వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

సృజనాత్మకతకు ప్రపంచకేంద్రంగా భారత్!

సి.ఐ.ఐ. భాగస్వామ్య శిఖరాగ్ర సదస్సులో కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ప్రకటన..

ఉపఖండాన్ని పరివర్తన చెందించాలంటూ పొరుగుదేశాల మంత్రులకు పిలుపు...
దక్షిణాఫ్రికా కస్టమ్స్ యూనియన్.తో ఆర్థిక సంబంధాలను
విస్తృతం చేసుకోవాలని సూచన..

యు.ఎ.ఇ., ఇ.యు., యు.కె., ఇజ్రాయెల్, ఆస్ట్రేలియా, కెనడా, రష్యా, ఒమన్, జి.సి.సి.లతో సంబంధాల విస్తృతికి కృషి...

జి.20 దేశాల తీర్మానంలో వర్ధమాన దేశాల వాణిని ప్రస్పుటం చేయడంలో భారత్ కృషి ...

ఆర్థికాభివృద్ధి ప్రణాళికకు సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు పరస్పర సంబంధం ఉండాలని గోయల్ సూచన

Posted On: 14 DEC 2021 3:24PM by PIB Hyderabad

    భారత ఉపఖండాన్ని సంపూర్ణంగా రూపాంతరం చెందించడానికి కలసికట్టుగా పనిచేయాలని కేంద్ర వాణిజ్యం, పరిశ్రమలు, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీ, జవుళి శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈ రోజు పొరుగుదేశాల మంత్రులకు విజ్ఞప్తి చేశారు. “భారతీయ పరిశ్రమల సమాఖ్య (సి.ఐ.ఐ.): భాగస్వామ్య శిఖరాగ్ర సదస్సు-మంత్రుల స్థాయి సమావేశం” ఉద్దేశించి కేంద్రమంత్రి న్యూఢిల్లీనుంచి వర్చువల్ పద్ధతిలో ప్రసంగిస్తూ ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. బోట్స్వానా, నమీబియా, దక్షిణాఫ్రికా, స్వాజీలాండ్, లెసోతో సభ్యదేశాలుగా ఉన్న దక్షిణాఫ్రికా కస్టమ్స్ యూనియన్.తో భారతదేశ ఆర్థిక సంబంధాలు మరింత విస్తృతం కావాలని ఆయన పిలుపునిచ్చారు. పారదర్శకత, పరస్పర ప్రయోజనాలు, అభివృద్ధి వంటి అంశాలు కీలకాంశాలుగా భావసారూప్యం కలిగిన దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు (ఎఫ్.టి.ఎ.లు) కుదుర్చుకునేందుకు భారతదేశం వేచి చూస్తోందని కేంద్ర మంత్రి గోయల్ అన్నారు. ఆగ్నేయాసియా దేశాల సంఘం (ఆసియాన్) సభ్యదేశాలు, జపాన్, కొరియాలతో ఇప్పటికే ఉన్న ఎఫ్.టి.ఎ.లను మరింత బలోపేతం చేసుకునే లక్ష్యంతో సదరు ఒప్పందాలను భారతదేశం సమీక్షించుకుంటోందని అన్నారు. అలాగే, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యు.ఎ.ఇ.) యూరోపియన్ యూనియన్ (ఇ.యు.), యునైటెడ్ కింగ్ డమ్ (యు.కె.), ఇజ్రాయెల్, ఆస్ట్రేలియా, కెనడా, రష్యా, ఒమన్.లతో, గల్ఫ్ సహకార మండలి (జి.సి.సి.)తో మరింత విస్తృతమైన వాణిజ్య సంబంధాలకోసం భారతదేశం కృషిచేస్తోందని అన్నారు.

   కోవిడ్-19 వైరస్ మహమ్మారి సంక్షోభంలో భారతదేశం, గట్టి ప్రతిఘటనా శక్తిగా, విశ్వసనీయమైన భాగస్వామ్యదేశంగా ఆవిర్భవించిందని గోయల్ అన్నారు. అంతర్జాతీయంగా తాము అందించాల్సిన సేవల విషయంలో శక్తివంచన లేకుండా కృషిచేశామని అన్నారు.

