ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఐజిఐ విమానాశ్రయంలో 90 కోట్ల విలువైన 12.9 కేజీల హెరాయిన్‌తో ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసిన కస్టమ్స్ అధికారులు

Posted On: 13 NOV 2021 7:43PM by PIB Hyderabad

మాదక ద్రవ్యాల స్మగ్లర్లు. సిండికేట్ల కార్యకలాపాలను  అణచివేయడానికి కఠిన చర్యలు అమలు చేస్తున్న కస్టమ్స్ అధికారులు ఢిల్లీ ఐజిఐ విమానాశ్రయంలో  12.9 కేజీల  హెరాయిన్‌ ను స్వాధీనం చేసుకున్నారు. ఉగాండా దేశానికి చెందిన ఇద్దరు వ్యక్తుల నుంచి అధికారులు   హెరాయిన్‌ ను 2021 నవంబర్ 12, 13 తేదీల మధ్య రాత్రి స్వాధీనం చేసుకున్నారు. అధికారులు స్వాధీనం చేసుకున్న  హెరాయిన్‌ విలువ ప్రస్తుత అంతర్జాతీయ ధరల ప్రకారం 90 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేశారు. 

మాదక ద్రవ్యాలను అక్రమంగా రవాణా చేస్తున్న స్మగ్లర్లు ఉగాండా, కెన్యా తో సహా దేశంలో అనేక తనిఖీలను తప్పించుకుంటూ వచ్చి ఢిల్లీలో అధికారులకు దొరికిపోయారు.తమతో పాటు తీసుకుని వచ్చిన చెక్-ఇన్ లగేజీ అడుగు భాగాన అరలు సృష్టించి దానిలో  హెరాయిన్‌ దాచి అక్రమ రవాణాకు పాల్పడ్డారు. 

ఉగాండా నుంచి వచ్చిన ఇద్దరు మహిళా ప్రయాణికులకు చెందిన  మూడు సూట్‌కేసుల నుంచి మొత్తం 12.900 కేజీల స్ఫటికాకార  హెరాయిన్‌   స్వాధీనం చేసుకున్నారు.  

ఢిల్లీ విమానాశ్రయంలో కస్టమ్స్ శాఖకి చెందిన డాగ్ స్క్వాడ్ ప్రయాణీకుల సూట్‌కేసులను వాసన చూసి వాటిలో మత్తుపదార్ధాలు ఉన్నట్టు గుర్తించాయి. దీనితో ప్రయాణీకులను అధికారులు వ్యక్తిగతంగా ప్రశ్నించి వారి సామానులను తనిఖీ చేశారు. దీనితో తమతో పాటు చెక్-ఇన్ లగేజీగా  తెచ్చిన  సూట్‌కేసుల రెండు వైపులా  అడుగు భాగాన దొంగ అరలను అమర్చి వాటికి చేసిన రంద్రాలలో హెరాయిన్‌ దాచి తెచ్చామని ప్రయాణీకులు అంగీకరించారు. హెరాయిన్‌ను ప్లాస్టిక్, పేపర్ బ్యాగులలో స్ఫటికాకార రూపంలో హెరాయిన్‌ ఆఫ్-వైట్-కలర్ పౌడర్/హెరాయిన్ రేణువులను దాచి వాక్యూమ్ ప్యాక్ చేసారని అధికారులు గుర్తించారు. 

