సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

గోవాలో రేపు ప్రారంభం కానున్న - 52వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం


ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించనున్న - కేంద్ర సమాచార, ప్రసార శాఖల మంత్రి అనురాగ్ ఠాకూర్

దేశంలోని వివిధ ప్రాంతాల నుండి 75 మంది యువ సృజనాత్మక మేధావులు ఈ ఉత్సవంలో పాల్గొంటున్నారు

ఐ.ఎఫ్.ఎఫ్.ఐ. జరుగుతున్న సమయంలోనే తొలిసారిగా నిర్వహిస్తున్న - బ్రిక్స్ చలనచిత్రోత్సవం

మొదటిసారి ఈ ఉత్సవంలో పాల్గొంటున్న - ప్రధాన ఓ.టి.టి. వేదికలు

ఈ ఉత్సవంలో 73 కంటే ఎక్కువ దేశాలకు చెందిన చలన చిత్రాలను ప్రదర్శించనున్నారు

ఈ ఉత్సవంలో "ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్-2021" అవార్డు అందకోనున్న - ప్రముఖ నటి హేమ మాలిని

Posted On: 19 NOV 2021 6:48PM by PIB Hyderabad

 

ఆసక్తిగల ఔత్సాహిక సినిమా ప్రేమికులందరికీ ఆహ్వానం. సినిమాల పట్ల మన ప్రేమను మళ్లీ పునరుజ్జీవింప జేసుకోవడంతో పాటు,  మనం పంచుకున్న మానవ అనుభవాల వైవిధ్యం, స్ఫూర్తితో నిండిన పండుగల సంరంభంలో మునిగిపోవడానికి ఇది సమయం.

అవును, ఆసియాలోనే పురాతనమైన, భారతదేశంలోనే అతిపెద్ద చలనచిత్రోత్సవం 52వ ఎడిషన్, భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం (ఐ.ఎఫ్.ఎఫ్.ఐ.) రేపు (2021 నవంబర్, 20వ తేదీన) గోవా బంగారు తీరంలో వర్ణ శోభితంగా ప్రారంభం కానుంది.

కేంద్ర సమాచార, ప్రసార, యువజన వ్యవహారాలు, క్రీడల శాఖల మంత్రి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్ తో పాటు గోవా ముఖ్యమంత్రి డాక్టర్ ప్రమోద్ సావంత్ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.  కేంద్ర సమాచార, ప్రసార, మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ శాఖల సహాయ మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్ కూడా ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరు కానున్నారు. 

ప్రపంచ సినిమా ఔన్నత్యాన్ని చాటి చెప్పే ఉద్దేశ్యంతో, 1952 లో మొదటిసారి ప్రారంభమై,  ప్రతి ఏటా నిర్వహిస్తున్న ఈ చలన చిత్రోత్సవాలు, ప్రస్తుతం, గోవా రాష్ట్రంలో జరుగుతున్నాయి.

ఐ.ఎఫ్.ఎఫ్.ఐ. 2021 నవంబర్, 20వ తేదీ నుండి, 28వ తేదీ వరకు జరుగుతుంది. వివిధ దేశాల సామాజిక, సాంస్కృతిక నైతికత నేపథ్యంలో వారి సినిమా సంస్కృతులను అర్థం చేసుకోవడానికి, ప్రశంసించడానికి అనువైన ఒక వేదికను ఈ ఉత్సవం అందిస్తుంది.  ఈ ఉత్సవాన్ని, కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ పరిధిలోని చలనచిత్రోత్సవాల డైరెక్టరేట్ తో పాటు, గోవాలోని ఎంటర్‌టైన్‌మెంట్ సొసైటీ, గోవా ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి.