కోవిడ్ మహమ్మారి సంక్షోభ సమయంలో కీలకమైన వైద్యసామగ్రి సరఫరా, పి.పి.ఇ.లు, టెస్టింగ్ కిట్లు, మాస్కులు వంటి ఉత్పత్తుల తయారీలో భారతదేశం స్వయంసమృద్ధిని సాధించడమేకాక, అవసరమైన ఇతర దేశాలకు కూడా ఆ ఉత్పాదనలను సరఫరా చేసిందని అన్నారు. కోవిడ్ కట్టడికోసం భారతదేశం చేపట్టిన వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మంత్రి ప్రస్తావిస్తూ, 130కోట్ల వ్యాక్సీన్ డోసులను ప్రభుత్వం ఇప్పటికే ప్రజలకు అందించినట్టు తెలిపారు.

  సౌభ్రాతృత్వం, భాగస్వామ్యం, సమస్యల పరిష్కారంకోసం కలసికట్టుగా పనిచేయాల్సిన ఆవశ్యకత వంటి భావనలను భారతదేశం వాస్తవికంగా విశ్వసిస్తుంది కాబట్టి, అవసరమైన దేశాలకు భారత్ సహాయం కొనసాగుతుందని కేంద్రమంత్రి గోయల్ అన్నారు. వైరస్ సంక్షోభం నేపథ్యంలో భారతదేశం పొరుగుదేశాలపై దృష్టి కేంద్రీకరించిందని, వ్యాక్సీన్లు, వైద్యసరఫరాల విషయంలో మిత్రదేశాలన్నింటికీ అండగా నిలిచేందుకు సిద్ధపడందని అన్నారు. ఈ ఏడాది జి-20 దేశాల తీర్మానంలో భారతదేశం వాణి ప్రస్పుటంగా కనిపించిందని, ప్రపంచంలోని వర్ధమాన దేశాల వాణిని ద్విగుణీకృతం చేయడంలో భారతదేశం విజయవంతమైందని, భారతదేశం నాయకత్వశైలిని ప్రపంచం కూడా గుర్తించిందని అన్నారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఎంతో వేగంగా కోలుకుందని, ఒక  దశాబ్దపు అభివృద్ధి వైపుగా భారతదేశం సాగుతున్నట్టు పెరిగే ఆర్థిక సూచికలే తెలియజేస్తున్నాయని అన్నారు. రెండవ త్రైమాసిక కాలంలో భారతదేశం 8.4శాతం మేర స్థూల స్వదేశీ ఉత్పత్తి (జి.డి.పి.)లో వృద్ధిని సాధించిందని అన్నారు. భారతీయ కంపెనీలు ఎక్కువ ఎగుమతులు, భారీగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్.డి.ఐ.లు) సాధించాయని, విదేశాల్లో పెద్దమొత్తంలో పెట్టుబడులు పెట్టాయని అన్నారు. తమ ఆర్థిక వ్యవస్థల్లో పెట్టుబడులు పెట్టేలా, తగినన్ని ఉద్యోగాలు కల్పించేలా భారతీయ కంపెనీలను ఆహ్వానించాలని ఆయాదేశాల మంత్రులను గోయల్ కోరారు.

