ఉప రాష్ట్రప‌తి స‌చివాల‌యం

సామాన్యుడికి మెరుగైన సేవలందించేందుకు అధికారుల్లో నైతిక పరివర్తన అవసరం


• అవినీతిని ఏ మాత్రం సహించవద్దు- అవినీతి నిరోధక చట్టాన్ని కట్టుదిట్టంగా అమలు చేయాలి

• అవినీతికి పాల్పడిన అధికారులు, ప్రజాప్రతినిధులపై ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి చర్యలు అవసరం

• నైతిక భారతం కోసం విశాల ప్రాతిపదికగా సామాజిక ఉద్యమం చేపట్టాల్సిన అవసరం ఉంది

• నిజాయితీతో పనిచేసే అధికారులను గౌరవించండి- ప్రతిభావంతులైన యువ అధికారులను ప్రోత్సహించండి

• సివిల్ సర్వీస్ అధికారులందరికీ  విలువలతో కూడిన  శిక్షణ అవసరం, సమగ్రమైన సివిల్ సర్వీస్ కోడ్ ఏర్పర్చుకోవాలి

• శ్రీ  ప్రభాత్ కుమార్ రచించిన పబ్లిస్ సర్వీస్ ఎథిక్స్: ఎ క్వెస్ట్ ఫర్ నైతిక్ భారత్’  పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో  ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు పిలుపు*

Posted On: 05 DEC 2021 1:33PM by PIB Hyderabad

అవినీతిని ఎంతమాత్రమూ సహించరాదని, పరిపాలనలో  అన్ని స్థాయిల్లో సంపూర్ణమైన పారదర్శకత, జవాబుదారీతనం అవలంబించాలని  గౌరవ భారత ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యానికి అవినీతి చెద పడితే సామాన్య మానవుడికి తీవ్ర నష్టంగా పరిణమిస్తుందని ఆయన తెలిపారు. అవినీతికి పాల్పడిన అధికారులు, ప్రజాప్రతినిధులపై అవినీతి నిరోధక చట్టం క్రింద సకాలంలో కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని, ఈ కేసుల విషయంలో సత్వర పరిష్కారం అవసరమని ఆయన స్పష్టం చేశారు. అదే సమయంలో సదుద్దేశంతో క్రియాశీలక చర్యలను చేపడుతున్న అధికారులను నిరుత్సాహ పరచడం కానీ, వేధించడం కానీ చేయకూడదని శ్రీ వెంకయ్యనాయుడు హితవు పలికారు. “అవినీతికి పాల్పడిన అధికారులపై కఠినంగా వ్యవహరించాలి కాని విస్తృతప్రజా ప్రయోజనాలరీత్యా ధైర్యంగా నిర్ణయాలను తీసుకునే అధికారులను నిరుత్సాహపరచకూడదు.” అని ఆయన అన్నారు.  

జార్ఖండ్ రాష్ట్ర మాజీ గవర్నర్, కేంద్ర ప్రభుత్వ మాజీ కేబినెట్ కార్యదర్శి శ్రీ ప్రభాత్ కుమార్ రచించిన ‘పబ్లిక్ సర్వీస్ ఎథిక్స్: ఎ క్వెస్ట్ ఫర్ నైతిక్ భారత్’ పుస్తకాన్ని ఆదివారం ఉపరాష్ట్రపతి నివాసంలో శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. 

 

సమాజంలో నైతిక విలువలు సార్వత్రికంగా పడిపోతున్నాయని, ఈ పరిణామాన్ని అరికట్టేందుకు ‘నైతిక భారతం’ అవతరించడం కోసం  విశాల ప్రాతిపదికగా ఒక సామాజిక ఉద్యమం అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.