గోవా, పనాజీలోని డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఇండోర్ స్టేడియంలో - సల్మాన్ ఖాన్, రణవీర్ సింగ్, రితేష్ దేశ్‌ముఖ్, జెనీలియా దేశ్‌ముఖ్, శ్రద్ధా కపూర్ తదితర ప్రముఖ చలన చిత్ర నటీనటుల సమక్షంలో ప్రారంభోత్సవ వేడుకకు శ్రీకారం చుట్టనున్నారు.  ఈ ఏడాది ఐ.ఎఫ్.ఎఫ్.ఐ. లో ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలకు చెందిన 300 చిత్రాలను ప్రదర్శించనున్నారు.  ప్రముఖ సినీ నిర్మాత కరణ్ జోహార్ తో పాటు, టెలివిజన్ కార్యక్రమాల ద్వారా ప్రముఖుడు మనీష్ పాల్ ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతలు గా వ్యవహరించనున్నారు.

ప్రస్తుతం కొనసాగుతున్న కోవిడ్-19 మహమ్మారి పరిస్థితుల కారణంగా, ఈ సంవత్సరం ఐ.ఎఫ్.ఎఫ్.ఐ. ని రెండు రకాలుగా నిర్వహిస్తున్నారు.   ఈ ఉత్సవాల ప్రతినిధులు తమ తమ ఇళ్లలోనే సౌకర్యవంతంగా కూర్చొని దృశ్య మాధ్యమం ద్వారా చలనచిత్రాలు వీక్షించడానికి, ఇతర కార్యక్రమాల్లో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది.

ఐ.ఎఫ్.ఎఫ్.ఐ. లో ప్రదర్శించే చిత్రాలు:

సుమారు 12 ప్రపంచ ప్రీమియర్లు; సుమారు 7 అంతర్జాతీయ ప్రీమియర్లు; 26 ఆసియా ప్రీమియర్లు; 64 ఇండియా ప్రీమియర్లతో అంతర్జాతీయ విభాగంలో దాదాపు 73 దేశాల నుండి 148 చిత్రాలను ఐ.ఎఫ్.ఎఫ్.ఐ. లో ప్రదర్శించనున్నారు.   ఈ ఏడాది ఉత్సవానికి 95 దేశాల నుండి 624 సినిమాలు వచ్చాయి, కాగా, ఏడాది 69 దేశాలు మాత్రమే పాల్గొన్నాయి. 

కార్లోస్ సౌరా దర్శకత్వం వహించిన 'ది కింగ్ ఆఫ్ ఆల్ ది వరల్డ్' (ఎల్ రే డి టోడో ఎల్ ముండో) అనే చిత్రం ఈ ఉత్సవంలో ప్రారంభ చిత్రంగా ప్రదర్శించనున్నారు.  ఈ చిత్రం అంతర్జాతీయ ప్రీమియర్ విభాగంలో కూడా ఉంది.  వెనిస్ చలన చిత్రోత్సవంలో ఉత్తమ దర్శకునిగా విజేతగా నిలిచిన జేన్ కాంపియన్ దర్శకత్వం వహించిన "ది పవర్ ఆఫ్ ది డాగ్" ఈ ఉత్సవంలో "మిడ్ ఫెస్ట్ చిత్రం" గా ఎంపికయ్యింది. దర్శకుడు అస్గర్ ఫర్హాదీ దర్శకత్వం వహించిన గ్రాండ్ ప్రిక్స్ అవార్డు పొందిన "ఎ హీరో" అనే చిత్రాన్ని, ఈ ఉత్సవంలో ముగింపు చిత్రంగా ప్రదర్శించనున్నారు. 

ఐ.ఎఫ్.ఎఫ్.ఐ. ప్రపంచ పనోరమా విభాగంలో, ప్రపంచవ్యాప్తంగా ఎంపిక చేసిన 55 అత్యుత్తమ చలన చిత్రాలను ప్రదర్శించనున్నారు.  ఈ చలన చిత్రోత్సవం "కెలిడోస్కోప్" విభాగంలో ప్రదర్శనకు, టైటాన్ (ఫ్రెంచ్) మరియు సౌద్ (అరబిక్) వంటి సినిమాలతో సహా 11 చలన చిత్రాలను ఎంపిక చేశారు. 

