వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
ముతకధాన్యాలపై మార్గదర్శకాల సవరణ
సేకరణ, కేటాయింపు, పంపిణీ, విక్రయానికి వర్తింపు..
జొన్నలు, రాగుల పంపిణీకి గతంలో విధించిన
3 నెలల గడువు హెచ్చింపు..
జొన్నలకు 6నెలలు, రాగులకు 7 నెలలు గడువు..
కొత్త మార్గదర్శకాలతో పి.డి.ఎస్. ద్వారా
పెరగనున్న ముతక ధాన్యాల సేకరణ, వినియోగం
Posted On:
09 DEC 2021 3:32PM by PIB Hyderabad
ముతక ధాన్యాల సేకరణ, కేటాయింపు పంపిణీ, విక్రయానికి సంబంధించిన మార్గదర్శక సూత్రాలను కేంద్ర ప్రభుత్వం సవరించింది. 21.3.2014/26.12.2014 తేదీల్లో ఈ మార్గదర్శక సూత్రాలను సవరించారు. ఈ మార్గదర్శక సూత్రాల ప్రకారం, సెంట్రల్ పూల్ కింద, వివిధ రాష్ట్రాలు కనీస మద్దతు ధరపై ముతక ధాన్యాలను సేకరించడానికి అనుమతిస్తారు. అయితే, భారత ఆహార సంస్థతో సంప్రదింపుల అనంతరం సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసిన ధాన్య సేకరణ ప్రణాళికకు భారత ప్రభుత్వంనుంచి లభించే ముందస్తు ఆమోదాన్ని బట్టి ఇది ఆధారపడి ఉంటుంది. సేకరణ వ్యవధి ముగిసిన నాటినుంచి మూడు నెలలలోగా మొత్తం ధాన్యాన్ని పంపిణీ చేయాల్సివచ్చింది.
ఆయా రాష్ట్రాల ద్వారా ముతక ధాన్యాల సేకరణను ప్రోత్సహించేందుకు ఈ మార్గదర్శక సూత్రాలు ఉపయోగపడ్డాయి. గత మూడేళ్లుగా సేకరిస్తూ వస్తున్న ముతక ధాన్యాల పరిమాణం క్రమంగా పెరుగుతూ ఉండటం ఇదే విషయాన్ని తేటతెల్లం చేస్తోంది. అయితే,..ముతక ధాన్యాల పంపిణీ వ్యవధికి సంబంధించి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నట్టు తెలిసింది. ఎందుకంటే, ముతక ధాన్యాల నిల్వ వ్యవధితో సంబంధం లేకుండా ఈ ధాన్యం సేకరణకు, పంపిణీకి మూడేసి నెలల చొప్పున మాత్రమే గడువును నిర్దేశించారు.
ముతక ధాన్యాల సేకరణ, పంపిణీకి సంబంధించి కొన్ని రాష్ట్రాలు ఎదుర్కొనే ఇబ్బందులను తొలగించేందుకు, సెంట్రల్ పూల్ కింద సేకరించే ముతక ధాన్యాల పరిమాణం పెంచేందుకు సంబంధించి, వివిధ భాగస్వామ్య వర్గాలతో చర్చలు నిర్వహించారు. భాగస్వామ్య వర్గాలవారితో జరిగిన చర్చల ఆధారంగా, ముతక ధాన్యాల సేకరణ, కేటాయింపు, పంపిణీకి సంబంధించిన మార్గదర్శకాలను సవరించారు. 21.3.2014/26.12.2014 తేదీల్లో ఈ సవరణలు చేశారు.
-
-
- తేదీ సవరించిన మార్గదర్శక సూత్రాల్లో ముఖ్యాంఖాలు ఇలా ఉన్నాయి:
- జొన్నల, రాగుల పంపిణీకి గతంలో నిర్దేశించిన 3 నెలల గడువును గణనీయంగా పొడిగించారు. జొన్నల పంపిణీ వ్యవధిని 6నెలలకు, రాగుల పంపిణీ గడువును 7 నెలలకు పెంచారు. దీనితో ఈ సరకుల సేకరణ, వినియోగం పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే, ప్రజాపంపిణీ వ్యవస్థ కింద, ఇతర సంక్షేమ పథకాల కింద ముతక ధాన్యాలను పంపిణీ చేయడానికి రాష్ట్రాలకు మరింత వ్యవధి అందుబాటులోకి వస్తుంది.
- అదనపు ముతక ధాన్యాలను భారత ఆహార సంస్థ (ఎఫ్.సి.ఐ.) ద్వారా అంతర్రాష్ట్ర రవాణాకు ఈ వ్యవస్థలో అవకాశం కల్పించారు. సేకరణ ప్రక్రియ కంటే మునుపే వినియోగ రాష్ట్రంలో ఏర్పడే గిరాకీకి తగినట్టుగా ధాన్యాలను సరఫరా చేసేందుకు ఈ చర్య తీసుకున్నారు.
- కొత్త మార్గదర్శక సూత్రాల కారణంగా, ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా జరిగే ముతక ధాన్యాల సేకరణ, వినియోగం పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే, ఈ ముతక ధాన్యాల పంటలన్నీ సాధారణంగా సేద్యపునీటి సదుపాయం లేనిచోట్ల వర్షాధార పంటగా సాగు చేస్తారు. ఈ పంటలసాగు పెరగడంతో సుస్థిర వ్యవసాయానికి, పంటల మార్పిడికి తగిన ప్రోత్సాహం లభిస్తుంది. ధాన్యంసేకరణ పెరగడంతో, ఈ పంటల సేకరణ ద్వారా ప్రయోజనం పొందే రైతుల సంఖ్య కూడా పెరుగుతుంది.
- చిరుధాన్యాల సేకరణ, పంపిణీ కేజీ రూపాయి ధర చొప్పున జరగడంతో ప్రజా పంపిణీ వ్యవస్థ లబ్ధిదారులైన సన్నకారు రైతులు, పేద రైతులు ప్రయోజనం పొందుతారు. స్థానిక వినియోగం కోసం ప్రాంతాలవారీగా ముతక ధాన్యాల పంపిణీ జరిగిన పక్షంలో గోధుమల రవాణా/బియ్యం రవాణా ఖర్చు కూడా ఆదా అవుతుంది.
- ముతక ధాన్యాలు బాగా పోషకాలతో కూడుకున్నవి. ఆమ్లత్వ రహితం, గ్లూటెన్ రహితమైనవి. దీనికి తోడు చిన్నారుల్లో, కిశోర ప్రాయపు బాలల్లో పోషకాహార లోపం నివారణకు మనం జరిపే పోరాటాన్ని బలోపేతం చేసేందుకు ముతక ధాన్యాల వినియోగం ఎంతగానో దోహదపడుతుంది. రోగనిరోధక శక్తిని, ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు కూడా ముతక ధాన్యాలు ఎంతో ఉపయోగపడతాయి.
***
(Release ID: 1779923)
Visitor Counter : 200