నిజాయితీ తో పనిచేసే సివిల్ సర్వెంట్లు సాధించిన విజయాలను గౌరవించాలని, వారి వినూత్న చర్యలను, సేవలను గుర్తించాలని ఉపరాష్ట్రపతి ఈ సందర్బంగా పిలుపునిచ్చారు. దీని వల్ల ప్రతిభావంతంగా పనిచేసే యువ అధికారులకు ఇతోధిక ప్రోత్సాహం లభిస్తుందని, ఇతరులు కూడా ఈ దిశగా వినూత్న కృషి చేసేందుకు దోహదపడుతుందని ఆయన తెలిపారు. స్థానిక అధికారులు చేస్తున్న ఇలాంటి కీలక సేవలను, ప్రజల దృష్టికి తీసుకువచ్చి ప్రోత్సాహం కల్పించే బాధ్యతను మీడియా తీసుకోవాలని ఆయన సూచించారు. 

ప్రజా జీవనంలో సత్ప్రవర్తనతో వ్యవహరించే విషయంలో అధికారులందరికీ విలువలతో కూడిన శిక్షణ అందించాల్సిన ప్రాధాన్యతను నొక్కిచెప్పిన ఉపరాష్ట్రపతి, అన్ని శిక్షణా కోర్సుల్లో వృత్తిపరమైన నైతికత అంతర్భాగం కావాలని, రెండవ పరిపాలనా సంస్కరణల కమిషన్ (ఎఐర్ సి) చేసిన సిఫారసుల ఆధారంగా సివిల్ సర్వెంట్లకు సమగ్రమైన నైతిక స్మృతిని రూపొందించాల్సిన అవసరం ఉన్నదని ఆయన పిలుపునిచ్చారు. 

మంచి సంస్థలు, సుపరిపాలన ప్రాధాన్యత ఎంతో ఉన్నదని, కాలయాపన లేకుండా సకాలంలో ప్రజాసేవలు అందించాలంటే మన సంస్థలను పునర్వ్యవస్థీకరించాలని, నిర్ణయ క్రమంలో అడ్డంకులు లేకుండా చూసుకోవాలని ఆయన తెలిపారు. సేవలు అందించడంలో మానవ ప్రమేయం తగ్గించేందుకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) ను అధికంగా ఉపయోగించాలని ఉపరాష్ట్రపతి పిలుపునిచ్చారు.  దీనివల్ల నాణ్యత పెరగడమే కాక, వివక్షకు, స్వప్రయోజనాలకు  ఆస్కారం ఉండదని ఆయన స్పష్టం చేశారు. 

ప్రజల ఆధునిక ఆకాంక్షలకు అనుకూలంగా పరిపాలనా నమూనాలు మారాలని, అధికారిక వ్యవస్థ తేలికగా,  పారదర్శకంగా, చురుకుగా పనిచేయడం అవసరమని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు.  పౌర కేంద్రిత, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా దేశం కోసం పనిచేసే అధికారిక వ్యవస్థకోసం కేంద్ర ప్రభుత్వం ‘మిషన్ కర్మయోగి’ని ప్రారంభించడాన్ని ఆయన అభినందించారు. 

ఈ పుస్తక రచయిత శ్రీ ప్రభాత్ కుమార్ ను, ప్రచురణ కర్తలు ఐసి సెంటర్ ఫర్ గవర్నెన్స్ ను శ్రీ వెంకయ్యనాయుడు అభినందించారు. పదవీ విరమణ చేసిన సీనియర్ అధికారులు తమ అపార అనుభవాన్ని, పరిజ్ఞానాన్ని యువ అధికారులతో పంచుకునేందుకు, ప్రభుత్వ విధాన నిర్ణయాలకు దోహదం చేసేందుకు ఇలాంటి పుస్తకాలు ఎంతో తోడ్పడతాయని తెలిపారు.

పుస్తక రచయిత శ్రీ ప్రభాత్ కుమార్, ఐసి సెంటర్ ఫర్ గవర్నెన్స్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ మహేశ్ కపూర్, సెక్రటరీ జనరల్ శ్రీ శాంతి నారాయణ్ సహా పలువురు మాజీ సివిల్ సర్వీస్ అధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

***



(Release ID: 1778249) Visitor Counter : 201