సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
జార్ఖండ్ ప్రజలకు జన జాతీయ గౌరవ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసి, భగవాన్ బిర్సా ముండా విగ్రహానికి పుష్పాంజలి ఘటించిన - శ్రీ అనురాగ్ ఠాకూర్
Posted On:
15 NOV 2021 5:39PM by PIB Hyderabad
పార్లమెంటు ఆవరణ లోని భగవాన్ బిర్సా ముండా విగ్రహానికి ఈ రోజు, కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్, ఇతర మంత్రులు, పార్లమెంటు సభ్యులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా, శ్రీ ఠాకూర్ మాట్లాడుతూ, "భగవాన్ బిర్సా ముండా దళితులు, అణగారిన వర్గాల సంక్షేమం కోసం తన జీవితాన్ని అంకితం చేశారు. గిరిజన వీరుడు, గొప్ప స్వాతంత్య్ర సమరయోధుడు భగవాన్ బిర్సా ముండా జయంతి సందర్భంగా ఆయనకు, నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గిరిజన సమాజంతో పాటు మొత్తం దేశ ప్రజలు ఆయనను ఎంతో గౌరవించారు." అని పేర్కొన్నారు.
“నవంబర్ 15వ తేదీని జన జాతీయ గౌరవ దినోత్సవంగా పాటించాలనే నిర్ణయం, భారతీయ చరిత్ర, సంస్కృతిలో గిరిజనుల విశిష్ట స్థానం, సహకారాన్ని గౌరవించడంతో పాటు, రాబోయే తరాలకు ఈ సాంస్కృతిక వారసత్వాన్ని, దేశ గౌరవాన్ని కాపాడుకోవడానికి స్ఫూర్తి నిస్తుంది." అని కూడా ఆయన తెలియజేశారు.
రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా, శ్రీ అనురాగ్ ఠాకూర్, జార్ఖండ్ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, “భగవాన్ బిర్సా ముండా జన్మస్థలమైన జార్ఖండ్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ సందర్భంగా, రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని, రాష్ట్ర ప్రజలందరూ, ఆనందం, ఆరోగ్యం, శ్రేయస్సుతో మెలగాలని కోరుకుంటున్నాను." అని చెప్పారు.
నేపథ్యం :
గిరిజన ప్రజల అద్భుతమైన చరిత్ర, సంస్కృతి, విజయాలను స్మరించుకుని, పండుగ జరుపుకోవడానికి ప్రభుత్వం, 2021 నవంబర్, 15వ తేదీ నుంచి 22వ తేదీ వరకు వారోత్సవాలను నిర్వహిస్తోంది. నవంబర్ 15వ తేదీని జన జాతీయ గౌరవ దినోత్సవంగా జరుపుకోవాలని 2021 నవంబర్, 10న కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.
ఈ తేదీ, దేశవ్యాప్తంగా గిరిజన సమాజాలు భగవాన్ గా గౌరవించే శ్రీ బిర్సా ముండా జయంతి. దేశంలో బ్రిటిష్ వలస వ్యవస్థ యొక్క దోపిడీ వ్యవస్థకు వ్యతిరేకంగా, బిర్సా ముండా ధైర్యంగా పోరాడారు. 'ఉల్గులన్' (విప్లవం) కోసం పిలుపునిస్తూ, బ్రిటిష్ అణచివేతకు వ్యతిరేకంగా ఉద్యమానికి నాయకత్వం వహించారు. ఈ ప్రకటన గిరిజన సమాజాల అద్భుతమైన చరిత్ర, సాంస్కృతిక వారసత్వాన్ని గుర్తిస్తుంది. ఈ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జరుపుకోవడం ద్వారా, భారతీయ శౌర్యం, ఆతిథ్యం, జాతీయ అభిమానం వంటి విలువలను ప్రోత్సహించడంతో పాటు, సాంస్కృతిక వారసత్వ పరిరక్షణ కోసం గిరిజనులు చేస్తున్న కృషికి గుర్తింపు లభిస్తుంది.
సౌరభ్ సింగ్
*****
(Release ID: 1772168)