ఆర్థిక మంత్రిత్వ శాఖ

గాంధీనగర్‌లోని జి.ఐ.ఎఫ్.టి. సిటీలో ఉన్న జి.ఐ.ఎఫ్.టి-ఐ.ఎఫ్.ఎస్.సి. కి తన తొలి పర్యటన సందర్భంగా అభివృద్ధి, పురోగతి గురించి చర్చించిన - కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్


ఐ.ఎఫ్.ఎస్.సి.ఏ. కోసం 500 కోట్ల కంటే ఎక్కువ విలువైన 3 కీలక ప్రాజెక్టులకు అనుమతి మంజూరు చేసిన - కేంద్ర ఆర్థిక మంత్రి

Posted On: 20 NOV 2021 8:48PM by PIB Hyderabad

కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన ఇద్దరు సహాయ మంత్రులతో పాటు, కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖకు చెందిన కార్యదర్శులతో కూడిన ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించిన, కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్,  ఈ రోజు జి.ఐ.ఎఫ్.టి. సిటీ ని సందర్శించారు.  గాంధీనగర్‌లోని జి.ఐ.ఎఫ్.టి. సిటీలో భారతదేశపు తొలి అంతర్జాతీయ ఆర్థిక సేవల కేంద్రం (ఐ.ఎఫ్.ఎస్.సి) అభివృద్ధి, పురోగతి కి సంబంధించిన విషయాలపై ప్రతినిధి బృందం చర్చలు జరిపింది.

క్యాపిటల్ మార్కెట్‌ లు, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్‌ పై రెండు ఇంటరాక్టివ్ సదస్సులు సంబంధిత కార్యదర్శుల నేతృత్వంలో సమాంతరంగా జరిగాయి.  ఈ కార్యక్రమాల్లో భాగంగా జి.ఐ.ఎఫ్.టి. మేనేజింగ్ డైరెక్టర్, సి.ఈ.ఓ. ద్వారా, ఆ తర్వాత ఐ.ఎఫ్.సి.ఎస్.ఏ., ఛైర్మన్ ద్వారా వివరాలు తెలియజేయడం జరిగింది.  గౌరవనీయులైన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభ దార్శనికతకు అనుగుణంగా, జి.ఐ.ఎఫ్.టి-ఐ.ఎఫ్.ఎస్.సి. ప్రయాణంలోని వివిధ అంశాలతో పాటు,  సాధించిన విజయాల గురించి, భవిష్యత్తులో జి.ఐ.ఎఫ్.టి.  స్థాయిని మరింత పెంచడానికి అనువైన మార్గాల గురించి, వారు తమ వివరణల్లో తెలియజేశారు. ఆ తర్వాత, జి.ఐ.ఎఫ్.టి-ఐ.ఎఫ్.ఎస్.సి.  లో వృద్ధి అవకాశాలకు సంబంధించి బహిరంగ చర్చ జరిగింది.  ఈ చర్చలో పాల్గొన్న కేంద్ర ఆర్థిక మంత్రి మాట్లాడుతూ, పరిష్కారాలను కనుగొని ముందుకు సాగాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు.

అంతర్జాతీయ ఆర్ధిక సేవల సాధికార కేంద్రం (ఐ.ఎఫ్.ఎస్.సి.ఏ) కి చెందిన మూడు కీలక ప్రతిపాదనలను ఆర్థిక వ్యవహారాల శాఖ గత వారంలోనే ఆమోదించినట్లు, శ్రీమతి నిర్మలా సీతారామన్ ఈ కార్యక్రమంలో ప్రకటించారు.  మొదటిది ఐ.ఎఫ్.ఎస్.సి.ఏ. కోసం ప్రధాన కార్యాలయ భవనం కోసం 200 కోట్ల రూపాయల ప్రతిపాదన కాగా,  ఇందులో 100 కోట్ల రూపాయలు గ్రాంట్-ఇన్-ఎయిడ్ గానూ, మిగిలిన 100 కోట్ల రూపాయలు ప్రభుత్వం నుండి రుణంగా సమకూర్చడం జరిగింది.   రెండోది ఐ.ఎఫ్.ఎస్.సి.ఏ. యొక్క ఐ.టి. మౌలిక సదుపాయాల అభివృద్ధికి 269.05 కోట్ల రూపాయల ప్రతిపాదన కాగా; మూడవది, ఐ.ఎఫ్.ఎస్.సి.ఏ. ఫిన్‌-టెక్ పథకం కోసం 45.75 కోట్ల రూపాయల ప్రతిపాదన. 

