డి.ఒ. మధ్య, డిఇఎఫ్ ఎక్స్.పో-2020 ప్రదర్శన సందర్భంగా కుదిరిన అవగాహనా ఒప్పందం అమలులో భాగంగా లక్నోలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో డి.టి.టి.సి.ని ఏర్పాటు చేస్తున్నారు. రక్షణమంత్రి, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి సమక్షంలో ఈ అవగాహనా ఒప్పందం కుదిరింది. నమూనా రూపకల్పన, నిర్మాణం, ప్రయోగపరీక్ష, అధ్యయన పద్ధతిని డి.టి.టి.సి. అనుసరిస్తుంది. కేంద్రీకృత అధునాతన సాంకేతిక పరిజ్ఞాన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడం ద్వారా పరిశ్రమల ఏర్పాటుకు ఈ కేంద్రం తగిన వసతిని కల్పిస్తుంది. ఇది తన పరిధిలోని ఆరు ఉపకేంద్రాల ద్వారా ఉత్పాదనా ప్రక్రియ రూపకల్పనను వేగవంతం చేస్తుంది. పరిశ్రమలు, స్టార్టప్ కంపెనీల మధ్య అనుసంధానకర్తగా పనిచేస్తుంది. యు.పి. డి.ఐ.సి.లో,.. పరిశ్రమలను, స్టార్టప్ కంపెనీలను, విద్యా సంస్థలను సమీకృతం చేయడానికి, సులభతర వాణిజ్య నిర్వహణకు దోహదపడుతుంది. తద్వారా ఆత్మనిర్భర భారత్ లక్ష్యాన్ని సాధించేందుకు కృషిచేస్తుంది.
ఇక బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రయిజ్ క్షిపణి వ్యవస్థ ప్రపంచంలోనే విజయవంతమైన క్షిపణి కార్యక్రమాల్లో ఒకటిగా పేరుగాంచింది. తన సన్నిహిత వ్యూహాత్మక మిత్రదేశమైన రష్యా భాగస్వామ్యంతో భారతదేశం ఉమ్మడిగా ఈ క్షిపణి తయారీ వ్యవస్థను చేపట్టింది. 21వ శతాబ్దంలో భారతదేశపు పటిష్టమైన ప్రతిఘటనా శక్తిగా ఇది రూపుదాల్చింది. భారత, రష్యా ఉమ్మడి సంస్థ అయిన బ్రహ్మోస్ ఎయిరోస్పేస్ సంస్థ రూపకల్పనలో తీర్చిదిద్దిన సూపర్ బ్రహ్మోస్ సూపర్.సోనిక్ క్షిపణి క్రమంగా మనకు సర్వోత్కృష్టమైన విశేష ఆయుధంగా మారుతూ వస్తోంది. ఈ ఆయుధ వ్యవస్థ పరంపర ప్రాతిపదికగా, మరింత అధునాతన పరిజ్ఞానంతో బ్రహ్మోస్-ఎన్.జి. అనే మెరుగైన తదుపరి తరపు క్షిపణి వ్యవస్థ రూపకల్పనా ప్రక్రియను ప్రారంభించారు. విస్తృతమైన సంఖ్యలో అధునాతన సైనిక వేదికలపై మోహరించేందుకు వీలుగా ఈ కొత్త తరహా క్షిపణిని తీర్చిదిద్దనున్నారు. భూ ఉపరితలం, సముద్ర ఉపరితలం, జలంతర్భాగం, గగనతలంలో మోహరించేందుకు వీలుగా ఈ కొత్త క్షిపణి వ్యవస్థను తయారు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నూతన క్షిపణి వ్యవస్థ భారతీయ సైన్యం అధునాతన పోరాట సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసే అవకాశాలు ఉన్నాయి.
****
(Release ID: 1785397)