ఉప రాష్ట్రప‌తి స‌చివాల‌యం

కరోనా కొత్త వేరియంట్‌పై మరింత అప్రమత్తత ఆవశ్యకం: ఉపరాష్ట్రపతి


- ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.. జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి

- వీలైనంత త్వరగా టీకాలు తీసుకోవాలని ప్రజలకు సూచన- బాధ్యతగా నడుచుకోవడమే.. అసలైన దేశభక్తి- భారతదేశ విజయమే ప్రపంచ విజయం అన్న ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు

- ‘ద మిడ్ వే బాటిల్: మోడీస్ రోలర్ కోస్టర్ సెకండ్ టర్మ్’ పుస్తకాన్ని ఆవిష్కరించిన ఉపరాష్ట్రపతి

Posted On: 04 DEC 2021 5:57PM by PIB Hyderabad

కరోనా మహమ్మారి ఒమిక్రాన్ రూపంలో మళ్లీ తన ప్రభావం చూపే ప్రమాదం ఉందని, అయితే ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రజలందరూ ఇన్నాళ్లు తీసుకున్నట్లుగా ప్రభుత్వాలు, వైద్య నిపుణులు సూచించిన జాగ్రత్తలను పాటిస్తే సరిపోతుందని గౌరవ భారత ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు సూచించారు. ప్రతి ఒక్కరూ టీకా వేయించుకోవడంలో చొరవ తీసుకోవడంతోపాటు ఇతరులను కూడా ప్రోత్సహించాలని ఆయన సూచించారు.

రాజకీయ విశ్లేషకుడు శ్రీ గౌతమ్ చింతామణి రచించిన ‘ద మిడ్ వే బాటిల్: మోడీస్ రోలర్ కోస్టర్ సెకండ్ టర్మ్’ పుస్తకాన్ని శనివారం ఉపరాష్ట్రపతి నివాసంలో జరిగిన కార్యక్రమంలో ఆయన ఆవిష్కరించారు. నడుస్తున్న చరిత్రను పుస్తకరూపంలో తీసుకురావడం అంత సులువైన విషయం కాదన్న ఉపరాష్ట్రపతి, ఈ ప్రయత్నం చేసిన శ్రీ గౌతమ్ చింతామణిని అభినందించారు. గత ఏడేళ్లలో కేంద్ర ప్రభుత్వ పనితీరు ద్వారా వచ్చిన విప్లవాత్మకమైన మార్పులను ప్రస్తావిస్తూ.. ఈ మార్పుల ద్వారా 130 కోట్ల మంది భారతీయుల శక్తిసామర్థ్యాలను బయటకు తీసేందుకు ప్రయత్నం జరుగుతోందన్నారు. ‘జీవన ప్రమాణాలు మెరుగుపడటం, ఆర్థిక సమగ్రత, ఆరోగ్య సంరక్షణ అందుబాటులోకి రావడం, ఉపాధికల్పన, సొంతింటి కల, పారిశ్రామిక వర్గాలకు చేయూత కల్పించడంతోపాటు వివిధ అంశాల్లో పురోగతి స్పష్టంగా కనబడుతోంది’ అని ఉపరాష్ట్రపతి అన్నారు.

బీమా కవరేజీ, పేదలకు ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లు, ఇంటింటికీ నల్లా కనెక్షన్లు, గ్రామాల్లో విద్యుదీకరణ వంటి ఎన్నో కార్యక్రమాలు వేగవంతంగా, సమర్థవంతంగా అమలవుతున్నాయని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. ప్రతి రంగంలో పురోగతి సాధించే దిశగా కేంద్ర ప్రభుత్వం కార్యక్రమాలు చేపడుతోందన్నారు. ప్రపంచ స్టార్టప్ వ్యవస్థకు భారతదేశం కేంద్రంగా మారనుందని ఆయన పేర్కొన్నారు. 

స్వాతంత్ర్య సముపార్జన అనంతరం భారతదేశం ఎన్నో ఆటుపోట్లను, ఇబ్బందులను ఎదుర్కొందన్న ఉపరాష్ట్రపతి, భారతదేశ పురోగతిని ఏ శక్తి అడ్డుకోబోదని, ఇకపై ప్రగతి పథంలోవచ్చే ఏ ఆటంకాన్నయినా ఎదుర్కొని ముందుకెళ్లేందుకు భారతదేశం సిద్ధంగా ఉందన్నారు. మరోసారి విశ్వగురు అయ్యేదిశగా భారతదేశం అభివృద్ధి పథంలో పయనిస్తోందన్న ఆయన, ఈ మహాయజ్ఞంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. ప్రతి భారతీయుడు బాధ్యతగా నడుచుకోవడమే.. అసలైన దేశభక్తి అని ఉపరాష్ట్రపతి నొక్కి చెప్పారు. 

ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయుడు, సమాచార, ప్రసార శాఖ సలహాదారు శ్రీ కంచన్ గుప్తా, బ్లూమ్స్‌బరీ ఇండియా, సంపాదకురాలు శ్రీమతి ప్రేరణా బోరా, పలువురు జర్నలిస్టులు, ప్రభుత్వాధికారులు పాల్గొన్నారు.

***



(Release ID: 1778075) Visitor Counter : 152