  భవిష్యత్తును ప్రభావితం చేసి, అభివృద్ధి దిశగా తీసుకెళ్లే  కీలక అంశాలపై మనం దృష్టిని కేంద్రీకరించవలసిన అవసరం ఉందని పీయూష్ గోయల్ అన్నారు. మరిన్ని భాగస్వామ్యాలను, వాణిజ్య ఒప్పందాలను, పెట్టుబడులను ప్రొత్సహించేందుకు వీలుగా భారతదేశం తన దృష్టిని కేంద్రీకరించవలసిన ఆరు అంశాలను గురించి మంత్రి ప్రధానంగా ప్రస్తావించారు. అలాగే సరఫరా వ్యవస్థ ప్రత్యామ్నాయంగా భారతదేశానికి ఉన్న బలాబలాలను, సులభతర వాణిజ్య నిర్వహణను, సృజనాత్మకతను, సుస్థిరతను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకోవలసి ఉందన్నారు. పెట్టుబడుల ప్రోత్సాహకంగా భారతదేశం తీసుకున్న చర్యలను ఆయన ప్రధానంగా ప్రస్తావించారు.  భారతదేశంలో అందుబాటులో ఉన్న అవకాశాలను వినయోగించుకోవలసిందిగా వివిధ వాణిజ్య సంస్థలను, ఇతర దేశాలను ప్రభుత్వం ఆహ్వానిస్తూనే ఉంటుందన్నారు. పెట్టుబడులకు సానుకూల అవకాశం ఉన్న వివిధ రంగాల జాబితాను ఆయన ప్రస్తావించారు. ఆరోగ్యరక్షణ, రక్షణ, ఇంధన,   పౌరవిమానయాన, బీమా రంగాలను సాంకేతిక పరిజ్ఞానం రంగాన్ని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. వాణిజ్యం, పెట్టుబడులకు సానుకూలమైన వివిధ పథకాలను దేశంలో అమలు చేస్తున్నట్టు చెప్పారు. ఉత్పాదనతో ముడివడిన ప్రోత్సాహక పథకం (పి.ఎల్.ఐ. పథకం), సడలించిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్.డి.ఐ.) విధానం తదితర అంశాలను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.

  భారతదేశంలో అందుబాటులో ఉన్న విభిన్నమైన వాణిజ్య అవకాశాలు, నైపుణ్యం కలిగిన సిబ్బంది, తక్కువ వ్యయంతో అందుబాటులో ఉన్న కార్మికశక్తి వంటి అంశాలు,.. పెట్టుబడుల ప్రోత్సహానికి, ఆదాయ సముపార్జనకు ఉపయోగపడతాయన్నారు. అలాగే, జాతీయ మౌలిక సదుపాయాల వ్యవస్థ, గతిశక్తి మౌలిక సదుపాయాల ప్రోత్సాహక చర్యలు, జాతీయ నగదీకరణ ప్రణాళిక వంటివి కూడా పెట్టుబడులకు ప్రోత్సాహకరంగా ఉంటాయన్నారు.

  సులభతర వాణిజ్య నిర్వహణను మెరుగుదలపై భారతదేశపు అభిలాషను, శ్రద్ధను గురించి ఆయన వివరించారు. జాతీయ సింగిల్ విండో వ్యవస్థ,  పారిశ్రామిక ల్యాండ్ బ్యాంకు ఏర్పాటు వంటి చర్యలు సులభతర వాణిజ్య నిర్వహణను గణనీయంగా మెరుగుపరిచేందుకు దోహదపడుతున్నాయన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో  సృజనాత్మకకు, ఆవిష్కారాలకు ప్రపంచస్థాయి కేంద్రంగా  భారతదేశం రూపొందుతోందని అన్నారు. మొత్తం 79 యూనికార్న్ స్టార్టప్ కంపెనీలతో భారతదేశం మూడవ అతిపెద్ద స్టార్టప్ సానుకూల వ్యవస్థగా రూపొందిందన్నారు.

  సుస్థిర అభివృద్ధి లక్ష్యంగా భారతదేశం తీసుకున్న చర్యలను కూడా కేంద్రమంత్రి ప్రధానంగా ప్రస్తావించారు. 2030నాటికల్లా 500 గిగావాట్ల మేర శిలాజేతర ఇంధనాన్ని ఉత్పత్తి చేసే స్థాయికి భారతదేశం చేరుకుంటుందని, 50శాతం ఇంధన అవసరాలను పునరుత్పాదన ఇంధనం ద్వారా తీర్చుకోగలుగుతుందని ఆయన అన్నారు. ప్రపంచంలోనే బృహత్తరమైన పునరుత్పాదక ఇంధన పథకాల్లో భారతదేశం కార్యక్రమం ఒకటిగా చెప్పవచ్చని అన్నారు. ప్రపంచ ఉష్ణోగ్రతలను స్థిరీకరించే లక్ష్యంలో భాగంగా 2070 నాటికల్లా నెట్ జీరో స్థాయికి కర్బన ఉద్గాగారాల విడుదలను నియంత్రించాలని భారతదేశం తీర్మానించుకున్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.