పునరావలోకన విభాగం:

52వ ఐ.ఎఫ్.ఎఫ్.ఐ. లో "రెట్రోస్పెక్టివ్" విభాగంలో ప్రఖ్యాత హంగేరియన్ చిత్ర నిర్మాత బేలా టార్ మరియు రష్యన్ చిత్ర నిర్మాత, రంగస్థల దర్శకుడు ఆండ్రీ కొంచలోవ్‌స్కీ పాల్గొంటారు.

రచయిత, చిత్ర నిర్మాత, బేలా టార్ తన స్వంత దృశ్య శైలిని సృష్టించారు.  ఆయన చలన చిత్రాలు బెర్లిన్, కేన్స్, లోకర్నో చలన చిత్రోత్సవాల్లో కూడా ప్రశంసలు పొందాయి.

కొంచలోవ్‌స్కీ చలనచిత్రాలు కేన్స్ గ్రాండ్ ప్రిక్స్ స్పెషల్ డు జ్యూరీ, ఫిప్రెస్కీ అవార్డు, రెండు సిల్వర్ లయన్స్, మూడు గోల్డెన్ ఈగిల్ అవార్డులు, ప్రైమ్‌-టైమ్ ఎమ్మీ అవార్డు తో సహా అనేక ప్రశంసలను గెలుచుకున్నాయి.

ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ 2021 :

ఈ ఉత్సవాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో, ప్రముఖ నటి, పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి హేమమాలిని కి "ఇండియన్-ఫిల్మ్-పర్సనాలిటీ-ఆఫ్-ది-ఇయర్-2021"  అవార్డును ప్రదానం చేయనున్నారు.  ప్రముఖ గీత రచయిత, సి.బి.ఎఫ్.సి. చైర్‌-పర్సన్ శ్రీ ప్రసూన్ జోషి కి ముగింపు రోజున అవార్డును అందజేయనున్నారు.  భారతీయ సినిమా రంగానికి దశాబ్దాలుగా వారు ఎంతో కృషి చేస్తున్నారు. వారి ప్రతిభ తరతరాలుగా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. 

స్వర్గస్తులైన చలనచిత్ర ప్రముఖులకు నివాళి :

స్వర్గస్తులైన సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులకు భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం ప్రతి ఏటా నివాళులర్పిస్తుంది.  52వ ఐ.ఎఫ్.ఎఫ్.ఐ. కార్యక్రమాలలో భాగంగా "నివాళి సమర్పించే విభాగం" లో బెర్ట్రాండ్ టావెర్నియర్, క్రిస్టోఫర్ ప్లమ్మర్, జీన్-క్లాడ్ క్యారియర్, జీన్-పాల్ బెల్మోండో చిత్రాలను అనుభవజ్ఞులైన ప్రముఖులకు నివాళిగా ప్రదర్శించనున్నారు.  భారతీయ చలనచిత్ర ప్రముఖులైన బుద్ధదేబ్ దాస్ గుప్తా (దర్శకుడు), దిలీప్ కుమార్ (నటుడు), నెడుమూడి వేణు (నటుడు), పునీత్ రాజ్‌కుమార్ (నటుడు), సంచారి విజయ్ (నటుడు), సుమిత్రా భవే (దర్శకులు), సురేఖ సిక్రీ (నటి) వామన్ భోంస్లే (ఫిల్మ్ ఎడిటర్) లకు కూడా ఐ.ఎఫ్.ఎఫ్.ఐ. ఈ సందర్భంగా నివాళులర్పిస్తుంది. 

వెండి తెరపై మొట్ట మొదటి జేమ్స్ బాండ్ గా పేరుగాంచిన సర్ సీన్ కానరీ కి ఈ ఉత్సవం ప్రత్యేక నివాళులర్పిస్తుంది.

