ఆర్థిక మంత్రిత్వ శాఖ

ప్రభుత్వ కార్యదర్శుల బృందంతో గిఫ్ట్ సిటీ చర్చలకు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్

Posted On: 19 NOV 2021 11:55AM by PIB Hyderabad

ఈ  నెల 20 న (రేపు) గాంధీనగర్ గిఫ్ట్ సిటీలోని అంతర్జాతీయ ఆర్థిక  సేవల కేంద్రం (ఐ ఎఫ్ ఎస్ సి) లో  భారతదేశపు అభివృద్ధి, ఎదుగుదలమీద జరిగే సమావేశానికి కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖామంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్  ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖలకు చెందిన ఏడుగురు కార్యదర్శుల బృందంతో కలసి హాజరుకాబోతున్నారు. ఆర్థిక శాఖ సహాయ మంత్రులు  శ్రీ పంకజ్ చౌధురి, డాక్టర్ భగవత్ కృష్ణారావు కరద్ కూడా ఈ చర్చలలో పాల్గొంటారు. ఇందులో ప్రధానంగా దృష్టిసారించే అంశాలివి:

i.             భారత్ లోని కార్పొరేట్ సంస్థలు  భారత్ లోపలే అంతర్జాతీయ ఆర్థిక సేవలందుకోవటంలో గిఫ్ట్ – ఐ ఎఫ్ ఎస్ సి పాత్ర  

ii.            భారతదేశానికి అంతర్జాతీయ ఆర్థిక వ్యాపారాన్ని ఆకర్షించటం

iii.          ఫిన్ టెక్ గ్లోబల్ హబ్ గా ఎదుగుదల

గిఫ్ట్ సిటీలోని ప్రధానమైన మౌలిక సదుపాయాల కేంద్రాలను కూడా కేంద్ర ఆర్థికమంత్రి సందర్శిస్తారు. అక్కడ  ఐ ఎఫ్ ఎస్ సి లో పాత్ర పోషిస్తున్న వివిధ భాగస్వాములు, సంస్థలతో సంభాషిస్తారు. భారతదేశపు ప్రధాన ఆర్థిక సేవల కేంద్రంగా గిఫ్ట్-ఐ ఎఫ్ ఎస్ సి ని అభివృద్ధి చేయటం పట్ల భారతదేశపు అంకితభావాన్ని ఈ పర్యటన చాటి చెబుతుంది. అదే విధంగా దీన్ని అంతర్జాతీయ ఆర్థికవనరుల ప్రవాహానికి ముఖద్వారంగా పరిగణిస్తున్నట్టుగా కూడా చెప్పటానికి ఇదొక అవకాశం. ఈ చర్చల వల్ల ఆలోచనలు, వ్యూహాల సంగమం తయారై గిఫ్ట్-ఐఎఫ్ ఎస్ సి వేగంగా అభివృద్ధి చెందటానికి దోహదం చేస్తుందని భావిస్తున్నారు. విదేశీ నిధులు భారత్ కు తరలి రావటానికి వెసులుబాటు కల్పించటం ద్వారా ఆత్మనిర్భర భారత్ స్ఫూర్తి ప్రతిబింబిస్తుంది.

ఈ దార్శనికతకు అనుగుణమైన లక్ష్యాల సాధనకు భారత ప్రభుత్వం, గుజరాత్ ప్రభుత్వం, గిఫ్ట్ సిటీ, ఇంటర్నేషనల్  ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్ అథారిటీ ఉమ్మడిగా కృషి చేస్తున్నాయి. ఈ ఏకీకృత ఆర్థిక రంగ నియంత్రణాసంస్థ అంతర్జాతీయ స్థాయి ఆర్థిక నియంత్రణను, చురుకైన మౌలిక సదుపాయాలను,  సమర్థవంతమైన పన్నుల విధానాన్ని, అందించటంతోబాటు  విమానాల లీజు, బులియన్ వ్యాపారం లాంటి ఆర్థిక సేవలలో సరికొత్త అవకాశాలను శోధిస్తుంది.

                                          

****



(Release ID: 1773262) Visitor Counter : 136