  ఆర్థికాభివృద్ధి ప్రణాళికకు సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు పరస్పర సంబంధం ఉండాలని, అన్నారు. స్వాతంత్ర్యం సిద్ధించి 75సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ పేరిట వేడుకలు జరుపుకుంటున్న తరుణంలో వందేళ్లు పూర్తయ్యే సరికి ఏ స్థాయికి చేరుకోవాలన్న అంశంపై బ్లూప్రింటును కూడా భారతదేశం రూపొందిస్తున్నట్టు కేంద్రమంత్రి చెప్పారు. పరిశోధన, అభివృద్ధి, ఆవిష్కారాలు, మేధో సంపత్తి హక్కులు వంటి విషయాల్లో భారతదేశం చేస్తున్న కృషిలో పాలుపంచుకోవలసిందిగా సమావేశంలోని వివిధ దేశాల మంత్రులను పీయూష్ గోయల్  పిలుపునిచ్చారు.

  130కోట్లమంది పౌరులతో కలసి ‘సబ్.కా ప్రయాస్’ నినాదంతో జరిపే  అభివృద్ధి యాత్రా పథం గురించి గోయల్ ప్రస్తావించార. భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి ఇదే తగిన తరుణమని అన్నారు. ప్రపంచ దేశాలు, భారతదేశం మధ్య భాగస్వామ్యాలను బలోపేతం చేయాలన్న ప్రణాళికను ముందుకు తీసుకెళ్లేందుకు చర్యలు తీసుకోవాలని వివిధ దేశాల మంత్రులకు ఆయన సూచించారు. కోవిడ్ అనంతర ప్రపంచంలో ఆర్థిక వ్యవస్థలను తిరిగి సుస్థిరం చేసేందుకు, బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకోవాలసిన అవసరం ఉందని అన్నారు.

  భాగస్వామ్య సదస్సును నిర్వహించడంలో సి.ఐ.ఐ. కృషి అభినందనీయమని పీయూష్ గోయల్ అన్నారు. వివిధ అంశాలపై చర్చలు జరిపేందుకు, కొత్త భాగస్వామ్యాలను రూపొందించుకునేందుకు ఈ శిఖరాగ్ర సమ్మేళనం తమకు  తగిన అవకాశం కల్పించిందని అన్నారు.

  ఖతార్ వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి షేక్ మొహ్మద్ బిన్ హమద్ బిన్ ఖాసిం అల్ అబ్దుల్లా అల్ థానీ, భూటాన్ ఆర్థిక వ్యవహారాల మంత్రి లోక్.నాథ్ శర్మ, ఇథియోపియా ఫెడరల్ డెముక్రటిక్ రిపబ్లిక్.కు చెందిన వాణిజ్య, ప్రాంతీయ సమగ్రత శాఖల మంత్రి గెబరే మెస్కెల్ చాలా, ఫిజీ వాణిజ్యం, పర్యాటకం, రవాణా శాఖ మంత్రి ఫయాజ్ కోయా, మాల్దీవుల ఆర్థికాభివృద్ధి శాఖ మంత్రి ఫయ్యాజ్ ఇస్మాయిల్, మారిషస్ వాణిజ్యం, వినియోగదారుల రక్షణ, కార్మిక, మానవ వనరుల అభివృద్ధి, శిక్షణా శాఖల మంత్రి సూదేశ్ సత్కమ్ కళ్లిచుర్న్,  మయన్మార్ వాణిజ్య శాఖ మంత్రి డాక్టర్ ప్వింట్ శాన్, శ్రీలంక వాణిజ్య శాఖమంత్రి బందదూల గుణవర్ధన, కంబోడియా వాణిజ్య శాఖ కార్యదర్శి చువాన్ దారా, ఇటలీ ఆర్థికాభివృద్ధి శాఖ మంత్రి గైన్.కార్లో జార్జెటీ ఈ శిఖరాగ్ర సదస్సుకు హాజరయ్యారు.

***



(Release ID: 1781519) Visitor Counter : 152