# మొదటి సారి ఐ.ఎఫ్.ఎఫ్.ఐ.లో :

75 మంది  సృజనాత్మక మేధావులు :

ఐ.ఎఫ్.ఎఫ్.ఐ. ఈ ఏడాది మొదటి సారిగా, 75 మంది యువ చిత్ర నిర్మాతలు, నటులు, గాయకులు, రచయితలు మొదలైన వారిని భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుండి ఎంపిక చేసి, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఈ ఉత్సవంలో తమ ప్రతిభను ప్రదర్శించడానికి ఒక వేదికను అందిస్తోంది.  ప్రముఖ చిత్ర నిర్మాతలు, పరిశ్రమ నిపుణులతో కలవడం తో పాటు, ఈ ఉత్సవంలో నిర్వహించే మాస్టర్ క్లాసులకు హాజరు కావడానికి అవకాశం కల్పిస్తూ, వీరిని, ఐ.ఎఫ్.ఎఫ్.ఐ. ఆహ్వానించింది.  ఆజాదీ-కా-అమృత్-మహోత్సవ్ స్ఫూర్తితో చేపట్టిన కార్యక్రమాల్లో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న యువ చిత్ర నిర్మాతల కోసం ఒక పోటీ నిర్వహించి, తద్వారా 75 మంది ప్రతిభావంతులైన యువకులను ఎంపిక చెయ్యడం జరిగింది. 

బ్రిక్స్ చలన చిత్రోత్సవం: 

ఐ.ఎఫ్.ఎఫ్.ఐ. తో పాటు, మొట్టమొదటిసారిగా, ఐదు బ్రిక్స్ దేశాలకు చెందిన చలనచిత్రాలను బ్రిక్స్ చలన చిత్రోత్సవం ద్వారా ప్రదర్శించనున్నారు. కాగా, ఇది ఆరవ బ్రిక్స్ చలన చిత్రోత్సవం.  బ్రిక్స్ దేశాలైన, బ్రెజిల్; రష్యా; దక్షిణ ఆఫ్రికా; చైనా; భారతదేశంతో సహా ఐదు దేశాలపై, 52వ ఐ.ఎఫ్.ఎఫ్.ఐ. ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ విభాగంలో మొత్తం 8 చలన చిత్రాలను ప్రదర్శించనున్నారు.  "కంట్రీ-ఆఫ్-ఫోకస్" అని వ్యవహరించే ఈ విభాగంలో ఆయా దేశాలకు చెందిన సినిమా నైపుణ్యంతో పాటు చలన చిత్ర రంగ అభివృద్ధికి ఆయా దేశాలు చేపట్టిన కృషిని ప్రత్యేకంగా గుర్తిస్తారు. 

ఎన్.ఎఫ్.డి.సి. ఫిల్మ్ బజార్ ను కూడా ఈ సందర్భంగా దృశ్య మాధ్యమం ద్వారా ప్రారంభించనున్నారు. 

ఓ.టి.టి. లతో భాగస్వామ్యం:

ఈ ఉత్సవంలో పాల్గొనడానికి ప్రధాన ఓ.టి.టి. మాధ్యమాలను, ఐ.ఎఫ్.ఎఫ్.ఐ. మొదటిసారి ఆహ్వానించడం మరో విశేషం.  నెట్-ఫ్లిక్స్; అమెజాన్ ప్రైమ్; జీ5; ఊట్; సోనీ లైవ్ వంటి ప్రధాన ఓ.టి.టి. మాధ్యమాలు ప్రత్యేక మాస్‌-క్లాసెస్; కంటెంట్ లాంచ్‌ లు; ప్రివ్యూలు; క్యూరేటెడ్-ఫిల్మ్-ప్యాకేజీ-స్క్రీనింగ్‌ వంటి అనేక ఇతర ప్రత్యక్ష; దృశ్య మాధ్యమ కార్యక్రమాల ద్వారా ఈ చలన చిత్రోత్సవంలో పాల్గొంటున్నాయి.  పారిస్ లోని ప్రఖ్యాత స్కూల్ ఆఫ్ ఇమేజ్ అండ్ ఆర్ట్స్, "గోబెలిన్స్ - స్కూల్ ఎల్'ఇమేజ్" ద్వారా 3-రోజుల దృశ్య మాధ్యమ మాస్టర్-క్లాస్‌ ను నెట్‌-ఫ్లిక్స్ నిర్వహిస్తోంది. 