ఢిల్లీలో కొన్ని వస్తువులను అప్పగిస్తే నగదు ఇస్తామని కెన్యాకు చెందిన ఒక వ్యక్తి డబ్బు ఇస్తానని వాగ్దానం చేసాడని వీరిలో ఒక మహిళ అధికారులకు తెలిపింది. డబ్బులకు ఆశపడి తాను కంపాలా నుంచి రోడ్డు మార్గంలో చేరుకున్నానని ఆమె వివరించింది. అక్కడ తనకు ఒక వ్యక్తి ఢిల్లీలో అందించవలసిన బ్యాగ్‌ను, మెడికల్ టూరిస్టుగా వెళ్తున్నట్టు తెలిపే కొన్ని పత్రాలను, టికెట్ అందించాడని తెలిపింది. విమానాశ్రయం నుంచి వెలుపలకు వచ్చిన తరువాత తనతో పాటు తెచ్చిన బ్యాగ్‌ను ఆమె ఒక వ్యక్తికీ అందించవలసి ఉంది. కస్టమ్స్ అధికారులు అడ్డగించి తనిఖీ చేసిన సమయంలో ఆమె వద్ద ఉన్నబ్యాగ్‌ అడుగు భాగాన అమర్చిన అర/ రంద్రాలలో 5.4 కేజీల హెరాయిన్ ఉంది. 

అదే విమానంలో వచ్చిన  మహిళా ప్రయాణీకురాలిని కూడా కస్టమ్స్ అధికారులు అడ్డగించి తనిఖీ చేసి ఆమె నుంచి  7.5 కిలోల  హెరాయిన్ ను స్వాధీనం చేసుకున్నారు. ఆమె రెండు బ్యాగుల కింద భాగాన దొంగ అరలు/రంద్రాలను సృష్టించి వాటిలో  హెరాయిన్ తీసుకుని వచ్చింది. తన సోదరి తనను కంపాలా నుంచి రోడ్డు మార్గాన నైరోబీకి పంపిందని అధికారులకు ఆ మహిళ తెలిపింది. అబు దాబి మీదుగా ఢిల్లీకి వచ్చానని ప్రాథమిక విచారణలో వెల్లడించింది. మెడికల్ టూరిస్టుగా వచ్చినట్టు ఈ మహిళ వద్ద కూడా అధికారులు కొన్ని నకిలీ పత్రాలను గుర్తించారు. 

ఢిల్లీ విమానాశ్రయం ద్వారా సాగుతున్న మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టడానికి అధికారులు కఠిన చర్యలను అమలు చేస్తున్నారు. 2021 అక్టోబర్ 28వ తేదీ అర్ధరాత్రి నిర్వహించిన తనిఖీలలో అధికారులు కెన్యాకు చెందిన ఒక వ్యక్తి నుంచి దాదాపు మూడు కేజీల  హెరాయిన్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యక్తి నైరోబి నుంచి షార్జా మీదుగా ఢిల్లీ వచ్చాడు. అంతకుముందుఉగాండా నుంచి రెండు కేజీల హెరాయిన్ ను అక్రమంగా దేశంలోకి రవాణా చేయడానికి ప్రయత్నించిన ఇద్దరు భారతీయులు కస్టమ్స్ అధికారులకు దొరికిపోయారు. వీరిని ప్రశ్నించిన అధికారులు ఉగాండాకు చెందిన మరో ముగ్గురు నిందితులను గుర్తించడం జరిగింది.

ప్రస్తుత సంవత్సరంలో ఢిల్లీ కస్టమ్స్ అధికారులు ఇంతవరకు 100 కేజీలకు పైగా  హెరాయిన్ ను స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి 26 మందిని అరెస్ట్ చేశారు. ప్రయాణికుల ద్వారా దేశంలోకి అక్రమంగా మాదక ద్రవ్యాలను తరలించడానికి ప్రయత్నాలు ఎక్కువగా జరుగుతున్నాయి. దీనిని గుర్తించిన అధికారులు దేశంలోని అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాల్లో నిఘాను ఎక్కువ చేసి సమాచార సేకరణకు పదును పెట్టి అనుమానితులను తనిఖీ చేస్తున్నారు. స్మగ్లర్లుసిండికేట్లు సాగిస్తున్న అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయడానికి సాగుతున్న ప్రయత్నాలలో  కస్టమ్స్ శాఖ  కీలక పాత్ర పోషిస్తోంది. ముంద్రా రేవులో సెప్టెంబర్ నెలలో కస్టమ్స్ అధికారులు 3000 కేజీల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు. 

***


(Release ID: 1771617) Visitor Counter : 132