జి.ఐ.ఎఫ్.టి. సిటీ లో జి.ఐ.ఎఫ్.టి-ఐ.ఎఫ్.ఎస్.సి. ద్వారా భారతదేశాన్ని "గ్లోబల్-ఫైనాన్షియల్=గేట్‌వే" గా మార్చడం భారత ప్రభుత్వ ప్రయత్నమని కేంద్ర ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. 

శ్రీమతి సీతారామన్ జి.ఐ.ఎఫ్.టి. సిటీని సందర్శించి, దాని ప్రత్యేక లక్షణాల గురించి క్లుప్తంగా తెలుసుకున్నారు. అనంతరం, ఆటోమేటెడ్ వేస్ట్ కలెక్షన్ సిస్టమ్ (ఏ.డబ్ల్యూ.సి.ఎస్);  భూగర్భ యుటిలిటీ టన్నెల్;  బులియన్ వాల్టింగ్ సౌకర్యం; ఇండియా ఐ.ఎన్.ఎక్స్. లను కూడా ఆర్థిక మంత్రి సందర్శించారు.  భారతదేశంలో బంగారానికి అధిక డిమాండ్ ఉన్న కారణంగా, జి.ఐ.ఎఫ్.టి.  ఐ.ఎఫ్.ఎస్.సి. వద్ద ప్రతిపాదిత అంతర్జాతీయ బులియన్ ఎక్స్ఛేంజ్‌గురించి, ఇండియా ఐ.ఎన్.ఎక్స్. వద్ద శ్రీమతి సీతారామన్ కి ఎన్.ఎస్.ఈ.  ఐ.ఎఫ్.ఎస్.సి; ఇండియా ఐ.ఎన్.ఎక్స్; ఐ.ఎఫ్.ఎస్.సి.ఏ. లు  వివరించాయి. 

బులియన్ మార్పిడి భారతదేశానికి పెద్ద గేమ్ ఛేంజర్ గా గుర్తింపు పొందిన నేపథ్యంలో, సురక్షితమైన వాల్ట్ సౌకర్యాలతో సహా అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు పనిచేయడం ప్రారంభించడంతో, బులియన్ మార్పిడి త్వరలో అమల్లోకి వస్తుందని భావిస్తున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు.  జి.ఐ.ఎఫ్.టి.  ఐ.ఎఫ్.ఎస్.సి. లో మరిన్ని కంపెనీలు లిస్ట్ అయ్యే వివిధ మార్గాలను పరిశీలించాలని శ్రీమతి సీతారామన్ అధికారులను కోరారు.  "అప్పుడు మరిన్ని లావాదేవీలు ఇక్కడ జరుగుతాయి.  కంపెనీలు ఇక్కడి నుంచి మరిన్ని నిధులు సేకరించవచ్చు.  అదేవిధంగా, జి.ఐ.ఎఫ్.టి.  ఐ.ఎఫ్.ఎస్.సి. వద్ద బాండ్ మార్కెట్ కార్యకలాపాలను మెరుగుపరచవచ్చు, పటిష్ట పరచి, విస్తరించవచ్చు." అని ఆమె వివరించారు. 

బెంగళూరు, హైదరాబాద్, గురుగ్రామ్ తదితర ప్రదేశాలలో ఉన్న, ఫిన్‌-టెక్ మరియు ఇతర కార్యకలాపాలతో వ్యవహరించే ప్రముఖ అంకురసంస్థలతో పరస్పర సంప్రదింపులు జరపవలసిన అవసరం ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి సూచించారు.  ఐ.ఎఫ్.ఎస్.సి. కి వెలుపల, అయితే, జి.ఐ.ఎఫ్.టి. సిటీ పరిధిలో ఉన్న ప్రముఖ అంకుర సంస్థలను గుర్తించి, వాటికి సౌకర్యాలు కల్పించే విధంగా,  అవకాశాలను అన్వేషించాలని, శ్రీమతి సీతారామన్, గుజరాత్ ప్రభుత్వాన్ని కోరారు.  తద్వారా ప్రపంచ ఆర్థిక కేంద్రానికి అవసరమైన పర్యావరణ వ్యవస్థను సృష్టించవచ్చునని, ఆమె పేర్కొన్నారు. 

 

*****



(Release ID: 1773674) Visitor Counter : 122