'ది పవర్ ఆఫ్ ది డాగ్' అనే జేన్ క్యాంపియన్ చిత్రాన్ని, ఇండియా ప్రీమియర్‌ లో ప్రత్యేకంగా ప్రదర్శించడానికి నెట్‌-ఫ్లిక్స్ సంస్థ ఏర్పాట్లు చేసింది.  ‘ధమాకా’ చిత్రం ప్రత్యేక ప్రదర్శన ను ఏర్పాటు చేయాలని కూడా నెట్‌-ఫ్లిక్స్ ప్రతిపాదించింది. అదేవిధంగా,  చిత్రంలో ప్రతిభ కనబరచిన కార్తీక్ ఆర్యానంద్ ద్వారా చిత్ర పరిచయం తో సహా,  రవీనాటాండన్, అశుతోష్ రానా నటించిన రాబోయే క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ - ‘అరణ్యక్’ మొదటి ఎపిసోడ్ ప్రివ్యూ ప్రదర్శించడానికి కూడా నెట్‌-ఫ్లిక్స్ ఏర్పాటు చేసింది. 

స్కాం-1992 స్క్రీన్‌ప్లే రచయిత – సుమిత్ పురోహిత్, సౌరవ్ డే ద్వారా ఒక మాస్టర్ క్లాస్‌ ఏర్పాటుచేయాలని, సోనీ లైవ్ ప్రతిపాదించింది,  ఈ కార్యక్రమాన్ని స్టూడియో నెక్స్ట్ బిజినెస్ హెడ్ ఇంద్రనీల్ చక్రవర్తి నిర్వహిస్తారు. 

జీ-5 ప్రత్యేకంగా ఏ.ఎఫ్.ఎఫ్.ఐ. కోసం నితీష్ తివారి & అశ్విని అయ్యర్ తో బ్రేక్‌పాయింట్‌ - ప్రముఖ పేస్ & భూపతి సీరిస్ ను సృష్టించింది. 

సత్యజిత్ రే జీవన సాఫల్య పురస్కారం :

గోవాలో జరిగే 52వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం లో మొట్టమొదటి సత్యజిత్ రే జీవన సాఫల్య పురస్కారాన్ని శ్రీ ఇస్తేవాన్  సజాబో   మరియు శ్రీ మార్టిన్ స్కోర్సెస్ లకు ప్రదానం చేయనున్నారు.   మెఫిస్టో (1981); ఫాదర్ (1966) వంటి కళాఖండాలకు ప్రసిద్ధి చెందిన, విమర్శకుల ప్రశంసలు పొందిన, హంగేరియన్ చలనచిత్ర దర్శకుడు -  ఇస్తేవాన్   సజాబో.  కాగా, కొత్త హాలీవుడ్ శకానికి చెందిన ఒక ప్రధాన వ్యక్తి గా, చలనచిత్ర చరిత్రలో గొప్ప, అత్యంత ప్రభావవంతమైన దర్శకులలో ఒకరి గా,  విస్తృతంగా గుర్తింపు పొందిన వ్యక్తి - మార్టిన్ స్కోర్సెస్.

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో గ్రాండ్ ప్రిక్స్ గెలుచుకున్న అస్గర్-ఫర్హాదీ చిత్రం "ఎ హీరో" ప్రదర్శనతో, ఈ ఐ.ఎఫ్.ఎఫ్.ఐ.-52 ముగుస్తుంది.

ఆజాదీ-కా-అమృత్-మహోత్సవ్ వేడుకలో భాగంగా ప్రత్యేకంగా ఎంపిక చేసిన 18 సినిమాలు కూడా ప్రదర్శించనున్నారు. 

 

*****

 



(Release ID: 1773414) Visitor Counter : 174